బోయిభీమన్న పాటల్లో సామాజిక సందేశం (సాహిత్య వ్యాసం ) – డా|| కె. వి.ఎన్‌.డి.వరప్రసాద్‌

 vihanga-telugu magazine

                                                                                                                                 ISSN 2278-478

                                           మానవత్వం యొక్క సమగ్రత్వానికి తాను ప్రయత్నిస్తూ, సమాజం కూడా అదే స్థాయిలో ఎదగాలని కవి ఆశపడుతూ ఉంటాడు. చిన్ననాడే భీమన్న అమానుష భావాలతోకూడిన సామాజికవర్గ దోపిడీని అతి దగ్గర నుంచి చూశారు. కొన్నిసార్లు ఆ దోపిడీకి గురై, అణచివేతలను కూడా ఎదుర్కొన్నారు. సమాజం యొక్క ఔన్నత్యం మానవవికాసంతోనే ఉంటుందని, తనను తాను వికసింపచేసుకున్న మానవతామూర్తి భీమన్న. అందుకే ఆయన కవిత్వంలో మానవీయకోణాలు దర్శనమిస్తూ ఉంటాయి. వస్తువు ఏదైనా మానవీయ కోణాన్ని చూపించడం భీమన్న రచనల్లో కానవచ్చే ప్రత్యేకత. నిరంతర ఆలోచనాపరుడైన మహారచయిత కలం నుంచి పుంఖాను పుంఖాలుగా ప్రక్రియా వైవిధ్యంతో రచనలు పరవళ్లు త్రొక్కేవి. దీనికి విస్మయమందిన సి.నా.రె.
”ఎప్పుడు చూస్తానో మరి
ఎప్పుడు రాస్తానో, అరె
తెప్పలుగా తేల్చినావు తీయన కవితల్‌
కుప్పలుగా రాల్చినావు కొన్నన పలుకుల్‌”
అంటూ ప్రశంసల అక్షరాభిషేకం చేశారు.
మనిషిగా ఎదుగుతూ, అందరినీ మనుషులుగా ఎదగమని ఉద్భోదిస్తూ, సమాజంలో కానవచ్చే అమానుష సంఘటనలకు చలించిపోతూ, మానవత్వం కోసం అక్షరాలతో అన్వేషణ సాగించిన మహాద్రష్ట బోయి భీమన్న. సమాజంలోని అసమానతలను గుర్తించిన భీమన్న మానవ సంబంధాల మెరుగుకై ఆరాటపడ్డాడు. మానవత్వాన్ని ఉద్దీపనం చేయడంకోసం ముందుకు అడుగులు వేశారు.
భీమన్న కవిగా కలంపట్టేనాటికి, సమాజంలో తనకు సరిపడని విషయాలను అంటే సమస్యలను గుర్తించి, వాటిపై అక్షరయుద్ధాన్ని ప్రకటిoచాడు. ఇది కవులకు, రచయితలకు సహజమైన విషయమని, అలా సమాజంలో అక్షరయుద్ధం చేయడం వల్లనే కవి, తనలో దాగిన ఉద్వేగాలను ప్రకటిoచే అవకాశం ఉందనే విషయాన్ని మహారచయిత చలం – ”తనకు, సంఘానికి సామరస్యం కుదిరిందాకా కవిచేసే అంతర్భహిః యుద్ధారావమే కవిత్వం” అని తెలిపాడు. భీమన్న రచనలు చలం అభిప్రాయాలలో ఒదిగిపోతాయి. మానవత్వం మూర్తీభవించిన కవిగా, భీమన్న సమాజంలో తనను ప్రభావితంచేసిన అనేక విషయాలపై ఏ విధంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడో పరిశీలిద్దాం……
దోపిడీ విధానం : సమాజంలోని అసమానతలకు ఒక వర్గం, మరో వర్గాన్ని దోచుకోవడమే కారణం. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తవుతున్నా సమసమాజ స్ధాపనే తన లక్ష్యమని దేశ తొలి ప్రధాని నెహ్రూ ప్రకటిoచిన లక్ష్యం నేటికీ కనుచూపుమేరలో లేదు. ఆకర్షణీయంగా కనిపించే పెట్టుబడిదారీ వ్యవస్థ రోజురోజుకూ బలాన్ని పుంజుకుoటోoది. ఫలితంగా ధనికుడు మరింత ధనవంతుడౌతున్నాడు. పేదవాడు, పెట్టుబడిదారుడి సంపాదన పెంచే యంత్రంగా మిగిలిపోతున్నాడు. అతని శ్రమకు విలువలేదు. అతని జీవన విధానంలో మార్పులేదు. అందుకే బోయిభీమన్న….
”గంగిగోవుల వోలె కనిపించునవి యెల్ల
గోవులే అనుకోకుమా!
గోగోపకుల నడుమ గోముఖవ్యాఘ్రాలు
కొల్లలుగ ఉన్నవి సుమా! ………..
శ్రమదొంగలున్నారు, జాగ్రత్త ప్రియతమా!
సంసిద్ధముగ కదులుమా! —
అంటూ సామాన్యుణ్ణి హెచ్చరించాడు. సమాజంలో ప్రత్యేకంగా శిష్టులు, దుష్టులనే వారెవరూ లేరని పేర్కొంటూ, అణచివేత నుంచే తిరుగుబాటు పుట్టుకొస్తుందని, అయితే సామదానముల తరువాతే శస్త్రప్రయోగం చేయాలని –
ఇంటగలుగు పాడిగోవు ఎంత సాధువైనను
కోపము కలిగింతుమేని కొమ్ములతో కుమ్మును!
మంచిని మచ్చికతో సాధించవచ్చు నోయీ!
సామదానముల పిదపే శస్త్రము గొనుమోయీ!
అంటూ అణచివేత ఎంతోకాలం కొనసాగదని, కానీ అత్యవసర పరిస్థితులోనే ఆయుధ ప్రయోగం చేయలాని హితోపదేశం చేశారు. అయితే జీవితాన్ని  ఆనందంగా గడపాలంటే శస్త్ర విద్యలు నేర్వాలని, కలం పట్టిన  చేత్తో కత్తిపట్టగల ధైర్యం కావాలంటూ ఉద్భోదించారు. సోషలిజంలాoటి  మాటలు వల్లించడానికే తప్ప వాటి వల్ల ఉపయోగం లేదంటూ, వారందరూ మిలియనీర్లుగా మారుతున్న దృశ్యాన్ని కళ్ళకు కట్టిస్తూ —
”న్యాయ ధర్య పథాలు నగ్జలిజమైతే
నాది కూడా నగ్జలిజమే!”
అంటూ తిరుగుబాటుపై తన దృక్పధాన్ని వెల్లడించారు. అదే సమయంలో యుద్ధంతోపాటు శాంతి కూడా కలిసే ఉంటుందని
”కలుపు తీయన చేను కలగూర గంపయై
ఆశించిన ఫలిమ్ము నందీయదు
ప్రగతి విధ్వంసకుల ప్రతిఘించగలేని
జాతి అభ్యుదయమ్ము సాధించదు”
అని యుద్ధాన్ని సమర్ధించారు.
అసమ సమాజం : సమాజంలోని అసమానతలపై గళమెత్తిన భీమన్న సాహిత్యంలో, సమాజంలోని అన్ని కోణాలను స్పృశించిన సంఘటనలు కోకొల్లలు. అయినా కొందరు సంకుచిత దృష్టితో ఆయనను దళితకవిగా ప్రచారం చేయడం దురదృష్టకరం. ఆయన సాహిత్యంలో నిమ్నవర్గాల సముద్ధరణ కోసం సృష్టించిన సాహిత్యం ఒక భాగం మాత్రమే. కానీ ఆయన సాహిత్యాన్నంతా దళిత సాహిత్యంగాను, ఆయన్ను దళితకవిగాను పేర్కోనడమంటే ఆయన స్ధాయిని తగ్గించినట్టే. పేద-ధనిక తారతమ్యాలను –
”ఏడంతస్తుల మేడల ప్రక్క
ఏడుస్తున్న పూరి గుడిసెలు…………..
ఇదియేనా నాగరిక జీవనం
ఇదియేనా మానవ సంస్కారం” ………. అంటూ ప్రశ్నిస్తారు.
రాజకీయాలు : రాజకీయ మదం ప్రజలను ఉన్మత్తులుగా మార్చేస్తుందని భీమన్న వాపోయారు. అయితే తాత్కాలికంగా ఆకర్షణీయంగా కనిపించినా, అది అల్పమైన భోగమని అభిప్రాయపడ్డారు.
”ధనం, పదవి, అధికారం
దానవ లక్ష్యములు
మూగుదురీకక్షుద్రలక్ష్య
ముల చుట్టూ సామాన్యులు” …. అని చెబుతూ
”అల్ప భోగముల కోసం
ఆరాటం పడకుమా!” ….. అని ఉపదేశిస్తారు. అలాగే
”అధికారం చేతికి వచ్చిన  తరువాత 
ఆత్మీయుల మరచి పోకుమా!” …. అని చెబుతూ
పదవులు శాశ్వతమని మురిసి పోవద్దని, ఓటు వేసిన సామాన్యుణ్ణి నిర్ణక్ష్యం చేస్తే ఆ పదవికి అతనే పోటీదారుడుగా మారే అవకాశం ఉందని గుర్తుచేస్తారు.
పైరవీల ప్రాధాన్యం : మనదేశంలో పైరవీల ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. భీమన్నగారు పేర్కొన్న కాలం కంటే ఇప్పుడే వాటికి మరింత డిమాండ్‌ ఉంది. ప్రతిభ ఉన్నా పైరవీ లేకపోతే ఉపయోగం సున్నా అనే అభిప్రాయం సమాజంలో ఉంది. అందుకే
”ఎంత ప్రజ్ఞ ఉన్నా
ఎంత ప్రతిభ ఉన్నా
పైరవీలు లేకుండా
పదవులు రావన్నా”
అన్న భీమన్నగారి మాటలు సమకాలీన సమాజంపై సంధించిన అక్షర తూణీరాలు. పైరవీలతో ప్రతిభను మరుగుపరచవద్దని చెబుతూ, పైరవీలు తాత్కాలికంగా మాత్రమే ప్రభావాన్ని చూపిస్తాయని, ప్రతిభ ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందని ఆశావహ దృక్పధాన్ని కలిగిస్తారు.
మతం : సమాజాభివృద్ధికి నిరోధకంగా మారి, మనుషుల మధ్య అగాథాలు సృష్టిస్తున్న మతాన్ని భీమన్న తీవ్రంగా నిరసించారు.
వద్దయ్యా, రాజకీయ
వాగ్దానం, మిత్రమా!
నిత్యాత్మవు నీవైతే
నిరతము మాతోనుండుము!
అని కోరుకుoటారు. మతం కంటే మానవత్వం మిన్న అని చాటారు.
యువతకు ప్రభోధం : యువతలో ఆత్మవిశ్వాసం ఉంటే, ఏదైనా సాధించగలరని, ఎంతి క్లిష్టపరిస్థితుల్లో ఉన్నా, దాని నుంచే పైకి రావాలని ఉద్భోదిస్తారు భీమన్న.
వెదురు పొదల జనించినా
వేణువుగా మొరయాలని
ములుకంపే లభించినా
గులాబివై విరియాలని….
చెబుతూ మనం గొప్పగా చూసే వాటి  చుట్టూ కూడా కొన్నిలోపాలు ఉంటాయని, వాటిని అధిగమించి సుఖాలను అందుకోవాలని ఆకాంక్షిస్తారు.
మానవత్వం : సాటి  మనిషిపట్ల ప్రేమాభిమానాలు తగ్గిపోయి, దైనందిన జీవితంలో పెరిగిపోయిన కృత్రిమత్వాన్ని భీమన్న ఖండించారు. మానవత్వం మనిషికి అత్యంత ప్రధానమైనదని, మానవత్వం లేనివాడు మనిషే కాదంటూ
ఎన్ని పదవులలంకరించిన
ఎన్ని భోగములనుభవించిన
మానవత లేకున్నవాడు
మనిషి కాదన్నా! …అంటూ
తన మానవతా వాదాన్ని చాటుకున్నారు భీమన్న.
ఐకమత్యం : ఇతరులతో నాకు సంబంధంలేదు. ఈ ప్రపంచంలో నేను, నా కుటుంబం అనే స్వార్ధం విపరీతంగా పెరిగిపోయిo ది. అందుకే ఒక మనిషి ప్రాణాపాయస్థితిలో ఉన్నా బిజీ జీవితం పేరుతో మానవత్వాన్నే మరచిపోతున్నాం. నరరూపరాక్షసులుగా మారిపోతున్నాం. దీనిపై ఆవేదన చెందిన భీమన్న ఎంత కష్టపడినా, వ్యక్తిగా సాధించే వృద్ధికంటే సమిష్టిగా కష్టపడితే ఎక్కువ వృద్ధి సాధించవచ్చని, అసాధ్యాలుగా కనిపించే వాటిని కూడా సుసాధ్యాలుగా చేసుకోవచ్చన్నారీ గేయంలో
కలిస్తే – గెలుస్తాం
గెలిస్తే – నిలుస్తాం
గడ్డిపోచలమె అయినా
మదగజముల బంధిస్తా,
చలిచీమలమైన గాని
సర్పాలను పట్టేస్తాం!
అంటూ ఐకమత్యంలో ఉండే బలాన్ని గొప్పదనాన్ని విశదీకరించారు.
తత్త్వం : మనం చేసిన పరిశ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతామని వివరిస్తూ భీమన్న
నీ మనసే నీదైవం
నీ ప్రజ్ఞే నీ ప్రగతి
నీవే నీ జీవిత నిర్మాతవు
నీవే నీ సుఖశాంతుల కర్తవు!
ఫలవృక్షం పెంచేనా
ఫలము లాగరించేవు
ముళ్ళ మొక్క నాటేవా
ముళ్ళు గిచ్చి వగచేవు!
అంటూ తన తత్త్వాన్ని ప్రకటిoచారు.
సమాజాన్ని నిరంతరం గమనించన భీమన్న అసమసమాజంలోని రుగ్మతలను బట్టబయలు చేశారు. వాటి  నిర్మూలనకై నిరంతరాయంగా అక్షర తూణీరాల్ని సంధించాడు. సమాజానికి తన కవిత్వం ద్వారా దిశానిర్దేశం చేశారు. సుఖసంతోషాలతో కూడిన సమసమాజస్ధాపన కోసం కలలు గన్నారు. ఆ కలలను సాకారం చేయమని తన సాహిత్యం ద్వారా ప్రజలకు ఉద్భోదించారు. కవిగా సమాజ ఔన్నత్యాన్ని స్వప్నించిన మహాస్వాప్నికుడు భీమన్న. సమాజశ్రేయస్సును కాంక్షిస్తూ మానవతను అభిలషిస్తూ ఆయన సృష్టించిన సాహిత్యం అజరామరం. అందుకే సమసమాజ స్ధాపనలో అవి నిత్యమూ ప్రజలను ఉత్తేజ పరుస్తూనే ఉంటాయి. ఒక కవి రచనలకు అంతకేంటే పరమార్ధం ఏముంటుంది? అందుకే కవిగా బోయి భీమన్న ధన్యుడు.

 

                                                                                          – డా|| కె. వి.ఎన్‌.డి.వరప్రసాద్‌

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)