హవాయీ భాగం-6 (బిగ్ ఐలాండ్ – చివరి రోజు)
హవాయీ యాత్రలో మొదటిదైన బిగ్ ఐలాండ్ లో చివరి రోజు అది. సాయంత్రం ఆరు, ఏడు గంటల వేళ బిగ్ ఐలాండ్ నించి హవాయీ రాజధానీ నగరం హానోలూలూ ఉన్న ఒవాహూ ద్వీపానికి మేం విమానం ఎక్కాల్సి ఉంది.
అప్పటికి గత రెండు రోజులుగా ద్వీపాన్ని ఉత్తరంగానూ, దక్షిణం గానూ పూర్తిగాచుట్టి, మేమున్న పడమటి తీరం నించి తూర్పు తీరానికి రోజూ వెళ్లొస్తూ , దాదాపు అన్ని ప్రధాన సందర్శక ప్రదేశాలూ చూసేసాం. అయితే అసలు సముద్ర తీర సందర్శన ఇంకా మిగిలిపోయింది. హవాయీ అంటేనే అందమైన సముద్ర తీరాలకు ప్రసిద్ధి. మా హడావిడిలో మేం తిరుగుతూ ఎక్కడా పిల్లల్ని ఎక్కడా నీళ్లలోకి దిగనివ్వలేదు. ఆ కొరత తీర్చడానికి కనీసం మధ్యాహ్నం మూడు గంటల వేళ వరకూ సముద్ర తీరంలో గడపడానికి నిశ్చయించుకున్నాం.
ఉదయం 9 గంటలకల్లా కోనా రిసార్టు నించి సెలవు తీసుకుని బయలుదేరాం. అన్నీ సర్దేసినా మా గదికి ఆనుకుని ఉన్న బాల్కనీని ఆనుకుని కనిపిస్తున్న అందమైన సముద్ర తీరాన్ని, దూరంగా కనిపిస్తూన్న నౌకల్ని, కనుచూపుమేర సువిశాలంగా వంపు తిరిగి కనుల విందు చేస్తున్న తీరాన్ని వదిలి రావడం చాలా కష్టతరమైంది.
అసలు రిసార్టు మొత్తం తిరిగి రాలేదని అప్పుడు గుర్తుకు వచ్చింది. సామాన్లతో బాటూ కిందికి వచ్చి సముద్ర కెరటాల్ని ఒరుసుకుంటూన్న రిసార్టు రెస్టారెంటుని, ఓపెన్ థియేటర్ని, ప్రాంగణంలో ఉన్న ఇతర సముద్ర తీర విశేషాల్ని, చుట్టూ కారిడార్లలో గోడలకి వేళ్లాడుతూన్న “కమాహమేహా” రాజ వంశీకుల ఫోటోలనూ, రిసార్టు చుట్టూ విరబూసిన దేవగన్నేరు పూలచెట్లనీ, చిన్న చిన్న కాలువల్లో ఉన్న రంగురంగుల పెద్ద పెద్ద చేపల్ని…అన్నిటినీ మీంచి నేను ఎంతో చూడాలనుకున్న పైనాపిల్ మొక్కల్నీ చూసేం. నడిచే రహదార్ల పక్కన పూల మొక్కల్లో పొదల్లో దాక్కుని క్రోటన్ మొక్కల్లా ఉన్న పైనాపిల్ మొక్కలకి అందంగా కాసిన చిన్న చిన్న పైనాపిల్ పిందెల్ని చూడడం చాలా సంతోషంగా అనిపించింది నాకు.
సముద్ర తీరానికి వెళ్లి ఒకసారి పిల్లలు నీళ్లల్లోకి దిగేరంటే ఇక ఎక్కడికీ రానంటారు. పైగా సాయంత్రం వరకూ సమయం ఉంది కాబట్టి నేను ఒకట్రెండు చూడాల్సిన ప్రదేశాలు చూసేక సముద్ర తీరానికి వెళ్దామని మేప్ తీసేను.
పిల్లలు” గొయ్”మని అరిచేరు. సత్య మధ్యవర్తిత్వం వహించి, ఏదైనా ‘ఒక’ నేను చెప్పినది చూసి, తరవాత సముద్రతీరానికి వెళ్దామని పిల్లల్ని ఒప్పించాడు. ఒప్పందం కుదిరనదే తడవుగా దక్షిణం వైపుకి జీపు తిప్పేను.
ఇక్కడ క్లిక్ చేసి ఛాయా చిత్రాలను చూడండి.
పుహానువా ఓ హానౌనౌ నేషనల్ పార్క్ (Pu’uhonua o Honaunau National Park) :- ముందుగా “పుహానువా ఓ హానౌనౌ నేషనల్ పార్క్ ” కి వెళ్ళాం. అది బిగ్ ఐలాండ్ చరిత్రని, సంస్కృతిని తెలిపే ప్రదేశం. అంతే కాదు ఈ ప్రదేశం ఒకప్పుడు ఆ ప్రాంతపు రాజులు, మత పెద్దలు నివసించిన స్థలం.
అప్పటి నివాస స్థలాల్ని, ఆచార వ్యవహారాల నిదర్శనాల్నీ పునర్నిర్మించిన పురాతన కాలపు సజీవ సాక్ష్యపు రాళ్లు, చెక్కతోనూ, రాతితోనూ తయారు చేసిన అనేక నిత్యావసర వస్తువులు, టోటెం పద్ధతిలో మలిచిన మంత్ర స్థూపాలు అక్కడ చూడొచ్చు. సముద్ర తీరంలో నాలుగు వందల సవత్సరాల నాటి పొడవైన రాతి ప్రాకారం మధ్య పునరుద్ధరించబడిన అప్పటి అవశేషాల మధ్య తిరుగాడుతూ ఉంటే చరిత్ర కళ్లకు కట్టినట్లు అనిపిస్తుంది.
ఆ మ్యూజియం కు టిక్కెట్టు అయిదు డాలర్లు. అంటేనే చాలా చిన్నదని అర్థమైంది. ఎంట్రెన్సులో కారు పార్కింగునానుకుని చిన్న గిఫ్టు షాపు, దానినానుకుని పొడవాటి వరండా. ఆ వరండా పొడవుకీ పక్కనే ఉన్న గోడమీద గీసిన గోడెత్తు కుడ్యచిత్రాలు సముద్రపు తీరంలో బతికిన ఆ ఆదిమ వాసుల గాథల్ని తెలుపుతూ ఉన్నాయి. ఆ విశేషాలన్నీ సందర్శకులు తెలుసుకోవడానికి అక్కడ మీట నొక్కితే వినిపించే స్వరంతో బాటూ ఎవరికి వారు వినడానికి హెడ్ఫోన్సు ఉన్నాయి. వరండా నుంచి దిగగానే సముద్ర తీరపు ఇసుకలో చుట్టూ కొబ్బరి చెట్ల నడుమ అక్కడక్కడా చిన్నవీ పెద్దవీ అయిదో ఆరో గుడిసెలు, అటునించి యిటుకి నడవగలిగిన పాకలు ఉన్నాయి. మొదటి గుడిసెలో పడవ సామగ్రి, ఇతరత్రా పనిముట్లు ముందేసుకుని ఆదిమ మానవుడిలా గోచీ పెట్టుకున్న మనిషి ఏదో పనిచేసుకుంటూ ఉన్నాడు. చెట్టు మొదల్ని కొంచెం కొంచెం గా చెక్కుతూ ఉన్నాడు. బహుశా: చిన్న సైజు పడవ కాబోలు తయారు చేస్తూ కనిపించాడు. మ్యూజియం వాళ్లు అక్కడ నిజంగా ఇలా మనిషిని ఏర్పాటు చేసి, జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడం మంచి ఆలోచన. అతను వచ్చిన వాళ్లు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇస్తున్నాడు. నేను అతన్ని “ఎన్నాళ్ళుగా చెక్కుతున్నావని” అడిగేను. నా వైపు కూడా చూడకుండా దీక్షగా “పదిహేను రోజుల నుంచి” అని సమాధానం ఇచ్చేడు. ఇలాంటివి మన శిల్పారామంలో చేస్తే బావుణ్ణని అనిపించింది నాకు. పిల్లలకు ఇంకాస్త ఆసక్తిదాయకంగా ఉంటాయి అనిపించింది. అతను అక్కడ నిజంగా నివసిస్తున్నట్టు పనిముట్లు చుట్టూ పేర్చి, చూరు నించి వేళ్లాడ దీసి, చక్కని ఏర్పాటు చేసారు.
ఇక అక్కడి నుంచి ఒక పద్ధతిలో లేని గోడని ఎటెటో చుట్టి మధ్యలో తిరిగొచ్చాం. గోడ లోపల ఉన్నామో, బయట ఉన్నామో తెలీకుండా ఉన్న ఇసుక దారి. గుర్రపు డెక్కాకు మధ్య చిన్న నడిచే త్రోవ. వెనక్కి వచ్చి సముద్ర తీరంలో మాంత్రికుని నివాసంలా ఉన్న ఎత్తైన గుడిసెని, చుట్టూ పొట్టి రాక్షసుల్లా ఉన్న చెక్క బొమ్మల దగ్గిర ఆగేం.
ఆ ప్రదేశాన్ని చూస్తుంటే మామూలుగా ఏదో చరిత్ర తవ్వి తీసినట్లు కాకుండా, మనిషి కొత్త ప్రదేశానికి వచ్చి బతకడానికి ఏర్పరుచుకున్న తొలి జీవన విధానం బోధపడింది. ఇవేళైయినా మనిషికి ఆధునికత తెలియక పోతే చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లనీ, రాళ్లనీ ఆధారంగా చేసుకుని అదే విధంగా బతకాల్సిందే. ఒక విధమైన గాంభీర్యత అక్కడ ప్రతీ రూపంలోనూ ద్యోతకమవుతూ ఉంది. మనిషికి, ప్రకృతికి ఉన్న విడదీయరాని సంబంధ బాంధవ్యాల్ని తెలియజెప్పే నమ్మకాలూ, మరణం పట్ల భయాలూ, మరణానంతర జీవిత రహస్యపు గాథలూ …ఎన్నో మర్మ సూత్రాలకు ప్రతీకలు అక్కడి దారు శిల్పాలు, నిర్మాణాలు.
ఇక సిరి ఇసుక చూడగానే మా ముందు సంతోషంతో పరుగులు తీసింది. దగ్గరగా ఉన్న రెండు కొబ్బరి చెట్ల నడుమ నిలబడి ఫోజులు కూడా ఇచ్చింది. కానీ అక్కడిదాకా మా ముందు పరుగెత్తినదల్లా సముద్ర తీరపు సుక్క బొమ్మల్ని, వాటి భయంకరమైన ఆకారాల్ని చూసి ఎవరో తరిమినట్లు వెనక్కి వేగంగా పారిపోయి వచ్చింది.
అవన్నీ దాటి ముందుకు తీరం వెంబడే వస్తే , నలుగురు మనుషులు చుట్టూ కూచోవడానికి చెక్క దిమ్మెల కుర్చీలు, రాతి దిమ్మెలు, మధ్యలో పులీ, మేకా లాంటి ఆట పేర్చిన్న పెద్ద బండ రాయి. ఎట్నించెటు తిరిగినా పిల్లలకు అక్కడ ఆసక్తిదాయకంగా ఏవీ కనబడక, అక్కడి వరకూ వచ్చేసరికి అలిసిపోయి ఆ కుర్చీల మీద చతికిలబడి ఇక నడవమని మొరాయించారు.
ఆ పార్కులో మాతో బాటూ జనం వేళ్ల మీద లెక్క పెట్టగలిగేటంత మాత్రమే ఉన్నారు. వచ్చిన వాళ్ళు కూడా పది నిమిషాల్లో తిరిగి వెళ్ళిపోతున్నారు. అక్కడ ప్రతీ విశేషమూ పిల్లలకి వివరించి చెపుతూ ఎక్కువ సేపు కాలక్షేప చేసినది బహుశా: మేమేనేమో.
ఆ పార్కుకి సముద్ర తీరపు కొసనే గోడ ఉన్న వైపు కాక, మరొక కొసలో ఇనుప కంచె లో నుంచి కనిపిస్తూ పక్కనే “స్నోర్కిలింగ్ పార్కు” ఉంది. జనాలు అక్కడ విరగబడి ఉన్నారు. స్నోర్కిలింగ్ అంటే సముద్రపు కెరటాల అడుగుకి ములిగి విశేషాలు చూడడమన్న మాట. ఆ విన్యాసానికి మర్నాడు హానోలూలూ లో మేము బుక్ చేసుకున్నాం కనుక అటు వెళ్లలేదు. అయినా ఎంట్రెన్సు అది కాదు కూడా.
కెకహా కై స్టేట్ పార్క్ (Kekaha Kai State Park) :- అక్కడి నుంచి ఉత్తరంగా ఉన్న ఎయిర్పోర్ట్ వైపుగా ఏదైనా బీచ్ పిల్లలు ఆడుకునే బీచ్ కి వెళ్దామని బయలుదేరేం. ముందు చూసిన స్నోర్కిలింగు పార్కు దరిదాపుల్లో సముద్రం భీకరమైన కెరటాలతో, రాళ్ళతో అల్ల కల్లోలంగా ఉంది. అలా కాకుండా పలుచని కెరటాలతో అందమైన తీరం కోసం మేప్ లో చూసి ఎయిర్పోర్టుకి అరగంట దూరంలో పైన ఉత్తరంగా ఉన్న “కెకహా కై స్టేట్ పార్క్” కు చేరేం. హవాయి భాషలో ప, హ, క, ల వంటి ఐదో, ఆరో హల్లులతో పేర్లన్నీ ఉండడం భలే ఆసక్తిదాయకంగా అనిపించింది. పలకడం రాక భలే ఇబ్బందీ పడ్డాం, అది వేరే విషయం.
ఇక ఈ “కెకహా కై స్టేట్ పార్క్” బయట రోడ్డు మీంచి చూస్తే త్రోవ మూతబడినట్లు కనిపించింది. కానీ అక్కడి నుంచి దిగువన సముద్ర తీరం వరకూ డ్రైవ్ చేస్తే కనిపించినన గొప్ప దృశ్యాన్ని ఇప్పటికీ మరిచిపోలేను.
చుట్టూ అప్పటి దాకా ఉన్న సముద్రపు ముదురు నీలం రంగు మాయమై హఠాత్తుగా లేత నీలి రంగులో సాగర స్వరూపమే ఆహ్లాదంగా మారిపోయింది. అందుకు కారణం అక్కడ దిగువన ఉన్న తెల్లని, పిండిలాంటి ఇసుక. మనమైతే పేదరాశి పెద్దమ్మ పిండార బోసుకుందని కథ అల్లేసేవాళ్ళమేమో. అప్పటికి మధ్యాహ్నం పన్నెండు కావొచ్చింది.
అక్కడి పలుచని లేత నీలి కెరటాల మీద అందమైన సూర్య కాంతి తేటగా ప్రసరిస్తూ భూమి మీంచి ఏదో దేవ లోకంలోకి అకస్మాత్తుగా రెక్కలు సాచుకుని ఎగిరినట్లనిపిం
చింది నాకు. గోరు వెచ్చని ఆ ఇసుకని చూస్తే తల మీద హాయిగా పోసుకోవాలని, చిన్న పిల్లల్లా ఒళ్లంతా పూసుకోవాలని అనిపించకమానదు. సిరి అదే చేసింది. చక్కగా నీళ్లలోకి దిగి ఒళ్ళంతా తడుపుకోవడం, వచ్చి ఇసుకలో పొర్లడం. అదీ ఆట. గోరు వెచ్చగా ఉన్న హాయైన నీళ్లలోకి అడుగుపెట్టగానే విశాఖపట్నంలోని ఋషికొండ బీచ్ జ్ఞాపకం వచ్చింది నాకు.
కానీ ఇంత అందమైన సముద్ర తీరాన్ని ఇంత వరకూ చూసిన జ్ఞాపకం లేదు. అక్కడ మాలాగా వచ్చిన మరో యాభై మంది వరకూ ఉన్నా బీచ్ అంతా పరిశుభ్రంగా ఉంది. అంత చక్కని నును వెచ్చని వాతావరణం లో నీళ్ల దిగే వాళ్ల కంటే తీరంలో వాలు కుర్చీల్లోనూ, తువాళ్ళు పరుచుకుని సేద తీరుతున్న వారే ఎక్కువ కనిపించారు. అలా వచ్చిన ఒక పెద్దావిడ సిరికి పరిచయమై కాసేపు కబుర్లు చెప్పింది. సిరి కూడా నాలాగే ఎవరైనా ఇట్టే పరిచయం చేసుకుని కబుర్లు చెప్పేస్తుంది. సిరి కబుర్లు చెప్పడమే కాకుండా ఏకంగా ఆవిడ టవలు మీదికెక్కి ఆవిడతో బాటూ బోర్లా పడుకుంది. ఆవిడ అమెరికా నుంచి ఇక్కడి ఫ్రెండ్ ఇంటికి వచ్చేనని, ఈ తీరాన్ని అనుకోకుండా మాలాగే చూసి ముగ్ధురాలై ఆగేనని చెప్పింది. ఇక్కడ ఇంకా పదిరోజులుండి రోజూ అక్కడికి వస్తానని చెప్పింది. ఆవిడ మా కంటే ముందే వెళ్లిపోయింది గాబట్టి సరిపోయింది. లేకపోతే సిరి ఆవిడతో వెళదామని పేచీ మొదలు పెట్టేది.
ఒడ్డుకి తిరిగి వచ్చి అక్కడ ఓపెన్ టాప్ ల దగ్గిర స్నానలు చేసి, వాష్ రూంస్ లో బట్టలు మార్చుకుని, అత్యంత శుభ్రంగా ఉన్న మా కార్ పార్కింగు దగ్గిరే దుప్పటీ పరిచి తెచ్చుకున్న బ్రెడ్డు, మామిడిపిందెల ముక్కలు (ముందు రోజు చెట్ల నించి కోసినవి), దారిలో కొన్న పొటేటో చిప్స్ అమృత ప్రాయంగా ఆరగించేం. త్రోవ పక్కన ఉన్న కంచిత్రం ముళ్ల చెట్లని చూసి జిగురు కోసం, చిన్నప్పుడు మేం “గుర్రాల”ని పిల్చుకున్న పురుగుల కోసం వెదికేం. అటువంటి జాడలు కనిపించలేదు. సత్య, నేను ఆ ముళ్ళ చెట్లతో మాకున్న అనుబంధపు కథల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పిల్లలకి వినిపించేసి నవ్వుకున్నాం.
ఒక అరగంటలో చేరుతాం అన్న ధీమాతో మూడు గంటల వేళ బయలుదేరేం. అద్దె కారు రిటన్ ఇవ్వడానికి మహా అయితే పదిహేను నిమిషాలు. ఎలా లేదన్నా నాలుగు గంటలకి ఎక్కిన అయ్యినా, మా ఫ్లైటు ఆరు గంటలకి కాబట్టి స్థిమితంగా వెళ్లొచ్చని అనుకున్నాం. అయితే తీరా సముద్ర తీరపు సన్న రోడ్డు నుంచి ప్రధాన రహదారికి వచ్చేసరికి రోడ్డంతా జాము అయిపోయింది. ఒక సిగ్నల్ నుంచి మరొక సిగ్నల్ కు చాలా సమయం పట్టేస్తూంది. ఇక ఇంకా విచిత్రమైన విషయం ఏవిటంటే GPS ఎయిర్పోర్టు అక్కణ్ణించి ఇంకా నలభై మైళ్ళ దూరంలో ఉన్నదని చూపిస్తూంది. నాకు డౌటు వచ్చింది. ఉదయం మేపులో గుర్తున్నంత వరకూ మేం ఉన్న సముద్ర తీరం నించి సరిగ్గా పది మైళ్ళ దూరంలో ఉండాలి ఎయిర్పోర్టు.
GPS ని మాత్రమే నమ్మే సత్య అసలే ట్రాఫిక్ జాములో ఇలాంటి సందేహాలేవిటని నా మాట కొట్టిపారేసేడు. GPS తప్పు చెపుతూన్నదని మేప్ గుర్తున్న నా మైండుకి అర్థమై నేను సత్య మాట వినిపించుకోకుండా అయిదారు సిగ్నల్స్ దాటేక కారుని వెనక్కి తిప్పేసేను. అప్పుడు సత్య, పిల్లలు బాగా గొడవ చేసినా, తర్వాత అర్థమైన విషయమేమిటంటే, నేనక్కడ కారు వెనక్కి తిప్పకపోతే మా ప్లైటు టైముకి మేం ఆ రోజు చేరలేకపోయే వాళ్లమని.
మొత్తానికి నాలుగున్నర ప్రాంతంలో ఎయిర్పోర్టుకి చేరుకున్నాం. అయిదింటికి కారు రిటర్న్ చేసి బస్టాండు లాంటి ఎయిర్పోర్టు ప్రాంగణంలోకి చేరుకున్నాం. ఫైటు గంట లేటని అనౌన్సుమెంటు వచ్చింది. ఈ సారి పగలు కావడం తో ఎయిర్పోర్టు చుట్టూ తిరిగి ఫోటోలు తీసుకున్నాం. బేగ్గులు చెకినయ్యేక లోపల్లోపల ఉన్న చిన్న చిన్న షాఫులన్నీ తిరిగి చూసేం. విమానం ఎక్కడానికి బస్సు క్యూ లో నిలబడ్డట్లు నిలబడ్డం, మెట్లెక్కి విమానం పైకి వెళ్ళడం బాగా నచ్చింది నాకు.
అక్కణ్ణించి సరిగ్గా గంట వ్యవధిలో ఉన్న హానోలూలూకి మా ప్రయాణం ప్రారంభమై, విమానం గాల్లోకి లేచి, కనుకపు మేర పై నుంచి బిగ్ ఐలాండ్ “స్మాల్ ఐలాండ్” గా మారుతూండగా బెంగ పుట్టుకొచ్చింది. సముద్రమ్మీద తేలియాడుతూ దిగువన మరో రెండు ద్వీపాలు దాటి దీప కాంతుల్తో ధగధగా మెరిసిపోతున్న ఒవాహూ ద్వీపంలో హానోలూనూ కి చేరేంత వరకు.
(ఇంకా ఉంది)
-కె.గీత
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to నా కళ్ళతో అమెరికా-60(యాత్రా సాహిత్యం )-డా .కె .గీత