నా కళ్లతో అమెరికా- 57 (హవాయి దీవులు- భాగం-3) -డా.కె.గీత

ఎండా వానల దోబూచులాటతో మొదలైన ఉదయం బిగ్ ఐలాండ్ కు పశ్చిమ తీరం లో ఉన్న మా బస నుండి తూర్పు తీరం లో ఉన్న విశేషాలను చూడడానికి బయలుదేరేం. హవాయిలో ఎక్కడ చూసినా ప్రత్యక్షమయ్యే నాకిష్టమైన దేవ గన్నేరు పుష్పాల సుగంధాన్ని ఆస్వాదిస్తూ, దాదాపు గంటన్నర వ్యవధిలో ఉన్న తూర్పు తీరంలో చూడదగ్గ మొదటి ప్రదేశం “వయాపో పాయింట్” లో ఇంద్ర ధనస్సు కళ్లజోడు తొడుక్కున్న ఆకాశమ్మీదుగా పచ్చని లోయని, విశాల సముద్ర తీరాన్ని చూడడం గొప్ప అనుభూతి.

అక్కణ్నించి తరువాతి ప్రదేశాల్లో అతి ముఖ్యమైన అకాకా ఫాల్స్, రైన్ బో ఫాల్స్ చూసిన తరవాత భోజన విరామం తీసుకోవాలనుకున్నాం.

దారి పొడవునా ఆగి కురుస్తూన్న వాన లో కనిపెట్టలేనన్ని గుబురు మొక్కలతో, తీగెలతో రోడ్దు కిరుపక్కలా అలుముకున్న పచ్చని కొండల మీదుగా ప్రయాణం సాగించాం. ఆ రెండ్రోజుల్లో ఒకటి మాత్రం కనిపెట్టాను. తూర్పు తీరం ఉన్నంత పచ్చగా, సతత హరితారణ్యంలా పశ్చిమ తీరం లేదు. అందుకు కారణం ద్వీపానికి మధ్య అత్యంత ఎత్తైన పర్వతాలు సముద్రపు మేఘాల్ని తూర్పు నించి పడమటి దిక్కుకి చేరకుండా అడ్డు కోవడమే అని తోచింది నాకు.
“అకాకా ఫాల్స్” (Akaka Falls):- అందులో మొదటిదైన “అకాకా ఫాల్స్” ని పై నించి చూడడమే కాకుండా కిందికి కొంత వరకు దిగి వెళ్లడానికి దారి ఉంది. అటువంటి చోట సాధారణంగా సిరి బాగా పేచీ పెడుతుంది. కిందికి ఉత్సాహంగా దిగినా తిరిగి వచ్చేటపుడు ఎత్తుకోమని గొడవ చేస్తుంది. ఇక నేను పైన సిరితో ఉండిపోవడమే ఉత్తమమని ఆగిపోయాను. సత్య, వరు అరగంటలో పరుగున వెళ్లి వచ్చారు.

మేం పైన ఉన్నా కనుచూపుమేర కనిపిస్తున్న జలపాతం అందాల్ని చూస్తూ , చుట్టూ ఉన్న పచ్చని పచ్చికలో ఆడుకుంటూ గడిపేం.

సిరిని వదిలితే చాలు బాణంలా ఎటో ఒక వైపు పరిగెత్తుతుంది. పరుగెత్తే త్రోవలో ఎదురుగా ఏం వస్తున్నాయో చూసుకోదు. అయితే ఈ ప్రయాణంలో సాధ్యమైనంత వరకూ తనకి ఆ పరుగులు ఆపి, నడక నేర్పించాలని ప్రయత్నించేం. కానీ తూనీగలా స్వేచ్ఛగా గిరికీలు కొట్టాలనుకునే పసిపిల్లని ఆపతరమా? చివరికి మా నడకలు కూడా పరుగులుగా మారడం తప్పనిసరయ్యింది.

ఇక వాళ్లొచ్చేవరకూ పిల్లని ఆపడానికి కనబడ్డ ఆకులు, పూలు కోసి ఒక చోట ఆట మొదలెట్టేను. బుద్ధిగా మఠమేసుకుని కూచుంది వాటి ముందు. నా మనస్సు మాత్రం లోయలోకి దుముకుతున్న జలపాతంతో బాటూ అటే ఉరకలేసింది. కిందికంటూ వెళ్లి దారిపొడవునా అందమైన తడి చెట్ల, లతల, పొదల ఫోటోలు తీసుకుని వచ్చేరు. అవి చూసి కాస్త స్థిమితపడింది.

“అలోహా ఫార్మ్స్” (Aloha Farms):- ఫాల్స్ నించి వచ్చే దారి మలుపులో “అలోహా ఫార్మ్స్” అనే పేరుతో తోట బయట కొబ్బరి బొండాల దుకాణం కనిపించింది. దుకాణ దారు అక్కడి స్థానిక వేషధారణతో వచ్చి పోయే కార్లని ఆకర్షిస్తూ పిలుస్తున్నాడు. అక్కడ కొబ్బరి బొండం తాగి వెళదామని ఆగేం. కొబ్బరి బొండాం తాగేక వచ్చే లేత కొబ్బరిలో పైనాపిల్ కలుపుకుని తింటే చాలా రుచికరం గా ఉంటుందని, కొనుక్కోమని చెప్పేడు దుకాణాదారు. బొండాం ఒక్కోటి అయిదు డాలర్లయితే అయితే, పైనాపిల్ ఎనిమిది డాలర్లు. అక్కడే అమ్ముతున్న చిన్న అరటి పళ్లు మూడు మరో డాలరు, చిన్న చెరుకు ముక్క ఒక డాలరు ఇలా కనబడ్డవి కనబడ్డట్టు కొంటున్న నన్ను చూసి నవ్వేరు వీళ్లు. పక్కనే ఉన్న జాంచెట్టు కొమ్మలకి వేళ్ళాడుతున్న అందమైన జాంపళ్ల చెట్టు వైపు నడిచి, “అమ్ముతావా?” అని అడుగుతున్న నన్ను బలవంతంగా బయలుదేరదీసేరు “ఇక చాలు” అంటూ. ఒక కవరులో పైనాపిల్ ముక్కల మధ్య లేత కొబ్బరి వేసి నాలుగు సార్లు కవరుని కదిపి, రెండూ కలిపి తినమని ఇచ్చేడు. పైనాపిల్ అంతలా ముగ్గగాక పోయినా చాలా తియ్యగా ఉంది. ఇక కొబ్బరి తియ్యగా లేకపోయినా చాలా లేత గా ఉండడం వల్ల రెండిటి కాంబినేషన్ మంచి రుచిగా ఉండడంతో పిల్లలు ఇష్టంగా తిన్నారు. అక్కడికక్కడే కవరంతా ఖాళీ చేసేరు. ఈ కాంబినేషన్ ఎప్పుడూ ప్రయత్నించక నాకూ నచ్చింది. ఖరీదు ఎక్కువైనా ఇలా కొత్తవి ప్రయత్నించాలని అర్థమైంది.

గీత

మరిన్ని చిత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

దారిలో వైవిధ్యభరితమైన వృక్షజాలాన్ని పరిచయం చేసే “హవాయి బొటానికల్ గార్డెన్స్” మీదుగా ప్రయాణం చేసేం.
“రైన్ బో ఫాల్స్”(Rainbow Falls):- ఇక తర్వాతిదైన “రైన్ బో ఫాల్స్” ని కేవలం పై నించి మాత్రమే చూడగలిగిన అవకాశం ఉంది. చిన్న జలపాతమైనా చుట్టూ అందమైన ఫెర్న్ చెట్లు అలుముకుని పచ్చని నాచు పట్టిన గోడల మీదుగా చూడడమూ మంచి అనుభూతే. ఇక అక్కడికి వెళ్లేసరికి సిరి అలిసి పోయి చెమ్మలో చతికిలబడింది.

అప్పటికే భోజనాల వేళయ్యింది. ఫాల్స్ కు ఎదురుగా రోడ్డు దాటితే ఏదో తినే దుకాణంలా కనబడితే అటు పరుగెత్తేం. కానీ అది కేవలం కేకులు, కాఫీ వంటివి అమ్మే చిన్న దుకాణం మాత్రమే.

“హీలో ” (Hilo):- అక్కణ్ణించి తూర్పు తీరానికి పెద్ద ఊరైన “హీలో “డౌన్ టౌన్ కి భోజనార్థం వెళ్లేం.
నిజానికి అలా వెళ్ళడం వల్ల మరో రెండు విశేషాల్ని చూడగలిగేం. డౌన్ టౌన్ లో ఉన్న పెద్ద ఊడల మర్రి చెట్టునీ, ఒకప్పటి రాణి పేరుతో నిర్మించబడ్డ “లిలియోకలానీ గార్డెన్స్” లో ఉన్న చిన్న నడిచే బ్రిడ్జ్ మీదుగా వెళ్లి చూడగలిగిన అతి చిన్న ద్వీపం, కోకోనట్ ఐలాండ్ నీ.

భోజనానికి పెద్దగా సమయం పెట్టదల్చుకోలేదు. పైగా పిల్లలు నూడుల్స్ లాంటివి తప్ప ఏవీ ఇష్టంగా తినరు. అందుకే త్రోవ పక్క కనిపించిన ఏదో డెలీ దగ్గిర ఆగి కాసిన్ని నూడుల్స్, ఫ్రెంంచ్ ఫ్రైస్ వంటివి కొనుక్కు తిన్నాం.

ఇక ఊడల మర్రి డౌన్ టౌన్ లో రోడ్డు ను ఆనుకుని పార్కులాంటి ప్రదేశంలో ఉంది. కారుని ఆపేందుకు సరైన పార్కింగు లేదు. పిల్లలతో దిగి ఎక్కువ సేపు గడపడం కుదిరేటట్టు కనిపించలేదు. ఇక అక్కడే రోడ్డు పక్కన 5 నిమిషాల పార్కింగు అని రాసి ఉన్న చోట ఆపి గబగబా ఒక ప్రదక్షిణ చేసి వచ్చాం.

ఐలాండు వాతావరణం లో మధ్యాహ్నానికి ముఖానికి మరీ జిడ్డు , మరీ పొడి కాని మధ్యస్తమైన పొర పట్టినట్లు అనిపించింది
ఇక టైములో మూడు గంటలు వెనక్కి ప్రయాణించి రావడం వల్ల కలిగిన జెట్ లాగ్ వల్ల మాకు సాయంత్రం నాలుగైదు గంటలకే విపరీతమైన ఆకలి వెయ్యడం, త్వరగా నిద్ర వచ్చెయ్యడం మొదలయ్యాయి. సాయంత్రానికే అందరం బాగా అలిసిపోయినట్లయ్యింది.

ఇంకా మేం అక్కణ్నించి సూర్యాస్తమయ వేళకి “మౌనాకియా” పర్వత సానువులమీద ఉన్న అబ్జర్వేటరీల దగ్గిరికి చేరుకోవాలి.
“కోకోనట్ ఐలాండ్”(Coconut Island) :- అప్పటికి నాలుగే అవడం వల్ల కాస్సేపు సముద్ర తీరంలో తిరిగి వద్దామని బయలుదేరేం. అక్కడ “కోకోనట్ ఐలాండ్” అనే తీర ప్రాంతపు చిన్నద్వీపం ఉంటుందని ముందు ఎక్కడో చదివేను. ఊరికే సముద్ర తీరం చూడడం కంటే అక్కడికి వెళ్లి అసలదేదో చూద్దామని ఆ త్రోవ పట్టుకుని వెళ్లేం. డౌన్ టౌన్ నించి సరిగ్గా అయిదు నిమిష్లాల సముద్ర తీరపు త్రోవలో కొద్దిగా లోపలికి తిరగగానే కోకోనట్ ఐలాండ్ కారు పార్కింగు కనిపించింది. చిన్న నడిచే బ్రిడ్జ్ దాటి అటు వెళితే వచ్చే చిన్న పార్కు వంటిదే కోకోనట్ ఐలాండ్. మధ్య సముద్రం ఉండడం వల్ల అది ద్వీపమైంది.

కానీ భలే అందంగా ఉంది. చుట్టూ కొబ్బరి చెట్లతో, పచ్చికతో చుట్టు ముట్టి ఉన్న సముద్రాన్ని ఒరుసుకునే రాళ్లతో. అక్కణ్ణించి కనిపించే హీలో నగర తీరం కంటే మనుష్య నివాసం కూడని ఈ బుజ్జి ద్వీపం ఎన్నో రెట్లు అందంగా కనిపించింది. ఐలాండ్ ని నగరంలోని ఒక పార్కులా రూపొందించి ఉంచకుండా సహజ సిద్ధంగా వదిలివేసి ఉంటే ఇంకా బావుండేదనిపించింది. స్థానిక భాషలో ఈ ద్వీపాన్ని “మోకు ఓలా (Moku Ola)” అంటారు. అంటే Island of life లేదా Healing Island అని అర్థమట. “సంజీవనీ ద్వీపం” అన్న మాట.

పిల్లలకు బిగ్ ఐలాండ్ సముద్రపు నీళ్లలో మొదటి సారి దిగే అవకాశం వచ్చింది. గోరు వెచ్చగా ఉన్న సముద్రపు నీటిలో పాదాలు మాత్రమే ముం చి బయటకు వచ్చేటట్లు చెయ్యడం చాలా కష్టమైంది పిల్లలతో. కొబ్బరికాయ ద్వీపమంతా కోతి పిల్లల్లా పరుగులెట్టి, బ్రిడ్జీ కొసల్ని పట్టు కుని ఊగులాడి, కారు పార్కింగు దగ్గిర కిందికి ఉన్న చెట్టెక్కి కోతి కొమ్మచ్చులాడి పిల్లలు ఆనందంగా గంతులేస్తూంటే నాకు ఎప్పుడు చూసినా చెట్లపైన చిందులేసిన నా బాల్యం జ్ఞాపకం వచ్చింది. కళ్ల ముందు చరచరా నడిచెళ్లిపోయిన వసంతాలెన్నో గిర్రున తిరిగాయి.

“మౌనా కియా” అబ్జర్వేటరీస్ (Mauna Kea Observatories):- ఇంకాస్సేపు గడపాలని అందరికీ అనిపించినా, అక్కణ్నించి “మౌనా కియా” దూరం కావడం వల్ల కదలక తప్పింది కాదు.

మరో గంటన్నర ప్రయాణించి అబ్జర్వేటరీస్ ఉన్న పర్వత పాదానికి చేరుకున్నాం. అంతలోనే తీరంలో ఉన్న పచ్చదనం, వెచ్చదనం హఠాత్తుగా మాయమై పోయాయి.

అగ్ని పర్వతం ఎప్పుడో పొంగి గడ్డ కట్టిన లావా పొరల మీదుగా ప్రయాణించి, ఒక్క మొక్క కూడా లేని పొడి రాలుతున్నట్లున్న అగ్ని పర్వతమ్మీద ప్రయాణం సాగించాం. అక్కడ మట్టి రంగు రాగి వర్ణంలో మెరిస్తూ భలే విచిత్రంగా ఉంది. 9200 అడుగుల ఎత్తున ఉన్న విజిటింగు సెంటర్ చేరి బయటికి అడుగు పెట్టే సరికి ఒక్క సారిగా భయంకరమైన చలిగాలి చుట్టుముట్టింది. అర్జంటుగా కారులోంచి చలికోట్లు తీసి తొడుక్కుంటే కానీ అడుగు వెయ్యలేనిస్థితికి వచ్చాం.

అక్కడ రోడ్డుకు ఒక పక్క విజిటింగు సెంటర్, మరో పక్క రాళ్లు పేర్చి, ఆకులు, పూలు కప్పి నట్లున్న ఆదివాసుల తాలూకు సంప్రదాయ ప్రదేశం ఉన్నాయి. అలా రాళ్లు పేర్చి ఉన్నవి స్థానిక తెగలు పితృ దేవతల కోసం ఎత్తైన ప్రదేశాలలో నిర్మించే గూళ్ళని, వాటిని ముట్టుకోరాదని అక్కడ ఇన్ ఫర్మేషన్ సెంటర్ లో వీడియో ప్రదర్శన లోచూసేం.

ఒక పక్క విజ్ఞానం, మరో పక్క సంప్రదాయం మనిషిని రెండు చేతులా ఎత్తుకున్నట్లున్న ఆ స్థలంలో ఆధునిక కాలానికి ప్రవహించిన పురాతత్త్వ స్మృతులు వెంటాడినట్లయ్యాయి.

అక్కణ్ణించి పైకి వెళ్ళడానికి విధిగా అక్కడ ప్రదర్శించే అరగంట వీడియో చూడాలి. అంతే కాదు, తిరిగి వచ్చేటపుడు అక్కడ పూట జరిగే వివిధ షోల ఇన్ ఫార్మేషను కూడా అక్కడే తెలుసుకోవాలి. పైన ఎక్కడా ఇన్ ఫర్మేషను ఎవరూ ఇవ్వరు.
అక్కణ్ణించి ఫోర్ వీల్ డ్రెవ్ చెయ్యగలిగిన వెహికిల్స్ మాత్రమే ప్రవేశం అన్నది తెలుసుకుని, మేం జీపుని అద్దెకి తీసుకున్నందుకు సంతోషించాం. అయితే ఒక్క మలుపు తిరగగానే అర్థమైంది ఫోర్ వీల్ ఇంజను కూడా రజనులా జారీ పోతున్న ఆ రోడ్డు లో ఎందుకూ పనికి రాదని.

ఎంత తక్కువ స్పీడుతో వెళ్లినా, అడుగడుక్కీ చక్రాలు పట్టు తప్పిపోతున్నట్లనిపిస్తూ బండి అటూ ఇటూ కదిలిపోతూంది ఆ మట్టి రోడ్డులో. దానికి తోడు ఎదురుగా కళ్లల్లో సూటిగా పడ్తున్న సాయంత్రపు కిరణాల వల్ల ఎదురుగా ఏవీ కనిపించడం లేదు. అక్కణ్ణించి పైకి ప్రయాణించిన 40-50 నిమిషాల పాటు గుండెలు అరచేతుల్లో పెట్టుకుని డ్రైవ్ చెయ్యవలిసి వచ్చింది.
రెండు మలుపుల్లో రోడ్డు దిగువన విమానంలోంచి తొంగి చూసినట్లు ఆకాశంలో చిక్కని మేఘాలు కనిపించసాగేయి. పైగా ఎటు వైపూ రైలింగులు లేవు రోడ్డు కి. అంత చలిలోనూ డ్రైవ్ చేస్తున్న నాకు చిరు చమటలు పట్టేయి. అదృష్టం కొద్దీ నేను డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి సరిపోయింది. క్లిష్ట సమయాల్లో నా మీద అంతా ఆధారపడి ఉన్నారనేది నాకెప్పుడూ గొప్ప జాగ్రత్తని నేర్పిస్తుంది. అందువల్ల మనస్థిమితమూ కలుగుతుంది. సత్య డ్రైవ్ చేస్తే నా మీద నాకు ఉన్నంత నమ్మకం ఉండదు నాకు. డ్రయివింగులో తను ఏ చిన్న తప్పు చేసినా భయంతో అరిచి మరింత భయపెడతాను. అందువల్ల ఖచ్చితంగా మరో తప్పు జరుగుతుంది. ఇన్ని అనర్థాల బదులు ఇలాంటి సమయాలలో ఎప్పుడూ నా భయాన్ని అదుపులో పెట్టుకోవడానికి రథ సారథ్యం నేనే తీసుకుంటాను. పిల్లలు కూడా నేను డ్రయివ్ చేస్తే కించిత్ భయం లేకుండా కూచుంటారు.

పైకి చేరె వేళకి మాలాగే సూర్యాస్తమయం చూడడానికి ఎక్కణ్నించి వచ్చారో, మరో వంద మంది వరకూ అప్పటికే అక్కడ పోగై ఉన్నారు.

మాలా కాకుండా, చిన్న బస్సుల్లో ప్రత్యేకమైన గైడెడ్ టూరు జనమూ చేరేరు. ఇక 14,000 అడుగుల ఎత్తున ఉన్న అక్కడ ఉన్న డజను అబ్జర్వేటరీల్లో ఏదీ సందర్శకులకోసం కాదు. అన్నీ పరిశోధకులకు మాత్రమే ప్రవేశం ఉన్నవి. అందుకో ఏమో గానీ నిజంగానే మరో గ్రహమ్మీద ఉన్నట్లు అనుభూతి కలిగింది.

అక్కణ్ణించి అత్యంత తేటగా కనిపిస్తున్న ఆకాశం మీద పరిశోధనలు చెయ్యడానికి బహుశా: భూమి మీద ఇదొక్కటే అత్యంత అనుకూలమైన స్థలమనిపించింది.

అక్కడ గడ్డ కట్టే చలి లేకుండా హాయిగా ఆరుబయట మంచమేసుకుని పడుకుని నక్ష త్రాల్ని చూస్తూ అందమైన రాత్రి గడిపితే బావుణ్ణని అనిపించింది.

సరిగ్గా 2 నిమిషాల కంటే ఎక్కువ ఆచలిలో నిలబడడం అసాధ్యమైన విషయం. ఇక జీపుని సూర్యాస్తమయ దిశగా రోడ్డు వార నిర్దేశిత స్థలంలో పార్కు చేసి అద్దాలలోంచి చూసేం అక్కడున్నంత సేపు. ఫోటోల కోసం మాత్రం పరుగున దిగి మళ్లీ వచ్చే వాళ్లం. అంతే కాదు మామూలుగా కంటే అంత ఎత్తున 40% ఆక్సిజను తక్కువ ఉండడం వల్ల బయట తల తిరుగుతున్నట్లు కూడా అనిపించసాగింది.

సరిగ్గా సూర్యాస్తమయం అయ్యి చీకటి ముసురు కోగానే స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా గార్డులు తరమడం మొదలు పెట్టారు. అప్పటి వరకూ బోర్లించిన గిన్నెల్లా ఉన్న అబ్జర్వేటరీల లోంచి పెద్ద గొట్టాలు లేచి, రోదసీ వెపుకి మెడలు సాచి గుండ్రంగా తిరగడం ప్రారంభించాయి.

సూర్యాస్తమయ వేళ చుట్టూ ఉన్న రాగి రంగంతా నలుపులో మునుగుతూండగా, ఆకాశం దిగువన రెండవ ఆకాశంలా పరుచుకున్న పల్లపు తెల్లని మేఘాల్ని నారింజ రసంలో ముంచినట్లు సూర్య కిరణాలు ఆక్రమించుకున్నాయి. ఎన్ని వింతల్ని చూసినా భూమి మీద అత్యంత విశిష్టమైంది సూర్యాస్తమయం కావడం నాకెప్పుడూ భలే ఆశ్చర్యంగా ఉంటుంది.

సముద్ర తీరాన అస్తమయాన్ని చూసినా, పర్వత సానువుల్లో చూసినా, నగరపు పొగ గొట్టాల నడుమ చూసినా దేనికదే విభిన్న అందాలతో మెరిసే ఇన్ని సూర్యాస్తమయాలు ఉన్నాయి కాబట్టే ఇంకా భూమి మీద ఒక అత్యద్భుతమైన కొత్త రోజు పుడుతుందని అక్కడి సూర్యాస్తమయాన్ని చూసేక అనిపించింది.

(ఇంకా ఉంది)

– డా || కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో