కల్లోల ఈశాన్య భారతం ‘’ నిరంతర కల్లోల ప్రాంతమైన ఈశాన్య భారతం’’ లోని 7రాష్ట్రాలలో 2005 నుండి 2015 వరకు దశాబ్దం పాటు విప్లవం హింస ,రాజకీయ దౌర్జన్యాలతో అట్టుడికి పోయి దాదాపుఆరు వేలమంది అమాయక ప్రజలు మరణించారు .భారత ప్రభుత్వం చేసేదేమీ లేక ప్రజల ధనమాన ప్రాణ సంరక్షణ కోసం 1958 ఆర్మేడ్ యెన్ఫోర్సేడ్ యాక్ట్ ను ఈ ఏడు రాష్ట్రాలలో అమలు చేసి౦ది .దీనిప్రకారం సైన్యం ప్రజా రక్షణ కోసం వారంట్ లేకుండా ఆస్తులు ఇల్లు వ్యక్తులను సోదా చేయటానికి ,జమ్మూ కాశ్మీర్ లో లాగా రాజ్యాంగ ధిక్కారం పై యే మాత్రం అనుమాన మొచ్చినా తీవ్రమైన ఆయుధాలను ప్రయోగించటానికి అనుమతి నిచ్చింది ఒక్కోసారి సైన్యం కూడా దురుసుగా ,దుడుకుగా ప్రవర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి అవి పెద్ద ఉద్యమాలకు దారి తీశాయి . .ఇదీ ఈశాన్య భారత స్థితి .ఈ కల్లోల భారతం లో మణిపూర్ లో జన్మించిన మహిళా జాతి రత్నమే ఐరాం షర్మిల .
షర్మిల పోరాట పటిమ :
‘’మణిపూర్ ఉక్కు మహిళ’’ అని పిలువబడే ఐరాం షర్మిల.14-3- 1972లో జన్మించి హైస్కూల్ చదువులో 12 వ క్లాస్ పూర్తీ చేయకుండానే తన రాష్ట్రం లో ప్రజా ప్రతిఘటన నాయకురాలిగా నిలిచింది .పౌరహక్కుల రాజకీయ పోరాట యోధురాలు .కవ యిత్రి .ఐరాం పై తండ్రి ప్రభావం చాలా ఉంది. మానవ హక్కులను కాల రాస్తున్నందుకు నిరసనగా ప్రజా హక్కుల పోరాటం చేసింది .
నరమేధానికి నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష :
ఇంఫాల్ లోయ లోని 2-11-2000 న ‘’మాలూం నర మేధ౦ ‘’లో అస్సాం రైఫిల్స్అనే పారా మిలిటరీ దళం చేతిలో 10 మంది అమాయక ప్రజలు బస్ స్టాప్ లో నిలబడి ఉండగా కాల్పులలో చని పోవటానికి సైన్యం చేసిన దమన కాండకు నిరసనగా ఆమె మాలూం లో 28 వ ఏట నవంబర్ 5 న నిరాహార దీక్ష చేబట్టింది .చనిపోయిన వారిలో’’ లీసేంగ్ భం ఐసే టో౦బి’’,అనే 62 ఏళ్ళ మహిళ ,’’నేషనల్ బ్రేవరి అవార్డ్ ‘’పొందిన 18 ఏళ్ళ’’ సీనం చంద్ర మణి’’ ఉన్నారు . ఈ సంఘటన ఆమె పై గొప్ప ప్రభావం చూపింది . ‘’ఆఫ్సాచట్టాన్ని ‘’ప్రభుత్వం ఉప సంహరించేవరకు తాను అన్నంతిననని , మంచి నీళ్ళుకూడా తాగనని తల దువ్వుకోనని అద్దం లో ముఖం చూసుకోనని కఠోర నియమాలు ఏర్పరచుకొని నిరాహార దీక్ష కొన సాగించింది .మూడవ రోజున ఆమె ఆత్మ హత్యా ప్రయత్నం చేస్తోంది అని చట్టప్రకారం అది నేరం అని అరెస్ట్ చేసి,తర్వాత జుడీషియల్ కస్టడీలో ఉంచారు .ఆమె ఆరోగ్యం క్షీణించి పోతూ ఉండటం తో ఆమెకు బలవంతంగా ద్రవాహారం ఇచ్చారు .ప్రతి సంవత్సరం ఆమె నిరాహార దీక్ష చేబట్టటం అరెస్ట్ అవటం విడుదలవటం మళ్ళీ దీక్ష చేబట్టటం జరిగింది .
2006లో అక్టోబర్ 2 గాంధీ జయంతినాడు షర్మిల ఢిల్లీ లోని రాజ్ ఘాట్ ను సందర్శించి తనకు ఆదర్శమైన మహాత్మునికి పుష్ప గుచ్చం సమర్పించి ,ఆ సాయంత్రమే విద్యార్ధి బృందాలు మానవ హక్కులకోసం చేస్తున్న పోరాటం లో జంతర్ మంతర్ వద్ద కలిసి నాయకత్వం వహించి౦ది .అస్సాం రైఫిల్స్ హెడ్ క్వార్టర్ ముందు షర్మిలకు మద్దతుగా 30 మంది మహిళలు నగ్న ప్రదర్శన చేశారు .వాళ్ళ చేతులలో ‘’భారత సైన్యం మమ్మల్ని రేప్ చేస్తుంది ‘’ అన్న బానర్లు ఉన్నాయి .వాళ్ళందర్నీ నిర్బంధించి మూడు నెలలు జైలులో ఉంచారు .
షర్మిలకు మద్దతు :
2011 లో షర్మిల మానవ హక్కుల నాయకుడు అన్నా హజారే ను మణిపూర్ సందర్శించ వలసిందిగా కోరింది ఆయన తన తరఫున ఇద్దరినీ పంపాడు .అదే ఏడాది అక్టోబర్ లో ‘’మణి పూర్ ప్రదేశ్ ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ ‘’శషర్మిలకు మద్దతు ప్రకటించి ,పార్టీ ప్రెసిడెంట్ మమతా బెనర్జీ ని’’ఆఫ్సా చట్టాన్ని ‘’ఉపసంహరించటానికి సాయం చేయమని కోరింది .దీనికి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సానుకూలంగా స్పందించాయి .11 వ నిరాహార దీక్ష సమయం లో నవంబర్ లో ప్రధాని మన్మోహన్ సింగ్ ను షర్మిల కలిసి అస్సాం లో అమలులో ఉన్న చట్టాన్ని ఉపసంహరించమని కోరింది .నవంబర్ 3 న 100 మంది మహిళలు అంబారి లో మానవ హారంగా చేరి 24 గంటల నిరాహార దీక్షతో షర్మిలకు మద్దతు తెలిపారు .అదే ఏడాది ‘’సేవ్ షర్మిలా సాలిడారిటి కాంపైన్ ‘’ఏర్పడి ఆమె ఉద్యమానికి మరింత బలం చేకూర్చారు .డిసెంబర్ లో పూనే యూని వర్సిటి మణిపూర్ మహిళలు 30 మందికి డిగ్రీ చదవటానికి స్కాలర్ షిప్ లను ‘’షర్మిలాచాను’’ 39 వ జన్మదినోత్సవ పురస్కారంగా మంజూరు చేసింది .దీక్ష ప్రారంభించాక ఒకే ఒక్క సారి తల్లిని చూడటానికి వెళ్ళింది .’’ఆఫ్సా చట్టం’’ ఉపసంహరించాక మాత్రమే మా అమ్మ దగ్గరకు వెళ్లి ఆమె పెట్టిన అన్నం తింటాను ‘’అని ప్రకటించింది .
దీక్ష విరమణ
28-3-2016 న 16 ఏళ్ళ నిరాహార దీక్షను షర్మిల విరమించింది .చేసిన శపథం ప్రకారం ఆమె ఇంటికి వెళ్ళలేదు తల్లిని చూడలేదు చట్టం ఉపసంహరించాల్సిందే అని పట్టు బట్టి అదే రోజు సాయంత్రం ఇంఫాల్ లో షాహిద్ మీనార్ లో మళ్ళీ నిరాహారదీక్షమొదలు పెట్టింది .ఆమరణ నిహారాహార దీక్ష నేరం అంటూ మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేశారు .26-7-16 న షర్మిల తాను ఆగస్ట్ 9 న దీక్ష విరమిస్తానని ,మణిపూర్ ఎన్నికలలో పాల్గొంటానని ప్రకటించింది .ఆమె ప్రకటన అందరికీ ఆశ్చర్యం కలిగించింది .ఆమె చేసిన శపదాలను పట్టించుకోనందుకు జనం కలతచెందారు ‘’నేను రాజకీయాలలో ఉండి ఆఫ్సా చట్ట ఉప సంహరణకు తీవ్రంగా కృషి చేస్తాను ‘’అని శాంత పరచింది ..
ప్రపంచ ప్రసిద్ధ చారిత్రాత్మక నిరాహార దీక్ష :
ఏకంగా 500వారాలు కఠిన కఠోర నిరాహార దీక్ష చేసింది .ప్రపంచ నిరాహార దీక్ష సమ్మెలో ఇది చారిత్రాత్మకంగా నిలిచి రికార్డ్ సృష్టించింది .ఇంత సుదీర్ఘకాలం నిరాహార దీక్ష చేసినవారెవ్వరూ ప్రపంచం మొత్తం మీద లేనే లేరు ..ఆహారం నీరు లను ఆమె తీసుకోకుండా నే ఇంతకాలం నిరాహార దీక్ష చేసింది . 2014 ఎన్నికలలో ఆమెను రెండు ప్రధాన రాజకీయ పార్టీలు తమ పార్టీ తరఫున ఎన్నికలో పోటీచేయమని కోరాయి .ఆమె తిరస్కరించింది .జైలులో ఉన్న వాళ్లకు ఓటు హక్కు రద్దు అయినట్లు చట్ట ప్రకారం ఆమెకు ఓటు చేసే హక్కును రద్దు చేసింది ప్రభుత్వం .19-8-20 14 న కోర్టు ఆమెను నిర్బంది౦చ టానికి తగిన కారణాలేవీ లేవని విడుదల చేసింది .కాని 22-8-2014న మళ్ళీ అరెస్ట్ చేశారు .విడుదల చేసి, కోర్టు ఆమె ను జుడీషియల్ కస్టడీ లో 15 రోజులు ఉంచారు . ‘’ఆమ్నెస్టీ ఇంటర్ నేషనల్ సంస్థ ‘’ఐరాం షర్మిలను ‘’ప్రిజనర్ ఆఫ్ కాన్షన్స్ ‘’గా ప్రకటించింది .
గౌరవ పురస్కారాలు :
2004 లో షర్మిల ను ‘’ప్రజా ప్రతిఘటన చిహ్నం ‘’గా గుర్తించి ఆరాధించారు . ‘’ఆమ్నెస్టీ ఇంటర్ నేషనల్ సంస్థ ‘’ఐరాం షర్మిలను ‘’ప్రిజనర్ ఆఫ్ కాన్షన్స్ ‘’గా ప్రకటించింది .అహింసా పూరిత సత్యాగ్రహ పోరాటానికి షర్మిలకు 2009 లో ‘’మయిల్లమ్మా ఫౌండేషన్ ‘’వారు ‘’మయిల్లమ్మా అవార్డ్ ‘’ను ప్రదానం చేశారు .2010 లో ‘’ఏషియన్ హ్యూమన్ రైట్స్ కమిషన్’’షర్మిలకు ‘’జీవన సాఫల్య పురస్కారం ‘’అందించింది .రవీంద్ర నాద టాగూర్ శాంతి బహుమతి తో పాటు 5 లక్షల నగదు పురస్కారాన్ని ‘’ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్ మెంట్ ‘’పురస్కారం అందుకొన్నది .’’శాంతి సామరస్య ‘’సాధన కోసం చేసిన కృషికి ‘’సర్వ గుణ సంపన్న’’పురస్కారం పొందింది . .2014 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఐరాం షర్మిల ఏం. ఎస్ .ఎన్ .వాళ్ళు నిర్వహించిన ఓటింగ్ లో అగ్రభాగాన నిలిచింది .
షర్మిల జీవితం పోరాటాలపై ‘’దీప్తి ప్రియా మేర్హోత్ర ‘’బర్నింగ్ బ్రైట్ –ఐరాం షర్మిల –అండ్ హర స్ట్రగుల్ ఫర్ పీస్ ఇన్ మణిపూర్ ‘’పుస్తకాన్ని రాశారు ..’’ఓజాస్ యే సి ‘’అనే పూణే నాటకనటుడుఆమె జీవితం ఆధారంగా ‘’టేక్ ది టార్చ్ ‘’అనే మొనో ప్లే ప్రదర్శించాడు .దీన్ని దేశం లో చాలా చోట్ల ప్రదర్శించి షర్మిల స్పూర్తిని తెలియ జేశాడు . మణిపూర్ ఉక్కు మహిళ ఐరాం షర్మిల అందరికీ ఆదర్శంగా నిలిచి స్పూర్తి ,ప్రేరణలనిచ్చింది .
గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to మణిపూర్ ఉక్కు మహిళ- ఐరాం షర్మిల – గబ్బిట దుర్గాప్రసాద్