ఉలన్ దారాల కుచ్చు టోపీలో
చందమామ రూపo
ధృవపు గొర్రె ఉన్నిలో
పడుకున్న ఒక కుందేలా
అప్పుడే చెట్టు బొరియలోంచి వెలికి వచ్చి
రెండు కాళ్ళూ బార్లా చాపిన
వయ్యారపు ఉడుత పిల్లా
ఇంతకూ యితడెవరు
ఈతడు
శీతాకాలపు నడిరాత్రిలో
నిండు పున్నమిలా ఉదయించిన
నవనవల బాలుడు
మానవత్వం చెట్టు కొమ్మన
విరగబూసిన గులాబీల గుత్తి
ఒక్కసారి యితని ముఖాన్ని చూడండి
నదిలో వదిలిన కార్తీక దీపంలా
ఉయ్యాల పడవలో ఊగడం లేదూ
ఆ మూసిన కళ్ళు
ఇసుకలో పూరేడు పిట్ట ఒకటి
గుడ్లు పెట్టి కప్పినట్టుగా లేవూ
ఉబ్బెత్తు ఆ చెంపలు
ఇంకా విచ్చుకోని తామరల్ని
అమ్మ అరచేతుల్లో పెట్టుకున్నట్టుంది కదూ
పెదాల మీది ఆ నునులేత పాటల వర్ణం
యీతని ముఖోదయంలో తప్ప
మరెక్కడైనా వెతికితే దొరుకుతుందా
ఈతడు
మూగ ప్రపంచాల్ని కేరింతలతో
బద్దలుకొడుతాడు
ముచ్చటించే ప్రపంచాన్ని
మౌనాదేశాలతో నియంత్రిస్తాడు
ఏడుపుతోనూ
నవ్వుతోనూ
జీవితాన్ని జీవితంలా జీవిస్తాడు
వీలైతే జీవించండి
యీతని
ప్రతి కదలిక వెనుకా
ఏ మకిలీ అంటని
ఒక అసలైన మనిషుంటాడు
-బూర్ల వెంకటేశ్వర్లు
———————————————————————————————————————————–