నిషేధపు బండి మీద మరొకటి – క్రిష్ణవేణి

The Vatican is against surrogate mothers. Good thing they didn’t have that rule when Jesus was born:Elayne Boosler
                                 24 ఆగస్టున, యూనియన్ కాబినెట్- సరోగసీ బిల్ ప్రతిపాదిత డ్రాఫ్టు మీద స్టాంపు వేసి, ఆ తరువాత పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని చూస్తోంది. అది పాస్ అయితే కనుక, వచ్చే కొత్త ఏక్ట్- జమ్మూ, కష్మీర్ కి  తప్ప దేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికీ వర్తిస్తుంది.
ఈ బిల్లు చెప్తున్నది ఇది.
                                   వ్యాపార సంబంధమైన సరోగసీకి ఇంక ఆస్కారం ఉండదు.ముందే ఒక బిడ్డని దత్తత తీసుకున్న/కన్న జంటకి సరోగసీ అనుమతి లేదు. ఒక బిడ్డ ఉండి, విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్ళి చేసుకున్న వారికి ఇది వర్తించదు. పెళ్ళవనివారికీ, విడాకులు తీసుకుని- ఒంటరిగా ఉన్నవారికీ, అవివాహితులకీ అసలే అంగీకారం లేదు. సహజీవనం చేసేవారికీ లేదు. మన దేశ చట్టం సమలైంగిక సంబంధాలని గుర్తించదు కనుక, ఆ జంటలు ఆశే వదులుకోవాలి.
                                సరోగసీ అంటే ఏమిటి? ఒక పురుషుని గర్భాన్ని మోయడానికి భార్య కాక ఇంకొక స్త్రీ అంగీకరించడం. గర్భాన్ని అద్దెకి తీసుకోవడం. తీవ్రమైన వ్యాధులవల్ల గర్భాశయాన్నో, బీజకోశాలనో పోగొట్టుకున్న జంటలకీ, గర్భాన్ని తొమ్మిది నెలలూ మోయలేకపోయే స్త్రీలకీ వీలు కల్పించడం. సరోగేట్ స్త్రీ ముందే బిడ్డని కని ఉండాలి. ఇక్కడ అసలు తల్లి, జీవమిచ్చిన (Biological) తల్లి అవదు. ఒప్పందం ప్రకారం, ప్రసవం తరువాత ఆ స్త్రీ పుట్టిన బిడ్డమీద అధికారం వదులుకోవాలి. వైద్యానికీ, పోషణకీ అయ్యే  ఖర్చంతా సరోగసీ కావాలనుకునే ఆ జంటదే. ఈ జంటకీ, సరోగేట్ తల్లికీ(surrogate mother ) మధ్య IVF క్లినికుల డాక్టర్లవీ, ఏజెన్సీ ఖర్చులూ అవీ తీసి వేస్తే సరోగేట్ తల్లికి దక్కేది మహా అయితే రెండో, మూడో లక్షలు. ఈ మొత్తం ప్రక్రియకి అయ్యే  ఖర్చు 8-10 లక్షలు.
                              ప్రాధమికంగా, ఈ బిల్లు పెళ్ళయిన జంటలకి మాత్రమే వర్తిస్తుంది. దీని ప్రకారం, పెళ్ళయి అయిదేళ్ళయితే తప్ప సరోగసీకి అనుమతి లేదు. పెళ్ళయిన మొదటి సంవత్సరమే, ఏదో లోపం వల్ల తమకి పిల్లలు పుట్టరని తెలిసినప్పటికీ, వాళ్ళు అయిదేళ్ళూ ఆగాలి. అదే, వారి పెళ్ళి అయినదే ఏ నలబై ఏళ్ళకో అయితే, అప్పుడు కూడా ఐదు సంవత్సరాలు ఆగాలనడం హాస్యాస్పదం.
                               మళ్ళీ, ఏ లోపమో/వికలాంగమో ఉన్న బిడ్డ ముందే ఉండి ఉంటే, ఆ జంటకి సరోగసీకి అనుమతి ఉంది. దీనిలో ఏ లాజిక్కూ కనబడదు. లోపం ఉన్న బిడ్డని జాగ్రత్తగా చూసుకోడానికే సమయం, డబ్బూ, శ్రమా అవసరం అవుతాయి. మళ్ళీ రెండో పిల్లో, పిల్లాడో కావాలనుకున్నప్పుడు, సమస్య జటిలం అవుతుంది. మొదటి బిడ్డని నిర్లక్ష్యపెట్టే అవకాశమూ లేకపోలేదు.
                                పరహితాత్మక (Altruistic) సరోగసీ అనుమతించబడింది. అంటే- దగ్గర బంధువు ఎవరైనా ఆ భారాన్ని తలకెత్తుకోవచ్చు. అయితే, ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలంటూ ఎన్నున్నాయి? ఎంత చుట్టరికం ఉంటే మాత్రం, ఏదీ ఆశించకుండానే ఒక బంధువు తన జీవితంలో ఒక సంవత్సరాన్ని ఇంకొకరి బిడ్డని కనడానికి వెచ్చించే కాలమా ఇది! ఇదేమీ రక్తదానం కాదు-ఒక అరగంటలో అయిపోడానికి. ఎవరూ గర్భాన్ని ఉచితంగా మోయరు. ఆ యువతికీ కారో, ఇల్లో, నగలో, పొలమో కొనివ్వకుండానే బిడ్డని కనిపెడుతుందా? మరలాంటప్పుడు, అదీ కమర్షియల్ సరోగసీయేగా!

వీడియో చూడండి
                               సహజంగా పిల్లలు కనలేని జంటలకి, డబ్బు సంపాదించే దారేదీ లేని సరోగేట్ తల్లి తోడ్పడుతుంది. దీనిలో లాభం తప్ప, నష్టం ఎవరికి జరుగుతోంది?? సరోగేట్ తల్లులకీ కాదు, జంటలకీ కాదు.
 పెళ్ళవని వారికి సరోగసీ అనుమతి ఎందుకు ఉండకూడదు? ఒంటరిగా పిల్లల్ని సాకలేరా వాళ్ళు? ఆ ఆత్మ విశ్వాసం, ఆ ఆర్థిక స్థితీ వారికి ఉండబట్టే కదా సరోగసీ ఎంచుకుంటారు!
                               సరోగసీ పేరుతో, భారతదేశపు స్త్రీలు ఉపయోగించుకోబడుతున్నారన్న అంశంమీద చర్చ చాలాకాలంగా నడుస్తోంది.వంధ్యతనం ఉన్న జంటలకి సరోగసీ ఒక వరం. దాన్ని లాక్కోవడం, పిల్లలు కావాలని కోరుకుంటున్న జంటల సంతోషాన్ని తుడిచి వేయడమే. సైన్స్ వల్ల అబివృద్ధి అయిన ఇతర వనరులలాగే, ఇది కూడా దుర్వినియోగపడుతోంది. నిజమే, కానీ దీన్ని పూర్తిగా బ్యాన్ చేసే బదులు నియంత్రిస్తే చాలదా!
                               స్త్రీలకి ఒక ఎంపిక ఉంటుంది. దాన్ని గౌరవించడం ప్రభుత్వం బాధ్యత. కానీ దీన్నీ ఇప్పుడు బుర్ఖినీ బ్యాన్ లాగానే చేస్తున్నారు.డబ్బు తీసుకునే అయినా, ఒక స్త్రీకి తన స్వంత బయోలాజికల్ బిడ్డ కావాలని ఉన్న కోరికని ఇంకొక స్త్రీ తీరుస్తోంది. ఆమె ఇంకొకరి గర్భం మోసేది తన కుటుంబానికి ఆర్థికంగా సహాయపడేందుకే. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ తీవ్రమైన నిర్ణయం ఎవరికీ సహాయపడదు.
                               ప్రస్తుతం ఉన్న దీని రూపంలో, ఈ బిల్లు ఎంతోమంది స్త్రీలు-మెడికల్ సైన్స్ తమకి కలిగించిన సదుపాయాలని వదులుకునేలా చేస్తోంది.
                               Image for articleమధ్యవర్తులని తొలిగించి, సరోగేట్ తల్లికే నేరుగా డబ్బు చెల్లించే జాగ్రత్త తీసుకోవచ్చు.ప్రస్తుతం, అది ఇంచుమించు 2.5 బిలియన్ల డాలర్ల పరిశ్రమ.
                              రష్యా, ఉక్రియిన్, యుఎస్ లో- కొన్ని రాష్ట్రాలు తప్ప, అధిక దేశాలు కమర్షియల్  సరోగసీ ని అనుమమతించవు.
ఈ బిల్లు తప్పు దృష్టాంతాన్ని ఏర్పరుస్తోంది. ఒక తిరోగమన అభిప్రాయానికి మద్దతు పలకడమేకాక, ఫలానా వర్గానికి అనుమతి ఉండదనీ, ఫలానావారికి అవకాశం లేదంటూ, ఒక వివక్షాపూరిత వైఖరిని కూడా కనపరుస్తోంది. ఇది పౌరుల అవసరాలని సంబోధించడం లేదు.
                             “ఒక అవసరం కాస్తా ఇప్పుడు ఫేషన్‍ అయి కూర్చుంది. ఇద్దరు పిల్లలు-ఒక మగ పిల్లాడూ, ఒక ఆడపిల్లా ఉన్నప్పటికీ- సరోగసీని ఆశ్రయిస్తున్న సెలెబ్రిటీలు ఇప్పుడు ఎంతమందో!” అంటూ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్- బోలీవుడ్ ఏక్టర్లని దెప్పుతూ చెప్పారు.
                             ఇప్పుడు కమర్షియల్ సరోగసీకి శిక్ష కనీసం పదేళ్ళ జైలు శిక్షా, పది లక్షల ఫైనూ.
ప్రభుత్వం రూపుమాపవలిసినది దోపిడీని. ఎంపిక చేసుకోగలిగే స్వతంత్రాన్ని కాదు. సరోగేట్ తల్లుల హక్కులు కాపాడే బదులు, ప్రభుత్వం అధికారవాది అయి, నీతిమంతమైన పాత్ర పోషిస్తోంది. ఇది వివాహ వ్యవస్థకి చాలా ప్రాముఖ్యతనీ, నైతిక విలువనీ ఆపాదిస్తోందనిపిస్తోంది.
                              ‘కావాలంటే అనాధాశ్రమాల్లో ఉన్న పిల్లలని దత్తత చేసుకోండి.’ అని చెప్పడానికి ప్రభుత్వానికేo  హక్కుంది? దత్తత తీసుకోవడం అన్నది సులభమైన ఆప్షన్ కాదు మన దేశంలో. ముప్పుతిప్పలు పడాలి. అదీకాక జంటలు తమ జీవసంబంధమైన సంతానం కావాలనుకుంటే, అది వారి ఇష్టం.
                              ఈ ఆధునిక కాలంలో, కుటుంబానికి ఉన్న నిర్వచనాన్ని విస్మరిస్తూ, కమర్షియల్  సరోగసీని పూర్తిగా బ్యాన్ చేయడం, దాన్ని నేలకిందకి తొక్కడం మాత్రమే. దీనివల్ల, ఈ పరిశ్రమకో బ్లాక్ మార్కెట్ తప్పక తయారవుతుంది. దేన్ని నిషేధించినా, జరిగేది అదే కదా! అప్పుడు సరోగసీని కమీషన్ చేస్తున్న జంటలకి ఇది ఎక్కువ ఖరీదూ అవుతుంది. సరోగేట్ తల్లులకి ఎక్కువ ప్రమాదంగానూ మారుతుంది.
                              యాoటీ  సరోగసీ బిల్లు ఉద్దేశ్యం మంచిదయి ఉండవచ్చు కానీ నిస్సారమైన జంటలు తల్లితండ్రులు కాగల ఒకే ఒక అవకాశాన్ని ఇది నిలిపివేస్తోంది.
                              మూడేళ్ళ పిల్లలు రోజూ రేప్ చేయబడుతున్నారు. నిర్భయ కేసులకి అంతంటూ లేకుండాపోతోంది. ఇలా ఎన్నున్నాయో! ముందు వాటిని సంబోధిస్తే నయం.

                                                                                      -క్రిష్ణవేణి 

——————————————————————————————————————————

కాలమ్స్, కృష్ణ గీత, , , , , Permalink

21 Responses to నిషేధపు బండి మీద మరొకటి – క్రిష్ణవేణి

 1. చాల బాగా రాసారండి ఈ వ్యాసాన్ని
  మీ విహంగ పత్రిక చాల బాగుంటుందండి

  • Krishna Veni Chari says:

   ఆర్టికల్ని మెచ్చుకున్నందుకు ధన్యవాదాలండీ.
   విహంగ నడుపుతున్నది హేమలతగారు.

 2. నీహారిక says:

  కృష్ణవేణి గారూ,

  ఇండియాలో సరోగ్రసీ కి ఆంక్షలు విధించినా విదేశాలకు వెళ్ళి పనిమనిషిలాగా పనిచేస్తూ పిల్లలని కని ఇచ్చేసి రావచ్చు …… 3 లక్షల ఆదాయపరిమితి ఉండాలి అనే రూల్ కూడా దండగే. నీతి విలువలు అనేవి ఉన్నత కుటుంబం లో పుట్టినా ఉంటాయన్న గ్యారెంటీ లేదు.డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడేవాళ్ళున్నపుడు ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం ఉండదు.విదేశీయులు డబ్బు ఎరవేసి మనవారి మేధస్సుని ఎత్తుకుపోతుంటే ఆపలేనివాళ్ళు పిల్లలని కని(పించి) ఎత్తుకుపోతుంటే ఆపగలరా ? సరోగ్రసీ కూడా మేధోవలసలాంటిదే !

  • Krishna Veni Chari says:

   నీహారిక గారూ, చాలా రోజులకి కనిపించారు! ఎలా ఉన్నారు?
   దేనికి ఆంక్షలు విధించినా, అడ్డగించినా, బ్యాన్ చేసినా జరిగేది అదే. అడ్డదారులకి తోవలు కనిపెట్టడం. విదేశాలకి వెళ్ళడం కాకపోతే మరొకటి.
   అందుకే మరీ అలా కఠినంగా నిషేదించే బదులు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పని జరగదా’ అనుకుంటూ రాసినదిది.
   థేంక్యూ. 🙂

 3. Srinivas Sathiraju says:

  కృష్ణవేణి గారు
  ముందుగా అభినందనలు. తరువాత వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు వ్యాసం మీద అంక్షింతలు. ఒక రాబోతున్న చట్టం మీద అవగాహన లేని సమస్య మీద ఒక చక్కటి అవగాహన మరియూ ఆలోచన కలిపించే విధంగా రాద్దామని మీరు మొదలు పెట్టినట్టుగా ఉన్నా ఎందుకో పాశ్చాత్య దోరాణుల మీద చూపించే శ్రద్ధ మీరు నిజమైన సమస్యల మీద చూపిస్తే సగటు పాఠకులకు చాలా చేరువవుతారు కదా అనిపించింది. ముందుగా పిల్లలు లేని నాలాంటి వాడు కూడా శ్రద్ధ చూపించని విషయం ఒక సమస్యగా ఎవరికీ ఉంది అని ఆలోచిస్తే కేవలం బాగా డబ్బు ఉండి పిల్లలు లేని వారికి మరియూ తమ రక్తపు వారసులకు తమ ఆస్తి సంక్రమించాలి అనుకునే వారు ఉంటె వారిది. తరువాత చట్టం చెయ్య వలసిన అవసరం ఎందుకు వచ్చిందో మీరు చెప్పడంలో విఫలమయినా కనీసం భారత దేశంలో ఎంత మంది ఈ విధానంలో పిల్లలు కంటున్నారు అనే విషయం, ఇతరత్రా గణాంక వివరణలు ఇవ్వ లేకపోవడమే ఇది సమస్య కాదు అని తేట తెల్లమవుతోంది. కానీ ఒక విషయం మీద సామాజిక మాధ్యమం వాడే వారికి కొంత అవగాహన కల్పించడంలో మాత్రం సఫలీకృతులయ్యారని చెప్పవచ్చును. కానీ మొత్తం మీద ఈ వ్యాసంలో మీరు వెలిబుచ్చిన సందేహాలు భయాలు అర్ధం చేసుకునే స్థాయి నాలో కాదు కదా అసలు సమస్యలో ఉన్నాయా అనే సందేహం మాత్రం కలిగించారు. కానీ భారత ప్రభుత్వం కొన్ని పాశ్చాత్యుల సమస్యలు చూసి ఇక్కడ ముందు చూపుతో వ్యవహరించి ఒక చట్టం చెయ్యడం నిజంగా అభినంద నీయమైన విషయం. అలాగే మన దేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా చట్టాలలో కాలానికి అనుగుణంగా మార్పులు చెరువులు కూర్పులు చెయ్యడం సర్వ సాధారణ మైన విషయం. కాబట్టి కాగల కార్యం గంధర్వులే చేస్తారు అని నా ఉద్దేసస్యం నమ్మకం.

  • Krishna Veni Chari says:

   శ్రీనివాస్ సత్తిరాజుగారూ,
   గణాంక వివరణలు—–ఇప్పటికే అవిచ్చీ, ఇచ్చీ నా కాలములని కాస్తా స్టాటిస్టికల్ డేటాతో నింపేస్తున్నాను.
   వెలిబుచ్చిన సందేహాలు భయాలు ——నేనే కాదండీ, ఈ బిల్లు వచ్చినప్పటినుంచీ ఏ వార్తాపత్రికా, ఏ న్యూస్ ఛానెలూ కూడా దీని గురించిన చర్చలు ఆపడం లేదు.
   మీ మిగతా సందేహాలకి ఇవ్వాళ్ళ వచ్చిన ఈ కాలమ్ చాలా ఉపయోగపడుతుంది. ప్లీస్ చదవండి.
   http://indianexpress.com/article/opinion/columns/nda-government-commercial-surrogacy-regulation-bill-reproductive-technologies-3026339/

   చదివినందుకూ చాలా వివరమైన కామెంటు పెట్టినందుకో ఎన్నో కృతజ్ఞతలు. 🙂

 4. ఆర్.దమయంతి. says:

  నిజానికి ఇదీ సమస్యే కృష్ణవేణి! కొన్ని కరువు జిల్లాలనించి స్త్రీలు గర్భాలని అద్దెకిస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. . ఈ క్రమంలో తాన సొంత పిల్లలకి తల్లి ఆయే అవకాశాన్ని పోగొట్టుకున్నానంటూ విలపించింది – ఒక అభాగ్యురాలు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని నాకు 5 ఏళ్ళ కిందటే అనిపించింది.
  మీరన్నట్టు నిర్భయ – వంటి అతి కిరాతక దుర్ఘటనలు జరగకుండా తగు కఠిన చర్యలను అమలు పరిచేలా చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం చాలాఉందన్న మాట మాత్రం వాస్తవం.
  ఒక పోరంబోకు వెధవకి టీజింగ్ కేసు కింద శిక్ష విధిస్తూ – అతని ఆస్తి ని కూడా జప్తు చేయాలని తీర్పు ఇఛ్చినట్టు గుర్తు.
  ఇలాటి కుక్కల్ని ఎంత బాదినా తప్పు లేదు.
  మీ వ్యాసాలన్నీ నాకు ఞ్చచుతున్నాయి కృష్ణ వేణి. చక్కటి సమాచారాన్ని అందచేస్తున్నారు.
  అభినందనలు.

  • Krishna Veni Chari says:

   దమయంతిగారూ, మొట్టమొదటిగా మీరు చదివినందుకూ, వివరమైన కామెంటు పెట్టినందుకూ, మీ మెప్పుకీ అబినందనలకీ కూడా ధన్యవాదాలు. ఇకపోతే,
   ఈ క్రమంలో తాన సొంత పిల్లలకి తల్లి ఆయే అవకాశాన్ని పోగొట్టుకున్నానంటూ—— లేదండీ. ముందే స్వంత పిల్లో, పిల్లాడో ఉన్న యువతులకే సరోగేట్ తల్లి అయే హక్కుంటుంది. అంటే- ఆమెకి కాన్పు మోసే సామర్థ్యం ఈ క్రమంలో తాన సొంత పిల్లలకి తల్లి ఆయే అవకాశాన్ని పోగొట్టుకున్నానంటూ ఉంటుందని నిర్థారించుకున్న తరువాతే ఆమెని ఎంచుకుంటారు.
   నేనన్నది ‘నిర్భయవంటి కేసులెన్నిటినో నిర్లక్ష్యపెడుతూ, ఎవరో ఒకరికి ఏదో విధంగా లాభం కలుగుతున్న ప్రక్రియని నిరోధించడం ఎందుకని!’

   • Krishna Veni Chari says:

    >ఆమెకి కాన్పు మోసే సామర్థ్యం ఉంటుందని నిర్థారించుకున్న తరువాతే<

 5. THIRUPALU says:

  చక్కగా రాశారు కానీ ఇంకా చాలా విషయాలను ప్రస్తావించలేదు. సర్రొగేట్ తల్లులు అనుభవించే శారీరక రోగాలను. బాడుగకు తల్లులు కావాలిస్తే చివరకు దొరికేది పేదమహిలలు. వారికే గదా డబ్బు లేమి. చివరకు అవయువాలు అమ్ముకోవడానికి దీనికి పెద్ద తేడా లేదు. అవయువాలు అమ్ముకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో దీనికి అంతే. మానవ సంబంధాల్లో తీవ్రమైన మార్పు తీసుకొస్తుందనడములో ఎటువంటి సందేహం లేదు. దీన్ని స్త్రీల రంగుల్లో చూడటం సబబు.

  • Krishna Veni Chari says:

   తిరుపాలు గారూ, మొట్టమొదటిగా చదివినందుకూ కామెంటు పెట్టతగినది అనుకున్నందుకూ మీకు కృతజ్ఞతలు.
   ఇకపోతే, అవును పేద మహిళలే ఒప్పుకుంటారీ పనికి. ఆవయవాలు అమ్ముకోడానికీ దీనికీ ముడి పెట్టలేం అనుకుంటాను. ఈ తరగతి మహిళలు అజ్ఞానం వల్లో, చదువు లేకపోవడం వల్లో సరొగసీ తల్లులు అవనివారు కూడా గంపెడు సంతానాన్ని కంటూనే ఉంటారు. ఆ ఒక అదనపు సంతానాన్నీ కన్నప్పుడు, నష్టం ఏముంది। ఎవరికీ హాని కలగడం లేదు ఈ ప్రక్రియలో.
   నిన్న రాత్రి బర్ఖాదత్ షోలో, ఎవరో దీన్ని GOD PARTICLE అన్నారు. నాకూ అదే అనిపించింది.
   నేను స్త్రీనే కాబట్టి స్త్రీల రంగులోనే చూశాను.

    • Krishna Veni Chari says:

     తిరుపాలగారూ,
     థేంక్యూ. 🙂
     మీరిచ్చిన లింకులో ఉన్న విషయం చదివాను. కాదన్ను, దానిలో ఉన్న ఏ సంగతినీ. కానీ , మన దేశంలో దత్తత అన్నది అంత సులభమా? అదేకాక దత్తత నియమాలు అన్ని మతాలవారికీ వేరువేరు. ముస్లిములకీ, జ్యూలకీ, క్రైస్తవులకీ Guardian and Wards Act of 1890 కి వర్తిస్తుంది. దత్తత తీసుకునే జంటల మతాన్ని బట్టి, ఎవరికి సులభమో ఎవరికి కాదో అని నిర్ణయించడం సబబైనదేనా?
     హిందువుకయినా కానీ legal formalities/చిక్కులూ paper work, పొడుగాటి వెయిట్ లిస్టులూ ఉండడం వల్ల కనిపించినంత సులభం కాదు ఈ ప్రక్రియ.
     ఇకపోతే, దానిలో ప్రస్తావించబడిన test tube babies కి IVF క్లినికులు కావాలి. అవే సక్రమంగా, నిజాయితీగా పని చేస్తూ ఉంటే కనుక- ఈ పరిస్థితే రాకపోను.
     ఇప్పటికీ టివి చర్చలూ, పేపర్లూ అన్నిట్లో- ఈ బిల్లు ప్రస్థావన వస్తూనే ఉంది. నేను గమనించినంతవరకూ హిందూ పత్రిక తప్ప మిగతా ఏదీ, దీన్ని సమర్థిస్తున్నట్టు కనిపించలేదు నాకు. నా అవగాహన తప్పయి ఉండవచ్చు. మొండి పట్టు పట్టడం లేదు నేను- నేను రాసిందే సరైనదని.
     కాలములో నేను చెప్పినట్టు, ఈ బిల్లు మరీ అంత కఠినంగా కాక ఎక్కడో అక్కడ ఏదో వెసులుబాటు ఉన్నట్టయితే, ఏదో మధ్యే మార్గం ఉండేది కానీ పూర్తిగా బ్యాన్ చేయడం వల్ల దీనికీ అడ్డదారులు ఏర్పడతాయి.
     సామాన్యంగా నేను రాసే కాలములన్నిటిలోనూ, నేను రెండు పక్షాలకున్న నెగటివ్ పోసిటివ్ పాయింట్లనీ-రెండిటినీ రాసి, మిగతాది పాఠకుల నిర్ణయానికే వదిలి వేస్తాను. ఏకపక్షంగా ఎప్పుడూ రాయలేదు.
     కానీ, ఈసారి మాత్రం, ఎందుకనో, ఈ బిల్లు అంత సమంజసమైనది కాదనిపించింది.
     ఓపికగా చదివి, కామెంటు రూపంలో ఇచ్చిన తెలుగు వ్యాసపు లింకుకని కృతజ్ఞతలు. 🙂

 6. Venkat Suresh says:

  నిజం, దేశంలో ఎన్నెన్నో సమస్యలు, పట్టించుకొనే నాధుడు లేడు. ఇప్పటికిప్పుడు ఈ సరోగసీ గురించి నిభందనలు పెట్టటం అవసరమా?. ప్రతిదీ కంట్రోల్ చేయాలి అన్న తపన ఎక్కువయ్యింది ప్రభుత్వానికి. చాలా మందికి ఈ విషయాలు తెలియవండి, మీ వంటి వారు ఇలాంటివి రాయటం ఎంతో ఉపయోగకరం.

  • Krishna Veni Chari says:

   అదే కదా! కంట్రోల్ ఫ్రీక్ అవుతున్నట్టుంది ఈ మధ్య. చాలామందికి ఎందుకు తెలియవూ? అందరూ పేపర్లు చదువుతారు, న్యూస్ చూస్తారు. తెలుసు, కానీ ఈ ప్రభుత్వపు చర్చ మాత్రం చాలామందికి నచ్చినట్టుంది.
   ఎప్పుడూ మీరందించే ప్రోత్సాహానికి ధన్యవాదాలు. 🙂

 7. వనజ తాతినేని says:

  ఎప్పటిలాగా … ఓ ఆసక్తి కరమైన అంశం . మీరు వ్యాసాలకి ,కథలకి పేరు పెట్టడంలో భలే సిద్ధహస్తులు కృష్ణవేణి గారూ …

  • Krishna Veni Chari says:

   వనజగారూ, థేంక్యూ. 🙂
   ఈ నెల ఆసక్తికరమైన టాపిక్స్ మూడు ఎంచుకుని రాయడం మొదలుపెట్టాను కానీ ఇదే సరిగ్గా అనిపించింది.
   ‘సిద్ధహస్తులు”-హహహ దానికో కిటుకు కనిపెట్టాను లెండి. అది మీకు తరువాత చెప్తాను. కానీ, ఇది మాత్రం ఎక్కడో చదివిన ఇంగ్లీష్ టైటిల్. ‘ఒన్ మోర్ ఆన్ థ బాన్ కార్ట్.’ నచ్చి దీన్ని తెలుగులో పెట్టాను.

 8. Venkata S Addanki says:

  క్రిష్ణవేణి గారూ , ముందుగా మీకు అభినందనలు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిశితంగా విమర్శించారు. మీ విమర్శ సద్విమర్శనే. ముఖ్యంగా పేదరికంలో ఉన్న కుటుంబాలకు అది ఒక ఊరడింపు. దాని వల్ల కొంతమంది జీవితాలైనా కొంత లాభం పొందుతుంటే కొంత మంది జీవితాలకు పిల్లలను కన్నాము అన్న మానసిక సంతృప్తిని ఇస్తోంది. ఇక బయట దేశాలవాళ్ళు భారత దేశ స్త్రీలని ఈ రకంగా వాడుకుంటున్నారని అనుకుంటే, దానికీ కొన్ని ఆంక్షలు విధించవచ్చు.కానీ మొత్తం మీద డబ్బు తీసుకోకుండా చెయ్యాలి అన్నది తప్పు.ఆధునిక విజ్ఞానం ఒక వరం గా ఇచ్చిన ఈ పద్ధతినే కాదు ఎన్నో పద్ధతులు ఎన్నో రకాలుగా దుర్వినియోగం చెందుతున్నాయి అంతెందుకు మనమే రాసుకున్న శిక్షాస్మృతిని ఎన్ని రకాలు గా దుర్వినియోగ పరుస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము.
  పొనీ ఈ ప్రకరణలో పాలు పంచుకునే స్త్రీ కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలకి మించకూడదు లాంటి నియమాలు పెట్టినా పరవాలేదు, అలాగే సర్టిఫయిడ్ డాక్టర్ ఇంక పిల్లలు కనే అవకాశం లేదు అని చెప్తే వెంటనే ఈ ప్రకరణకు వెళ్ళవచ్చన్న నియమము పెట్టచ్చు. పెళ్ళి కాని ఒంటరి వారికీ, విడాకులు తీసుకున్న వంటరివారికీ కూడా అవకాశం కల్పించడం అన్నది తగదు అని నా అభిప్రాయం , కేవలం డబ్బు ఉంది బాగోగులు చూసుకోగలము అనే మాటకన్నా తల్లి తండ్రుల ఇద్దరి సమ్రక్షణా కూడా అంతే అవసరం అన్నది, అలాగే ఒంటరి వ్యక్తి సమ్రక్షణ వల్ల పెరిగిన పిల్లల మానసిక ప్రవృత్తి అధ్యనాలు ఎక్కువగానే జరిగాయి కాబట్టి ఆ ఒక్క్ అంశంతొ ఏకీభవించలేను, పైగా అది ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

  ఏది ఏమైనా మీరు ఎండగట్టిన తీరు బాగుంది, నా లాంటి సామాన్యులకి కూడా అర్ధం అయ్యే రీతిలో బాగా వ్రాసారు. మరొక్క సారి ధన్యవాదాలు.

  • Krishna Veni Chari says:

   వెంకట్ అద్దంకిగారూ,
   మీరెంత బాగా చదివి, కూలంకషంగా చర్చిస్తారో గమనిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మొట్టమొదటిగా మీ ప్రశంశకి ఎన్నో కృతజ్ఞతలు. 🙂
   తల్లీ, తండ్రీ ఇద్దరి సంరక్షణా- కావాలన్నారు. ఏమో, ఒంటరి తల్లులూ తండ్రులూ కూడా ఏ లోటూ లేకుండానే పెంచగలరేమో! ఒక జంటకి పిల్లలు కలిగి ఉండి, తల్లో తండ్రో దురదృష్టవశాత్తో పోయినప్పుడు, పిల్లల్ని అనాధులుగా వదిలివేయడం లేదు కదా?
   ఏమో మరి. ఈ సంగతి ఆలోచించవలిసినదే. సూచించినందుకు థేంక్యూ.
   ‘మీలాంటి సామాన్యులకి”-అయ్యో, ఇదేం మాటండీ వెంకట్ గారూ? నేనే తెలుగు ప్రాంతాలకి దూరంగా పెరిగిన తెలుగు సామాన్యురాలిని. మీరు కాదు.

 9. శిద్దా. నరేష్ says:

  చాల చక్కగా
  అందరికి అర్థమయ్యేలా వివరించారు

  • Krishna Veni Chari says:

   శిద్ధా. నరేష్ గారూ,
   ఓపికగా చదివి కామెంటు పెట్టినందుకు కృతజ్ఞతలండీ. 🙂