జ్ఞాపకం- 2(ధారావాహిక )-అంగులూరి అంజనీదేవి

                 అంగులూరి ‘‘నువ్వే చూడు. చెబితే నమ్మవు’’ అంటూ సంలేఖ కథ వచ్చిన పత్రిక పేరు చెప్పాడు దిలీప్‌. దిలీప్‌ ఒకప్పుడు జయంత్‌కి ఇంటర్‌లో క్లాస్‌మేట్‌! ఆ తర్వాత దిలీప్‌ డిగ్రీచదివి జర్నలిజం వైపువెళ్లాడు. అయినా వాళ్ల స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జయంత్‌ వెంటనే వెళ్లి సంలేఖ కథ వున్న పత్రిక కొన్నాడు.
ఇంటికి వెళ్లి సంలేఖ కథ వున్న పేజీని తీసాడు.
                     ఒక్క క్షణం ఆ పేజీనే చూస్తూ చూపు తిప్పుకోలేకపోయాడు. ఎంత ప్రయత్నించినా సంలేఖ పేరు మీద నుండి అతని చూపు వెనక్కి రావటం లేదు. ముందు నమ్మలేక పోయినా నమ్మక తప్పటం లేదు. దిలీప్‌ చెప్పేది నిజమే!. ఆ కథ రాసింది సంలేఖనే. ఎందుకంటే ఆ కథ పేరుకన్నా సంలేఖ పేరే పెద్దపెద్ద అక్షరాతో ముద్రించబడి వుంది. ఆ పేరు చూస్తుంటేనే చిత్రంగా అన్పిస్తోంది. అయినా సంలేఖ కథ రాయడమేంటి? అంత మంచి పేరున్న పత్రికలో ఆ కథ రావడమేంటి? కథ రాయడమంటే మాటలా! ఇదెలా సాధ్యమైంది సంలేఖకి.? ఎంత వద్దనుకున్నా ఒకటే ఆశ్చర్యం జయంత్‌లో.
                    సంలేఖ ఇప్పుడు ఏం చేస్తుందో? చదువుతోందా? ఖాళీగా ఉందా ? లేక ఉద్యోగం చేస్తోందా? ఏదీ లేకుండా కథలు రాయడమే పనిగా పెట్టుకుందా? ఏది తెలియాలన్నా ఆమె ఇప్పుడు తనకి అందుబాటులో లేదు. ఆ మధ్యన ఓ స్నేహితుడు కన్పించి ‘సంలేఖ చదువు మానేసిందిరా!’ అన్నాడు జాలిగా. కసుక్కున గుచ్చుకున్నట్లైంది ఎక్కడో. ఈ మధ్యన అదే స్నేహితుడు మళ్లీ కన్పించి ‘సంలేఖ డిగ్రీలో జాయిన్‌ అయిందిరా!’ అన్నాడు. తను దేనికి ఎలా స్పందించాలో తెలియలేదు. కానీ ఏదో అవ్యక్తమైన బాధ మాత్రం కొద్ది క్షణాలు మనసును తొలిచింది. ఆ తర్వాత దాని గురించి అంతగా ఆలోచించకుండా తన వ్యాపకంలో తను ఉండిపోయాడు.
                     కాని ఇప్పుడు రచయిత్రి అయిందని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. కథ చదివి నిశ్చేష్టుడయ్యాడు.ఉన్నట్టుండి జయంత్‌ ముఖంలో అనేక రంగుల కలబోత జరిగింది. బరువుగా నిట్టూర్చాలన్న ధ్యాస కూడా లేనివాడిలా అలాగే వుండిపోయాడు.
                     అదే క్షణంలో ‘‘ఏరా జయంత్‌ ! ఆ కథ చదివి ఆశ్చర్యపోయావా ? అవాక్కయ్యావా ?’’ మళ్లీ ఫోన్‌ చేసి అడిగాడు దిలీప్‌.
                     పడుకున్నాడే కాని జయంత్‌కి నిద్రరావడం లేదు. ఆ రాత్రంతా సంలేఖ గురించే ఆలోచించాడు. మెల్లగా లేచి వెళ్లి ఆ పత్రికను మళ్లీ చేతిలోకి తీసుకున్నాడు. మరోసారి ఆ కథను చాలా ఏకాగ్రతతో చదివాడు. ఆ కథ చదివాక అతనికి వెంటనే సంలేఖను చూడాలనిపిస్తోంది. మాట్లాడాలనిపిస్తోంది… ‘ఈ కథ నువ్వే రాసావా’ అని అడగాలనిపిస్తోంది. అభినందించాలనిపిస్తోంది. అభినందిస్తున్నప్పుడు ఆమెలో కలిగే ఆనందాన్ని చూడాలనిపిస్తోంది. అసలు తనను చూడగానే ఎంతగా ఆశ్చర్యపోతుందో…!! ఎంతగా కళ్లు పెద్దవి చేసి చూస్తుందో ! చూడాలి. తను ఆమె దగ్గరికి వెళ్లి అవన్నీ చూడాలని. వెంటనే లేచాడు జయంత్‌. సెల్ఫ్ లో వున్న ఖాళీ బ్యాగ్‌ని అందుకున్నాడు. అందులో తనవి రెండు జత బట్టలతో పాటు తనకి అవసరమైనవి పెట్టుకున్నాడు… కంపెనీ పనిమీద వైజాగ్‌ వెళుతున్నానని తల్లితో అబద్దం చెప్పి సంలేఖ వాళ్ల ఊరు ఆదిపురికి బయలు దేరాడు.

                     వెళుతున్నాడే కాని అతని మనసులో ఏదో ఊగిసలాట. తన ప్రయాణం తనకే నమ్మబుద్ది కావటం లేదు. తన మనసు తనకే అర్థం కావటం లేదు. అభినందించడానికే అయితే తనిప్పుడు ఇంత దూరం రావాలా! సెల్‌ నెంబర్‌ తీసుకుని ఓ మెసేజ్‌ పంపితేనో, ఒక ఫోన్‌ కాల్‌ చేసి మాట్లాడితేనో సరిపోతుంది కదా! లేదంటే వాళ్ల ఇంటి అడ్రస్‌ తీసుకుని ఒక ఉత్తరాన్ని కొరియర్‌ చేసినా సరిపోతుంది. అలాంటివేం చేయకుండా తనే ఇలా ఎందుకు రావాలి? అసలు సంలేఖకి ఇప్పటికైనా సెల్‌ఫోన్‌ వుందో లేదో?

                     సంలేఖతో అప్పుడొకసారి ‘నువ్వు సెల్లెందుకు వాడుకోవు…? ఈ రోజుల్లో సెల్‌ఫోన్‌ ఉపయోగించని అమ్మాయిలు  వుండరు తెలుసా! నువ్వెందుకో నాకు చాలా ప్రత్యేకంగా అన్పిస్తున్నావు’ అని అన్నాడు. అందుకామె వెంటనే.‘నేనే కాదు జయంత్‌! మా ఇంట్లో ఎవరూ సెల్‌ఫోన్‌ వాడరు. ఎందుకంటే సడన్‌గా వచ్చే ఫోన్‌కాల్స్‌ వల్ల మనసు స్థిరత్వం దెబ్బతింటుంది.చేస్తున్నపనిపట్ల ఏకాగ్రత పోతుంది. పని సకాలoలో పూర్తి చేయలేక పోతాం! అందుకే మా కుటుంబ సభ్యులకి సెల్‌ఫోన్లు వుండడం మానాన్న గారికి నచ్చదు. అదీకాక ఎవరి సెల్‌ఫోన్‌ వారికి వుండడం వల్ల కుటుంబంలో సంబంధాలు , అనుబంధాలు తగ్గిపోతాయి. అందరూ ఓచోట కూర్చున్నప్పుడు కూడా మనసు విప్పిమాట్లాడుకోకుండా,మనస్ఫూర్తిగా ఒకరినొకరు చూసుకోకుండా సెల్‌ఫోన్‌ చెవి దగ్గర పెట్టుకొని ఎవరిపాటికి వాళ్లు లేచి బయటకెళ్లి నిలబడి దూరంగా ఎక్కడో వున్నవారితో మాట్లాడుతూ గడుపుతారు.

                      అందుకే మాకెవరికి సెల్‌ఫోన్లు తీసివ్వలేదు మా నాన్న. ఓ.. నేనిలా దూరంగా హాస్టల్లో వున్నాను కదా మా వాళ్లతో ఎలా మాట్లాడతాననా మీ సందేహం…? నేను మొన్ననే కదా మా ఆదిపురి నుండి వచ్చాను. ఇంతలోపలే ఏముంటాయి మాట్లాడటానికి…? ఇంటికెళ్లాక తీరిగ్గా అందరం ఓ చోటకూర్చుని మాట్లాడుకుంటాం. నాకేదైనా అవసరం అయితే మా తిలక్‌ అన్నయ్య ఇక్కడే మీ హస్టల్లోనే వున్నాడు. అయినా మా రాజారాం అన్నయ్య దగ్గర సెల్‌ఫోన్‌ వుంది. కాక పోతే అది ఆయన స్కూల్లో వున్నంత సేపు ‘నాట్‌ కవరేజ్‌ ఏరియా’ అని వస్తుంది. మా అన్నయ్య ఇప్పుడు టీచర్‌గా ఉద్యోగం చేసేది మా పక్క వూరిలోనే…’’ అని చెప్పేది. ఇప్పుడెలా వుందో ఏమో! అయినా సంలేఖ ఎలా వుందో ఏమోనని ఆమె గురించి తనెందుకిలా ఆలోచిస్తున్నాడు?
                                                                                     

  –అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

3 Responses to జ్ఞాపకం- 2(ధారావాహిక )-అంగులూరి అంజనీదేవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో