అది గమనించి ‘‘ఏంటి సర్! అలా అయ్యారు…?’’ నివ్వెరపోయి చూశాడు జయంత్.
‘‘తిలక్ చదవడయ్యా! వాడికి అక్షరాలంటే భయం. చిన్నప్పుడు స్కూల్లో వాడు నా విద్యార్థి. క్లాసులో వూరికే లేచి చేతి వేళ్లు చూపించి బయటికి వెళ్లి వస్తుండే వాడు. పెద్దయ్యాక కూడా చదువు విషయంలో దొంగయ్యాడు. టెన్త్ క్లాస్ రెండు సార్లు ఫెయిలై మూడవసారి అతి కష్టంగా పాసైయ్యాడు. తన చెతుల్లో సంలేఖతో కలిసి ఇంటర్లో జాయినయ్యాడు. ఆ తర్వాత కూడా అదే ఏడుపు. నీకు తెలియందేముంది. ఇంటర్ కూడా రెండు సార్లు ఫెయిలయ్యాడు. అసలు వాడు చదివితే కదా!’’ అన్నాడు. ఆయన మాటల్లో ఒక విద్యార్థి పట్ల ఆత్మీయతతో కూడిన బాధ విన్పిస్తోంది.
ఆయన బాధ చూస్తుంటే జయంత్ మనసు చివుక్కుమంది. టీచర్లు తమ విద్యార్థులు పెద్దవాళ్లయ్యాక కూడా ఇంత శ్రద్దగా ఆలోచిస్తారా ? ఆ క్షణంలో భరద్వాజ మంచి టీచర్, మనసున్న టీచర్ అన్పించాడు. ఆయన పట్ల ఇంకా గౌరవం పెరిగిపోతోంది జయంత్‌కి.
‘‘తిలక్ ఈ మధ్యనే ఇంటర్ పాసై డిగ్రీలో చేరాడు జయంత్ ! నువ్వు కలిసినప్పుడు కాస్త గట్టిగా మందలించు. చదువు లేకపోతే బ్రతుకు అంధకారమవుతుందని చెప్పు! ఒక స్నేహితుడు తలుచుకుంటే ఇంకో స్నేహితున్ని ఎటువైపు అయినా మళ్లించవచ్చు…’’ అన్నాడు.
ఆయన బాధ అర్థమవుతోంది జయంత్‌కి… తిలక్ సి.ఎ. ఫౌండేషన్‌కి రాకపోయినా కామన్‌గా వుండే ఇంటర్ క్లాసుకి వస్తుండేవాడు. తనకి అప్పుడు కన్పించేవాడు తిలక్. అతను కాలేజీలో ఎక్కడ ఏ గొడవ జరిగినా నేనున్నానంటూ వెళ్లేవాడు. కొట్టడమో, కొట్టించుకోవడమో చేసేవాడు. పక్కా మొండివైఖరి. తను మాత్రం ఏ గొడవకి వెళ్లేవాడు కాదు. ఇంటర్‌లోనే సి.ఎ. ఫౌండేషన్ తీసుకొని, ఇంటర్ అయిపోగానే ఎంట్రన్స్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఐ.పి.సి.సి.లో జాయినయి సి.ఎ. ఫైనల్ పాసై ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు.
జయంత్ నీట్‌గా షేవ్ చేసుకుని మంచి డ్రస్ వేసుకుని హుందాగా వుండడం వల్ల భరద్వాజకి జయంత్‌తో ఆసక్తిగా మాట్లాడనిపిస్తోంది. ఆదీ కాక చార్టెడ్ అకౌంటెంట్ అంటే మాటలు కాదు.
దాని కోసం ఎంత కష్టపడాలో ఆయనకి తెలుసు. అలా కష్టపడి చదవలేకనో మరే ఇతర కారణాల వల్లనో తమ వూరి పిల్లలు కొందరు చదవాలనుకున్న సి.ఎ.ను మధ్యలో వదిలేసి ఇళ్లకి వస్తున్నారు. కొందరేమో డిగ్రీ చేస్తున్నారు. అలా చేస్తున్న వాళ్లలో సంలేఖ ఒకరు.
ఆమె చదువు ఇంటర్ నుండి సాఫీగా సాగిపోతూవుంటే ఈ జయంత్‌లాగే ఈరోజు ఏదో ఒక కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్‌గా వుండేది. వాళ్ల నాన్నగారికి ఆర్థికంగా కాస్త ఆసరా దొరికేది. పెద్దకొడుకు రాజారాం టీచర్ ఉద్యోగం చేస్తూ కూడా వచ్చిన డబ్బుని రాఘవరాయుడికి ఇవ్వడట. ఇవ్వాలని చూసినా అతని భార్య వినీల ఇవ్వనీయదట. వడ్డీకి తిప్పడమో, చిట్టీలు కట్టటమో చేస్తుందట. అంతేకాక రాజారాంకి జీతం రాగానే తన ప్రణాళికకి ఏ మాత్రం ఆటంకం కలిగినా గొడవ చేస్తుందట. కోడలి మనసు అర్థం చేసుకొని నడుచుకోవడమే సుఖమనిపించి రాఘవరాయుడు ఆయన భార్య సులోచనమ్మ నోరెత్తరట. ఇలాంటి సమయంలో సంలేఖ ఉద్యోగంలో వుండి వుంటే రాఘవరాయుడి కష్టాలు తీరి వుండేవి అని భరద్వాజ మనసులో అనుకుంటుంటే…
‘‘ఏంటి మాస్టారూ! మౌనంగా వున్నారు?!’’ అడిగాడు జయంత్.
‘‘ఏంలేదు జయంత్! నువ్వు తిలక్ బ్యాచ్ అంటున్నావు కదా! అదే బ్యాచ్‌లో తిలక్ చెల్లెలు సంలేఖ సి.ఎ. ఫౌండేషన్ తీసుకుంది. నీకు తెలుసా?’’ అడిగాడు భరద్వాజ.
(ఇంకా ఉంది )
-అంగులూరి అంజనీదేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~