నచ్చావులే…..!!!

అపూర్వ మిత్రద్వయం “బాపు-రమణ” ల శ్రీ రామ రాజ్యం విడుదలయింది కదా – మళ్ళీ మళ్ళీ పౌరాణికాలు రాబోయాయా-చూడబోయామా అనుకుని  ఒక 45 నిముషాల డ్రైవ్ లో వున్నఒకానొక ధియేటర్ కి వెళ్లి ఆ సినిమా చూసి అక్కడక్కడా లవ-కుశ తో పోల్చుకుని మనసు లో కలగబోయిన అసంతృప్తిని అంతగా లెక్కచేయక ఒక మంచి సినిమా చూశామనేసుకున్నాము. మరుసటి రోజు కలవడానికి వచ్చిన మిత్రులతో మాట్లాడుతుండగా శ్రీ రామ రాజ్యం ప్రస్తావన వచ్చింది. ఎలా వుంది అన్న ప్రశ్నకి తెగ ఉత్సాహపడి ఆ సినిమా లో నచ్చిన సన్నివేశాలు, బాలకృష్ణ నటన, నయనతార ఆహార్యం, అభినయం, లవకుశుల హావభావాలు, ఫోటోగ్రఫి, గ్రాఫిక్స్ గురించి నాదైన ధోరణిలో చెప్పుకుపోతూ వున్నాను. ఆ వచ్చిన వారు నన్ను మధ్యలోనే ఆపేసి – మిమ్మల్ని అడిగాను చూడండి ! అసలు ఆ బాలకృష్ణ నీలం సున్నం వేసుకున్నవాడిలా ఏమన్నా బాగున్నాడాండీ? ఆ ఇళయరాజా సంగీతం అసలు సంగీతమేనా- పాటలు అన్నీ చెడగొట్టాడు. కీరవాణి అయితే పాటలు గొప్పగా ఉండేవి. లవకుశ తో పోలిస్తే పాసు మార్కులు కూడా రావు ఈ సినిమాకి- మీరెంతైనా చెప్పండి- అనేశారు. అంతే! ఇంకేమీ చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు.

వారు “అస్సలు బాలేదు – మీరెంతైనా చెప్పండి” అని  తెల్చేయకుండా ఒక్క మాటైనా  మంచిగా  అంటే – ఏదో బాపు-రమణ కాంబినేషన్ లో ఆఖరి సినిమా, ఎక్కడా ఇంగ్లీష్ మాట-పాట లేని అచ్చ తెలుగు సినిమా, మన సీతారాముల్ని సరికొత్త రంగుల్లో చూపించిన సినిమా అని అనివుంటే మా సంభాషణ ఇంకొంచెం ఆహ్లాదం గా సాగేదేమో!

అనుకోకుండా ఆ  మిత్ర కుటుంబాన్నే మళ్ళీ ఒక పుట్టిన రోజు పార్టీ లో కలిశాము- మరుసటి రోజే. పలకరింపులు, కుశల ప్రశ్నలు అయాక చుట్టు పక్కల వున్న ఇండియన్ రెస్టారెంట్స్ లో ఏది బాగుంటుంది అన్న మాట వచ్చింది. మేము గత ఆరేళ్లుగా మా పెళ్లి రోజు, పిల్లలపుట్టినరోజులు, ఇంకా ఏమైనా ముఖ్య సందర్భాలలో ఆలోచించకుండా అతి ఇష్టం గా వెళ్ళే ఒకానొక రెస్టారెంట్ పేరు చెప్పాము. వెంటనే ” అదాండీ! మీకైతే ఎలా నచ్చిందో కానీండి. ఒకసారి వెళ్ళాము – ఆ ఓనరో, మరెవరోనండీ బొత్తిగా  మేనర్సు లేనివాడిలా వున్నాడు. మధ్యలో వచ్చి “ఈస్ ఎవ్రీతింగ్ ఆల్రైట్” అనడుగుతాడు. అసలు ప్రైవసీ నే వుండదు ఆ రెస్టారెంట్ లో ” అనేశారు ఆ కుటుంబ పెద్ద. నిజంగా చెప్పాలంటే  వారు “బొత్తిగా మేనర్సు లేదన్న ఆ ఓనరు” మిగిలిన రెస్టారెంట్లలా  కాక మొదటిసారి ఇచ్చిన రైస్ కానీ, రోటీలు కానీ ఖాళీ అయితే అదనంగా ఛార్జ్ చేయకుండా మళ్ళీ సర్వ్ చేస్తాడు. అక్కడ లభించే పదార్థాలు ఎప్పుడు  తాజాదనం లోనూ, రుచిలోనూ తేడా లేకుండా వుంటాయి. అది దాదాపుగా అందరూ అంగీకరించారు – మా సంభాషణలో పాల్గొన్నవాళ్ళంతా – ఒక్క మా మిత్రులు తప్ప. అసలు రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ తిన్న వాటి గురించి మాట్లాడకుండా సంబంధం లేని ఏదో ఒక రెండు నిముషాలు వచ్చిపోయే ఓనర్  ప్రవర్తన గురించే అయేటప్పటికి ఆ సంభాషణ అంతటితో సరి.

తర్వాత ఆలోచిస్తే అనిపించింది – కొంతమంది చేత ఏదైనా సరే బావుంది అనిపించాలంటే చాలా కష్టం. నలుపంటే ఇష్టం లేదు అంటూ అన్ని రంగులూ కలిస్తేనే తెలుపు అవుతుంది – అంటే తెలుపులో కూడా నలుపు వుంది. అందుకే తెలుపు అంటే కూడా ఇష్టం లేదు అని వాదించి నెగ్గేస్తారు కూడా.

అలాగే ఇంకొందరు పూర్తిగా విషయం తెలుసుకోకుండా ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. అది తప్పని తెలిశాక కూడా అంత తొందరగా ఆ అభిప్రాయాన్ని మార్చుకోరు. ఒకసారి నాలుగు కుటుంబాలు కలిసి వారి ఊరికి దగ్గరగా వున్న సముద్రతీరానికి కార్తీక మాసం లో వనభోజనాలకి  వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. అలా అనుకున్న తర్వాత చాలా ఉత్సాహంగా ఎవరు ఏమి వండి తీసుకుని వెళ్ళాలో మాట్లాడుకుని కావాల్సిన వస్తువుల జాబితా వ్రాసుకున్నారు. అందులో ఒకావిడ పులిహోర చేస్తానని చెప్పారు. తీరా ఆ రోజు వచ్చేసరికి అనుకున్న సమయానికి ఆ కుటుంబం నిర్ణీత స్థలానికి రాలేదు. కొంచెం ఎదురు చూశాక అందులో రామన్ అనే ఆయన  “నేను ముందు నుంచే అనుకుంటున్నాను. వీళ్ళిలా హ్యాండ్ ఇస్తారని- ఇలాంటి వాళ్ళతో ఎప్పుడూ పెట్టుకోకూడదు” అని. అది విన్న మరొకరు “అయ్యో! అలా అనకండి. రావుగారెప్పుడూ అందరి కన్నా ముందు వుంటారు. అసలు వాళ్ళ ఇంటికి వెళ్లి వద్దాము – సంగతేంటో తెలుస్తుంది కదా ” అని బయల్దేరి వెళ్ళారు. ఆ రావుగారు వెళ్ళిన వారికి వారి ఇంటి గేటు బయటే కనిపించి “అనుకోని ఇబ్బంది వచ్చింది – రాలేకపోతున్నాము. ఏమీ అనుకోకండి” అని చెప్పి పంపించేశారు. తిరిగి వచ్చేదారిలో, మళ్ళీ పిక్నిక్ వెళ్లి వచ్చేదాకా రామన్ గారు ఆ పిక్నిక్ కి వస్తామని చెప్పి , చివరికి రాని రావుగారిని తిడుతూనే వున్నారు. రెండో రోజు ఆఫీసులో ఎవరో చెప్పగా తెలిసింది రావుగారి భార్య తెల్లవారుఝామున చీకట్లో కనపడక మెట్ల మీద జారిపడి కాలు ఫ్రాక్చర్ అయింది – హాస్పిటల్ లో వున్నారని. ఆ సంగతి తెలిస్తే అందరూ పిక్నిక్ మానేస్తారని రావుగారు భార్యని ఆసుపత్రి లో చేర్చి తాను ఇంటి గేటు దగ్గర వీరి కోసం వేచి వున్నారు. అలా కాకపోతే పక్కింటి వాళ్ళ వల్ల తన భార్య కాలు విరిగిన విషయం తెలిసి అందరి ప్రోగ్రాం పాడవుతుందని. ఇది విన్న తర్వాత పికినిక్ కి వెళ్ళిన అందరూ బాధ పడ్డారు – ఒక్క రామన్ గారు తప్ప. ఆయన ఇప్పటికీ పిక్నిక్ కి రావడం ఇష్టం లేకే ఏదో చిన్న దెబ్బ తగిలి  రావుగారి భార్య కాలు బెణికితే దానికి ఫ్రాక్చర్ అని అబద్ధం చెప్పారని అనుకుంటూ వుంటారు – అందరికీ చెప్తూ వుంటారు.

అన్నీ నచ్చాలని లేదు- నచ్చి తీరాలనీ కాదు. కానీ తటస్థ పడ్డ ప్రతీ వ్యక్తిలోనూ, ప్రతీ సంఘటన  లోనూ తప్పులే ఎన్నుకుంటూ పోతే చివరికి మనకి మనమే ఇష్టం లేకుండా పోతామేమో.

ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్పాలని వుంది. ఒకరోజు నేను మా ఏడేళ్ళ బాబుకి లంచ్ టైమ్లో అన్నం, పప్పు కలిపి తినమని ఇచ్చాను. వాడు అది తిన్న తర్వాత పెరుగు అన్నం కలపబోతూ అలవాటు ప్రకారం”ఏం నాన్నా! పప్పూ-ఆమ్ ఎలా వుంది” అని అడిగాను . వాడు ఒక నిముషం నిశ్శబ్దం గా వుండి “అమ్మా! నువ్వు బాగా చేశావు కానీ నాకు నచ్చలేదమ్మా” అన్నాడు. ఆ మాటకి పప్పు బాగా లేదన్నాడని బాధ వేసే బదులు నేనెక్కడ  బాధ పడతానో అని అలోచించి నా ప్రయత్నంగా నేను బాగా వండానని చెప్పాడని మురిసిపోయాను.

మనకి నచ్చని వాటిని పది కారణాలు  వెతికి ఎత్తి చూపేకన్నా నచ్చిన ఒక కారణం చెప్పగలిగితే మన ఇంటర్ – పెర్సనల్ రిలేషన్షిప్స్ పొడి-పొడి మాటలు దాటి స్నేహపూరిత వాగ్జ్హరులు అవుతాయి.

మనకి పది మంది సన్నిహితులుంటే పదిమందీ మనలాగే ఆలోచించాలి , మనలాగే వుండాలి – అలా అయితేనే మెచ్చుతాము, నచ్చుతారు అనుకుంటే మన పరిధి అంతగా విస్తరించక  కూపస్థ మండూకాల్లా తయారవుతామేమో.

ఇంట్లో గానీ, ఆఫీసుల్లో కానీ, స్నేహితులు /పరిచయస్తుల్లలో కానీ – ఎక్కడయినా ఎప్పుడయినా ఎవరినీ , ఏ పరిస్థితినీ మనకి తోచినట్టు అంచనా వేయకుండా, వున్నది ఉన్నట్టుగా తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ నచ్చుతారేమో / యేమో కదా!

ఇంకొద్ది రోజుల్లో 2012 నూతన సంవత్సరం లో అడుగుబెట్టబోతున్నాము కదా….శుభాకాంక్షలతో పాటు

మొన్న తొడిగిన భూతద్దాలు లేవులే

నిన్న పెట్టుకున్న  రంగుటద్దాలు కావులే

నిన్ను ఎలాగైనా మెచ్చాలనే నా కళ్ళులే

నిన్ను మెచ్చానులే! నువ్వు నువ్వుగా నచ్చావులే!

….అని చెబ్దామా?!!!!

– లలితా TS

వ్యాసాలు, Permalink

9 Responses to నచ్చావులే…..!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో