నా సంపూర్ణత నాదే

Everybody with a womb doesn’t have to have a child any more than everybody with vocal cords has to be an opera singer — Gloria Steinem | American feminist activist.

             ‘థెరెసా మే’కి మేనల్లుళ్ళూ, మేనగోడళ్ళూ ఉన్నప్పటికీ- కన్నపిల్లలు లేరు కనుక దేశప్రధాని అవడానికి తానే ఎక్కువ అర్హురాలినన్న స్టేట్మెంట్ ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థి అయిన ఆండ్రియా లీడ్సమ్‌ కొన్నాళ్ళ కిందట. థెరెసా మేకీ ఆమె భర్త ఫిలిప్‌కీ పిల్లలు పుట్టలేదు. జీవితం తనకి ఎంతందిస్తే అంతే ప్రాప్తమనుకుంటానని- మే చెప్పారు.

          తనన్న మాటలకి లేచిన దుమారం వల్ల లీడ్సమ్ తన అభ్యర్థిత్వం వెనక్కి తీసుకున్నారనుకోండి. మన దేశంలో ఎవరూ అలా చేసిన దాఖలాలు కనిపించవు.

               పిల్లలని కనడం గురించి లోకంలో ఆలోచనాధోరణి మారినప్పటికీ, బ్రిటన్లో కూడా మాతృత్వాన్ని ప్రధాని పదవికే ఒక అర్హతగా చేసినప్పుడు, మన దేశంలో ఉన్న సామాన్య స్త్రీల పరిస్థితేమిటి?

            పిల్లలు లేకపోవడం అన్నది కొన్నాళ్ళ కిందటి వరకూ సామాజిక వెలిగా భావించబడుతుం డేది. ప్రత్యేకంగా గ్రామాల్లో. గొడ్రాళ్లని ఎగతాళి చేయడానికి సంకోచపడేవారు కాదు.

            వివాహవ్యవస్థా, మాతృత్వం- ఇవన్నీ లేకుండా, స్త్రీ అసంపూర్ణమైనదన్న భావం లోతుగా పాతుకుని ఉండేది. భారత సమాజం సాంప్రదాయాలు, విలువలు సంస్కృ తి-వీటన్నిటినీ దారాలతో కలిపి అల్లబడినదే ఆదర్శ కుటుంబం అన్న అభిప్రాయాన్ని నమ్మేది. ఇప్పటివరకూ ఒక స్త్రీ విలువ ఇంటిని ఎంత బాగా నడుపుతుందో, ఒక వారసుడిని కనివ్వగలదో, లేదో అన్న వాటిమీదా ఆధారపడినదే.

సామాన్యంగా మనం ఒక సమాజంగా, నిశ్చిత మైలురాళ్ళ లోలోపలే ఉంటాం-ముందే గీసి పెట్టి ఉన్న ఒక టైమ్‌లైన్ ప్రకారం. ఒక పట్టణపు స్త్రీ చదువు పూర్తి చేసి (అదెంతైనా) ఒక నిర్దిష్ట వయస్సులో పెళ్ళి చేసుకుని, ఆ తరువాత పిల్లల్ని కనడం అన్నది ఆనవాయితీ.

              పెళ్ళి ఆలశ్యమయితే, తెలిసినవాళ్ళు ‘ ఎప్పుడు చేసుకుంటావింక?” అని మొహంమ్మీదే అడుగుతారు. ఆ పెళ్ళి అయిన తరువాత, ‘ఇంకా విశేషమేదీ లేదా?’ అని అడగడానికి సంవత్సరం కూడా పట్టదు. ఇంకా ఆలశ్యం చేస్తే, ‘ఇప్పుడు తెలియదులే. వయస్సుమీద పడ్డాక- రోగమో, రొష్టో వస్తే చూసుకోడానికి ఎవరూ లేకపోతే కానీ తెలిసి రాదు’ అనో, ‘మరీ ఇంత స్వార్థమా? పిల్లల్ని పెంచడం కూడా ఇష్టం లేదూ?’ అనో, ‘జీవితం అంటే ఏమిటనుకున్నావు? బాధ్యతలూ నిర్వహించాలి.’ అనో, మరేవో అనడం సామాన్యం.

              పిల్లల్ని కనాలో, కూడదో అన్నది మన సమాజంలో ఉన్న సాంఘిక, నైతిక ధార్మికత వల్ల నిర్దేశించబడుతుంది.
ఒక జంట తమకి పిల్లలు వద్దనుకుని పరస్పరం నిర్ణయించుకున్నా లేక ఒంటరి స్త్రీ మాతృత్వాన్ని కావాలనుకున్నా- అవి వారి వ్యక్తిగత ఎంపికలయి ఉండాలి.
ఒకానొకప్పుడు, పిల్లలు పుట్టడం అన్నది పెళ్ళికి పరమార్థం. ఇప్పుడు వాళ్ళు పుట్టబోయేముందే, తల్లి తండ్రులు ఎంతో ప్లానింగ్ చేసుకుంటున్నారు.

             భారతీయ నారి అనే మూసలో ఇమిడి, దశాబ్దాలగా స్త్రీలు అంతర్గతంగా పితృస్వామ్యంలోనే జీవించారు. తల్లి అవడంలో ఉన్న తృప్తిని ఎవరూ కాదనరు. కానీ, స్తీలు ఆర్థికంగా స్వతంత్రులవుతున్న కొద్దీ, ఆధునిక సంప్రదాయ వైరుధ్యం ప్రారంభం అవడం వల్ల, చాలామంది యథాతథ స్థితి నుండి దూరం అవుతున్నారు.

                   పట్టణపు మహిళలు ‘పిల్లలు కావాలా వద్దా’ అన్న ఎంపికమీద తమ హక్కు ప్రకటించుకోవడం హెచ్చవుతోంది. మాతృత్వపు దారిలో నడవకుండా, తమని తాము నిర్వచించుకోవడం ఎక్కువవుతోంది. పాటల్లో, సినిమాల్లో, పుస్తకాల్లో కూడా తల్లినీ, తల్లితనాన్నీ గ్లోరిఫై చేస్తూనే ఉన్నారు. అదిప్పుడు మాతృత్వం వద్దనుకునే స్త్రీల భుజాలమీద భారీ అయింది. ‘నాకున్న టైముని నాకిష్టం వచ్చినట్టు గడుపుకుంటాను. దానికి పిల్లల్నే కనాలా?’ అని ప్రశ్నించడానికి వీరు ధైర్యం సమకూర్చుకుంటున్నారు.

                ఏమి చెప్పినప్పటికీ, పిల్లలు వద్దనుకోవడం అన్నది సులభమైన నిర్ణయమేదీ కాదు. తీవ్రమైన సామాజిక వత్తుడులని భరించే శక్తుంటే కనుక, అది వేరే సంగతి కానీ స్త్రీ చంద్రమండలానికి వెళ్ళగలిగినప్పటికీ, పిల్లలు లేకపోతే కనుక ఆమెకెక్కువ విలువ ఉండేది కాదు-ఇప్పటివరకూ.

                  ఏది ఏమైనా, సామాజిక వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఇప్పటి పరిస్థితి ఒక దశాబ్దం కిందటికన్నా నయమే. సామాజిక వ్యవస్థలు, పోకడలు ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి. పిల్లలుంటే కనుక అతి ఖర్చుతో, పోటీతత్వంతో, విద్యావ్యవస్థతో కూడా పోరాడ్డమేకాక ఒక పెద్ద బాధ్యత నిర్వహించడం కూడా అని తల్లితండ్రులకి తెలుసు.

స్త్రీల ఉన్నత చదువుల వల్లా, వారికిప్పుడు కనిపిస్తున్న విస్తారమైన ప్రపంచం వల్లా, వారి అవధులు విప్పారి, జీవితంలో అర్థమూ, ప్రయోజనమూ కనుక్కునేటందుకు పిల్లలని కనడమే కాక, ఇంకా అనేకమైన మార్గాలున్నాయని వారికి తెలుస్తోంది. అందువల్లే కొందటి రెండు, మూడు దశాబ్దాలుగా DINKs( double income, no kids) జంటలు మనకి తరచూ తారసపడుతున్నాయి. వీడియో చూడండి.

                 కానీ, పిల్లలు వద్దనుకునే స్త్రీలని తీర్పు తీర్చడం మాత్రం సులభం. వారు స్వార్థపరులనీ, కుటుంబ వ్యతిరేకులనీ, వృత్తిపట్ల స్వీయభావావరోధం ఉన్నవారన్న ముద్రలు మాత్రం పడతాయి. పిల్లలున్నవారు తీర్పు తీరుస్తారు. పిల్లలు లేని వారు సంజాయిషీ ఇచ్చుకుంటారు.
పిల్లలు వద్దనుకునే కారణాలెన్నో ఇప్పుడు!

                 పిల్లల్ని కంటే, పనివాళ్ళ మీదైనా ఆధారపడాలి లేకపోతే అమ్మో, అత్తో ఆ బాధ్యత తలకెత్తుకోవాలి- వాళ్ళు ఒప్పుకుంటేనే.ఇకోలొజీ, సాంస్కృతిక వాతావరణం, హెచ్చవుతున్న కాలుష్యం, వ్యయం, భౌతికవాదం, నేరాలు – వీటన్నిటినీ లెక్కలోని తీసుకుని , ఇంకొక జీవిని ఈ లోకంలోకి తీసుకురావడం సరైనదేనా, కాదా అని కొందరు తటపటాయిస్తారు.

             మాతృత్వం బానిసత్వానికి ఇంకో రూపం మాత్రమే. బాధ్యత చాలా ఉంటుంది. దానితోపాటు వచ్చే తమ దోష భాషమే కాక తమ తార్కిక అస్థిత్వాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నది మరి కొందరి అభిప్రాయం.

                   పిల్లలగా ఉన్నప్పుడు చేయలేకపోయిన పనులన్నిటినీ ఇప్పుడు చేయొచ్చు. సంగీతం అయినా, పి ఎచ్‌డి పూర్తి చేయడం అయినా ఆర్టైనా సరే- ఆ తమ passion పిల్లల కోసమని వదులుకుంటే, బహుషా భవిష్యత్తులో పిల్లలని అసహ్యించుకొనే అవకాశం ఉంటుందేమో!-ఇంకో వాదన.

Picture 2              పిల్లలు లేకపోవడం వల్ల తాము అంసపూర్తైన స్త్రీలమని వారనుకోరు.మాతృత్వం overrate చేయబడింది. అది సంతోషాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు కానీ అది జీవితకాలపు బాధ్యత. దానికి వారు సిద్ధంగా లేరు.
తమ ఉద్యోగం వదులుకోవాలి. ప్రయాణాలని తగ్గించుకోవాలి. తమకంటూ ఒక సమయాన్ని కేటాయించుకోలేరు.-ఇవన్నీ మరికొన్ని.

                ఆఖరిగా- పిల్లలు వద్దనుకున్నవారికి కొన్ని కొన్ని సార్లు సందేహాలు కానీ పశ్చాత్తాపం కానీ కలుగుతాయా? తప్పకుండా. కానీ, పిల్లలు కలిగి ఉంటే, తమ జీవితంలో పిల్లలని పుట్టించకుండా గడిపే ప్రయత్నం ఎందుకు చేయలేదా! అని కూడా ఆలోచించే అవకాశమూ లేకపోలేదు. అన్ని రకాలైన జీవితాలనీ గడపడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ సందర్భాల్లో, తమ అంతర్బుద్ధిని నమ్ముకోవడమే ఉత్తమం.

పిల్లలు వద్దనుకున్న జంటలని మన సమాజం గౌరవించే రోజొకటి వస్తుందని ఆశిద్దాం.

ఎంపిక వ్యక్తిగతమైనంతమాత్రాన్న, అది సమాజాన్ని అగౌరవపరచడం మాత్రం కాదు.

ఎవరి ఆలోచన వారిది, ఎవరి నిర్ణయమూ/జీవితమూ వారిదే. పరిణామాలు భరించేదీ వారే.

-కృష్ణవేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీత, , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

17 Responses to నా సంపూర్ణత నాదే

 1. Sunitha Ramesh says:

  ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్. ఎప్పటిలానే చాలా బాగుందండి మీ వ్యాసం

  • Krishna Veni Chari says:

   సునీత రమేశ్‍ గారూ,
   చాలా థేంక్స్‍. 🙂

 2. Gauthami Jalagadugula says:

  వ్యాసం ఆలోచనను పెంచే విధంగా ఉంది. భారత దేశం లో పెళ్లి, పిల్లలు వాళ్లందరితో కలిసి ఫోటోలు, కలిసి బ్రతుకుతున్నారని చూపడానికి ఒక గృహం … మళ్ళీ ఫేస్ బుక్ లాంటి వాటిలో ఫోటోలు పెడితే పుష్కలమైన గౌరవం లభిస్తుంది అని నమ్మేవారు చాలామందిని చూస్తుంటాం. అది నిజమే కూడా. వీటిల్లో ఏదయినా తేడాగా కనిపిస్తే బుర్రలు తింటారు. మీరు వ్రాసిన ఉదంతాలన్నీ కరెక్ట్. వారి వారి ఇళ్లల్లో ఎంత ఈగలమోత ఉండనీ… ఎదుటి వాళ్ళ జీవితాలలో ఏఏ చిన్న తేడా ఉన్నా అంగీకరించలేరు. అటువంటిది మేము పిల్లల్ని కనము, హాయిగా ఇలాగే ఉంటాము, సంపాదించినది అంతా మేమే తింటాము అంటే కుటుంబాలలో ఊరుకోరు. కనీసం వాళ్ళ పిల్లలకయినా ఆస్తులు వ్రాసేసి, వాళ్ళని దత్తత కూడా తీసుకొని సేవ చేసేంత వరకు. ఈ సమస్యలను ఎదుర్కొనే బదులు కనగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు కనడమే మంచిది.

  కనలేని పరిస్థితి అయ్యి, పెంచుకొనే పరిస్థితి ఉంటే పెంచుకోవడం మంచిది. తప్పనిసరి అని చెప్పను. వ్యక్తిగతం.

  ఇకపోతే సమాజంలో కనలేని వాళ్లకి చిన్న చూపు- ఈ భోగి పళ్ళు పోసినప్పుడో, పిల్లలకోసం పళ్ళవ్రతం చేసినప్పుడో వాళ్ళని పిలవరు. పోతేపోనీయండి అని వదిలేయడమే. మిగితా వాటికి పిలవరా ఏమిటి? కొన్ని నోములకు కొంతమందిని పిలవనే పిలవరు ఎలిజిబిలిటీలు ఉన్నా. వెళ్లి యుద్ధం చేయగలరా ఎవరైనా ఎవరితోనైనా? ప్రతి ఒక్కరూ ఏదోలా పక్షపాతానికి గురి అవుతుంటారు. కొందరికి కొన్ని విషయాల్లో అన్నీ ఉన్నా కూడా వాళ్లకి “ఉందీ” అని అసహ్యించుకుంటుంటారు, అసూయ పడతారు, వేరుగా చూస్తారు 🙂 . కాబట్టి ఈ వేర్పాటుకు ఒక లెక్కా డొక్కా లేదు. అలాగే పిల్లలు లేరని బాధపడకూడదు.

  కనడానికి ఇష్టం లేనివాళ్లకు- వాళ్ళ ఇష్టం. కంటే వాళ్ళకే మంచిది కొన్ని విధాలుగా. అయినా జీవితంలో ఒక గోల్ లేకుండా పోతుంది. మన కష్టాన్ని, మన విజయాల్ని, మన ఉన్నతిని మన కన్నవాళ్ళ తర్వాత మనం కన్నవాళ్ళే గుర్తిస్తారు.

  అమెరికాలాంటి దేశాలు వేరు. వాళ్ళకిన్ని మాటలు నేను చెప్పను. చివరివరకూ లైఫ్ సెటిల్మెంట్ కోసం పోరాడాలి. అది పోరాటం అని కూడా తెలియదు వాళ్లకి, జీవితం అంటే అలాగే జీవించాలనుకుంటారు. ఇద్దరికీ కంపేరిజన్ లేదు.

  వ్యాసం బాగుంది కృష్ణవేణి గారూ …

  • Krishna Veni Chari says:

   గౌతమిగారూ,
   భోగి పళ్ళు పోసినప్పుడో, పిల్లలకోసం పళ్ళవ్రతం చేసినప్పుడో వాళ్ళని పిలవరు. —-
   అదే కాక పెళ్ళిళ్ళల్లో పేరంటాలో కూడా వాళ్ళు అక్షంతలు వేస్తే అపశకునం అన్న మూఢ నమ్మకం కూడా ఉందనుకుంటాను.
   అలాగే పిల్లలు లేరని బాధపడకూడదు——-
   పిల్లలే అనవసరం అనుకుంటే మరి బాధ కూడానా?
   వ్యాసం బాగుంది————
   థేంక్యూ, థేంక్యూ, థేంక్యూ. 🙂
   నిన్నంతా ఫోన్నుంచి తప్ప టైప్ చేయడానికి వీలు పడనందువల్ల ఇంత ఆలశ్యంగా సమాధానం ఇస్తున్నాను.

 3. Vanaja Tatineni says:

  మంచి వ్యాసం. బావుంది కృష్ణవేణి గారు . ఎంపిక వ్యక్తిగతమైనంతమాత్రాన్న, అది సమాజాన్ని అగౌరవపరచడం మాత్రం కాదు. బాగా చెప్పారు.

  • Krishna Veni Chari says:

   వనజగారూ,
   మీరెప్పుడూ అందిస్తున్న ప్రోత్సాహానికి మీకు చాలా థేంక్యూలు. 🙂

 4. Right analysis,ma’am!

  • Krishna Veni Chari says:

   జి నారాయణరావుగారూ,
   థేంక్యూ 🙂

 5. SRINIVAS SATHIRAJU says:

  ఎందుకనో నాకు ఈ వ్యాసం అంతగా హత్తుకోలేదు. కారణం నాకు పిల్లలు లేరు. అంతే కాదు ఎందుకు లేరా అని ఆలోచించ లేదు. మానవ సమాజ పురోగమనం మానవ పునురుత్పత్తి మీద ఆధార పడీ ఉంది కాబట్టి అధికారం అనేది సంతానం లేని వారికి ఇస్తే వారి లాగే ఆ జాతి కూడా నిర్వీర్యం అవుతుంది పునరుత్పత్తి లేకుండా అనేది మన పూర్వీకుల భావన భూమి మీద నాలు దిశలా కాబట్టి మీరు పేర్కొన్న కొన్ని రాజ్యార్హత విషయాలు అర్ధం చేసుకోగలిగా! ఇక ఈ విషయం మీద ఆలోచించడం ఒక విధమైన విగ్రహాలంకరణ ప్రాయమైన సమయ పాలన. కుంచెం విపరీతమైన ఆలోచనా ధోరణిలా ఉంది. అసలు జనాభా ఎక్కువైనా భారత దేశంలో పిల్లలు లేక పోయినంత మాత్రాన్న ఎవ్వరూ పట్టించుకునే తీరుబాటు ఓపిక ఉందనుకోను. ఉన్నా ఆశ్చర్య పోను కారణం సమాజం కట్టుబాట్లు అలాంటివి. ఎందుకూ ఏమిటీ అనే ప్రశ్నలు పట్టించుకోనక్కర్లేదు ఆడో జీవన విధానం ఒక్క రాత్రిలోనో లేదా ఒక్క వ్యాసంతోనో మార్పు రాదు. అన్ని విషయాలలో వచ్చినట్లే అతి త్వరలోనే ఈ విషయం కూడా కాలానికి మనుషుల ఆలోచనల పరిధి చేత తప్పకుండా మారుతుంది. తరువాత ఇప్పుడు వస్తున్నా ఆధునిక యంత్రాలు అన్నీ తమ అణు ధార్మికత మూలంగా సంతాన ఉత్పత్తి చేసే కణాలు అతితక్కువయ్యేలా చేసి కుంచెం సమస్యని సులభం చేస్తున్నాయి. సంతానోత్పత్తి కొన్ని తరాల తరువాత ఒక అరుదైన శాస్త్ర ప్రక్రియ గా రూపు చేందుకునే దిశగా మానవ సమాజం అడుగులు త్వరితంగా వేస్తోంది. సరి అయ్యిన సమయంలో సరి అయ్యిన ఒక తిరోగమన వాదపు పురాగమన సందేశంగా మీ ఆలోచన భావించ వచ్చు.

  • Krishna Veni Chari says:

   శ్రీనివాస్ సత్తిరాజుగారూ,
   — నాకు పిల్లలు లేరు. అంతే కాదు ఎందుకు లేరా అని ఆలోచించ లేదు.— కూడోస్ టు యూ.
   ఒక్క వ్యాసంతోనో మార్పు రాదు.—-
   — సంతానోత్పత్తి కొన్ని తరాల తరువాత ఒక అరుదైన శాస్త్ర ప్రక్రియ గా రూపు చేందుకునే దిశగా మానవ సమాజం అడుగులు త్వరితంగా వేస్తోంది.—
   అది జరిగేది కాదనుకుంటాను. కారణం- సంతానం వద్దనుకునేవాళ్ళ సంఖ్య చాలా అల్పమైనది.
   ఎందుకనో నాకు ఈ వ్యాసం అంతగా హత్తుకోలేదు.———
   హత్తుకోకపోయినప్పటికీ, చదివి అలా అని వ్యక్తపరిచి, ఇంత మంచి కామెంటు కూడా పెట్టినందుకు బోల్డు కృతజ్ఞతలు మీకు. 🙂

  • Krishna Veni Chari says:

   శ్రీనివాస్‍ సత్తిరాజుగారూ,
   నా రాతలవల్ల ఎవరూ మారతారన్న భ్రమకానీ, ఆశ కానీ నాకు లేవు. కేవలం నాకొచ్చిన మితమైన మాతృభాష(వ్రాత)ని మెరుగు పరచుకోవాలన్న ప్రయత్నమూ, ఫుల్‍ టైమ్‍ ఉద్యోగాలన్నీ మానెయ్యడం వల్ల , నాకుంటున్న టైముని సద్వినియోగపరచుకోడానికీ మాత్రమే రాస్తున్నానంతే.
   థేంక్యూ 🙂

 6. నేను జీవితపు ఆవల మరేదో వుందని నమ్మను.

  మన కర్మ సిద్దాంతం ప్రకారం మోక్షం లభించే వరకూ పుట్టడం-మరణించడం అనే చక్రంలో బంధీ అంటుంది. ఈ చక్రం నుండి బయటపడి అనంత బ్రంహ్మలో లీనమవడమే మోక్షం అంటుంది.

  నా మట్టుకు జీవికి మరణానంతరం ఏమీ లేదు. జీవి తన వునికినీ, కొనసాగింపునూ తన పిల్లల ద్వారా మాత్రమే కాపాడుకుంటుంది. అలా కాపాడుకోవాలనుకోవడమే జీవి యొక్క ఏకైక లక్ష్యం. భౌతికం కానిది ఏదైనా ఈ సృష్టిలో ఆ తపన నుండీ వుద్భవించిందే! ఓ పూవు అందమైనా, రంగైనా, వాసనైనా.. ఓ జీవి పోరాడే లక్షణమైనా … ఏదైనా… వాటి పరమావధి, జీవిగా తన్ను తాను తన సంతానం ద్వారా వీలయినంత కొనసాగిస్తూ ఈ కర్మ చట్రంలో (జనన-మరణ చక్రం) వుండలనుకోవడమే!

  మన వేదాంతం ప్రకారం ఈ చక్రం నుండి బయటపడటమే మోక్షమయితే, పిల్లలు కనకుండా వుండటమే మోక్షం.

  పిల్లలని కనాలి అనే సామాజిక ఒత్తిడి కేవలం తమతమ జాతిని కొనసాగించాలనుకోవడమే! కనాలా వద్దా అనేది వారి వారి స్వంత నిర్ణయమే కావాలి. సమాజపు ఒత్తిడి భరించలేక కనడం తప్పు.

  • Krishna Veni Chari says:

   ప్రసాద్ చరసాలగారూ,
   నేను జీవితపు ఆవల మరేదో వుందని నమ్మను.———–
   నేనూ నమ్మను.

   మీరు చెప్పిన కర్మ సిద్దాంతం, మోక్షం, మరణానంతరం-వీటితో పూర్తిగా ఏకీభవిస్తాను.

   ఇకపోతే, మీ కామెంటుని రెండు, మూడుసార్లు చదివిన తరువాత మొత్తం కామెంటుతోనూ నాకే పేచీ లేదు.

   చదివి, ఇంత ఓపికగా ఇంత వివరమైన కామెంటు పెట్టి, నేను రాసిన కాలమ్నే నేనే మరింత బాగా అర్థం చేసుకోడానికి తోడ్పడినందుకు-బోల్డు కృతజ్ఞతలు.

 7. Suresh says:

  “ఎంపిక వ్యక్తిగతమైనంతమాత్రాన్న, అది సమాజాన్ని అగౌరవపరచడం మాత్రం కాదు. ఎవరి ఆలోచన వారిది, ఎవరి నిర్ణయమూ/జీవితమూ వారిదే. పరిణామాలు భరించేదీ వారే.”… “పిల్లలున్నవారు తీర్పు తీరుస్తారు. పిల్లలు లేని వారు సంజాయిషీ ఇచ్చుకుంటారు.” భలే చెప్పారు. అన్నీ కోణాలనీ విశ్లేషిస్తూ చాలా బాగా రాసారండి. మీరన్నట్లు “ఇప్పటి పరిస్థితీ ఒక దశాబ్దం కింద కంటే నయమే” ఇంకో దశాబ్దం తరువాత .. వ్యక్తి గత నిర్ణయాలను గౌరవించే పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నాను.

  • Krishna Veni Chari says:

   అన్నీ కోణాలనీ విశ్లేషిస్తూ చాలా బాగా రాసారండి—–
   థేంక్యూ సురేశ్ గారూ . “వ్యక్తి గత నిర్ణయాలను గౌరవించే పరిస్థితి” వస్తుందనుకుంటాను. యాబై ఏళ్ళ కిందటి పరిస్థితీ, మనస్తత్వం ఇప్పుడు కనపడ్డం లేదు. ఈ ఆలోచనా ధీరణిలోనూ మార్పు వస్తే నయమే కదా! 🙂

 8. Venkata S Addanki says:

  చాల బగుందండి, శారీరిక నిర్మాణం అనుకూలించక పిల్లలు పుట్టక ఉండిపోతే మాట వేరుగానీ, పిల్లలను కనము అనుకోవడం ఈ సృష్టికి చేస్తున్న ద్రోహం కాదంటారా? మనము మన జీవితమూ అంతే చాలనుకుని మానెయ్యడం అన్నది సంకుచిత్వం కాదంటారా? స్వార్ధం కాదంటారా? ఎంతో ముందుకి వెళ్ళిన పాశ్చత్య దేశాలలో కూడా ఈ పోకడలు ఉన్నా, భర్తలనుండి విడిపోయి వేరే వివాహాలు చేసుకుంటున్నా పిల్లలని కనకుండా వాళ్ళు లేరే. ఇక అలాంటి వారిని గౌరవించడం అంటే మనకెందుకని వదిలెయ్యడమే, మరి అదే వచ్చే తరాలు అవలంబిస్తూపోతే ఈ మానవాళీ మనుగడ ఎంతో దూరం నడువదు కదా, అటువంటప్పుడు ఇన్ని రకాల అభివృద్ధులు, పరిజ్ఞానాలు ఎందుకు?

  అంతెందుకు అంతరించిపోతున్న జాతులని ( వృక్ష, పశు) కాపాడడం కోసము, పెరుగుతున్న భూమి వేడిని అరికట్టడం కోసమూ ఎన్నో చర్యలు తీసుకుంటూ, తమ జీవితాలనే త్యాగం చేసే త్యాగ ధనులున్నారు, మీరు చెప్పినట్లే అలా తమ పేషన్ కోసమో తమ కెరీర్ కోసమో పిల్లలు వద్దు అనుకుంటున్న జంటలు పెరుగుతుంటే కొన్నాళ్ళకి అలాంటి త్యాగధనులు మానవజాతి అంతరించిపోకుండా చెయ్యవలసిన అవసరం కోసం కూడా ఆలోచించవలసివస్తుందేమో, వ్యక్తిగత స్వేచ్చని కాదనలేము గానీ, మానవుడు సంఘజీవి, ఆ సంఘం కోసమైనా స్త్రీ కి ఒక వరముగా వచ్చిన మాతృత్వాన్ని వదులుకోవడం ఎంతవరకు సమర్ధించగలమండి? విదేశాలనుండి సారోగసీ కోసం పేద లేక ఎదుగుతున్న దేశాలలోని స్త్రీ లకి డబ్బు ఎరజూపి పిల్లలని కనివ్వమని అడుగుతున్న పాశ్చత్య దేశపు స్త్రీలు , అటువంటి కేసులూ ఎన్నో చూస్తున్నము, మరి వారెందుకు మాతృత్వపు చాయలు కోరుకుంటున్నారు?

  ఈ సృష్టి, తలరాత అన్నీ ఒక వైపు అనుకున్నా, ముఖ్యంగా పునరుత్పత్తి అన్నది ప్రతి జీవికి ఉన్న అన్శం దానిని కావాలని మానెయ్యడం జాతి అంతానికి మూలకారణం, అవి ఒక రకమైన విషపు బీజాలే అని నా అభిప్రాయం.

  మీరు మళ్ళీ ఒక మంచి చర్చకు దారితీసే అంశం తో రావడం ఆనదం.

  • Krishna Veni Chari says:

   వెంకట్ ఎస్ అద్దఁకి గారూ,
   శారీరిక నిర్మాణం అనుకూలించక———–
   అనుకూలించినంత మాత్రాన్న, పిలల్ని కనేస్తూనే ఉండాలనేమీ లేదు కదా!
   మీరు చెప్పిన ‘పాశ్చత్య దేశపు స్త్రీలు ‘ పిలల్ని కనాలనుకున్నా కనలేని స్థితిలో ఉండేవార కాబడ్డి సరోగసీని ఆశ్రయిస్తున్నారు.
   ‘పునరుత్పత్తి’ ‘మానవజాతి అంతరించిపోకుండా’ ఉండడానికీ మన దేశంలో ఉన్న నిరక్షరాశ్యులు రెండు పూటలా తిండి పెట్టలేకపోయినా సరే. గంపెడుమందిని కంటూనే ఉన్నారు మరి. కాబట్టి ఆ భయం మాత్రం లేదు.
   మీరు ఎప్పుడూ అందిస్తూ వస్తున్న ఇంత ప్రోత్సాహానికీ నేను వట్టి “థేంక్యూ” మాత్రమే చెప్పగలను. 🙂