కాళ్లకూరి ‘వరవిక్రయం’ -డా|| సింగుపురం నారాయణరావు , డా|| రంకిరెడ్డి రామమోహనరావు,

vihanga-telugu magazine
ISSN 2278-478

పరిచయం :

                        కాళ్ళకూరి నారాయణరావు గారు తెలుగువారు గర్వించదగిన మహాకవి, నాటకకర్త, సమకాలీన సామాజిక సమస్యలను, దురాచారాలను తన కవితా ఖడ్గంతో ఛేదించిన అక్షరవీరుడు ఆయన.  తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, బంగారు రాజులు. పశ్చిమగోదావరి జిల్లా మత్స్యపురిలో  28-4-1871వ సంవత్సరంలో నారాయణరావు గారు జన్మించారు. తండ్రి గారి దగ్గరే రామాయణ, భారతాలు చదువుకొన్నారు. పాడి వెంకట నారాయణగారి దగ్గర కావ్య నాటకాలంకారాలు చదువుకొన్నారు. స్వాతంత్య్రోద్యమం అప్పుడప్పుడే పరివ్యాప్తమవుతూ ఉంది. బ్రహ్మ సమాజ భావనలు సమాజం మీద ప్రభావం చూపుతూ ఉన్న సమయాన – ఆ ప్రభావానికి వశ్యులై నారాయణరావుగారు కళావంతుల కుంటుంబానికి చెందిన చంద్రమ్మ (చంద్రముఖి)ను వివాహం చేసుకున్నారు. బహుశా ఈ వైవాహికం 1890వ ప్రాంతంలో జరిగి ఉండవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు. కాగా నారాయణరావు గారికి అన్ని విధాలుగా అండగా ఉండే మహోన్నత వ్యక్తి బుద్ధిరాజు వీరభద్రరావుగారు. తన రచనలన్నీ వీరికే కాళ్ళకూరి అంకితం చేశారు.

                              నారాయణరావుగారి రచనలన్నీ ఆయన వ్యక్తిత్వ వైశిష్ట్యానికి, సామాజిక దృక్పథానికి, ప్రతిభా విశేషానికి, పాండిత్య ప్రకర్షకు అక్షర తార్కాణాలు. చిత్రాభ్యుదయం, పద్మవ్యూహం, చింతామణి, వరవిక్రయం, మధుసేన, సంసార నటన మొదలగు నాటకాలు, లుబ్దాగ్రేసర చక్రవర్తి, ధూమశకట ప్రహసనం మొదలగు ప్రహసనాలు, ప్రతాప రుద్రమదేవి పేరుతో నవల, లక్కికిలక్కి, పెద్దల నాటి  ముద్దు కథలు, మూర్ఖ సేవకుడు ముప్పు  కథలు, సదండ విదండ వివాదం, మారుతము విమర్శలు, చరిత్రగ్రంథాలు, అనేక వ్యాసాలు, గ్రంథ విమర్శలు, కవితలు మొదలగు ఎన్నెన్నో సాహితీ ప్రక్రియలను అమేయమైన వినూత్నమైన రీతిలో రచించి మనకు అందించిన మేధో మూర్తి నారాయణరావుగారు. వివిధ సంస్థలచేత, పీఠాధిపతులచేత, కవిరాజు, గ్రంథపఠన, రచన చతురాస్య మహాకవి మొదలగు బిరుదులు పొందారు.

                              సంఘసంస్కరణాభిలాష మెండుగా వున్న నారాయణరావుగారు యోగ విద్యల్లో కూడా నిష్ణాతులు.  వైద్యం చేయటంలో నేర్పరి. దాన్ని సాధనంగా చేసికొని అనేకుల రోగాలను తగ్గించటం జరిగింది. హస్తసాముద్రికంలో అందె వేసిన చేయి. మంత్రశాస్త్రంలో ప్రావీణ్యం ఉండేది. దక్షిణామూర్తి ఉపాసన వీరికుందని ప్రతీతి. వీరి కుమారులలో ఒకరికి దక్షిణామూర్తి అనే పేరు కూడా ఉంది. నాట్యశాస్త్రంలో కూడా చక్కని ప్రవేశం ఉంది. అధునాతన కళయైన పోగ్రఫీలో వీరి నైపుణ్యం ప్రశంసనీయం. ఆదిభట్ల నారాయణదాసు గారితో పోటీగా  హరికథలు చెప్పేవారు. ఉపాధ్యాయవృత్తిలో కొన్నాళ్ళున్న నారాయణరావుగారు న్యాయశాస్త్రంలో అభినివేశం కలిగినవారు. ఎందరెందరో న్యాయ సలహాల కోసం వీరి దగ్గరకు వచ్చి వెళుతుండే వారు. అనాటి కాలంలో తిరుపతి వెంకట కవులకు కొప్పరపు కవులకు మధ్య తీవ్రమైన విద్యాశత్రుత్వం ఉండేది. నారాయణరావుగారు కొప్పరపు కవులకు అభిమానిగా ఉండేవారు. అండా నిలిచేవారు. దీనివల్ల తిరుపతి వెంకట కవులకు, నారాయణ రావుగారికి మధ్య వైరుధ్యం ఏర్పడింది. వీణా వాదనలో నిపుణులుగా అనాడు కాళ్ళకూరి ప్రఖ్యాతిని పొందారు. అనేక సన్మానాలు పొందారు. ”ఆచంటలో కవితా చమత్కృతి చూపి కాంచన కవి ఘంటకాంచినాడ” అని చెప్పుకున్నారు. ఇంతేకాకుండా నాటకాలలో కూడా నించేవారు. ప్రకాశం పంతులుగారు దమయంతి పాత్ర ధరిస్తే, వీరు నల, బహుక పాత్ర ధరించి ప్రజలను మెప్పించేవారు.

                                   కన్యాశుల్క దురాచారానికి వ్యతిరేకంగా గురజాడ అప్పారావుగారి కన్యాశుల్కం ఎటువంటి  ప్రఖ్యాతిని పొందిందో, అదే విధంగా వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా కాళ్ళకూరి నారాయణరావుగారు రచించిన వరవిక్రయం అంతి విఖ్యాతిని పొందింది. కొప్పరపు సోదర కవులు ఈ మహాకవిని – నాటకాన్ని కీర్తించిన విధము చూస్తే నారాయణరావుగారి కీర్తి చంద్రికలకు ఎత్తిన పచ్చ కర్పూర హారతిని తలపిస్తుంది.

కన్యా విక్రయ మెట్ల భావుకము లోకత్యాజ్యమారీతినే
హైన్యం బౌవర విక్రయంబును బ్రపంచా నర్ధకం బౌటచేఁ
గన్యలగాంచిన య్టి వారును పరుంగన్న్టి వారున్‌ సదా
ధన్యంబౌ గురుమంత్ర నాయకముగా ధ్యానింతురే సత్క కృతిన్‌
లలిత శిరీష పుష్పమృదులంబు రసాల రసైక మాధురీ
విలసిత ముత్త మోత్తమము విస్ఫుట నూతన భావ వైభవో
జ్జ్వలము జనానుకూలము భవత్క కృతి రత్నము భవ్యసాంఘికో
క్తుల వెలసెన్‌ యశోరములతోఁ గృతి భర్తకృతార్ధతంగనన్‌

                                      వరవిక్రయ నాటకంలో ప్రధాన పాత్రధారి పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు. ప్రధాన ప్రతినాయక పాత్ర సింగరాజు లింగరాజు. వీరివురిని క్రమంగా వెన్నతోను, అగ్నికణంతోను పోల్చవచ్చు. పురుషోత్తమరావు సౌమ్యుడు, మృదుస్వభావి, దేశభక్తిపరాయణుడు. విలువలు పాించే మనిషి. అమాయకుడు. సింగరాజు లింగరాజు పూర్తిగా పై లక్షణాలకు వ్యతిరేకం. డబ్బుకోసం ఎంతనీచానికైనా ఒడిగడతాడు. దేశభక్తి అన్నా, స్వాతంత్య్రం అన్నా అతనికి ఒళ్ళుమంట. విలువలకు విలువనివ్వని మనిషి. మోసగాడు. మహాకవి కాళ్ళకూరి నారాయణరావుగారు ఈ రెండు పాత్రలను అతిప్రతిభావంతంగా చిత్రించినారు. ఈ రెండుపాత్రల లోతుపాతులను, మనస్తత్వాల్ని, వ్యక్తిత్వతారతమ్యాల్ని కింది విధంగా పరిశీలిద్దాం.

పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులు :

                                     వరవిక్రయ నాటకంలో ప్రధానపాత్రధారి పురుషోత్తమరావు. ఇంటి పేరు పుణ్యమూర్తుల. పదిసంవత్సరాల పాటు రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌ పనిచేసి, సహాయనిరాకరణ ఉద్యమం పట్ల సానుభూతితో ఉద్యోగాన్ని వదిలివేసి వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా పోరాటం సాగించసాగారు. భార్య భ్రమరాంబ అనుకూలవతి. వీరిద్దరి సంతానం కాళింది, కమలలు. పెళ్ళీడు వచ్చిన వీళ్ళ కోసం, తన సిద్ధాంతాలను తప్పని పరిస్థితులలో వదులుకొని, సింగరాజు లింగరాజు దత్తత కుమారుడు అయిన బసవరాజుకు ఇచ్చి పెళ్ళిచేయానిఇ పేరయ్య ద్వారా స్ధిరపరుచుకొన్నాడు. 5 వేల రూపాయిల కట్నం, ఇతర లాంఛనాలు ఇవ్వానికి అంగీకరించాడు. 5 వేల రూపాలయల నగలు కాళిందికి పెట్టానికి లింగరాజు అంగీకరించాడు. అయితే వరకట్నం తీసుకునే సంబంధం ఇష్టం లేక, ఈ పెళ్ళి వల్ల తమ కుటుంబం చితికి పోతుందని గ్రహించి కాళింది ఆత్మహత్య చేసుకుంది. తర్వాత అందరూ ఒక నిర్ణయానికి వచ్చి, కమలను బసవరాజుకిచ్చి పెళ్ళి చేస్తారు. ఈ పెళ్ళి సందర్భంలో ఆడపిల్ల పెళ్ళివారు ఎన్ని అవస్థలు పడతారో ప్రత్యక్షంగా అనుభవించారు. పురుషోత్తమరావు. తర్వాత కమల మాటమీద కాపురానికి కూతురుని పంపించడు. లింగరాజు నోటీస్ఇస్తాడు. కమల మాట మీద ధైర్యంగా ఉన్నాడు. అయితే కోర్టు ఎక్కటం కన్నా కొరత ఎక్కటమే మేలు అని భావిస్తాడు. కోర్టువాళ్ళు కమలకు అనుకూలంగా తీర్పు ఇవ్వటం జరిగింది. తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నప్పటికీ , కూతుళ్ళ వివాహం కోసం, కొంత రాజీపడినప్పటికీ  కూతురు మాటలు విని, తన వక్తిత్వాన్ని నిలుపుకున్నాడు.

సింగరాజు లింగరాజు :

                                            వరవిక్రయ నాటకంలో లింగరాజుది ప్రధాన ప్రతినాయక పాత్రగా మనం చెప్పుకోవచ్చును. సింగరాజు అనేది ఆయన ఇంటి పేరు. పరమ పిసినారి ఈ లింగరాజు. మూడో భార్య సుభద్ర పిల్లలు లేకపోతే దత్తతగా ఒక అబ్బాయిని తీసికొని పెంచుకోసాగాడు. ఇతని పేరు బసవరాజు. లింగరాజు సంసారాన్ని జాగ్రత్తగా, డబ్బు ఖర్చు పెట్టుకోవానికి వీలు లేకుండా నడుపుతుాండు. వడ్డీ వ్యాపారం కూడా ఉంది. బసవరాజుకు పెళ్ళిచేసి, ఘనంగా కట్నం తీసికోవాలని దురాశ. పేరయ్య చెప్పిన మాటలను బట్టి  పురుషోత్తమరావు కుమార్తె కాళిందిని కోడలుగా చేసికోవానికి అంగీకరించాడు. ఆస్తి బాగా కలిసి వస్తుందని ఊహించాడు. వెనక ముందు చూసుకోకుండా బజానా క్రింద 10 వేలు రూపాయలు తీసికొని కట్నం వివరాలు, ఇతర లాంఛనాలు అన్ని రశీదు రూపంలో వ్రాసి ఇచ్చాడు. కాళింది చనిపోయిన తర్వాత కట్నం డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఏమి చేయాలా! అని ఆలోచించాడు. చివరకు కాళింది చెల్లెలగు కమలను తన కోడలుగా చేసుకున్నాడు. అయితే కమల తెలివితేటలు కలది. శుభలేఖను ఆధారం చేసికొని బసవరాజును తాను వేలంలో కొనుగోలు చేశానని చెప్పింది. 3 సంవత్సరాలపాటు కాపురానికి వెళ్ళకుండా లింగరాజుకు బుద్ధి రావటంకోసం పుట్టింట్లో  ఉండిపోయింది. లింగరాజు అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. 4 వేల రూపాయల సొమ్ము ఆమె ఒంటి మీద ఉండి పోయిందని లబోదిబోమన్నాడు. వెంగళప్పతో ఆలోచించి కోర్టులో దావావేశాడు. అయితే ఓడిపోయాడు. న్యాయాధిపతి కమల మాటలలో నిజం ఉందని అంగీకరించాడు. బసవరాజు కూడా ఎదురు తిరగటంతో జ్ఞానోదయం అయ్యింది. పురుషోత్తమరావు గారి అభిప్రాయాలతో ఏకీభవించాడు.

                                         వరవిక్రయం నరమాంస విక్రయం విందని పురుషోత్తమరావు భావన. చివరకు బుద్ధి తెచ్చుకొని లింగరాజు, పురుషోత్తమరావు గారి అభిప్రాయాలకు విలువనిచ్చి ఆయనతో కలిసిపోయాడు. పురుషోత్తమరావు లింగరాజును మనస్ఫూర్తిగా క్షమించాడు. ఈ నాటకంలో లింగరాజు హాస్య ప్రతి నాయకుడిగా, పిసినిగొట్టుగా, దన పిశాచిగా, మానమర్యాదలు పాటించని  వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఆడపిల్లల పెళ్ళికై మధ్యతరగతి కుటుంబాలలోని వ్యక్తులు ఎలా నలిగిపోతున్నారో అనడానికి పుణ్యమూర్తుల పురుషోత్తమరావు ప్రతినిధిగా కనిపిస్తాడు. విలువలకు విలువనిచ్చిన మనిషిగా పురుషోత్తమరావు పంతుల్ని విజయం వరిస్తుంది. నీతికి నిజాయితికి మారుపేరుగా పుణ్యమూర్తుల పురుషోత్తమరావు కనిపిస్తాడు. పురుషోత్తమరావు నైతికవర్తనం ముందు లింగరాజు అనైతికత తలదించక తప్పలేదు. పురుషోత్తమరావు మంగళాశాసనాన్ని పలుకుతూ ఆడపిల్లల వివాహానికై తండ్రులు పడే బాధలు పోవాలని కోరుకుంటాడు .

డా|| సింగుపురం నారాయణరావు
చైర్మన్‌ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ఇన్‌ తెలుగు
బరంపురం యూనివర్శిీ, బరంపురం, ఒడిశా

డా; రంకిరెడ్డి రామమోహనరావు,

రీడరు & తెలుగు శాఖాధ్యకక్షులు,
ఎస్‌.వి.కె.పి. & డా|| కె.ఎస్‌.రాజు ఆర్ట్స్‌ & సైన్స్‌ కళాశాల,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , , , , Permalink

Comments are closed.