హవాయి దీవులు- బిగ్ ఐలాండ్ -(భాగం-2)
హవాయి సమయం ప్రకారం తొమ్మిది గంటల వేళ ఫ్లైటు దిగినా, మాకు అలవాటైన శాన్ ఫ్రాన్ సిస్కో సమయం ప్రకారం అర్థ రాత్రి కావడం వల్ల పిల్లలు బాగా నిద్రకు వచ్చి అలిసిపోయారు. మామూలు బస్టాండులా ఉన్న ఎయిర్ పోర్టు నించి కారు రెంటల్ ప్రదేశానికి షటిల్ బస్సు కోసం వేచి చూసి కారు రెంటల్ కు చేరేసరికి మరో అరగంట పట్టింది. అక్కడ లైనులో మరో అరగంట. ఇక మేం ముందు బుక్ చేసుకున్న మామూలు కారు బదులు బిగ్ ఐలాండ్ లో కొండలు ఎక్కి దిగడానికి వీలుగా జీపుని రెంట్ చేసుకున్నాం. పైగా ఎన్నో రోజుల నించి ఓపెన్ టాప్ జీప్ డ్రెవ్ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి అవసరాలకు తగినట్టు గా కన్వర్టబుల్ జీపును రెంట్ కు తీసుకున్నాం.
ఎయిర్పోర్టు నించి హోటలుకు వెళ్లే దారిలో మొదటి మలుపు తిరగగానే గొప్ప హాయైన అనుభూతి. కిటీకీలు దించుకుంటే నునువెచ్చని గాలి అచ్చం ఇండియాలోలాగా. భలే ఆనందం వేసింది. ఇక రోడ్ల మధ్య నియాన్ లైట్లు, రెండు వైపులా రోడ్లు చూస్తే పొరబాటున ఇండియా వచ్చామా అనుకున్నాం. కానీ ఇదీ USA లోని భాగం కాబట్టి రోడ్ల మీద స్టాపు గుర్తులతో సహా అంతా యూఎస్ లాగానే ఉన్నాయి.
అందరికీ కణకణా ఆకలేస్తూంది. హోటల్ కి వెళ్లే ముందే ఏమైనా తిని వెళ్లాలని నిర్ణయించుకుని GPS లో చూసుకుని ఏదో పీజా ప్లేస్ కి వెళ్లాం. అప్పటికే మూసేసి ఉండడంతో వెనుతిరిగేం. ఇక హోటల్ కు వెళ్లిపోదామని కొంత దూరం రాగానే అదృష్టం కొద్దీ మరో పది నిమిషాలలో కట్టేసే పీజా ప్లేస్ కనబడింది. వెజ్ పీజా ఆర్డరు చేసుకుని ఆదరాబాదరా తిన్నాం.
ఇక్కడ క్లిక్ చేసి ఛాయా చిత్రాలను చూడండి.
ఎయిర్పోర్టు నించి మేము చేరాల్సిన “కోనా రిసార్టు” అరగంట దూరంలో ఉన్న “కోనా” సిటీ లో ఉంది. సముద్రం ఒడ్డునే చిన్న రోడ్డు తిరగగానే ఉంది మా రిసార్టు. ఆ చుట్టు పక్కల ఉన్న అన్ని బిల్డంగులలా కాకుండా చాలా పెద్ద బిల్డింగు అది. ఎదురుగా ఉన్న ఓపెన్ పార్కింగు లాటు కూడా చాలా పకడ్బందీగా హోటల్ టిక్కెట్టుతో మాత్రమే తెరుచుకునేట్లు ఉంది.
హోటలు దగ్గర దిగేమో లేదో ముక్కుకి పరిచయమైన గొప్ప సువాసన చుట్టుముట్టింది. రాత్రి వెలుతురులో చెట్లకి నక్షత్రాల్లా అందంగా మెరిసిపోతూన్న పూల వైపు పరుగెత్తాను. నాకెంతో ఇష్టమైన దేవ గన్నేరు పూలవి. ఎటు చూసినా అన్నీ అవే చెట్లు. సంతోషంతో పులకరించిపోతున్న నన్ను చూసి పిల్లలు లగేజీల మీద చతికిల బడ్డారు. సత్య కౌంటర్ దగ్గిరికి వెళ్లొచ్చే వరకూ పరవశంలో తేలిపోతూ నిద్రకి జోగుతున్న పిల్లలకి ఆ పూలంటే నాకెంత ఇష్టమో చెప్పేస్తూ ఉన్నాను. అంతే కాదు ఉదయం బయటికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కాసిన్ని పూలు పర్సులో వేసుకోవడం, మా జీపులో అలంకరించడం పరిపాటి అయ్యింది. హవాయిలో స్త్రీలు ఒక పువ్వు చెవి పక్క పెట్టుకోవడం వారి సంస్కృతిలో భాగం. ఇక అనుకరించకుండా ఉంటానా!
రూముకున్న బాల్కనీ తెరిచి బయటకు అడుగు పెట్టేసరికి ఆహ్లాదమైన నునువెచ్చని గాలితో బాటూ హోరున ఎదురుగా కదలాడుతున్న సముద్రతీరం కనిపించింది. అంత అందమైన రూము దొరకడం భలే ఆనందాన్నిచ్చింది. ఎందుకో విశాఖపట్నం జ్ఞాపకం వచ్చింది. జనవరి నెలలోని నును వెచ్చని అందమైన సముద్ర తీరం జ్ఞాపకం వచ్చింది.
మర్నాడు మా బాల్కనీ లోంచి సుందరమైన ఉదయపు సముద్ర ఆహ్వానంతో లేస్తూనే ద్వీపాన్ని చుట్టుముట్టి రావాలన్న ప్లాను కాగితం బయటకు తీసాను. మేం బిగ్ ఐలాండు కు పశ్చిమ తీరంలో దాదాపు మధ్యన ఉన్నాం.
మేప్ లో చూడాల్సిన ప్రదేశాల లిస్టు చూసేక అర్థమైనదేవిటంటే చూడాల్సినవన్నీ దాదాపు తూర్పు తీరంలోనే ఉన్నాయి. మేం ఉండే రెండు మూడు రోజులూ తూర్పు తీరానికి ప్రయాణం చేయాలంటే ఉత్తరం నించి గానీ, దక్షిణం నించి గానీ మొత్తం ద్వీపాన్ని చుట్టి వెళ్ళి మళ్లీ తిరిగి రావల్సిందే.
మొదటిరోజు ఉదయం ఉత్తరంగా బయలుదేరి దారిలో జలపాతాలు చూసుకుంటూ సాయంత్రానికి ప్లానిటోరియంకు చేరాలనేది ప్లాన్. ఇక అక్కడికి దగ్గిరలోనే ఉన్న “వాల్కనోస్ నేషనల్ పార్క్” కి ఆ రోజు సమయం చాలదు. కాబట్టి మర్నాడు మళ్లీ ఈ తీరానికి రావాలి. అయితే చూసిందే మరలా చూడకుండా మర్నాడు దక్షిణ దిశగా ద్వీపాన్ని చుట్టి వెళ్లాలని నిర్ణయించుకున్నాం.
అంతే కాకుండా ద్వీపమంతా తిప్పి చూపించే ప్రైవేటు టూర్ల లో ఏమేమి ప్రదేశాలు ముఖ్యమైనవి ఉన్నాయో అన్నీ నోట్ చేసుకుని మూడు రోజులకు టైం టేబుల్ రాసుకున్నాం.
ఆ రోజు చూడాల్సిన మొదటి ముఖ్య ప్రదేశానికి ఉదయం 9 గంటల వేళ పశ్చిమ తీరంలో బయలుదేరి తూర్పు తీరంలో ఉన్న “వైపియో బే” బయలుదేరాం.
మేమున్న సముద్ర తీరపు రిసార్టు ప్రాంతం కోనా ఊరు కి మధ్యలో ఉంది. అక్కణ్ణించి ఎటు వెళ్లాలన్నా తీరం నీంచి కొండ మీద ఉన్న రోడ్డు ద్వారానే వెళ్లాలి. రెండు వాహనాలు వెళ్లగలిగే రోడ్డు మీంచి మా కన్వర్టబుల్ జీపు టాపు తీసి బయలుదేరేం. ఉత్తరానికి వెళ్లేదారి ఎందుకో గోవాలా అనిపించింది. ఊరు దాటేంత వరకూ ఉన్న ఇళ్ల మధ్య, రోడ్డుకిరువైపులా లతలూ తీగెలతో అల్లుకున్న అందమైన చెట్లు, పచ్చదనం.
ఊరు దాటిన తర్వాత ఉత్తర దిశ నుంచి తూర్పుకి తిరిగే రోడ్డు మళ్లీ అటు తీరం చేరుకునే వరకూ దారంతా కొండలు ఎక్కి దిగుతూ ఉన్నాం. మధ్య గంటన్నర దూరంలో ఏ ఊరూ లేదు.
ఓపెన్ టాపు అలవాటు లేకో, 55 మైళ్ల స్పీడులో వెళ్తున్న రోడ్డు మీద బాగా వీస్తున్న గాలి వల్లనో నాకు చాలా అన్ కంఫర్టబుల్ గా అనిపించింది.
నా గోల పడలేక జీపు ఆపి మళ్లీ యథావిథిగా టాపుని అమర్చేడు సత్య. సరిగ్గా రెండు మలుపులు తిరిగేమో, లేదో అప్పటి వరకూ ఉన్న ఎండ మాయమై జలజలా వాన కురవడం మొదలుపెట్టింది.
“అయ్యో, వర్షం రోజు బయలుదేరేమే, ఏవీ చూడలేమేమో” అనుకున్నాం. కానీ తర్వాతి రెండు మైళ్లలో చుక్క వాన లేదు. హమ్మయ్య అనుకోగానే మళ్లీ వాన. కానీ చక్కగా నును వెచ్చని వాన. ఎంత సేపు వానలో తిరిగినా హాయిగా అనిపించే వాన. అప్పుడప్పుడే ఎండ, అంతలోనే వాన.
ఈ వింత అనుభవం ఆ మూడురోజులూ కొనసాగింది. ఇక మేం ఎప్పుడు పడ్తుందో తెలీని వానలో తడిసి ముద్దవుతూ, మళ్లీ ఆరుతూ చెట్ల మీద పక్షులంత హాయిగా స్వేచ్ఛగా తిరిగేం అక్కడున్నన్నాళ్లు. కాలిఫోర్నియాలో చలి ముళ్లు గుచ్చుకున్నట్లుండే వాన లో ఎప్పుడూ బయట తిరిగే సాహసం చెయ్యని వాళ్లం మేం. అందుకే ఎప్పుడూ ఎక్కడికి వెళ్లినా వర్షానికి, చలికీ తట్టు కోగలిగే కోట్లు పట్టు కు వెళ్లడం పరిపాటి మాకు. ఇక్కడ కూడా మొదటి రోజంతా వర్షంలో ఆ కోట్లు వేసుకున్నాం. మర్నాటి నుంచి ఇండియాలో ఉన్నట్లున్న మంచి వెచ్చని వాతావరణంలో వానలో హాయిగా కేరింతలు కొడుతూ తిరిగేం.
ఇక దారిలో చాలా చోట్ల అరటి చెట్లు, చెరకు చెట్లు కనిపించాయి. వరు, సిరి లకు అరటి చెట్లు ఇప్పటి వరకు తెలియదు. “ఓహ్, బనానా చెట్లు ఇలా ఉంటాయా?” అంది వరు. ఇక అది మొదలుకుని అక్కడ కనబడ్డవీ, లేనివీ అన్ని చెట్ల వివరాలు చెప్పడం మొదలు పెట్టేను.
ఇక హవాయి దీవులు అనాస తోటలకు ప్రసిద్ధి అని ఎక్కడో చదివేను. అవెక్కడున్నాయో అని రోడ్ల పక్క నిశితంగా చూస్తూ ఉన్నాను. మాటి మాటికీ సత్యని ఎక్కడన్నా తోట కనబడితే ఆగుదామని చెప్పేను. “ఇదేమైనా మన ఎస్టేటనుకున్నావా? ఎక్కడ పడితే అక్కడ ఆగకూడదు” అని కొట్టిపరేసేడు సత్య.
ఆ మూడు రోజులూ ద్వీపమంతా తిరిగినా ఎక్కడా పైనాపిల్ చెట్టు ఒక్కటి కూడా కనబడలేదు. సత్య “ఇక్కడ కాదు, ఒవాహూ ద్వీపంలో ఉంటాయి” అని సర్ది చెప్పేడు. తమాషా ఏవిటంటే మేం మూడో రోజున తిరిగి వచ్చేసేటప్పుడు గమనించేను. మా హోటలు బయట బాట చుట్టూ ఉన్న ఫ్లవర్ గార్డెన్ల మధ్య చిన్న క్రోటన్ మొక్కల్లా ఉన్నవన్నీ పైనాపిల్ మొక్కలే. ప్రతీ మొక్కకీ మధ్య అందమైన చిన్న కాయ కూడా మొలకెత్తుతూ భలే అందంగా ఉన్నాయి. అక్కడే ఉన్నా చూడకుండా ద్వీపమంతా వెతికినందుకు బాగా నవ్వుకున్నాం.
ఇక అలా ఎండా, వానా, చెట్టూ, చేమా, పిల్లలూ, కబుర్లతో దీవికి రెండో వైపుకు చేరుకున్నాం. “హనుక టౌన్ ” ను ఆనుకుని ఉన్న “వైపియో బే” కు దాదాపు పదకొండు గంటల వేళ చేరుకున్నాం. అది పెద్ద కొండ. కొండ మీంచి కొంత మేర కిందికి పార్కులా ఉన్న ప్రాంతానికి దిగి అక్కడి నుంచి కిందికి అందంగా కనబడే సముద్రాన్ని పై నుంచి చూడాలి. అది “వైపియో పాయింట్”.
ఆ సముద్ర తీరాన్ని అలా పై నించి అందమైన దృశ్యంగా చూడడం కంటే గొప్ప చారిత్రక నేపథ్యం కూడా ఉందక్కడ.
ఆ తీరాన్ని “హమాకువా తీరం” అంటారు. అక్కడే హవాయి మొదటి కమాహమేహా మహారాజు బాల్యమంతా గడిచింది. ఒకప్పుడీ లోయ వేలాది స్థానిక తెగల నిలయం. దాదాపు అయిదు మైళ్ల దిగువన కనిపిస్తూన్న ఆ లోయలో చరిత్ర ఆనవాళ్లని, జ్ఞాపకాలని చూడడానికి కిందికి జీపు, గుర్రమ్మీద టూర్ లు మొ.నవి కూడా ఉన్నాయట. కానీ మేం అక్కడ కేవలం గంట మాత్రమే గడిపేందుకు సమయం ఉంది. కాబట్టి పై నుంచి చూడడానికి నిర్ణయించుకున్నాం.
ఆ లోయలో ఇప్పుడు కేవలం వంద మంది మాత్రమే ఉంటున్నారట. అక్కడ అప్పటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా అప్పటి నుండి ఇప్పటికీ వరకూ లోయను ఎడతెరిపి లేకుండా పచ్చని సురక్షిత ప్రాంతంగా విలసిల్లజెస్తున్న హవాయీ లోకెల్లా ఎత్తైన హిలావాయీ జలపాతం 1300 ఎత్తునించి దుముకుతూ భూమిని సారవంతం జేస్తూంది.
మేం పార్కు కిందికి వెళ్లి పిట్టగోడనానుకుని ఆ తీరాన్ని చూస్తూండగానే చిరు జల్లుల వాన కురుస్తూ ఆగుతూ మురిపించడం మొదలు పెట్టింది. ఆ ఎండా వానల దోబూచులాటలో లోయకామూల నుంచి ఈ మూల వరకూ ఆకాశానికీ, భూమికీ మధ్య ఏడు రంగుల వారధిలా ఇంద్రధనుస్సు అత్యద్భుతంగా దర్శనమిచ్చింది. ఆ సుందర దృశ్యాన్ని చూడడానికి ఎన్ని వేల మైళ్లన్నా ఎగిరి రావాల్సిందే అనిపించింది.
(ఇంకా ఉంది)
– డా|| కె.గీత
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~