నా జీవనయానంలో.. (ఆత్మ కథ) జీవితం-58-కె. వరలక్ష్మి

కె.వరలక్ష్మి

కె.వరలక్ష్మి

ఇదంతా జరగకముందు పురుటిస్నానం రోజు రమ్మని కబురు చేసినా మా అత్తింటివాళ్ళు ఎవరూ రాలేదు. వీధిలో వాళ్ళు మాత్రం కొందరు వేడినీళ్లు, ఇంకొందరు చన్నీళ్ళు బిందెలకి పసుపు ముద్దలు అంటించీ, నీళ్ళల్లో ఒకో పసుపుకొమ్ము వేసీ తెచ్చేరు. మా వాకిట్లో పెద్ద కర్రల పొయ్యి మీద వావిలాకు, వేపాకు వేసి పెద్ద డేగిసాతో నీళ్ళు మరగబెట్టేరు. పదకొండుమంది ముత్తైదువులు ఒకో చెంబుడు నీళ్ళు నానెత్తిన గుమ్మరించి స్నానం కార్యక్రమం ప్రారంభించేరు. నా ఒళ్ళంతా పసుపు, సున్నిపిండి, నూనె కలిపి రాసి నల్చేరు. బిందెలు బిందెలు వేణ్ణీళ్ళ స్నానం, దట్టమైన సాంబ్రాణిపొగ నిండిన వింత వాతావరణం ఇల్లంతా నిండిపోయింది. పదకొండుమంది ముత్తైదువుల సహ పంక్తిన నాకు భోజనం పెట్టేరు. అత్తింటి వాళ్ళెవరూ రాలేదా అని అందరూ అడగడమే,

తర్వాత నెలలోపల మా అత్తగారు, అమ్మమ్మగారు, ఆంటీ, విజయ కలిసి వచ్చేరు. అమ్మమ్మగారు సన్నని చిన్న బంగారు గొలుసు పావుతులంది, విజయ నీలంరాయి పొదిగిన చిన్న ఉంగరం తెచ్చి బాబుకి అలంకరించేరు.
‘పురుటిస్నానం రోజు మీరు వచ్చుంటే ఆ రోజు పేరు కూడా పెట్టేసేవాళ్ళం కదాండీ’ అంది మా అమ్మ.

‘దానికేవుంది, ఇప్పుడే పెట్టేద్దాం. నేనెప్పుడో అనుకున్నాను మోహన్రావుకి కొడుకుపుడితే మా నాన్న పేరేనని’ అంటూ మా అత్తగారు ఉయ్యాల దగ్గరకెళ్లి నిద్రపోతున్న పిల్లవాణ్ణి ‘ఎర్రయ్యా, ఎర్రయ్యా, ఎర్రయ్యా’ అంటూ మూడు సార్లు పిల్చేసారు.
వెలవెలపోయిన నా మొహం చూసి అమ్మమ్మగారు ‘నోరు ముయ్యవే కనకం, నీ కొడుకులకి రామ్మోహన్, కృపాల్ అని కొత్తపేర్లు పెట్టుకుని ఆళ్లపిల్లోడికి అంత పాతపేరు పెడతావా? మీ అత్తగారంతేలేమ్మా! మోహన్రావూ నువ్వూ అనుకుని మంచి రోజు చూసి మంచిపేరు పెట్టుకోండి’ అని తేల్చేసారు.

మా మాస్టారు, అక్కయ్యగారు చూడ్డానికి వచ్చినపుడు బాబుకి పేరు పెట్టమని అడిగేం, వాడి జన్మ నక్షత్రానికి పదకొండు అక్షరాల పేరు పెట్టాలని పంచాంగంచూసి చెప్పేరు మాస్టారు. పురుటి సమయంలో మోహన్ మొక్కుకున్న వేంకటేశ్వరస్వామి, నేననుకున్న రవీంద్రుడు, పదే పదే కలల్లోకి వచ్చిన నాగేంద్రుడు పేర్లు కలిపి శ్రీ వెంకట రవీంద్ర ఫణిరాజ్ అని వేణు గోపాలస్వామి ఆలయంలో అర్చనానంతరం నామకరణం చేసేరు మాస్టారు. మాస్టారు స్వయంగా పిల్లవాణ్ణి తీసుకెళ్ళి వేణుగోపాలుడి పాదాల్ని తాకించి తెచ్చేరు. నేను మాస్టారి పాదాల్ని తాకించేను. ఆయన ఆత్మీయంగా ఆశీర్వదించేరు. ఆరోజు మా అమ్మ చంటిపిల్లల మొలకి కట్టే బంగారు మువ్వలదండ ఇచ్చింది. మా అందరికీ కడుతూ వచ్చిన దండ అది. మేం మాస్టారికీ, అక్కయ్యగారికీ, కొత్త బట్టలు పెట్టేం. కబురుచేసినా మా అత్తింటి వాళ్ళెవరూ రాలేదు కానీ, ఆరోజంతా ఒక వేడుకలాగా జరిగింది.

బాబు ఫిబ్రవరిలో పుడితే మార్చినెలచివర్లో ఒకరోజు మోహన్ తనకి ఉద్యోగం పోయింది అంటూ వచ్చేడు. నాగుండె గుభేలుమనిపోయింది. దుఃఖం ఆగలేదు. ‘పోవడం అంటే నిజంగా పోవడం కాదులే, నేను B.Ed చేసిన వాణ్ణి సెకండరీ గ్రేడు పోస్టులో చేస్తున్నాను కదా, B.Ed పోస్టింగ్స్ తీసినపుడు నాకు తిరిగి ఉద్యోగం వస్తుంది.’ అంటూ మోహన్ చెప్పినా, అదెప్పటికి జరుగుతుందో తెలీదు. బతుకుబండి మళ్ళీ మొదటికొచ్చిందే అని దిగులుపట్టుకుంది నాకు. నా ఫ్రెండు రామలక్ష్మి హయ్యరుగ్రేడు పాసై ఎలిమెంటరీ స్కూల్లో టీచరుగా చేస్తోంది. వాళ్ళక్క సర్వలక్ష్మి సెకండరీగ్రేడు పాసై హైస్కూల్లో టీచరుగా చేస్తోంది. నాకెందుకలాంటి ఆలోచన రాలేదు? మెడిసిన్ అని పట్టుకుని వేళ్ళాడేను. తప్ప రాజమండ్రిలోనే ఉన్న గాళ్స్ ట్రెయినింగ్ లో చేరాలని ఆలోచన రాలేదెందుకు? ఒకవేళ వచ్చినా మా అత్తగారు ఒప్పుకునే వారా? ఒక్కదాన్నీ ఎలాగో బతికేసేను. ఇప్పుడీ పిల్లవాడికి గ్రైప్ వాటర్ కొనాలన్నా రూపాయిన్నర ఎవరిని అడగాలి? రకరకాల ఆలోచనల్తో నిద్ర పట్టేది కాదు. మోహన్ తన బట్టలు సర్దుకుని రాజమండ్రి వెళ్ళిపోయాడు. చిన్నింట్లో ఉన్న మా సామాను మూటలు కట్టేసి దాన్ని అద్దెకిచ్చేశారు. ఆ నెలలోనే మా నాన్న బడ్డీ ఉన్న వీధిగదిలో మళ్ళీ కూల్ డ్రింక్స్ సోడాల్తో షాపు ప్రారంభించేరు. దాన్తో నా మంచం, బాబు ఉయ్యాల పంచాదిగుమ్మంలోకి వచ్చాయి. నా మంచం పక్కనే గట్టు మీద టేకు కర్రపెట్టెలున్నాయి. ఆ పైన కోళ్ళమట్టు పెట్టింది మా అమ్మ. రోజూ కోడిగుడ్లమీదనుంచి లేచి ఆహారం కోసం బైటికెళ్ళేది. రెక్కలు విదిలించి ఊకంతా నా మంచం మీద దులిపి వసారా చివరికి దుమికేది. తిరిగి వచ్చేటప్పుడు వసారా చివర్నించి పెట్టె మీదకి ఎగిరేది. ఈసారి రెక్కల్లో మట్టినింపుకుని వచ్చేది. ఈ చర్యలకీ, చప్పుళ్ళకీ బాబు ఉలిక్కిపడి కాళ్ళూ చేతులూ పైకి ఎత్తి ఏడుపు అందుకునేవాడు. అందుకని నేను వీలైనంతవరకూ బాబుని ఆ ప్రాంతంలో ఉంచకుండా జాగ్రత్త పడేదాన్ని. పాలు తాగేటప్పుడు తప్ప బాబుని ఎవరో ఒకళ్ళు ఎత్తుకుని ఉండేవాళ్ళు. ఒకరోజు పాలిచ్చిన వెంటనే మరీ ముద్దొచ్చేసి వాడి బుల్లి ముఖాన్ని బొజ్జనీ, కాళ్ళనీ, చేతుల్నీ నిమురుతూ ‘ఈబుజ్జి బొజ్జలోంచి నేనుపుట్టేసేనేంటీ’ అంటూ ముద్దులాడుతున్నాను. ఎంత ముద్దులాడినా తనివితీరడం లేదు. వాణ్ణి చెంపలకు హత్తుకుని, గుండెకు హత్తుకునీ ఏమేమో మాట్లాడేస్తున్నాను. చుట్టుపక్కల ఎవరూ లేరనే నమ్మకంతో కానీ, మా నాన్న నా వెనుక గుమ్మం దగ్గర ఎప్పట్నుంచి నుంచుని వింటున్నారో ‘అవునమ్మా, అందర్నీ హడలబెట్టి ఏడిపించి పుట్టేసేడమ్మా నీ గారాల కొడుకు’ అని ఫక్కుమని నవ్వేరు. నేను చాలా సిగ్గుపడిపోయేను.
బాబుకి రెండోనెల నడుస్తోంది. 1969 ఏప్రిల్ 13న సంధ్యవేళ దాటిన కాస్సేపటికి బాబుని ఒళ్ళో పెట్టుకుని మా హాలుగోడకి చేరబడి కూర్చుని ఉన్నాను. హఠాత్తుగా నేను కూర్చున్న గది నీటిమీది నావ లాగా అటూ ఇటూ ఊగింది. ఎడం పక్కనున్న గోడ నేలబారుకీ, కుడిపక్క గుమ్మం పైకి వెళ్ళి యథాస్థానానికి వచ్చేయి. గోడమీది దేశనాయకుల ఫోటోలు కొన్ని కిందపడిపోయాయి. నా వెనుక ఉన్న పడకగదిలో బల్లలమీద పేర్చిన ఇత్తడి సామాను భళ్ళు భళ్ళున శబ్దం చేస్తూ పడిపోయింది. ఇదంతా జరుగుతుండగా ఆ చివర కొట్లో ఉన్న మా నాన్న ఒక్క పరుగున వచ్చి బాబును తీసుకుని, నా చెయ్యందుకుని వీధిలోకి పరుగుతీసేరు. ఇదంతా కొద్దిక్షణాల్లో జరిగిపోయింది. పుంతవీధిలో జనం అంతా బైటికి వచ్చి ఉన్నారు. భూకంపం.. భూకంపం అని చెప్పుకుంటున్నారు. వాకిళ్లలోనూ, రోడ్లమీదా ఉన్నవాళ్ళకి ఈ సంఘటన పెద్దగా అనుభూతిలోకి రాలేదట. అందరం తిరిగి ఇంట్లోకి వచ్చేక మా అమ్మ సీరియస్ గా మొహం పెట్టి, ‘నేనూ మిగతా పిల్లలూ ఏవైపోయినా ఫరవాలేదన్నమాట. మీ పెద్దకూతురూ, మనవడూ బాగుంటే చాలన్నమాట!’ అనేసి ఆ తర్వాత నవ్వడం మొదలుపెట్టింది.

మర్నాడు పేపర్లో అది పెద్ద భూకంపమని, సముద్రతీరం నుంచి చాలా ప్రాంతాల్ని కుదిపేసిందని, భద్రాచలం రామాలయం పగుళ్ళిచ్చిందని వార్తలు వచ్చేయి. మా ఊరి జనానికి కొన్నాళ్ళపాటు చెప్పుకునే సంచలనవార్తయిపోయింది.
మోహన్ జీతం అందుకుని నా చేతికి ఒక్క రూపాయైనా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. మాంసాహారుల ఇళ్ళల్లో బలవర్థకమని బాలింతలకి తరచుగా కీమాకూర వెల్లుల్లితో కలిపి నూనెలో ఉడికించినది పెడతారు. ఐదురూపాయలు పెడితే గానీ, నాకొక్కదానికి సరిపడే కైమా రాదు. బాబు పుట్టిన కొత్తల్లో మా అమ్మ రెండుసార్లు తెప్పించి వండింది. అంతలో మా పెద్దమ్మ వచ్చి, ‘మా ఇంట్లో ఆడపిల్లలు ఆళ్ళకోసం మాంసం ఆళ్ళే కొనుక్కుంటారు’ అంది. మా అమ్మ ఆ మాటను నాలుగైదుసార్లు నా దగ్గర అంది. అప్పటినుంచీ మోహన్ ను డబ్బులడిగి నేనే తెప్పించుకునేదాన్ని. ఇప్పుడిక కైమా తినే అవకాశం లేకుండా పోయింది. నా మాట సరే, బాబుకి గ్రైప్ వాటరు అలవాటు చేసింది మా అమ్మ. అది పట్టకపోతే పాలు జీర్ణం కావని అనేవారు. దానికోసం ఎవర్ని అడగాలి? అలాంటి పరిస్థితుల్లో మా వీధికి అవతల వీధిలో ఉండే ఫారెస్టు గార్డు ఒకాయన రెండు, ఒకటి చదువుతున్న వాళ్ళ అబ్బాయిని, అమ్మాయిని తీసుకొచ్చి ట్యూషన్ చెప్పమని నెలకి మూడు రూపాయలు ఇస్తానని అన్నాడు. వెంటనే ఒప్పేసుకున్నాను.

నేను చదివే కథల్లో స్కూలు ఫైనల్ చదివి ఉద్యోగాలు చేసే వాళ్ళుండేవారు. ఒకరోజు ఎమోషనలైపోయి మా మీనాక్షితో చెప్పేను నేను ఏదైనా ఉద్యోగంలో జాయినై మా నాన్నను ఆదుకోవాలనుకుంటున్నానని. ‘వెంకట్రావు మాస్టారు చాలామందికి ఇలాంటి విషయాల్లో సలహా ఇస్తుంటారు. పద వెళ్దాం’ అంది. విషయం విని ‘నువ్వు పెళ్ళైన అమ్మాయివి. నీకా స్వతంత్ర్యం ఎలా ఉంటుంది, నీ భర్త ఒప్పుకోవద్దూ?’ అన్నారాయన. ‘అక్కర్లేదండీ, నేనిక్కడే ఉండిపోతాను. అక్కడికి వెళ్ళనిక’ అన్నాను. ఆయన నవ్వి ‘అదంత సులభం కాదమ్మాయ్! ఎవరో ఎందుకు ఈ మాటను మీ నాన్నే ఒప్పుకోడు. చెప్పిచూడు’ అన్నారు. నన్ను ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించేసింది. కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరుకున్నాను. కానీ, నన్నా ఆలోచన వదలడంలేదు. మా చిన్నింట్లో అద్దెకున్న హెల్త్ అసిస్టెంటు భార్యకు చెప్పేను. ఆవిడ ఆయనకు చెప్పింది. ఆయన ‘దానికేం, చెయ్యొచ్చు. దానికిముందు ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ లో పేరు నమోదు చేయించుకోవాలి’ అన్నాడు. నేను మర్నాడే మా నాన్నని అయిదు రూపాయలడిగి మా పెద్దచెల్లిని, బాబుని తీసుకుని కాకినాడ వెళ్ళి అక్కడ క్యూలో నిలబడి పేరు నమోదు చేయించుకుని వచ్చేను. మా ఇంట్లో హెల్తాయన నాకు సాయం చేసే ఉద్దేశంతో వాళ్ళ ఆఫీసర్ని భోజనానికి పిలిచి నాతో మాట్లాడించేడు. నేను భుజాలమీదుగా కొంగు నిండుగా కప్పుకొని కళ్ళు దించుకుని భయం భయంగా ఆయనడిగిన వాటికి సమాధానాలు చెప్పేను. ఆయనన్నాడు. ‘అమ్మా నీ మార్కులకి, క్వాలిఫికేషన్ కీ ANM పోస్టు ఈజీగా వస్తుంది. వెంటనే వేయించగలను కూడా. కానీ ఆ ఎండన పడి తిరిగే ఉద్యోగం నువ్వు చెయ్యలేవమ్మా! పైగా పసిపిల్లవాడున్నాడు. ఏదైనా ఆఫీసులో కూర్చుని చేసేపని అయితే బాగుంటుంది. బెస్టాఫ్ లక్’ అని.

మా మీనాక్షి తమ్ముడు పుంతవీధిలోంచి వెళ్తూ నన్ను చూసి పలకరించి లోపలికి వచ్చేడు. ఉయ్యాలలో ఉన్న పసివాణ్ణి మురిపెంగా చూస్తూ ‘భలే ఉన్నాడు వీడు. కాకపోతే నీ ముక్కు రాలేదు. వీడికి చప్పిడి ముక్కులాగా ఉంది’ అని నవ్వేడు. స్కూలు ఫైనల్ ఫెయిలై మెట్రిక్యులేషన్ కట్టేడు. రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాడట, ఆ వారంలోనే రిజల్ట్ వచ్చేయి. వాడు ఫెయిలయ్యాడు. చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడని వాళ్ళింట్లో వాళ్ళు వెతికే ప్రయత్నాల్లో ఉండగా వాళ్ళ వంటింటి పక్క పెరట్లో ఉన్న పెద్దనూతిలో శవం తేలింది. మా వీధిలోనే ఉంటున్న మా హిందీ టీచర్ భర్త శివాజీగారు వచ్చి కబురు చెప్పేరు. ఎలా ఉన్నదాన్ని అలాగ పరుగెట్టేసేను. ఆ దృశ్యం నన్ను చాలా డిస్టర్బ్ చేసేసింది. కొన్నాళ్లపాటు తేరుకోలేకపోయాను. అందరికన్నా పెద్దవాడు అన్నయ్య తర్వాత ఎనమండుగురు ఆడపిల్లలు, చివర వీడు. తోటలు, పొలాలు, ఆస్తులు కలిగిన సంపన్న వైశ్య కుటుంబం. ఏదో ఒక వ్యాపారం పెట్టించేవారు. ఏ బలహీనక్షణంలో వాడంత పని చేశాడో కానీ ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాళ్ళ తల్లిగారు నవ్వు మరచిపోయారు. ఏడ్చి ఏడ్చి చూపు కోల్పోయారు.

పుట్టుక – మరణం, ఈ మధ్యలో రకరకాల వైషమ్యాల, వైక్లబ్యాల జీవితం, నాలో ఓ పక్క అనాసక్తత, మరోపక్క జిజ్ఞాస మొదలైంది. దాని ఫలితంగా వేదాంత గ్రంథాల పఠనం కొనసాగింది.

కె. వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, నా జీవన యానంలో...Permalink

Comments are closed.