నాకూ ఒక గూడు వుంది (కథ ) -కనకదుర్గ

Kanaka Durga

Kanaka Durga

“మనూ, మనూ కొంచెం కామ్ డౌన్ అవ్వు తల్లీ! నాకు తెల్సు నీకు చాలా బాధ కలిగింది, హర్షా అట్లా అనకుండా వుండాల్సింది. నీకు తెల్సు కదా తనూ ఆలోచించకుండా అనేస్తాడు మళ్ళీ తనూ బాధ పడ్తాడు. నేను తనతో మాట్లాడనా?” సుమ అడిగింది మనస్వినిని.

“నో! అవసరం లేదు సుమ. అయినా ఇది తను గానీ వేరే ఎవ్వరయినా గానీ ఎదుటి మనిషిని తన సాటి మనిషిగా గుర్తించలేకపోతే ఎలా? ఒకోసారి కేవలం వారికే సంబంధించిన విషయాలని వాటిలో తలదూర్చే హక్కు గానీ, కనీసం ఒక భార్యగా, కూతురిగా వారి మంచి గురించే ఆలోచించే మనిషిగానయినా అడిగే హక్కు లేదు అని ఇంకా ఎన్ని సార్లు అనిపించుకోమంటావు చెప్పు! నాకు విసుగొస్తుంది. నాది కేవలం బాధేనా? ఇది నాకొక్క దానికి సంబంధించిన విషయమేనా? ఇది ప్రతి ఆడపిల్లకి ఎదురయ్యే సమస్యే కదా! అవునా, కాదా?” అని ఆవేశంగా అడిగింది మనస్విని.

“అమ్మా తల్లీ నువ్వు ప్రతి విషయం కరెక్ట్ గానే చెబుతావు, నువ్వే కాదు నేనూ ఇలాగే చెబుతుండేదాన్ని. కానీ రాను రాను నా మాటకు ఎంత విలువ వుందో తెలిసింతర్వాత అంతగా చెప్పడం మానేసాను. ఎప్పుడైనా నా సలహా అంతగా ప్రాముఖ్యత లేని విషయంలో అడిగినపుడు నాకు తోచింది చెప్పి నోరు మూసుకుంటాను. అది కూడా ఏదో అడగాలి కాబట్టి అడుగుతారు, నిజానికి మన సలహ పాటిస్తారా పాడా. ఇది మన చిన్నప్పటినుండి ఎదుర్కుంటున్న విషయాలే కానీ వాళ్ళు వాళ్ళకి ఈగో ఎక్కువయినప్పుడు ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం కాసేపు ఆవేశ పడతాం ఆ తర్వాత అడ్జస్ట్ అయిపోతాము. ఎందుకో తెలుసా స్త్రీలు బంధాలను, అనుబంధాలని అంత త్వరగా వదులుకోలేరు మై ఫ్రెండ్!” అంది సుమ మనస్విని భుజం మీద చెయ్యి వేసి.

“నా దురదృష్టమేమిటంటే నా భర్త నన్ను బాగా అర్ధం చేసుకున్నాడు నేను ఎలాగ అతని మనసు బాధ పెట్టకూడదనుకుంటానో తను కూడా అలాగే అనుకుంటాడనుకున్నాను. కానీ ఆలోచిస్తుంటే ఇప్పుడు తెలుస్తుంది ప్రతి విషయంలో తనే నిర్ణయాలు తీసుకుంటాడు ఆ తర్వాత నాకు చెబుతాడు, నేను కూడా తను బాగా ఆలోచించే తీసుకుని వుంటాడు కదా అని అన్నిటికీ సరే అనేస్తుంటాను. నీకు తెలుసు కదా! నేను తనని ఏ విషయంలో పెద్దగా వత్తిడి చేయను, నా చదువు విషయంలో అడ్డు చెప్పలేదు, జాబ్ చేస్తున్నాను, నా జీతం అడగడు, నేను వలంటరీ వర్క్ చేస్తున్నా కూడా ఏమీ అనలేదు, నీకేది హ్యాపీగా అనిపిస్తే అది చెయ్యి అనే అన్నాడు ఇంతవరకు. నేను బిజీగా వుంటాను తనూ బిజీగా వుంటాడు, అంతా ప్రశాంతంగానే వున్నట్టనిపిస్తుంది. అత్తగారు, మామగారు వూళ్ళో పొలాలు చూసుకుంటూ వుంటారు నీకు తెల్సు కదా! వీళ్లకి వూళ్ళో ఒక పాత ఇల్లు వుంది అది పాడుపడినట్టుగా అయ్యింది అది బాగు చేయించే పరిస్థితిలో లేదు మామగారు దాన్ని అమ్మేసి పాప పేరు మీద పెట్టమని ఎప్పుటినుంచో చెబుతున్నారు. మొన్న ఫోన్ చేసి పెద్దవాళ్ళిద్దరూ నాకు చెప్పారు, ’ హర్షాని ఒప్పించి త్వరగా ఏదైనా చేయకపోతే వూళ్ళో గూండాల బెడద ఎక్కువయ్యింది, ఎక్కడ ఖాళీ ఇల్లు కానీ జాగా కానీ కనిపిస్తే కబ్జా చేసేసుకుంటున్నారు అని చెప్పారు.’

వాళ్ళు అంతగా చెప్పారు కదా అని హర్షా రాగానే కూడా చెప్పలేదు తను అల్సిపోయి వున్నాడు రాగానే చెపితే కోపం వచ్చింది అనుకోవచ్చు. తను ఫ్రెష్ అప్ అయ్యి పాపతో ఆడుకుంటుంటే నేను కూడా వాళ్ళతోపాటు ఆడుతూ వూరి నుండి అత్తయ్య, మామయ్య ఫోన్ చేసారని చెప్పి వాళ్ళు అన్న మాటలు చెప్పాను, అంతే అప్పటి వరకు సంతోషంగా ఆడుకుంటున్న హర్షా గబుక్కున లేచి వీరావేశంతో, ’ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, అది నా పేరుమీద వున్న ఇల్లు, నా ఆస్థి, నా యిష్టం అమ్మితే అమ్ముతాను, లేదా అలాగే వదిలేస్తాను, లేదా దానం చేసుకుంటాను, గూండాలు ఆక్రమించుకుంటారా చేసుకోని ఐ డోంట్ కేర్. తెలిసిందా? నువ్వు మాత్రం మళ్ళీ ఈ విషయంలో కలగచేసుకుంటే వూరుకునేది లేదు.” అనేసి మేడ పైకి వెళ్ళి ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ కూర్చున్నాడు. నాకు తల తిరిగిపోయింది. నేను చేసిన తప్పేమిటి వాళ్ళ తల్లి తండ్రులు చెప్పిన విషయం తనకి చెప్పడమే నేను చేసిన తప్పా? లేదా తను నన్నసలు మన:స్ఫూర్తిగా జీవిత భాగస్వామిగా అంగీకరించనే లేదా?” అంది ఎంతో ఆవేదనగా.

“మనూ, ఫ్లీజ్…..” అని సుమ మనస్వినీ తలని తన భుజం మీద అనించుకుంది. తల నిమురుతూ కామ్ గా వుండిపోయింది.

తనేమని చెప్పగలదు. కుటుంబంలో అందరూ సంతోషంగా వుండాలని ఎన్నో సార్లు మనసు ఎదురు తిరుగుతున్నా, పిల్లల కోసం, అదీ కాకుండా వేరే భర్తలు, అంటే తాగి, కొట్టే వాళ్ళు, ఇంటికి రాకుండా గాంబ్లింగ్ కి, రేసులకి, వెళ్ళి డబ్బు తగలబెట్టే వారితో పోల్చుకుంటే తన భర్త చాలా మంచి వాడని, తనకి, పిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకున్నాడు కదా అని కంపేర్ చేసుకుని కాంప్రమైజ్ అయ్యి చాలా సంతోషంగా వున్న జంటల్లాగా కనిపిస్తారు కూడా. మనస్వినీవి చాలా స్వతంత్ర భావాలు కల అమ్మాయి, కానీ హర్ష ఎప్పుడూ తను ఏది చేస్తానన్నా అడ్డు చెప్పలేదు అందుకనీ ఇద్దరూ చాలా సంతోషంగా వున్నారనే అనుకుంటారు. మనూ కూడా హర్ష అంటే ఎంతో ఇష్టంతో వుంటుంది. కానీ అప్పుడప్పుడు మాత్రం తను ఎక్కువగా మాట్లాడడని, పెళ్ళయి ఎన్నేళ్ళవుతున్నా ఇద్దరి మధ్య చనువు, ప్రేమాప్యాయతలు ఎక్కువవుతున్నట్టుగా అన్పించటం లేదని, ఏదో మెకానికల్ గా బ్రతకడం ఇష్టం లేదని ఎపుడన్నా ఒకసారి అంటూ వుంటుంది సుమతో మనూ!

మనస్విని తల పైకి ఎత్తి, ” సుమ ఇలా ఎన్నాళ్ళు? మనం ఎంత చదువుకున్నా, వుద్యోగం చేస్తున్నా, ఏ విషయంలోనైనా సరే మనని ఒక్క నిముషంలో నువ్వు నాకన్నా ఎప్పుడైనా తక్కువే, అని గుర్తు చేస్తు వుంటారు తెల్సా. కానీ మనం మనుషులమని మనకి మనసుంటుందని దానికి బాధ వుంటుందని, మనం మనుషులం , మనకొక విలువ, మనకో వ్యక్తిత్వం వుంటాయని, అలా తీసి పడేస్తే మనసు ముక్కలైపోతుందని ఎందుకు తెలియదు వాళ్ళకి? పుట్టినప్పట్నుండి ఆడ పుట్టుక పుట్టావు కాబట్టి మా ఇంట్లో చాకిరీ చేయడం అయిపోయింది, నీ భర్త ఇంట్లో సంతోషాలు పంచు ఆయన నిన్ను నీ పిల్లలను కాపాడతాడు ఆయనకి మెచ్చినట్టు మసులుకో అని పంపిస్తారు ఇలాంటి కథలే చూస్తూ వస్తున్నాను. నా కథని కూడా ఇలాగే నడపడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ నేను అట్లా చేయలేను సుమ.”

“అంటే ఏం చేస్తావే! చూడు నువ్వు ఇప్పుడు ఆవేశంలో వున్నావు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోకు. ఇంటికెళ్ళు, హర్షాకి తను చేసిన తప్పు తెలిసి వస్తుంది. ఆ తర్వాత నువ్వింకేమి గొడవ చేయకు. నువ్వు చెప్పే ప్రతి మాటతో నేను ఏకీభవిస్తాను. ఎపుడో ఒక్కసారి జరిగే ఇలాంటి సంఘటనలను సీరియస్ గా తీసుకుని జీవితాలు నాశనం చేసుకోకూడదు బంగారం! ప్లీజ్ నేను చెప్పేది విను నువ్వు ఇప్పుడు ఏదైనా క్లిష్టమైన నిర్ణయం తీసుకుంటే ఎంత మంది బాధ పడ్తారో ఆలోచించు. మీ అమ్మా, నాన్న, వాళ్ళసలే మొగపిల్లలు తమని చూసుకోవడం లేదని కుమిలిపోతున్నారు. నువ్వు చూసుకున్నా మీ నాన్నకు తృప్తిగా వుండదు నాకు తెలుసు. వాళ్ళు పెద్దవాళ్ళై పోయారు అలాగే మీ అత్తా, మామగారు, అందరికంటే ముఖ్యం నీ కూతురు, దాని మనసు ఎంత బాధ పడ్తుందో ఆలోచించు, నువ్వు అన్నంత ఈజీ కాదు ఈ బంధాల నుండి భయటపడటం. నువ్వు మాత్రం వుండగలవా హర్షా లేకుండా చెప్పు, అతను రావడం కొంచెం ఆలస్యమైతేనే ఎంత కంగారు ………”

“పిచ్చి సుమ నేనేమి విడిపోతానని అనలేదే ఇప్పుడు. కానీ మన జీవితాల్లోని పురుషులకు సడన్ గా ఈగో ఎక్కువయి, ఇలాంటి జలక్ లు ఇవ్వకుండా వుండాలంటే మనం కూడా ఏదైనా చేయాలి కదా! అంతే, నేను ఏదైనా పూర్తిగా నిర్ణయించుకున్న తర్వాత నీకు ఫోన్ చేసి చెబ్తాను, నువ్వేం కంగారు పడకే పిచ్చి తల్లీ!” అని తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని,” పాపని స్కూల్ నుండి పిక్ అప్ చేసుకోవాలి కదా! వెళ్ళొస్తాను. నా గురించి నువ్వేం భయపడకు ఐ విల్ బి ఫైన్.” అని బయటకు నడిచింది.

కార్ కీస్ తో డోర్ తీసుకుని స్టీరింగ్ దగ్గర కూర్చొని కార్ స్టార్ట్ చేసింది. పక్క సీట్ లో ఆ రోజే తన చిన్నప్పటి ఫోటోలు అన్నీ పాడయిపోతున్నాయి అని అమ్మ అంటే అవి అన్నీ తీసుకొచ్చి వాటిని అయిదారు కాపీలు తీయించింది. అందరికీ ఏదైనా పండగకీ గిఫ్ట్ లా పంపించి వాళ్ళని ఆశ్చర్యపరచాలని అనుకుంది. పాపని పిక్ అప్ చేసుకుని తనకి స్నాక్ కొంటే కార్లో తినేసింది, ఇంటికి వెళ్ళే దారిలో వున్న పార్క్ కి వెళ్ళింది. అక్కడ పాప ఫ్రెండ్స్ అందరూ వచ్చి తనని చుట్టు ముట్టారు. పాప ఆడుకుంటుంటే ఫోటోలు చూస్తూ అలా జ్ఞాపకాల్లోకి జారుకుంది మనస్విని.

చిన్నప్పుడు పెరిగిన కాలనీలో ఇళ్ళు, ఆ యింట్లో ఎన్ని అందమైన భాల్యపు అనుభూతులో! ఆ యిల్లు తల్చుకుంటే కన్న తల్లి ఒడి ఆ ఒడిలోని భద్రత, అక్కడ వుంటే ఏ సమస్యలు, భయాలు, గొడవలు, ఎటువంటి వైషమ్యాలు లేకుండా ఎంతో ప్రశాంతతని కలిగించేది. చిన్నప్పుడు ఎనెన్ని ఆటలు ఆడేవాళ్ళు, తనకెప్పుడయినా మనసు బాగా లేకపోతే ఆ యిల్లు, ఆ యింట్లో గడిపిన ఏ చీకూ చింతాలేని బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటే చాలు మనసు అలా అలా దూది పింజలా తేలిపోతుంది…

                    *****                         *****                          *****

మనస్వినీ ఇద్దరు అన్నదమ్ముల తర్వాత పుట్టింది దాంతో ఎంతో అపురూపంగా చూసుకునేవారు. మనస్వినీ నాన్న గారు, రాఘవరావుగారు కష్టపడి పైకి వచ్చారు అందుకనీ తనలాగే ఎవ్వరూ కష్టపడకూడదని తన పరిస్థితి కొంచెం మెరుగు పడగానే ఆయన తన వూరి నుండి చదువుకోవడానికి వస్తే వారికి తన దగ్గర వుండడానికి వసతి కల్పించేవారు. ఆయన భార్య విమల కూడా భర్త మాటకు ఎదురు చెప్పే ఆవిడ కాదు. మనస్వినీ ఒకోసారి వాళ్ళ నాన్నగారి గురించి ఎంతో గర్వంగా స్కూల్లో కానీ తర్వాత కాలేజ్ లో కానీ చెబితే తన స్నేహితుల్లో కూడా కొంతమంది ఇంట్లో కూడా ఇలాగే వుండేది అని విన్నప్పుడు అప్పుడు అనిపించింది, ఆ రోజుల్లో ఒకరు బాగుంటే పది మందికీ సాయం చేయాలనుకునే కాలం అది అని.
మనస్విని పుట్టేప్పటికి ఒక హౌసింగ్ బోర్డ్ ఇల్లు కొనుక్కున్నారు. విశాలమైన పెరడు, ముందు స్థలం దాంతో ఆయన ఎన్నో చెట్లు నాటారు.

మనస్వినీ అందరినీ తన నవ్వులు, ఆటలు, పాటలతో ఎప్పటికీ మురిపిస్తూ వుండేది. రాఘవరావు గారి అన్నగారికి, చెల్లెళ్ళకు గానీ ఆడ పిల్లలు లేరు. అందుకే మనస్వినీ అందరికీ ముద్దులు మూటకట్టే బంగారు తల్లిలా పెరుగుతున్నది. తల్లి విమలకి కూడా కూతురితో పండగలు, పబ్బాలు అన్నీ సరదాగా అనిపించేవి. చిన్నప్పుడు పట్టులంగాలో బుట్టబొమ్మలా వున్న మనస్వినికి భోగిపళ్ళు పోసినా, బుగ్గన దిష్టి చుక్క పెట్టిన బుజ్జితల్లి భోగిపళ్ళు తీసుకుని తినడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ వున్న వారికి రెండు కళ్ళు చాలవేమో అనిపించింది. ఇద్దరు అన్నదమ్ముల మధ్యన కూర్చొన్న ఏడాది వయసున్న మనస్విని అందరి మనసు దోచుకున్నది అని అమ్మ తన చిన్నప్పటి కథలు చెబుతుంటే, “ఇంకా చెప్పమ్మా,” అని మరీ మరీ చెప్పించుకుని వింటుండేది.

మనస్విని అన్నదమ్ములతో పాటు చుట్టు పక్కల పిల్లలతో ఎప్పుడు మేడపైన కొబ్బరి మట్టల నుండి కొబ్బరాకులు తెంపుకుని వాటితో రకరకాల బొమ్మలు తయారు చేసుకుని బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవారు, అమ్మ ఇచ్చిన పప్పు బెల్లాలు, పల్లీలతో రక రకాల వంటకాలు చేసి పెళ్ళివారికి పెట్టేవారు. ఎప్పుడు చల్లగా చెట్లక్రింద ఆడుకునేవారు. ఒకోసారి పూల కొట్టు పెట్టుకుంటే, మరోసారి కూరల కొట్టు పెట్టుకునేవారు. సాయంత్రాలు కాగానే కాలనీలో వీళ్ళ ఇంటికి దగ్గరలో వుండే వారంతా కలిసి నాటకాలు వేసేవారు. ఈ నాటకాలు చూడడానికి పెద్దవాళ్ళని పిలిచేవారు. ఆడపిల్లలు అమ్మల చీరలు పట్టుకొచ్చి వారికొచ్చినట్టు ఫ్రాక్స్ మీదనుండే చీరలు చుట్టుకునేవారు. మొగపిల్లలు లుంగీలు కట్టుకునేవారు. పెద్దవాళ్ళకి వీళ్ళ వేషాలు చూస్తే చాలా నవ్వొచ్చేది కానీ నవ్వితే మళ్ళీ ఎక్కడ పిల్లలు వుడుక్కొని నాటకం వేయడం మానేసి వెళ్ళిపోతారేమోనని ఏమి అనేవారు కాదు. నాటకం మధ్యలో చీరలు వూడిపోవడం లేదా లుంగీలు పడిపోవడం జరిగినప్పుడు మాత్రం వారికి ఇక నవ్వు ఆగేది కాదు.

మనస్వినీకి ఐదేళ్ళు రాగానే ప్రతి సంక్రాంతికి బొమ్మల కొలువు పెట్టడం మొదలు పెట్టింది విమల , అలాగే ప్రతి ఏడాది కొన్ని కొత్త బొమ్మలు కొనిపెట్టడం చేసేది. ఇద్దరు అన్నదమ్ములతో కలిసి స్కూల్ కి వెళ్ళేది. శ్రీధర్, శ్రీనాధ్, స్కూల్లో చెల్లిని ఎంతో అపురూపంగా చుసుకునేవారు. అందులో శ్రీనాధ్ చెల్లెలి స్కూల్ బ్యాగ్ కూడా తనే పట్టుకెళ్ళేవాడు, చెల్లిని ఎవ్వరు ఏదన్నా అంటే అస్సలు వూరుకునేవాడు కాదు. తనకు కొంచెం నలత చేసినా ఇద్దరూ స్కూల్ కి వెళ్ళినా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి చెల్లికి ఎలా వుందో చుసి వెళ్ళేవారు.

మనస్వినీ పెద్దవుతుంటే ఎవ్వరు ఎంత గారాబం చేసినా కూడా తల్లి మాత్రం తనకు ఇంటి పనులు చేయడం, కుట్లు, అల్లికలు, వంటలు నేర్పించేది.

మనస్వినీకి అవన్నీ నేర్చుకోవడంలో ఏం అభ్యంతరం లేదు కానీ అన్నలిద్దరు బలాదుర్ గా బయట ఫ్రెండ్స్ తో తిరుగుతుంటే తనేమో దసరా పండగ అనీ పనిమనిషి రాకపోతే అమ్మ ఇల్లు కడుగుతుంటే తను మంచాల క్రిందనుండి నీళ్ళన్నీ గట్టిగా వూడ్చేసి ఆరడానికి గుడ్డతో తుడిచి ఫాన్ వేసింది. ఒకోసారి కోపం వచ్చి తల్లిని, తండ్రిని అడిగేది, ’వాళ్ళు ఇద్దరు ఎంత సేపయినా బయట తిరగొచ్చు నేను మాత్రం స్కూల్ కాగానే ఇంటి దగ్గర స్నేహితులతో ఆడుకుని ఇంట్లోకి వచ్చేయాలి, అమ్మకి సాయం చేయాలి కానీ వాళ్ళు ఇద్దరు ఎందుకు ఇంట్లో నాలా వుండరు, లేదా నేను కూడా వాళ్ళ లాగా బయటకు ఎందుకు వెళ్ళకూడదు?’ అని అనగానే, తల్లీ తండ్రి ఇద్దరూ ఒకటేసారి, ” వాళ్ళు మొగపిల్లలు, వాళ్ళు ఎలా వున్నా ఎవ్వరు ఏమనరు? కానీ నువ్వు ఆడపిల్లవి వేరే ఇంటికి వెళ్ళేదానివి నువ్వు కుదురుగా వుండడం నేర్చుకోవాలి తెలిసిందా? నువ్వు ఇంకా చిన్నపిల్లవు కావు.” తల్లి అక్కడితో ఆగినా తండ్రి ఇంకా ఆవేశంగా అరుస్తూనే వుండేవాడు, ” వాళ్ళతో నిన్ను పోల్చుకోకు. వాళ్ళు బయట తిరిగినా, వాళ్ళ చదువుకుని వుద్యోగాలు చేయాలి చేస్తారు. కుటుంబ పరువు, ప్రతిష్ట ఆడపిల్ల చేతిలో వుంటుంది, వంశాన్ని నిలబెట్టి, తల్లి తండ్రులను వృద్ధాప్యంలో చూసుకుంటారు మొగపిల్లలు. ఆడపిల్లలు ఎంత చదివించినా వారికి పెళ్ళిళ్ళు చేసి వేరే ఇంటికి పంపించేయాలి కానీ మొగపిల్లలు అలా కాదు. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పిచ్చి వితండవాదం పెట్టుకోకు తెలిసిందా?” అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళుతున్న నాన్నని చూసి నోరెళ్ళబెట్టింది.
ఒకప్పుడు ఆడపిల్ల ఇంటి మహాలక్ష్మి అనీ, ఆడపిల్లే ఇంటికి అందాన్ని, ఆనందాన్ని తీసుకువస్తుంది అని బొమ్మల కొలువు పెట్టి పేరంటాలను పిలిచినప్పుడు ఆనంద భాష్పాలు రాల్చిన తండ్రేనా ఈయన అని ఆలోచిస్తూ కూలబడిపోయింది మనస్వినీ. ఇంటి ముందర రక రకాల పూల తీగలు తీసుకొచ్చి తను పాతిపెట్టి నీళ్ళు పోస్తుంటే తల్లి ఎంతో ఆనందంగా ఆడపిల్లలతోనే ఇంట్లో సంతోషాలు, ఆనందాలు, ఇంటికి అందం తీసుకొచ్చేది చిన్నారి తల్లులే అని తన కూతురికి దిష్టి తగుల్తుందేమో అని దిష్టి తీస్తుంటే తల్లి ప్రేమకి కదిలిపోయింది మనస్వినీ.

స్కూల్ వర్క్ అయిపోయింతర్వాత ఇల్లంతా సర్ధడం, కొత్త కొత్త పేయింటింగ్స్ కానీ గవ్వలతో హ్యంగింగ్స్ చేసి, వైర్ తో ద్రాక్షాగుత్తులు చేసి డెకొరేట్ చేయడం చేస్తుండేది.

పిల్లలందరూ గ్రాడ్యుయేషన్ కి వచ్చారు. శ్రీధర్ సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, శ్రీనాధ్ బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు, మనస్వినీ బి.ఎస్.సి ఫస్ట్ ఇయర్ లో వుంది.

మనస్వినికి డిగ్రీ కాగానే పెళ్ళి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. మనస్వినీ ఏమో తనకింకా చదువుకోవాలని వుందనీ ముందు తనకంటే పెద్దయిన అన్నయ్యలకు పెళ్ళిళ్ళు చేయమని అప్పటికి తన చదువయిపోతుందని అప్పుడప్పుడు తల్లితో అంటుంది. “మీ నాన్న వింటే చంపేస్తారు. నా ముందర అంటే అన్నావు కానీ ఆయన ముందర అనకు. ముందు ఆడపిల్ల పెళ్ళయ్యాకే మొగపిల్లలకి చేస్తారు ఎవరయినా,” అంటూ కొట్టిపారేసేది తల్లి విమల.

మనస్విని డిగ్రీ అవ్వగానే మంచి సంబంధం అని ఒక డాక్టర్ కి ఇచ్చి పెళ్ళి చేసేసారు. రాఘవరావు గారు రిటైర్ అయ్యారు. మొగపిల్లలు చదువులయ్యాయి, వుద్యోగాలు వచ్చాయి.

శ్రీధర్ పెళ్ళయ్యింది, కొన్నాళ్ళు హైద్రాబాద్ లోనే పని చేసాడు ఆ తర్వాత అమెరికాలో రెండేళ్ళ ప్రాజెక్ట్ వర్క్ కి వెళ్ళాడు, అక్కడే వాళ్ళకి ఒక బాబు పుట్టాడు, ఇద్దరూ అక్కడే జాబ్స్ చూసుకున్నారు గ్రీన్ కార్డ్ కి అప్లయ్ చేసాక. తమ్ముడి పెళ్ళికు వచ్చి వెళ్ళారు, వెళ్ళేప్పుడు తల్లిని, తండ్రిని వాళ్ళతో తీసుకెళ్ళారు. వాళ్ళకి మరో పాప పుట్టింది, కోడలి డెలివరీ అయ్యి, మెటర్నిటీ లీవ్ అయ్యాక జాబ్ లో జాయిన్ అయ్యిందని పాపని చూసుకోవడానికి కొన్నాళ్ళు వుండి పాపని బేబి కేర్ సెంటర్ లో చేర్పించాక ఇండియాకి తిరిగివచ్చారు.

శ్రీధర్ అమెరికా వెళ్ళినప్పట్నుండే రాఘవరావుగారు ఢల్ అయ్యారు. శ్రీనాధ్ కూడా కొన్నాళ్ళు అక్కడే వర్క్ చేసినా భార్య పి.హెచ్.డి డిల్లి యునివర్సిటీలో చేస్తుందని అక్కడికి షిఫ్ట్ అయ్యారు. శ్రీనాధ్ కూడా అక్కడే వేరే బ్యాంక్ లో జాబ్ చూసుకున్నాడు.

ఆ యింట్లో మిగిలింది రాఘవరావు గారు, విమల. పిల్లలతో, చదువుకోవడానికి వుండే వాళ్ళతో కళ కళలాడిన ఇల్లు ఇప్పుడు బోసిపోతున్నట్టుగా వుంది. అదీకాక ఇద్దరు కొడుకుల్లో ఒక్క కొడుకైనా తమ దగ్గర వుండి తమని చూసుకుంటారనుకున్నారు.

అంతా త్వర త్వరగా అయిపోయినట్టనిపించింది. వంటిరిగా ఇంట్లో వుండలేకపోయారు. ఇల్లు అమ్మాలని నిశ్చయించుకున్నారు.

విమలగారికి ఎన్నో మంచి జ్ఞాపకాలను మిగిల్చిన ఇల్లును వదిలి పెట్టి వెళ్ళాలని లేదు.

ఎంతో మందితో చెప్పించి చూసింది. కొడుకులతో మాట్లాడింది. ఒక్కరు కూడా ఆ ఇంటిపైన ఆసక్తి చూపించలేదు. బావగారితో, ఆడపడుచుతో మాట్లాడించింది. ఆయన ఎవ్వరు చెప్పినా వినేట్టు లేదు.

కొడుకులతో మాట్లాడిన తర్వాత విమల గారికి ఒక సంఘటన గుర్తొచ్చింది, మనస్విని తొమ్మిదేళ్ళ వయసున్నపుడు సిటీలో చాలా గొడవలయ్యి తగ్గాయి. ఆ రోజు రాఘవరావు గారు పూజ చేసుకుని లేస్తూ,”ఇక్కడ ఎప్పుడంటే అప్పుడు గొడవలెక్కువవుతున్నాయి. కొంతమంది ఇళ్ళు అమ్మేసి సిటీలోకి వెళ్ళిపోతున్నారు. మనం కూడా అదే పని చేయాల్సివస్తుందేమో,” అని అనడం అప్పుడే స్నానం చేసి లోపలికి వచ్చిన మనస్విని ఆ మాటలు విన్నది. స్కూల్ కి రెడీ అవ్వకుండా,ఏడవడం మొదలుపెట్టింది. తల్లి చూసి, “ఏమ్మా! ఏమయింది? ఎందుకు ఏడుస్తున్నావు?”
“నాన్న ఇల్లమ్మేస్తానంటున్నారు. నేను ఈ ఇల్లు వదిలి పెట్టి వెళ్ళను. ఈ ఇల్లు అమ్మొద్దని నాన్నకి చెప్పమ్మా? మనం ఇల్లమ్మేస్తే ఈ చెట్లన్నీ ఏమవుతాయి? జామ, దానిమ్మ, కొబ్బరి, మామిడి, నిమ్మ చెట్లు, వీటన్నిటికి మనం అలవాటయ్యాము. కొత్తగా వచ్చేవారు చెట్లు వుంచుతారో, కొట్టేస్తారేమో అమ్మా? అమ్మో పాపం ఇన్నేళ్ళు మనకి పళ్ళు, కూరలు, పూలు ఇచ్చిన ఈ చెట్లు, తీగలు, పూల మొక్కలు అన్యాయంగా చచ్చి పోతాయమ్మా. ప్లీజ్ అమ్మా, నాన్నకి చెప్పమ్మా! ఇల్లమ్మోద్దని!” అని గోలపెడుతూ ఏడ్వడం మొదలు పెట్టింది.

ఇద్దరు అన్నలు పరిగెత్తుకొచ్చారు. విషయం తెలుసుకున్నారు. తండ్రి మీద విరుచుకు పడ్డారు.
” ఏంటి నాన్న ఆలోచించకుండా ఏదో అనేస్తారు. చిన్నపిల్ల చూడండి ఎలా భయపడిపోయిందో! ఈ ఇల్లు అమ్మనని దానికి నమ్మకం కలిగేలా చెప్పండి.” అని అందరూ కల్సి అంటే అపుడు తండ్రి మనస్వినినీ దగ్గరకు తీసుకుని,” నేను ఏదో వూరికే అన్నానమ్మా! కొంతమంది అమ్మేసారు కదా! మరీ గొడవలు ఎక్కువయితే అన్నాను…”

“ఎక్కువయినా కానీ మనం మన ఇల్లు వదిలి వెళ్ళకూడదు. వాళ్ళు పిరికి వాళ్ళు, మనం కాదు కదా నాన్న! ప్లీజ్ నాన్న ఈ ఇల్లు కాకుండా నేను వేరే ఇంట్లో వుండలేను.” అని తండ్రిని హత్తుకుని ఏడ్చేసింది.

“లేదమ్మా! అస్సలు అమ్మను సరేనా!” అని బుజ్జగించి ఏడుపు ఆపించారు అపుడు.

ఇప్పుడు మనుకి తెలిస్తే ఎంత బాధ పడ్తుందేమో! ఆడపిల్లకు పుట్టింటి పైన, తను పుట్టి పెరిగిన ఇంటిపైన వున్న ప్రేమ ఈ మొగపిల్లలకు ఎలా వుంటుంది? అనుకుని నిట్టూర్చింది విమలగారు.

మొత్తానికి ఇల్లు అమ్మకానికి పెట్టేసారు రాఘవరావు గారు. ఇల్లు అమ్మేసి ఏం చేస్తారు అంటే డిల్లీలో వున్న కొడుకు దగ్గరే చిన్న అపార్ట్మ్ంట్ తీసుకుని వుందాము అంటారు. శ్రీనాధ్ వుండేది పెద్ద అపార్ట్మ్ంటే అయినా వచ్చి వాళ్ళ దగ్గర వుండమని అనలేదు. కొన్ని రోజులు వుండడానికి వెళితే ఇద్దరూ ఇంట్లో వుండరు, వుద్యోగాలకు వెళ్ళిపోతారు. వాళ్ళకి విమలగారే వండిపెడతారు.

వాళ్ళ దగ్గర వెళ్ళి వున్నా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకుంటారో లేదో తెలియదు అందుకని ఇంత మంచి ఇల్లు అమ్ముకుని చిన్న అపార్ట్మ్ంట్ కెళితే అక్కడ వుండలేకపోతే ఎలాగ అని ఆమె ఆలోచన.

ఇల్లు అమ్మకానికి పెట్టగానే కొంటామని వచ్చేవాళ్ళు మొదలయ్యారు. కొంతమంది రాఘవరావుగారికి నచ్చలేదు. మరీ తక్కువ ధరకి అమ్మమ్మన్నారు. ఆయనకి అది నచ్చలేదు.

కొన్నాళ్ళు ఆగారు. ఒక రోజు ఇల్లు కొంటానని ఒక పెద్ద ప్యామిలీ వాళ్ళు వచ్చి కొనుక్కుని ఆ యింటిని మరింత పెద్దదిగా చేసుకుంటామన్నారు. దాని కోసం రాఘవరావు గారు ఎంతో ప్రేమగా పెట్టుకున్న చెట్లన్నీ కొట్టేయాల్సి వస్తుందని ముందే చెప్పారు. విమల గారికి ఎక్కడో చిన్న ఆశ భర్త తను ఇష్టపడి పెట్టుకున్న చెట్లని బాగా చూసుకునే వారికే అమ్ముతారు, వీళ్ళని వెళ్ళిపొమ్మంటారని అనుకున్నారు. కానీ ఆమె ఆలోచనలు తల్లకిందులు చేస్తూ రాఘవరావు గారు వారితో ఇల్లు అమ్మడానికి ఒప్పందం చేసుకున్నారు. ఆమెకేం చేయాలో పాలుపోలేదు. తామిద్దరూ ఉన్నన్నాళ్ళు ఈ యింట్లో వుండి ఆ తర్వాత పిల్లలకి ఇచ్చేస్తే ఎవరో ఒకరు వచ్చి వుంటారేమో అని ఆశ.

ఇంటి పెపర్స్ వారికివ్వడం, రిజిస్ట్రేషన్ చేయించడం వాళ్ళు ఒప్పుకున్న డబ్బు ఇవ్వడానికి ఒక రోజు నిర్ణయించుకున్నారు. విమల గారు ఇవన్నీ జరిగేపుడు భర్తతో పాటు కొడుకులెవరైనా వుంటే బాగుండు అని ఇద్దరికీ ఫోన్ చేసి చూసింది. ఎవ్వరూ ఆసక్తి చూపించలేదు సరి కదా డబ్బు చేతికొచ్చిన తర్వాత చెబితే వచ్చి తన వాటా తీసుకుని వెళ్తానని ప్రస్తుతం తనకి డబ్బు చాలా అవసరం వుంది అని అన్నాడు డిల్లీలో వుంటున్న శ్రీనాధ్! విమల గారికి చాలా కోపం వచ్చింది. పిల్లలు ఎదిగి చేతికి వచ్చినా వారిని ఎప్పుడూ ఇది కావాలి అని అడగలేదు, తామే మనవలకోసం అందరికీ ఫిక్స్డ్ డిపాజిట్లు వేసారు. అలాంటిది ఆ రోజు కొడుకు అలా అనేవరకు అస్సలు వూరుకోలేకపోయింది. “ఓరేయ్, చిన్నప్పట్నుండి పుట్టి పెరిగిన ఇల్లు అమ్ముడుపోయింది పెద్దాయన ప్రక్కన ఎవ్వరూ లేకపోతే మోసపోతారేమో, తన స్వార్జితంతో కొనుక్కున్న ఇల్లు ఎంతో మందికి ఆసరా అయ్యింది అలాంటి ఇల్లు వదలాలంటే మా మనసులు తట్టుకుంటాయో లేదో కొంచెం తోడు రమ్మంటే, అమ్మడం అయ్యాక డబ్బు వచ్చాక చెపితే వచ్చి నీ వాటా తీసుకెళ్తానని అంటావా? అంత పొగరుగా వుందిరా నీకు, బంధాలు, అనుబంధాలు అన్నీ వదిలేసుకున్నార్రా మీరు. అందరూ అంటుంటే నేను నమ్మలేదు, పిల్లలకు రెక్కలొచ్చాక ఎగిరిపోతారు వారికి తల్లితండ్రులు కనపడరు అని అంటే మా పిల్లలు అలా కాదు. మంచి వాళ్లు, మా ఇద్దరు కొడుకులు ముత్యాలు అని గర్వంగా చెప్పుకున్నాంరా…. ,”అని ఇక మాట్లాడలేక ఫోన్ పెట్టేసారు విమలగారు.

శ్రీనాధ్ అలా అడిగాడని తల్లి తండ్రికి అస్సలు తెలియదు.

విమల గారు ఇక ఏ దారి కనపడక మనస్వినిని, అల్లుడు డా.హర్షా కి ఇల్లు అమ్మకం విషయం చెప్పి ఇద్దరినీ సాయం చేయడానికి రమ్మని అడిగారు.

మనస్వినీ ముందు షాక్ అయ్యింది కానీ తల్లితండ్రులు ఒంటరిగా అంత పెద్ద నిర్ణయం తీసుకుని అన్ని ఏళ్ళు వున్న ఇల్లు వదిలేసి వెళ్తుంటే తోడుగా వుండాలని, తను పుట్టి పెరిగిన యింట్లో కొన్ని రోజులుండి గుర్తుగా చాలా ఫోటోలు తీసుకుని రావాలనే ఆశతో కూడా వెళ్ళారు. హర్షా అక్కడి నుండే హాస్పిటల్ కి వెళ్తానని, ఇల్లు కొనుక్కున్న వాళ్ళు వచ్చినప్పుడు మామగారి దగ్గరే వుండి ఎటువంటి గొడవ రాకుండా చూసుకుంటానన్నాడు. హర్ష హాస్పిటల్ కి ఆ రోజు సెలవు పెట్టాడు ఆ రోజే ఇల్లు గురించి అన్నీ మాట్లాడుకుని డబ్బు ఇవ్వడానికి వస్తున్నారు, మామగారికి సాయంగా వుండాలని వున్నారు. రాఘవరావు గారికి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోనైతే తీసుకున్నారు కానీ ఎక్కడైనా మోసం జరిగితే ఎలా అని ఆయన మనసులో కూడా భయంగానే వుంది. అల్లుడిని చూడగానే కొంచెం ధైర్యంగా వున్నా కొడుకులెవరూ రానందుకు బాధగా కూడా వుంది.

బ్రేక్ ఫాస్ట్ అయ్యాక మామ అల్లుడు లివింగ్ రూమ్ లో కూర్చొని పేపర్లో విషయాలు మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా తొమ్మిది గంటలకు దాదాపు నలుగురైదుగురు కలిసి వచ్చారు ఇల్లు కొనుక్కున్న వాళ్ళు.

కాఫీ, టీలు, తీసుకెళ్ళింది మనస్విని. అవి అయ్యాక వాళ్ళు ఇల్లు గురించి అన్నీ డిటైల్స్ మళ్ళీ అడిగారు రాఘవరావుగారిని. ఇల్లు కొంటున్న దామోదర్ గారు, దాదాపు 60 ఏళ్ళ వయసు వుంటుంది. వాళ్ళది ఉమ్మడి కుటుంబం అని ఈ యిల్లు కొని దీని పైన ఇల్లు కట్టి, ఇంటి వెనక, ముందు కూడా చిన్న చిన్న రూమ్స్ వేయాలని వుందని, అందరికీ అనువుగా వుండేట్టు చేయించడానికి ఇంజనీర్ ని తీసుకొచ్చి చూపిస్తానని అన్నారు.

హర్షకి ఫోన్ కాల్ వస్తే బయటికి వెళ్ళాడు. అప్పుడు దామోదర్ గారు, రాఘవరావు గారితో, “మీరు ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తారు. మాకు ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా వర్క్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాము. మీరు ఏమనుకోనంటే ఒక మాట చెబుతాను వింటారా?” అని అడిగారు. మనస్విని లివింగ్ రూమ్ కి దగ్గరగానే తిరుగుతుంది ఎందుకంటే హర్ష అర్జెంట్ కాల్ అటెండ్ అవుతున్నాడని.

రాఘవరావు గారు, ” భలే వారే చెప్పండి, ఇంత దూరం వచ్చాక ఇంకా మొహమాటం ఎందుకండీ?” అన్నారు.

” ఏమీ లేదు మీరు కొంచెం సహకరిస్తే మా పని అయిపోతుంది, ఎందుకంటే మేము వెంటనే ఇంటి పై వర్క్ మొదలు పెట్టాలంటే ప్లాన్స్ అవి చేయించుకోవాలి, వర్క్ కి కూడా చాలా డబ్బు అవుతుంది. అందుకని….” అని నీళ్ళు నమలసాగారు.

“చెప్పండి ఎందుకండీ భయపడతారు.” అన్నారు రాఘవరావు గారు.

” అంటే మీకు ఇప్పుడు ఇంటికి సగం డబ్బులిస్తాను, మిగతా డబ్బు కొన్నాళ్ళయ్యాక ఇస్తాను మీరు ఏమి అనుకోకుంటే, ఇపుడు అగ్రిమెంట్లో మొత్తం డబ్బు ముట్టినట్టుగా రాసుకుందాం, కానీ మీకు మాటిస్తాను నాకు ఒకరి దగ్గరినుండి డబ్బు రావాలి అది రాగానే మీకిచ్చేస్తాను, అలా అని మీ తృప్తి కోసం ఒక నోట్ కేవలం మీ కోసం రాసి ఇస్తాను కూడా……”

రాఘవరావుగారు బిత్తరపోయారు, ఆయన ఇంకా షాక్ నుండి తేరుకోలేదు. మనస్వినీ ఇంక ఆగలేకపోయింది. “ఏం మాట్లాడుతున్నారండి. ఆయన ఒక్కరే వున్నారని వెనక సపోర్డ్ లేదని అనుకోకండి, ముందు ఒప్పందం ఎలా జరిగిందో అలాగే డబ్బు ముట్ట చెప్పాలి, లేకపోతే మీ డీల్ మాకు ఇష్టం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు,” అని కోపంగా చెప్పింది.
“ఈ అమ్మాయి మీ ఒక్కగానొక్క కూతురు కదా! పెళ్ళయిపోయింది కదా, తనకు ఈ యింట్లో హక్కునట్టు మాట్లాడుతుందేమిటి?” అని అడిగారు.

రాఘవగారు, దామోదర్ గారు డబ్బు గురించి అడిగింది మర్చిపోయి, కూతురు బయటికి వచ్చి వాళ్ళతో అలా మాట్లాడటం బాగా కోపం తెప్పించ్చింది.

హర్ష వచ్చాడు, అత్తగారు విషయం చెబితే తెలుసుకుని లివింగ్ రూమ్ లోకి వచ్చాడు. అప్పటికే రాఘవరావుగారు మనస్వినీ మీద విరుచుకుపడ్డారు, “నువ్వెందుకు బయటకొచ్చావు? నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా!”
హర్ష కల్పించుకుని, “అది కాదండి మామయ్య, వాళ్ళేమో డబ్బు సగం ఇప్పుడు సగం తర్వాత ఇస్తామనడం తప్పు కదా…”

” వాళ్ళు అన్నంత మాత్రానా నేను ఒప్పుకున్నానా? అప్పుడే తను వచ్చేయాలా నా పరువు తీయడానికి. అయినా తనకి ఈ యింట్లో హక్కుందా? తన యిల్లుకే అన్యాయం జరిగిపోతున్నట్టు ఇంటికి వచ్చిన మర్యాదస్థులతో ఇలాగే మాట్లాడుతుందా? తీసిన పరువు చాలు నువ్వు లోపలికి వెళ్ళు. ఆడపిల్లలు ఎక్కడ వుండాలో అక్కడే వుండాలి. ఇది నా యిల్లు నా యిష్టం వచ్చినట్టు చేసుకుంటాను. నాకు మీ సలహాలు అవసరం లేదు.” అని హుంకరించారు మనస్విని మనసుని ముక్కలు ముక్కలు చేస్తూ. మనస్వినిని లోపలికి వెళ్ళమని చెప్పి, అక్కడున్న వాళ్ళకి తనని పరిచయం చేసుకున్నాడు.

“మామయ్య మీరు కూర్చోండి. ఇందాక మీరు చెప్పినట్టు మాత్రం ఒప్పుకోము మేము. మేమెవరం అడగడానికి అని మీరు అడగొచ్చు. ఆయన కూతురు, అల్లుడికి ఈ ఇంట్లో హక్కు వున్నా లేకున్నా ఆయన మంచి కోరుకునే మనుషులుగా ఆయన వెనక మేము వుంటాము తప్పకుండా! అలాగని మేమేమి మీరన్నట్టు ఈ యింటి మీద ఆశతో రాలేదు. నా భార్య ఇక్కడ పుట్టి, పెరిగిన అనుబంధంతో వచ్చాము. మాకు చాలా ప్రాపర్టీస్ వున్నాయండి. ఈ చిన్న యింటి కోసం మేము ఆశ పడటం లేదు.” అని కొంచెం గట్టిగానే మాట్లాడు హర్ష.

“ఆ మేము అంత పెద్దాయనని మోసం చేస్తామా? ఏదో మాట వరసకి అడిగాము. కొన్ని రోజుల్లో డబ్బు వస్తుంది ఇస్తాను అన్నాను కానీ మీకు ఇష్టం లేకుంటే మొత్తం ఇప్పుడే ఇచ్చేస్తామండీ. ఇదిగో మొత్తం తీసుకొచ్చాము.” అని డబ్బు తీసి చూపించారు.

లోపల మనస్వినీ పరిస్థితి భయంకరంగా వుంది. ఈ యింటితో నాకేం సంబంధం లేదా? ఈ యింట్లో సంతోషాలు పంచుతూ తిరిగినప్పుడు, మా యింటి మహాలక్ష్మి అంటూ మురిసి పోయిన రోజులు, ఆడపిల్ల అని కాదు కానీ, ఆ యింటికి ఎంత ప్రేమగా అన్ని చేస్తూ వుండేది. చెట్లల్లో పని చేసినా, ఆకులన్నీ వూడ్చి చెట్లకి నీళ్ళు పోసి పూల మొక్కలు తీసుకొచ్చి పెట్టినా, ఇంట్లో డెకొరేషన్ చేసినా అన్నీ ఎంతో ఇష్టంతో చేసేది. ఎన్నడూ ఒక్క పని ముట్టుకోని, ఇంట్లో ఇష్టం వచ్చినట్టు వున్న అన్నదమ్ములు, ఇప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోకున్నా వాళ్ళకి అన్నీ హక్కులుంటాయి. రెండ్రోజులుండమని తల్లి బ్రతిమిలాడితే వుండి వెళ్ళిపోయారు.

 

        ****                                   *******                                               **** 

“అమ్మ ఆకలేస్తుందమ్మా! ఇంటికెళ్దాం పదమ్మా,” అన్న హేమ మాటలతో ఈ లోకంలోకి వచ్చి పడింది.
మనస్విని చుట్టూ చూసింది. చీకటి పడిపోయింది. గబ గబా ఫోటోలన్ని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసి హేమ చెయ్యి పట్టుకుని పార్క్ బయటికి వచ్చి ఇంటికి వెళ్ళారు కార్లో.

హేమకి అన్నం పెట్టేసి పడుకోబెడ్తుంటే నాన్న కథ చెప్పాలని గొడవ చేస్తే సరే అని వచ్చాడు హర్ష. వారిద్ధరిని హేమ రూమ్ లో వదిలి బయటికి వచ్చింది మనస్విని.

తను కూడా ఫ్రెష్ అప్ అయివచ్చింది. నిద్ర రావటం లేదని కాసేపు టీ.వి పెట్టుకుంది. ఏమీ చూడాలనిపించలేదు. బాల్కనీలోకి వెళ్ళి కూర్చుంది. అలాగే అక్కడే నిద్రపోయింది.

పొద్దునే పిచుకల కిల కిలరవాలతో మెలుకువ వచ్చింది. ఎదురుగా ఒక చెట్టుమీద ఒక పిట్ట ముక్కుతో గడ్డి పరకలు తెచ్చి పెట్టి మళ్ళీ ఎగిరిపోయి చిన్న చిన్న కర్ర ముక్కలు ఒకోసారి ఒకొక్కటీ పట్టుకొచ్చి చిన్న గూడు తయారు చేసుకుంటుంది. దానికి తోడు ఇంకో పిట్ట కూడా సాయం చేస్తుంది. చల్లని గాలి వీస్తుంది. మనసు ఎందుకో తేలికగా అయ్యింది మనస్వినికి. హ్యంగింగ్ చెయిర్ లోనుండి లేచి చుట్టూ వాతావరణం చూసింది. సూర్యుడు అపుడే ఉదయించడంతో ఆకాశం అంతా వింత వెలుగుతో నిండిపోయివుంది. సూర్య కిరణాలు, చల్లని గాలి కలిసి మనస్వినిలో ఏదో తెలియని కొత్త ధైర్యం, ఉత్తేజం, ఒక కొత్త గమ్యం అది చేరుకోవటానికి మనసు తహ తహలాడ్తుంది.

మనస్విని మనసు సంతోషంతో నిండిపోయింది. ప్రపంచంలో ప్రాణులన్నీ తాము వుండడానికి తమకు తాముగా నివాసాలు ఏర్పరుచుకుంటాయి. అందులో ఆడ, మగ తేడాలు లేవు, కొన్ని కలిసి కట్టుకుంటాయి ఏ ఈగోలు లేకుండా, కొన్ని ఒంటరిగానే కట్టుకుంటాయి.

స్త్రీ పురుషులిద్దరూ కలిసి బ్రతకాలంటే అందులో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కారు. తన ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చినట్టు లేచి గబ గబా తయారయి బయటికి వెళ్ళిపోయింది. హర్ష, హేమ ఇంకా లేవలేదు.

రియల్ ఎస్టేట్లో పని చేస్తున్న తన ఫ్రెండ్ కవితకి ఫోన్ చేసి వెళ్ళింది. అంత పొద్దునే వచ్చిన ఫ్రెండ్ ని చూసి ఆశ్చర్యపోయింది. మనస్విని అక్కడ వున్న ఇళ్ళ ఫోటోలు చూస్తూ కూర్చుంది. మనసు ఎంతో ఆనందంగా వుంది, రెక్కలొచ్చి ఎగురుతున్నట్టుగా వుంది.

ఇన్ని రోజులకి తనకంటూ ఒక ’గూడు,’ కట్టుకోవాలనే ఆలోచన వచ్చినందుకు తనకే ఆశ్చర్యంగా వుంది.
తనకి ఎలాంటి ఇల్లు,లేదా అపార్ట్మెంట్ రెండు చాయిస్ లు పెట్టుకుని ఏది నచ్చితే, ఏది వుండడానికి కంఫర్టబుల్ గా వుంటే అది తీసుకుంటానని చెప్పింది కవితకి.

కవిత ఇళ్ళు చూపించడానికి ఎప్పుడు రెడీగా వున్నాయని చెబితే అప్పుడు వస్తానని, అప్పటివరకి డబ్బు అరేంజ్ చేస్తానని చెప్పి బ్యాంక్ కి వెళ్ళింది లోన్ గురించి కనుక్కోవడానికి. తన అకౌంట్లో కొంత సేవింగ్స్ కూడా వుందికొన్ని రోజులు మొత్తం ఈ పనికే కేటాయించింది.

హర్షకి ఏం అర్ధం కావటం లేదు. అడిగితే తర్వాత చెబుతానంటుంది. నెల రోజులయ్యాక, తల్లి తండ్రిని, అత్త, మామగార్లను, పిలిచి ఇంట్లోనే తనే వంట చేసి అన్నీ స్పెషల్స్ చేసి బోజనాలు పెట్టింది. హేమ ఆనందంగా అందరికి తన ఆట పాటలు చుపిస్తూ తిరుగుతుంది.

కాసేపయ్యాక రెండు కార్లల్లో బయటికి తీసుకెళ్ళింది. హర్షాతో రాత్రే మాట్లాడి తను ఇల్లు కొనుక్కున్న విషయం చెప్పింది. నిర్ఘాంతపోయాడు హర్షా.

“అంటే నాకు చెప్పకుండా ఇన్ని రోజులు నువ్వు చేస్తున్న పని ఇదేనా? ఇప్పుడేం చేస్తావు? నువ్వు అక్కడా, నేనిక్కడ వుండాలా, ఇన్ డైరెక్ట్ గా నన్ను డైవోర్స్ అడుగుతున్నావా? దానికి నేను చచ్చినా ఒప్పుకోను. నేను నీకు ఏం తక్కువ చేసానని, ఏ కారణం చెప్పి విడిపోవాలనుకుంటున్నావు?” అని కోపంతో వూగిపోయాడు హర్ష.

” హర్ష కామ్ డౌన్! చిన్నప్పట్నుండి పెళ్ళయ్యేదాక నాన్న ఇల్లు, ఆ తర్వాత అత్తిల్లు లేదా భర్త ఎక్కడ వుంటే అక్కడ వుండాలి భార్యలు. ఎప్పుడైనా ఏదైనా జరిగినా, అసలు ఏదో జరగాలని కాదు, మాకంటూ ఒక ఇల్లు వుంటే నాకు మనసు బాగా లేనపుడు, నన్ను ఎవరయినా ఒక ఉనికి లేని మనిషిగా చూసినపుడు, మనసు దెబ్బ తిన్నపుడు నాకూ ఒక ఇల్లుంది, నేను సంపాదించుకుంది, నాకూ ఆత్మాభిమానం వున్న మనిషిలా బ్రతికే హక్కు వుంది, ఈ ఇల్లు నాకు ఆ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అందుకని కొన్నాను. నిన్ను వదిలేయడం లేదు, నీ మీద నాకు కోపం లేదు. మీలో ఎంత మార్పు వచ్చినా మాకు సాయం చేసినా ఒకోసారి మీకు తెలియకుండానే, ’నాకంటే నువ్వు ఎక్కువ కాదు,’ అనే ఫీలింగ్ మీకు తెలియకుండానే వచ్చేస్తుంది. నీకు నాతో కలిసే వుండాలనే వుందని నాకు తెల్సు కాబట్టి ఐ వాంట్ టు సజెస్ట్ మ్యారేజ్ కౌన్సిలింగ్ సో దట్ వియ్ కాన్ బి ఈక్వల్ పార్ట్ నర్స్ ఇన్ దిస్ రిలేషన్ షిప్.” అని చెప్పి హర్ష ఏదో మాట్లాడబోతుంటే, “ప్లీజ్ హర్షా థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు నాకు ఇంకేం మాట్లాడాలని లేదు, ఏదైనా వుంటే తర్వాత మాట్లాడుకుందాం,” అని చెప్పి అక్కడినుండి లేచి వెళ్ళిపోయింది మనస్విని.

కార్లు ఒక కొత్త ఇల్లు ముందర ఆగాయి. అందరూ హర్ష మరో కొత్త ఇల్లు కొన్నాడని సంతోషపడుతున్న సమయంలో, “ఎలా వుంది ఇల్లు? బావుందా?’ అని అడిగింది.

“చాలా బావుంది. మాకందరికీ సర్ప్రైజ్ ఇచ్చారన్నమాట. కంగ్రాట్స్ హర్షా!” అన్నారు మనస్విని తండ్రి. అపుడు మనస్విని వెంటనే, “నా ఇల్లు, ఎందుకో నాకంటూ ఒక యిల్లు వుండాలనిపించింది. అందుకే బ్యాంక్ లో లోన్ కి అప్లయ్ చేసాను అప్రూవ్ అయ్యింది, నాకు నచ్చిన ఇల్లు దొరికింది, నిన్ననే రిజిస్ట్రేషన్ చేయించేసాను.” అని ఎంతో నిదానంగా, తడుముకోకుండా చెప్పింది.

అందరూ నోళ్ళు వెళ్ళబెట్టారు. అందరికంటే ముందు తేరుకుంది రాఘవరావు గారు, “నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ యిల్లు హర్ష ఎక్కడ వుంటే అదే నీ యిల్లు, అదే మీ ఇల్లు…..”

“నీకిదేం పోయే కాలం వచ్చిందే? పచ్చగా వున్న సంసారంలో నిప్పులు పోసుకుంటున్నావు?” అని తల్లి విమల అరిచింది.

“అమ్మా నువ్వయినా అర్ధం చేసుకుంటావనుకున్నాను. నీ జీవితం చూడు…”

“ఆ..ఆ.. ఏమైందే మీ అమ్మకి? ఏం తక్కువ చేసాను. పిల్లా పాపలతో ఇన్నాళ్ళు బిజీగా వుండింది ఇప్పుడు మేమిద్దరం పెద్దవాళ్ళమయ్యాము, ఒకరికొకరు తోడుగా వున్నాము. నేను సంపాదించిందాంట్లో నా తదనంతరం మీ అమ్మకే ఇల్లు, తను బ్రతకడానికి సరిపోయేంత డబ్బు వస్తుంది. కానీ నువ్వు చేసే ఈ వెర్రి వేషాల వల్ల మాత్రం మాకు తలవంపులు తీసుకొస్తున్నావు, ఈ ముసలితనంలో మేము ప్రశాంతంగా వుంటే చూడలేకపోతున్నావా?” తల పట్టుకున్నాడు తండ్రి.

“ప్రశాంతంగా వున్నారా? మీ వృద్దాప్యంలో మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవల్సిన కొడుకులు దగ్గర లేరు, వాళ్ళు మిమ్మల్ని వచ్చి అక్కడ వుండమనరు. ఇదేనా ప్రశాంతత అంటే? రోజు వాళ్ళు వస్తారేమోనని, ఫోన్ చేస్తారెమోనని, నీకేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వుండాలని వుంటుంది. కానీ వాళ్ళు రమ్మనకుండా ఎలా వెళతారు? అమ్మ చాలా సంతోషంగా వుందంటున్నారు కదా! ఇన్నాళ్ళు మీతో కాపురం చేసి మీ మాట జవ దాటకుండా సంసారం చేసిన అమ్మకి ఆఖరికి దక్కేదేమిటి? మీరు శ్రీనాధ్ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటే అమ్మ పిల్లలకి ఆయాగా వుండడం చచ్చేదాకా చాకిరీ చేయడం అంతే కదా అమ్మల జీవితాల్లో రాసి వుంది.” అంది ఆవేశంగా మనస్విని.

“ఇదే వితండవాదం. పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కని వారిని పెంచి పెద్దచేసి, వారిని జీవితాల్లో సెటిల్ చేయడం, బాధ్యతలైపోయి సంతోషంగా రామా, కృష్ణ అనుకోవడం కష్ట పడటమా? నీలా బ్రతకాలంటావా మీ అమ్మని కుడా?’

“నేను చెప్పేది మీకు అర్ధం కావడం లేదు. మేము అంటే ఆడపిల్లలు పుట్టగానే భారంగా అనుకుంటారు. . పెళ్ళయి వెళ్ళి పోయే వరకు, ఆ యింటి మూల మూలలు మాకు తెల్సు, ఇళ్ళు వూడవడాలు, ఇంటిని అందంగా వుంచడం, సర్ధడం, ఇది అమ్మ, నాన్న ఇల్లు, నా యిల్లు, జామ చెట్టు కొమ్మ ఎక్కి వూయల వూగడం, ఆ యింట్లో ఏ చెట్టుకి మొదటి పువ్వేసి, పిందేలేసినా చూసి మురిసిపోవడం, ఆ యింట్లో అమ్మ వొడిలోని వెచ్చదనాన్ని అనుభవిస్తాము, ఎక్కడకు వెళ్లి వచ్చినా మన ఇంటికి వచ్చేస్తే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ యింటితో ఒకరకమైన బంధం ఏర్పడుతుంది మాకు కానీ, ఈ యింటితో సంబంధం లేదు నీకు నోర్మూసుకొని లోపలికి తగలబడు అని నీతో అనిపించుకున్నాను నాన్న!”

“అపుడు ఏదో కోపంలో అన్నాను…”

“కాదు నాన్న, ప్రతి మాట మీ మనసులోనుండి వచ్చిందే. జీవితాంతం తోడుగా ఒకరికొకరుగా మసలాల్సిన భర్తతో కూడా అదే మాట అనిపించుకున్నాను. ఎప్పటినుండో నా మనసులో మాకంటూ ఇళ్ళు ఎందుకుండవు అని ఆలోచిస్తుంటే అనిపించింది అందరూ చెబుతున్నట్టు చిన్నప్పట్నుండి పెళ్ళయ్యే వరకు తండ్రి, అన్నదమ్ముల నీడలో, పెళ్ళయ్యాక భర్త నీడలో, వృద్దాప్యంలో కొడుకు నీడలో బ్రతకాలనే మాట తప్పని, నాకూ ఒక ఉనికి వుంది, నాకు ఒక యిల్లు వుంది నేను సంతోషంగా బ్రతకవచ్చు అనే గుండె నిబ్బరం కోసం, నన్ను చూసి నా కూతురు కూడా ఆత్మ విశ్వాసంతో పెరుగుతుంది. అందుకని కొన్నాను. ప్రస్తుతం ఒక సైడ్ ఇల్లు ఖాళీగా అంటే నాకు కావాల్సినట్టు అమర్చుకుని వుంచుకుంటాను. మిగతా రెండు రూమ్ ల్లో రమణి, మా ఆఫీసులో కొన్ని రోజులు చిన్న పని చేసేది, ఇపుడు భర్త వదిలేసాడు, కొడుకుతో, చిన్న వుద్యోగంతో జీతం సరిపోక అద్దె కట్టలేక అవస్థ పడుతుంది, తనని ఇక్కడ వచ్చి వుండమన్నాను. కొన్నాళ్ళూ ఏదైనా ట్రయినింగ్ చేసి జాబ్ సంపాదించుకుంటే ప్రయివేట్ గా చదువుకోవడానికి కూడా సాయం చేస్తానని చెప్పాను.”

” ఈ సమాజ సేవ ఒకటి ఇపుడు! ఒసే ఇప్పుడు నీకు వేరే ఇల్లు కొనాల్సిన అవసరం ఏం వచ్చిందే? సరే ఒప్పుకుంటాము మాకు బ్రతకడం రాదు, నువ్వు చదువుకున్నదానివి, నీలా ఆలోచించలేం మేము. స్త్రీలనంతా మేము కష్టాలు పెట్టిన వాళ్ళం సరేనా? కానీ నీకోసం ఒక ఇల్లు కొనడం అవసరమా? నీ భర్త ఏమనుకుంటాడు. దేవుడిలాంటి మనిషి దొరికాడు, నువ్వు చేసే ఏ పనికి అడ్డు చెప్పలేదు, ఆయన నిన్ను కంట్రోల్ లో పెట్టలేదు కాబట్టి నువ్వు ఇలా తెగించావేమో? తను ఎంత బాధ పడ్తాడో ఆలోచించావా?” అని తండ్రి అరిచారు కోపం తట్టుకోలేక.

“నేను చేసింది మీలాగే తప్పు అని తను కూడా అనుకుంటే నేనేమి చేయలేను. కానీ తను నేనెందుకు ఈ నిర్ణయం తీసుకున్నానో అర్ధం చేసుకుంటాడనుకుంటున్నాను!”

“హర్ష ఇదేమిటిరా! భార్య మీద ప్రేమ వుండాలి కానీ తను ఏది చేస్తే దానికి తానా తందానా అంటే ఏట్లారా?” అని హర్ష తండ్రి అన్నారు.

“నాన్న, నేను నిజంగా తనని మన:స్ఫూర్తిగా అర్ధం చేసుకుంటే తను ఈ నిర్ణయం తీసుకునేదంటారా?”

“ఇంకేం చేయాలిరా? తను ఏది చేసినా నువ్వు అడ్డు చెప్పలేదు. ఇంకా ఏం అర్ధం చేసుకోలేదురా?”

“అవును తనకిష్టం వచ్చింది చేయొచ్చు అని చెప్పాను. నాకు ఆ అవకాశం వుంది కాబట్టి చెప్పాను, వద్దనే అవకాశం కూడా వుంది. భార్య ఏది చేస్తానన్న చేయనీయడంలో మా ఛాయిస్ వుంది. తనతో బాగుండాలి, బాగా వుండకూడదు అనే ఛాయిస్ మాకు వుంది. మేము ఎంత మంచి వాళ్ళమయినా మా దయాదాక్షిణ్యాలపైనే బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఎంత స్వాతంత్ర్యం ఇవ్వాలో అంతే ఇస్తాము. సడన్ గా మాకు మా అహంకారం గుర్తొస్తుంది అప్పుడు వాళ్ళని భయంకరంగా అవమానిస్తాము, వాళ్ళ మనసులని ముక్కలు ముక్కలు చేస్తాము. మనలాగే వాళ్ళకి ప్రతి విషయంలో హక్కు, అధికారాలున్నా, వాటిని మనకి ఇష్టమొచ్చినట్టుగానే వారికి ఇస్తుంటాము. అందుకే ఈ రోజు తన ఉనికిని నిరూపించుకోవడానికి మనస్విని ఈ పని చేయాల్సివచ్చింది, అండ్ ఐ యామ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. అందరూ ఇలాగే ధైర్యం చేయగలిగితేనే గానీ మాకు మాలో వున్న అహంకారం పోదు. మీకిష్టమైనా కాకున్నా మనస్విని చేసిన పని గురించి ఇంక చర్చ అనవసరం. తను తనంతట తను స్వంతంగా తన ఇల్లు కొనుక్కున్నందుకు మనం తనని అభినందించాలి. ఇదే నేను కొన్నానంటే మీరు ఇలా గొడవ చేసేవారా? కంగ్రాట్స్ చెప్పేవారు, కొడుకు మరో ఇల్లు కొన్నందుకూ ఆనందించేవారు అవునా కాదా?”

“మనూ, మనం ఒక మంచి పార్టీ ఇవ్వాలి ముఖ్యంగా నీ ఫ్రెండ్స్, నీకిష్టమయిన వారందరినీ పిలిచి సెలబ్రేట్ చేసుకోవాలి. చెప్పు ఎప్పుడు చేద్దాం?” అని అడిగాడు హర్షా!

“అరే ఇక్కడే ఆగిపోయారేమిటి? పదండి లోపలికి, నేను మీకు అందరికీ ఇల్లు చూపిస్తాను, తాతయ్యలు ఈ చెయ్యి పట్టుకొండి, అమ్మమ్మ, నానమ్మ ఈ చెయ్యి పట్టుకొండి. మొత్తం ఇల్లు చూపిస్తాను, వెనక అమ్మకిష్టమయిన చెట్లు ఎక్కడ పెడ్తామో కూడా చూపిస్తాను, కమాన్, రండి!” అని లోపలికి లాకెళ్ళింది హేమ. 

హర్ష మాటలు విన్నాక మనస్విని మనసు తేలికపడింది. హర్ష వెళ్ళి మనస్విని భుజం చుట్టూ చేతులు వేసి, ” కేన్ యూ ఎవర్ ఫర్ గివ్ మీ మనూ! ఐ యామ్ రియల్లీ సారీ రా! హృదయపూర్వకంగా , మన:స్ఫూర్తిగా చెబుతున్నాను, నువ్వు నమ్మవని నాకు తెలుసు. నాకొక్క చాన్స్ ఇవ్వు ప్లీజ్ ఐ విల్ ట్రై టు డు మై బెస్ట్, ఏవో పై పైకి చెబుతున్న మాటలు కావు, ప్లీజ్ మనూ!” గొంతులో బాధ సుళ్ళు తిరుగుతుండగా కళ్ళల్లో నీరు తిరిగింది.

మనస్విని హర్ష కళ్ళలోనుండి రాలబోతున్న కన్నీటిని తన చేత్తో ఆపింది. తల అడ్డంగా వూపుతూ, “ఇప్పుడే ఇది హ్యాపీ అకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలి అన్నావు, ఇప్పుడు ఇదేమిటి? అవునూ నువ్వు నిజంగానే పార్టీ ఇద్దామన్నావా? వూరికే అన్నావా? నాకు నమ్మకం లేదు..” అంది చిలిపిగా చూస్తూ.

హర్ష ఇంకా సీరియస్ గానే వున్నాడు అందుకని,”చూడు నేను చెప్పానా? నీకు నా మీద నమ్మకం లేదు…” అంటూ కళ్ళు పైకి ఎత్తి మనస్విని కళ్ళలోకి చూసాడు, తను చిలిపిగా నవ్వుతుంది.

“యూ, సిల్లీ, నన్ను ఏడిపిస్తే నీకు నవ్వులాటగా వుంటుంది కదూ….”
రెండు పిచ్చుకలు వారి పై నుండి ఎగురుకుంటూ వెళ్ళాయి.

హేమతో ఇల్లు చూస్తున్న పెద్దవాళ్ళల్లో అందరికీ సంతోషంగా వుందో లేదో తెలియదు కానీ మనస్విని తల్లికి, అత్తగారికీ ఆనందంగా అనిపించింది.

మనస్విని తీసుకున్న నిర్ణయాన్ని మన:స్ఫూర్తిగా అమోదించారు, ఆనందించారు.

-కనకదుర్గ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

7 Responses to నాకూ ఒక గూడు వుంది (కథ ) -కనకదుర్గ

 1. Desu Chandra Naga Srinivasa Rao says:

  చక్కటి కధ.చాలా బాగుంది.

 2. SINGARAJU RAMADEVI says:

  కనకదుర్గ గారు, కథ చాలా బాగుంది! అభినందనలు! చక్కటి ఆలోచన! హర్ష లాగా వెంటనే మారిపోయి అందరూ అర్ధం చేసుకుంటే ఎంత బాగుంటుందో!
  -సింగరాజు ramaadEvi

 3. sailaja says:

  చాల చాల బాగుంది దుర్గ గారు మీ కధ.మనసుకు హత్తుకుంది.

 4. Subhashini says:

  కథ చాలా బాగుంది.
  మనస్విని పాత్రలో స్పందించే ప్రతి మహిళా కన్పించింది.
  Thank u for d grt story.🙏

 5. Vanaja Nallanchakravartul says:

  చాలా బాగుంది కధ. నా స్నేహితులకి కూడా చదవమని చెప్తాను.

 6. Durga Dingari. says:

  థ్యాంక్స్ కృష్ణా, వొంట్లో బావున్నా లేకున్నా రాద్దామనుకుంటున్నాను. ఒకోసారి అలా కూడా ఆరోగ్యం కొద్దిగానయినా కుదుటపడవొచ్చునన్న నమ్మకం! కథ చదివి నీ అభిప్రాయం తెలిపినందుకు థ్యాంక్స్ నేస్తం.

 7. Krishna Veni Chari says:

  మగపిల్లలతో పాటు ఆడపిల్లల్ని కూడా సమానంగా, పక్షపాతం లేకుండా చూడాలన్న మనస్తత్వం మన సమాజంలో ఎప్పుడు వస్తుందో.
  బాగా రాశావు దుర్గా. ఆరోగ్యం కొంచం సర్దుకున్నప్పుడల్లా, ఇలాగే ఏదో ఒకటి రాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)