సంపుటి :6 సంచిక :65
ISSN 2278-478
సాహిత్యం సమాజాన్ని చైతన్యం చేస్తున్న నేపధ్యంలో భారతీయ భాషా సాహిత్యాన్ని సుసంపన్నం చేసినవారు చాలామంది అందులోనూ ఆంధ్ర, కేంద్ర స్థాయిలో న్యాయ, రాజకీయ రంగాలో వున్న అనేక మంది ప్రముఖులు రచనా తృష్ణకల వారే . వారిలో బూర్గుల రామకృష్ణారావుగారు ఒకరు.
బూర్గుల వారు 1899-03-13 మహబూబ్‌నగర్ జిల్లాలో పడకల్లు గ్రామంలో జన్మించారు వీరి స్వస్థలం అదే జిల్లాలో బూర్గుల , బాల్యం నుంచి సామాజిక స్పృహ కలిగిన రామకృష్ణారావుగారు ముంభైలో ఎల్.ఎల్.బి చదివారు. ఈయన ఉన్నత చదువు చదువుతున్న కాలం లో మహారాష్ట్రలో ఉన్న సంప్రదాయాన్ని అనుసరించి, గ్రామం పేరునే ఇంటిపేరుగా పొందారు. కావున ఆయనని సంక్షిప్తంగా బూర్గుల రామకృష్ణారావు (బూర్గుల )గా పేరొందారు. తదుపరి హైదరాబాద్ నగరంలో లాయరు వృత్తి చేపట్టి ప్రముఖ న్యాయవాదిగా, 1952లో హైదరాబాదు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వీరు మహబూబ్‌నగర్ (జిల్లా) షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికై, కాంగ్రెస్ శాసన సభా పార్టీ నాయకుడుగా హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టి ప్రజలకు నిరుపమాన సేవందించారు.
ప్రతిష్టాత్మకమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన, అలాగే రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో ఒక కళాశాలను మహిళకు ఒక ఉన్నత పాఠశాలను పెట్టించడమేకాక మాతృభాషలో విద్యావ్యాప్తికి కృషి చేశారు. తెలుగు మాట్లాడే ప్రాంతాన్నీ ఒకే రాష్ట్రంగా రూపొందటానికి వీరు సాగించిన కేరళ, ఉత్తరప్రదేశ్ గవర్నరుగా అలాగే అనేక కార్యక్రమాలకు ప్రతినిధిగా, ప్రజాసేవలో ఆయన నిత్యం నిమగ్నమై ఉండేవారు. అన్ని పనులతోపాటు, ఆయన రచనాభిరుచికి కూడా ఏమాత్రం కొదవలేకుండా సాహిత్యాన్ని పండించారు.
తెలుగు , సంస్కృతం, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు, పారసీ, మరాఠి, కన్నడ భాషల్లో పరిజ్ఞానం కలదు. కాబట్టే పారసీ మూలం నుంచి ఉమర్‌ఖయ్యాం రచించిన రుబాయిలు , సంస్కృతమూలం నుండి పండిత రాయలు ఐదు సంస్కృతహరులను వీరు తెలుగులో పద్యాలుగా అనువాదం చేశారు.
ఈయన రచనలు :
కృష్ణశతకము, పుష్పాంజలి, తొలిచుక్క, సారస్వత వ్యాపముక్తావళి, పారశీకవాఙ్మయ చరిత్ర, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతము, కవితామంజరీ, ఆంధ్రమహా భాగవత సమీక్ష, The dream of poeaters Random Reflictions , Cultural Syntheses of india , పండిత రాజపంచామృతము, కనక ధారాస్తవము, సౌందర్యలహరి, సర్మద్ గీతము, ఉమర్‌ఖయ్యాం.
ఇంతటి రచనా కౌశలం కలిగిన పండితుని రచనలు కొన్నింటిని ఆచార్య బిరుదురాజు రామరాజుగారు సేకరించి ప్రచురించారు. అలాగే బూర్గుల రంగనాధరావుగారు మరికొన్నింటికి వెలుగునిచ్చారు. ఆ నేపధ్యంలోనే బూర్గుల రామకృష్ణారావు తొలిదశలో రచించి భావగీతాలు /కవితలు కొన్నింటిని ‘‘నివేదన’’ అనే కవితా సంకలనాన్ని ముద్రించారు. ఈ కవితా సంకలనమే ఈ వ్యాస రచనకు మూలం .
రామ చంద్రమూర్తిని తనకి మనోధైర్యాన్నిచ్చే దేవునిగా తలంచి ‘అవనీశ’ అని సంబోధిస్తూ
‘‘ప్రాంశులభ్యంబునైనట్టి ఫలము కొరకు
నెగరు చుండెడి వామను పగిది నేను
సంస్కృతాంధ్రంబు లెస్సగా జదివినట్టి
పండితులు జేయగా గల పనిని జేయు
దలచి నాడను నీ కృప గలిగి యుండ
కాని భవదాంకితంబైన కార్యమెపుడు
నీచమై యుండదిది యే నీచమౌను?’’
తన యొక్క రచనా ఆరంభ దశని మొదలు పెట్టేముందు, గొప్పగొప్ప పండితులు మాత్రమే వ్రాయగల కవిత్వాన్ని తాను ప్రారంభించానని ఈ వాక్యంలో తనముందు కాలంలో రచించి కవుల యందు గౌరవంగా వారి తరువాతనే తను అని ఒక గొప్ప అనుకువని అలాగే భగవంతునికి అంకితమిచ్చే ఒక ఉత్తమ రచన మంచిని ప్రబోధించేది ఎన్నడూ తక్కువకాదని తన మానసిక దృడత్వానికి శ్రీకారంతో శ్రీకారం చుట్టారనిపిస్తుంది. అటువంటి అచంచలమైన భక్తి తత్పరతని శ్రీకారం, ప్రార్థన, శ్రీయాదగిరి క్ష్మీనృసింహస్తుతి రచనలలో భక్తి రసాన్ని చిందించారు.
ప్రబంధ క్షణాలో ఒకటైన రవి`శశి వర్ణనని ఇందులో గమనించవచ్చు. సూర్యచంద్రుల ప్రకృతి రమణీయతని వర్ణించటం
చలికిన్ శోకమున్, శశికి సత్వరకాంతి విహీన తన్, నిశా
వలికిన్ నాశనంబు, బహువంచన మాతిమి రాళికిన్
సదా కలువల కెల్లి దైన్యమధకంబగు శ్రేష్ఠత పద్మరాశికిన్
గలుగ చతుర్థిశల్ విరిసి కాంతు నన్వహ మొప్పు భానుడన్.
చలికి, శశికి, నిశకి, కలువలకు మొదలైన వస్తువులకు, సూర్యునిచే కరిగిపోయి, తరిగిపోయి, వంగిపోయిన కవితావస్తువు పరిస్థితిని, సూర్యునికి వ్యతిరేక దిశలో వికసించిన వాటి యొక్క స్థితిని అత్యద్భుతమైన వర్ణన మరియు వాస్తవ చిత్రణని, సూర్యకిరణాల సామర్థ్యాన్ని ప్రస్ఫుటిస్తుంది.
‘‘యా కసంబను పచ్చని యాకునందు
విడిచి పెట్టిన ముద్దనా విధుడు దోప
గుడుచు వేళ నెల్లెడ బడినయట్టి
యమృత బిందువులన జుక్కలరుచుండె’’
ఆకాశం పచ్చని పత్రంగా పోలుస్తూ, ఆకాశ వీధుల్లో ప్రకృతి రమణీయతని ఆపాదిస్తూ చంద్ర తారకల్ని అత్యంత శోభాయమానంగా వర్ణించే తీరు చూస్తే పోతనగారి శ్రీ కృష్ణుని చిలిపి చేష్టు వర్ణించిన వెన్న తిన్న చిన్నవాడికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఆ చుక్కలు అమృత బింధువుల్లా ఉన్నాయన్న ఊహ అద్భుతం
‘‘చంద్ర సూర్యుల పర్వత సానువులను
నాడు చుందురు దోబూచులను దినంబు
రాత్రి మంచును గూర్చు రేరాజు కూర్మి
భానుడద్దాని గరగించు ప్రత్యహంబు’’
ప్రాచీన మానవుడు సూర్య చంద్రులను రెండు కళ్ళుగా భావించాడు. ఆధునిక మానవుడు గ్రహాలు గా భావిస్తున్నప్పటికీ అదే సమస్త ప్రాణికోటికి జీవణాధారాలుగా భావిస్తున్నదీ వాస్తవమే, కాని ఈ చాటువులో బూర్గులవారు సూర్యచంద్రల దోబూచులాటని హేమంత ఋతువు సమక్షంలో ఆ ఆటని ఆడుతున్నట్లు వర్ణిస్తూ, వాటి మధ్య ఉన్న పోటీ తత్వాన్ని కూడా సూచించే విధంగా భావావిష్కరణ చేశాడు. చంద్రతారకలు , చాటువుల్లో, సూర్యోదయం అనే శీర్షికలో మరెన్నో విషయాలు ఉన్నాయి. అలాగే ప్రేమగీతి, ప్రణయ సంక్షోభము, విరహిణీ మొదలైన కవితల్లో ప్రేమ, ప్రణయ భావాలను ఎంతో తాత్వికతతో కూడిన చింతనలో రచించారు.
సమాజంలో ఆనాటి సాంఫీుక జాడ్యంగా సంఘంలో పాతుకుపోయిన మూఢవిశ్వాసాలను నిరసిస్తూ ‘బహార్ ఖురాసానీ’ అనే ఖండికలో
‘‘మూఢ విశ్వాసముల చలిచే
గాఢముగనేకాటు పడితిని…’’
జ్ఞానం కూడా ఆనాడు మూఢవిశ్వాసాలకు బలైందని, తాను కూడా బలైనానని, ఒక్కసారిగా మూఢవిశ్వాసాలు అంతరించవని వాటిని తొలగించే నేపథ్యంలో ఎంతోమంది కృషిచేయ్యాలని అభ్యుదయాన్ని సమాజానికి అందించే ఒక ప్రగతిశీల భావజాలంతో తనయొక్క రచనల్లో దేశభక్తిని స్ఫురించేవిధంగా, ఉమర్ ఖయ్యాంలో ప్రాచీన కవీశ్వరుల్ని వారు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన విధానాన్ని చాటి చెప్పి తన రచనలతో తెలుగు , సంస్కృత మొదలైన భాషా సాహిత్యానికి విశేష కృషినందించారు బూర్గుల రామకృష్ణారావుగారు.
-రుత్తల శీధర్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to బూర్గుల రామకృష్ణారావు ‘నివేదన’ కవితా సంకలనం -రుత్తల శ్రీధర్