వచ్చే మార్పు
ఈ సారి మూసలో పోసినట్టు ఉండదు
అగ్ని స్ఫటికల్లాంటి వ్యక్తిత్వాల వర్షం లో
తడిసిపోయిన లేవెండర్ పూల వనంలా ఉంటుంది !
వ్యక్తిత్వమే విపత్తుగా బతికిన మనుష్యులు వీళ్ళే
ఎముకల చెట్లలా తిరిగిన మనుష్యులు వీళ్ళే
ఉన్నపళాన కరవాలాన్ని
గొంతుగా చేసుకున్న వీళ్ళే
విజయధారులు !
వీళ్ళు !
ఆత్మ గౌరవానికి అరుదైన జీవన సూత్రాల రెక్కలు
కుట్టేసి ఆకాశ అంగణంపై స్వేచ్చగా ఎగిరేసిన
నిరాధార నిష్కపటులు !
టోకులో నిరాదరణ సూత్రాలు నిండిన
నీతి తత్వానికి నిజాయితీ నేపథ్యాన్ని
ధార పోస్తున్న నవ్య తత్వ వేత్తలు !
వీళ్ళేమీ ప్రపంచ గోళం చుట్టలేదు
జంధ్యం తో సాధించిన జన్మహక్కులేమీ
లేనివాళ్ళే వీళ్లందరూ !
అదుగో –
భుక్తి లేమి లేని లోకం కోసం
భూమిని సాధనం చేయమంటున్నారు
భువిలోక సౌందర్యం కోసం
భూమిని పంచుకుందామంటున్నారు
ఈ సారి మార్పు చినుకుల్లా ఉండదు
తెగిన చెలియలి కట్టలా ఉంటుంది !
తెగి పడిన ఆకాశపు పలుకులా ఉంటుంది !!
నీలి ఋతురవళుల విస్ఫోటనం లా ఉంటుంది !!!
మేఘాలు ముద్దులు పెట్టడానికి తహతహ లాడుతున్న
మహా వీరులు వీళ్ళే !
జంతు చర్మం ఒలుచుకుని
కలో గంజో తాగిన వీళ్ళే
మనుష్య చర్మమేసుకున్న
జంతువుల కోరలతో రక్కించుకున్నవాళ్ళే
ఇప్పుడు ఈ నేలపై ఎగిరే జండా రంగులే వీళ్ళు !
ఇకపై –
అణువణు ఉనా ..
అడుగడుగు ఉనా ..
మళ్ళో మనిషికి తాత్పర్యం వెతికిన
రణ సంభాషణ !
ఉనక లాంటి మనుష్యులు వీళ్ళే
ఉన రణ సాహితీ కారులు వీళ్ళే !
– పి. విక్టర్ విజయ్ కుమార్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~