ప్రసాద్ కి యం.బి.బి.యస్. అయిపోయింది. ఉద్యోగం చేస్తూ పీ.జీ. పరీక్షలు వ్రాయడానికి ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి ఇంట్లో వాళ్ళు సంబంధాలు వెతకాడానికి పూనుకుంటున్నారు.
“ఏమోయ్… మొన్న మీ అన్నగారు ఫోన్ చేసారు, అతగాడి శ్రేయోభిలాషి ఎవరో ఉన్నారుట. వాళ్ళమ్మాయి పెళ్ళికుందీ, ప్రసాద్ కేమన్నా సంబంధం నిశ్చయం చేసారా? లేకా ప్రయత్నాల్లో ఉన్నారా? … అని” ప్రసాద్ నాన్నగారు రెటైర్డ్ ఇంగ్లీషు ప్రొఫెసరు రామారావు గారు భార్య రేవతికి తెలియ పరిచారు.
“మంచి విషయమేగా. మావాళ్ళని మీరు పట్టించుకోకపోయినా, వాళ్ళకి ఎప్పుడూ నా ఆలోచనా, నా పిల్లల ఆలోచనే”…
మురిసిపోయింది రేవతి.
“వూ… బాగుంది. కరక్టే. నాకే ఆ ఆలోచన తక్కువ!”
“అని నేన్లేదు గానీ… మావాళ్ళకి బాధ్యత తప్పలేదంటున్నాను. సరేలెండి. ఇంతకీ అమాయి వివరాలేమిటో?”
“పెద్దగా అడుగలేదు. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు అడుగుతాలే”.
“పోనీ మా అన్నయ్యకు అబ్బాయి గురించి ఏం చెప్పారు? పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నామా? ఇహ ఎప్పటికీ చెయ్యమనా?” …
మళ్ళీ ఫోన్ చేసినప్పుడు అడుగుతానులే అన్న మాటకి రేవతి తన వాళ్ళని నిర్లక్ష్యం చేసినట్లుగా ఫీల్ అయిపోయి చిన్నగా కసురుకుంది.
రామారావుగారికి అర్ధం కాకపోలేదు. ఆవిడని ఉడికించి ఆనందించడం అలవాటయిపోయింది అతనికి.
మెల్లగా పేపర్ తిప్పుతూ తనకేం పట్టనట్లు … “అమ్మాయి ఫొటో, వివరాలు పంపమని చెప్పాను”.
ఆ మాటకి రేవతి వెన్నపూసలా కరిగిపోయి, నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక రామారావు గారు కూడా నవ్వుకున్నారు.
రేవతి వాళ్ళ అన్నయ్య వీరభద్రయ్య రెండురోజులయ్యాక రామారావుకి ఫోన్ చేసారు. తానెలాగూ అటే ఏదో పని మీద వస్తున్నట్లూ… అమ్మాయి ఫోటో తీసుకొస్తున్నట్లు.
“రేవతీ … మీ అన్నయ్య స్వయంగా ఆ పిల్ల ఫోటో, వివరాలు తెస్తున్నాడు”… రామారావు గారి ఉవాచ.
“అహా.. పోన్లెండి. అందరం ఒకేసారి కూర్చొని మాట్లాడొచ్చు. మీరే అంటే ఒకటి చెప్తారు, ఒకటి వింటారు”.
“అవును. అందుకే మీ అన్నయ్య దగ్గిరుండి నేరుగా నీకే చూపిస్తానన్నాడు”.
రేవతి మాట్లాడకుండా వెళ్ళిపోయింది, ఆ వెటకారానికి.
**** *** ***** *****
రేవతి అన్నయ్య వీరభద్రయ్య సాయంత్రం చేసి ఇంటికి వచ్చారు.
“రా అన్నయ్యా… ఏవిటింతాలశ్యం? ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాం”… రేవతి సాదరంగా ఆహ్వానించింది.
రండి బావా … ఏంటి ఇంటి దారి మర్చిపోయారా ఏంటీ? ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా ఎత్తలేదు?
“ఆ… అదే.. బయలుదేరేసరికి లేటే అయ్యింది. తర్వాత నా పన్లన్నీ చూసుకొనేసరికి ఈ టైం అయ్యింది. ఫోన్ కూడా చార్జింగ్ అయిపోయింది. మధ్యలో ఎక్కడా చార్జింగ్ పెట్టడానికి అవ్వలేదు.
అవును చెప్పడం మర్చిపోయాను, మీ పెద్దమ్మాయి వాళ్ళ అత్తగారి వాళ్ళ వార్తలు. మీ అల్లుడి పెద్దన్న వాళ్ళమ్మాయిని బాంబే ఇచ్చారట కదా?”
“అవునూ… పెళ్ళయి ఆరెనెల్లయింది, ఏం… ఏమయ్యింది?”
“అదే అత్తవారింట్లో గొడవలట. పుట్టింటికి వెళ్ళిపొమ్మాంటున్నారుట, ఏమయ్యిందో ఏమో మరి. మీ పెద్దమ్మాయేమీ చెప్పలేదా?”
“లేదన్నయ్యా… మా అమ్మాయికి సరిగ్గా తెలుసో లేదో?”
“అదేంటీ?”
“అదంతే. అల్లుడు మంచివాడే గానీ, వాళ్ళ కుటుంబ విషయాలొచ్చేసరికి వాళ్ళందరూ ఒక కట్టులో ఉంటారుట. చెప్తే చెప్తాడు వాళ్ళ విషయాలు, లేకపోతే లేదు”… రేవతి నిట్టూర్పు.
“అయ్యో… అలాక్కూడా ఉందా?”
“హ… ఎంతసేపు ఈమెకి తన ధ్యానం, తన పిల్లల ధ్యానంలోనే ఉండాలంటాడుట. ఏ ఒక్క ఇతర విషయం ఆలోచించొద్దంటాడుట. అదేమిటో వింత మనస్తత్వం. అందుకే పెళ్ళయీన్నేళ్ళయినా ఆమె కి అతని కుటుంబంలో ఇంకా కొత్తే. వాళ్ళు కూడా ఒక బయటి స్నేహితుల్ని చూసినట్లే చూస్తారుట తప్పా, తమలో ఒకరిగా చేసుకోలేదుట. చెప్పి బాధపడుతుంది”.
“విచిత్రంగా వుంది రేవతీ. నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. ఇతనెందుకలా అంటాడో, వాళ్ళెందుకు అలా దూరం పెడుతున్నారో. ఏదో ఉంది ఆ కుటుంబంలో. మన పిల్లకి ఏ లోటూ లేనంతవరకూ పర్వాలేదు. చూద్దాం”… వీరభద్రయ్య లోతైన ఆలోచనలు చేసారు.
“రాత్రికుండిపోయి రేపెళ్ళన్నయ్యా …”
“అహా… లేదమ్మా. రేపు పన్లున్నాయి, ఇవాళే వెళ్ళిపోవాలి. హా… ఇదిగో అమ్మాయి ఫొటోలు” … ఇద్దరికీ ఫోటోలు చూపించాడు.
“పైగా వీళ్ళ ఫాదరు నీకు తెలుసు బావా. మీరిద్దరూ ఏనాడో కలిసి ఏదో దేనికో ఎంప్లాయీస్ తరుపున కలిసి పోరాడారట. తానే చెప్పాడు. నువ్వు చాలా మంచివాడివనీ, అదనీ, ఇదనీ చాలా తలుచుకున్నాడు నిన్ను. ఇదిగో అతని ఫ్యామిలీ ఫొటో కూడా. చూస్తే గుర్తుపడతావు” … అందించాడు వీరభద్రయ్య.
“ఓహో… ఇతనా? చాన్నాళ్ళ క్రితం కలిసాము. బానేవుంది అమ్మాయి”.
“నేను పని చేసిన కాలేజీలోనే ఆనాడు అడ్ హోక్ గా జాయిన్ అయ్యాడు. పర్మనెంట్ చేసే లోపలే హైదరాబాదు వెళ్ళిపోయాడు. ఎన్నాళ్ళో ఉండలేదు.. అయిదారు సంవత్సరాలున్నారు అంతే. కొన్ని కాలేజీ విద్యా విధానాల్లో మార్పులకనీ, ఎంప్లాయీస్ రైట్స్ అని ఏవో కార్యక్రమ్మాల్లో ఇద్దరం కలిసి పనిచేసాం. అలాగే చుట్టుపక్కల పల్లెటూళ్ళో గవర్నమెంట్ స్కూళ్ళ పరిషితి చాలా అధ్వానం గా వుండేది, వాటి గురించి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసేవాళ్ళం కదా?”
“అవునవును …”
“ఆ… మాతో పాటు తానూ ఉండేవాడు, ఈయన పేరు సుధాకర్. గుర్తొచ్చేసింది. ఇప్పుడేం చేస్తున్నారో?”
“ఇంకా మూడు సంవత్సరాలు సర్వీస్ ఉంది. ఈ లోపుల అమ్మాయికి పెళ్ళి చెయ్యాలని”.
“అమ్మాయి ఎం.ఏ. చేసింది, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నది. మరి మీకు ఇష్టమయితే అన్నీ మాట్లాడుకోవచ్చు. అబ్బాయితో కూడా మాట్లాడి చెప్పండి, ఎందుకంటే తను మళ్ళీ డాక్టర్నే చేసుకుంటానంటే?”
“లేదులే అన్నయ్యా… డాక్టర్ కాకపోయినా పర్వాలేదన్నాడు ఇంతకుమునుపు, అమ్మాయి మాకు నచ్చితే చాలన్నాడు”.
“కలికాలం, ఈ రోజుల్లో ఇలా ఆలోచించే పిల్లలు తక్కువే” … వీరభద్రయ్య ఆశ్చర్యపు నవ్వు!
అలా కొంచెంసేపు ఎక్కడక్కడో ఉన్న పాత బంధుత్వాలు మాట్లాడుకొని వీరభద్రయ్య బయలుదేరే టైం కి … ప్రసాదొచ్చాడు ఇంటికి.
మళ్ళీ వీరభద్రయ్య కాసేపాగారు, ప్రసాద్ తో మాట్లాడుతూ మళ్ళీ అందరూ కలిసి పెళ్ళి విషయాలు, అమ్మాయి విషయాలు మాట్లాడారు. ప్రసాదు ఫొటో చూసాడు.
“సరే ఆలోచిద్దాం … ఇప్పుడే ఎందుకు? నేనింకా పీ.జీ. చేద్దాం అనుకుంటున్నాను కదా?”
“పీ.జీ. ఎంతా? ఒక రెండేళ్ళు. మంచి సంబంధాలు దొరకడం కూడా కష్టమే. అమ్మాయి కి కూడా మొన్ననే ఉద్యోగం వచ్చింది, తాను కూడా కాస టైం అడుగుతోందిట. రెండూ కలిసి వస్తాయి, ఒక మాటనుకుంటే సరిపోతుంది అంతే”.
వీరభద్రయ్య చాలా ఈజీ గా చెప్పేసారు, మిగితా ఇద్దరు కూడా తలాడించారు, ప్రసాద్ తప్పా.
ప్రసాద్ కి ఉన్న పెద్ద కారణం తాను పీ.జీ చెయ్యాలి, రెండవ కారణం సరిత కావొచ్చు. సరిత కావొచ్చు, మరింకెవరైనా కావొచ్చు, కానీ ప్రసాద్ కి మాత్రం అంతా అమ్మానాన్న ఇష్టమే.
ఇలా రెండు, మూడు సంబంధాలొచ్చాయి ప్రసాద్ కి. రామారావు, రేవతీలకి ప్రసాద్ తర్వాత మరో అమ్మాయి ఉంది. పేరు కౌముది. కౌముది టెంత్ పరీక్షలు వ్రాసింది, ఫలితాలకోసం వెయిటింగు.
ప్రసాద్ ఎలాగూ డాక్టర్ అయిపోయాడు కాబట్టి ఆఖరి పిల్ల బాధ్యతలు పంచుకుంటాడనే ధైర్యం ఆ ఇంటిల్లపాదిదీ, అలాగే దగ్గిర చుట్టాలది.
ప్రసాదుకు కూడా కౌముది అంటే చాలా ఇష్టం. తనని డాక్టర్ని చవించేస్తాను, ఇద్దరం కలిసికట్టుగా హాస్పిటల్ రన్ చేసుకుంటాం అంటుండేవాడు.
కౌముది కూడా తెలివైనదే. ఇంట్లో వాళ్ళందరూ చిన్నప్పటినుండీ డాక్టర్ డాక్టర్ అంటుండడం వల్ల తను కూడా డాక్టరవ్వాలని ఫిక్స్ అయిపోయింది.
*** *** *** ***
ప్రసాద్ ప్రొద్దున్నంతా ఉద్యోగ బాద్యతలు, రాత్రి కూర్చొని పీ.జీ. ప్రిపరేషన్లు. మధ్యలో సరిత ఫోన్లు. మొదటిసారిగా సరిత తన ఇష్టాన్ని తెలియ పరిచిన సంఘటనని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకున్నాడు.
“హలో ప్రసాద్ గారూ, ఏం చేస్తున్నారు?” … సరిత ఫోను.
“ఏముంటాయి … ఇంటికి ఎవరో ఫ్రేండ్స్ వస్తే వాళ్ళని పంపించేసి భోజనాలయ్యేసరికి ఇంతసేపయ్యింది. ఇప్పుడు కాసేపు చదువుకోవాలి”.
“ఓ… మీ ఫ్రెండ్స్ ఎవరో నాకు చెప్పనేలేదు!” … సరిత ముక్తాయింపు.
“ మీకెవరని తెలుసు?”
“మీరు చెబితే నాకు తెలుస్తుంది గా. మీ ఫ్రేండ్స్ నాకూ ఫ్రెండ్సే గా” … మార్ధవంగా సరిత చెబుతోంది.
“ఎందుకలా?”
“అదేంటో మరి. మీ విషయాలన్నీ నా స్వంత విషయాలుగా అనిపిస్తున్నది?”
“ఎప్పటినుండి?”
(ముసి ముసి గా) నవ్వుతూ … “మొదటిసారి పేషంట్ గా మీ దగ్గిరకి వచ్చిన దగ్గిరనుండి”.
“ఓ… అలాగా. మొన్నీమధ్య ఇద్దరు ముగ్గురు పేషంట్లు కూడా అలాగే అన్నారు”.
“చివాలున గొంతు మార్చి … ఎవరు వాళ్ళు? నాకు చెప్పనే లేదు?” … సరిత వాదించడం మొదలెట్టింది.
“వాళ్ళు నన్ను ఎవరికీ చెప్పొద్దన్నారు”.
“అయితే మీకు వాళ్ళు ఫోన్లు చేస్తుంటారా?”
“యస్. ప్రతిరోజు చేస్తారు”.
“మరి నాకు చెప్పలేదు?”
“అదే చెప్తున్నాగా.. వాళ్ళు నన్ను చెప్పొద్దన్నారు”.
“ఎంతమంది అలా ఫోన్లు చేస్తున్నారో?”
“మీతో కలిపి ముగ్గురు”.
“ఓ… నన్ను కూడా వాళ్ళతో కలిపేసారా?”
“ఏం?”
“అ..అంటే వాళ్ళూ నేనూ ఒకటేనా అని?”
“వేరే అని ఎందుకనుకుంటున్నారు?”
ప్రసాద్ చిలిపిగా ప్రశ్నలు వెయ్యడం మొదలు పెట్టాడు. ఇలాగయినా ఆమె ఉద్దేశ్యం తెలుస్తుంది అని.
“నేను వేరే అనే అనుకుంటున్నాను”.
“అదే ఎందుకు?”
“వాళ్ళని అడిగారా … అసలు వాళ్ళెందుకు ఫోన్ చేస్తున్నారని?”
“అడిగాను”.
“ఏమన్నారు?”
“నేనంటే ఇష్టమన్నారు. నాతో మాట్లాడుతూ వుంటే వాళ్ళకి అసలు టైం కూడా తెలియనంత ఇష్టమని చెప్పారు”.
“మరి మీరేమన్నారు దానికి?”
“నాకూ అంతేగా? నేనలా, అంతసేపు మాట్లాడబట్టే గా వాళ్ళకలా అనిపించింది. మళ్ళీ ప్రశ్న వెయ్యడమెందుకు?”
మరి మీకేమనిపిస్తున్నదేమిటి?”
సరితకి బాధ, కోపం, ఉక్రోషం వచ్చేసింది. వెంటనే నాకు పనుంది అర్జంటుగా. వెళ్ళాలి. తర్వాత మాట్లాడతాను”…అని చటుక్కున ఫోన్ పెట్టేసింది.
వెంటనే సరిత ఫోన్ మ్రోగింది. ట్రిగ్ … ట్రింగ్ … ట్రింగ్ …
“హలో” … సరిత ఫోన్ ఎత్తింది. అట్నుండి ప్రసాద్.
“అయ్యిందా అర్జెంట్ పని? ఇప్పుడు చెప్పు”.
“ఎందుకు?”
“ఇప్పుడు వాళ్ళిద్దరు అడుగుతున్నారు. వాళ్ళకి చెప్పాలి”.
ఆ మాటకు సరిత ఫకాలున నవ్వేసింది.
సరిత తన మనసులోని మాట చెప్పక తప్పలేదు … ప్రసాద్ ని తను ఇష్టపడుతున్నట్లుగా.
“మరొక్క విషయం, ఈ మాట ఇంకా హేమలత కు చెప్పొద్దు” … సరిత ఖచ్చితం గా చెప్పింది.
“ఏం, ఎందుకు? తను నాకు మంచి స్నేహితురాలు”
“తెలుసు. అందుకే ఇప్పుడప్పుడే చెప్పొద్దంటున్నాను. గబుక్కున మీ ఇంట్లో చెప్పినా చెబుతుంది”.
“అలా ఏం ఉండదు. తను నా శ్రేయోభిలాషి”
“నాకు ఇంకా నమ్మకం లేదు. కొద్ది రోజులు ఓపిక పట్టండి”
“సరే”
*** *** *** ****
“సరితతో మాట్లాడుతున్నంతసేపు నాకూ మాట్లాడాలని ఉంటున్నది, నేనూ ఇష్టపడుతున్నాను సరిత ను, ఆమెతో మాట్లాడడం. తనతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియదు. ఒకవిధం గా నా పీ.జీ ప్రిపరేషన్ కి ఆటంకం గా కూడా ఉంది. సరిత ఫోన్లను కాస్త ఎంటర్టెయిన్ చెయ్యడం కాస్త తగ్గిస్తేనో? కొంత నా కంటూ సమయం దొరుకుతుంది.
ఇది మరో విధంగా కూడా ఇద్దరికీ ఉపయోగపడుతుంది. మేమిద్దరం ఒకరంటే ఒకరం అంత సీరియస్సా అన్న విషయం కూడా తెలుస్తుంది. అమ్మా నాన్నతో చెప్పేంత సీరియస్ గా నేను సరితను ప్రేమిస్తున్నానా? అర్ధం కావడం లేదు. ఇప్పటినుండీ కాస్త ఆలోచించడం కూడా మానేసి చూద్దాం, ఎలా కూపప్ చేసుకోగలనో? సైకలాజికల్ ట్రీట్ మెంట్! ఎన్నాళ్ళయ్యిందనీ 8 నెలలే గా ఈ విధం గా పరిచయమయ్యి.
నేను కూపప్ అయ్యానంటే సరితకూడా ఈజీ గా అవ్వగలదు. కనీసం ఆ విధంగానయినా మా ఇద్దరికీ అర్ధమవుతుంది, మేము నిజంగా సీరియస్ గా ప్రేమలో ఉన్నామా? లేక రోజూ హాస్పిటల్ లో కలుసుకుంటున్నాము గాబట్టి అలవాటయిందా కాలక్షేపం చెయ్యడం?”
ఇలా పరి పరి విధాలా ప్రసాద్ మనసు అలోచిస్తున్నది. ఈలోపుల సరితనుండి ఫోన్ రింగ్ అయ్యింది. ప్రసాద్ ఎత్తలేదు కావాలనే. తన నిగ్రహాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. మళ్ళీ మళ్ళీ రింగ్ అవుతున్నది. మ్యూట్ లోపెట్టేసి, దిండు లోపలికి తోసేసాడు.
ప్రొద్దున్నే లేచి… మిస్సుడు కాల్స్ లెక్క పెట్టుకున్నాడు. 5 సార్లు ఉంది. తను మామూలుగానే నిద్ర పోయి లేచాడు.
ఊ… నాట్ బ్యాడ్. సైకొలాజికల్ ట్రీట్ మెంట్ పెద్దగా అక్కర్లేదు నాకు. హాయిగా పీ.జీ. కి ప్రిపేర్ అయిపోవచ్చు … ” అనుకుంటూ హాస్పిటల్ కి వెళ్ళిపోయాడు.
హాస్పిటల్ కి వెళ్ళేసరికే సరిత వచ్చి ఉంది. తనని చూడగానే కొంపలు మునిగినట్లు ఆఫీసులోకి వచ్చింది. వస్తూనే ఏడుపు గొంతుతో మాటలు.
“నిన్న నేనెంత అర్జెంట్ విషయం చెప్పాలని ఫోన్ చేసానో తెలుసా, ఫోన్ ఎత్తలేదెందుకు?”
“ఆ… నేను ఫోన్ వేరే చోట మర్చిపోయాను, ఏంటో చేప్పు … ఎందుకు?”
“పోనీ తర్వాతయినా మిస్సుడు కాల్స్ చూడలేదా?” తీక్షణమైన ప్రశ్న.
“ప్రొద్దున్న చూశాను” …
“మరి ఏం జరిగిందో అని ఫోన్ చెయ్యాలని ఆత్రుత కలగలేదా?” … మళ్ళీ తీక్షణమైన ప్రశ్న.
“ఎలాగూ అఫీసులో కనబడతావుగా” … మామాలు సమధానం.
సరితకు చాల అహం దెబ్బతిన్నది ఆ సమాధానానికి. ఇంతవరకూ తాను చాలా మటుక్కి అతని బుర్రలో, మనసులో చాలా పెద్ద పీఠం వేసుకున్నదని అనుకుంటున్నది. కాదేమో అని అనిపించాసాక … అది పరాభవం గా తీసుకొన్నది.
వెంటనే ఆమె గొంతు, మాటా మారిపోయి … అప్పలమ్మ లా గొడవేసుకొంది.
“మీ మగాళ్ళంతా ఇనే. సరదాగా తిరగడానికి అడవాళ్ళు కావాలి. ఒక్కసారి మోజు పోయాక ఫోన్లు ఎత్తరు, మాట్లాడరు”
ఆ మాటలకి ప్రసాద్ విస్తుపోయాడు. అతనెప్పుడూ ఇలాంటి మాటలు సరిత నోటంబడి వినలేదు. ఎవరైనా విన్నారేమో అనే సంశయంతో వేసున్న కర్టెన్ వైపు చూశాడు.
“ఎవరూ లేరు”… అన్నది గట్టిగా సరిత.
ప్రసాద్ విస్తుపోతూ … “నువ్వేదో అర్జేంట్ గా ఫోన్ చేసానన్నావు. నేను చెప్పమని అడుగుతుంటే, అసలెందుకు ఫోన్ చేసావో చెప్పకుండా … ఈ మాటలన్నీ ఏమిటి?”
“అంటే ఇన్నాళ్ళు ఏదయినా అర్జెన్సీ ఉంటేనే ఫోన్లు చేసుకున్నామా?” అని ఎదురు ప్రశ్న వేసింది.
ప్రసాద్ మళ్ళీ హతాశుడయిపోయాడు.
“లేదు. సరదాగా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం”
“ఊ.. ఆ తర్వాత?
“ఓకే .. ఓకే… ప్రేమించానన్నావు”
“నువ్వు అనలేదా” … మళ్లీ ప్రశ్న!
“అన్నాను. అయితే అనుకుంటే అన్నానా? అనిపిస్తే అన్నానా అన్నది నాకింకా డౌట్ ఫుల్. నాకు కొంచెం టైం ఇయ్యి. ఏదయినా గానీ, నేను నిజాయితీ గా ఉంటాను”
అంతే … సరిత ఏడుపుతో విరిగిపోయింది.
ప్రసాద్ ఆశ్చర్యంతో దిగ్భ్రాంతి చెందాడు. సరితలోని ఈ రియాక్షన్ ని అతను ఊహించలేదు.
వెంటనే “ఓకే ఒకే, నేను నిన్ను బాధ పెట్టివుంటే అయాం సారీ. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఒకసారి మళ్ళీ ఆలోచించి చూద్దాం, తప్పులేదు. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది”.
“నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మీ మీద, మన ప్రేమ మీద, ఇప్పుడు ఏది ఎలా జరగాలో అలా జురుగుతుంది అంటారా? అందరిలో ఇప్పుడు నా పరువేం గావాలీ? నన్ను నవ్వులు పాలు చెయ్యడం న్యాయమా?”
“చాలా బలమైన మాటలు వాడుతున్నావు” … ప్రసాద్ నొచ్చుకుంటూ మాట్లాడుతున్నాడు.
సరిత ఎలాగయినా ప్రసాద్ ని దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ప్రసాద్ ఇంకా ఆలోచించే స్టేజ్లో ఉన్నాడు, ఇంకా ధృఢమైన నిర్ణయం తీసుకోలేదు.
“సరిత అభాండేలేసేస్తున్నదేమిటి? నా వల్ల సరిత ఇంత డిస్టర్బ్ అయ్యిందా? నేను అంతలా డిస్టర్బ్ చేసానా? ఏం చేసానని???” ప్రసాద్ ఆలోచనలో పడ్డాడు. అంతు చిక్కడం లేదు.
సరిత మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసింది. ప్రసాద్ యంత్రికం గా ఫోన్ ఎత్తాడు.
“సారీ … ఎమోషనల్ గా ఏదేదో మాట్లాడాను”.
“సరే … ఇంతకీ అర్జెంటు ఫోనెందుకో చేసానన్నావు. ఇప్పుడు చెప్పు ఏంటో అది?”
“ఏమీ లేదులెండి. అలా చెయ్యబట్టే కదా … ఇంత గొడవయ్యింది. చూసారా ఇప్పుడు కూడా నేనే చేసాను గానీ, అయ్యో పొద్దున్న నేనన్న మాటలకి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది, ఎలా ఉందో, తిన్నదో లేదో అని ఒక్కసారయినా చేసారా? చెయ్యాలని కూడా అనిపించలేదు కదూ?”
“మళ్ళీ నిష్టూరాలు వేస్తున్నావు. అసలు నిన్న ఎందుకు ఫోన్ చేసావో మాత్రం చెప్పలేదు”.
“ఎందుకులెండి మళ్ళీ మీ టైం వేస్ట్ చెయ్యడం?” అనేసి పెట్టేసింది సరిత.
*** *** *** ***
“మంచి పని చేసావ్ ఫోన్ పెట్టేసి. ఇలాగే చేస్తూవుండు, గురుడు నీ దారిలోకి వచ్చేవరకు. లేకపోతే పెళ్ళి సంబంధాలు చూసుకుంటాడా?” … వినీత అక్కసుగా అంది.
“అయినా నిజంగా వాళ్ళు పెళ్ళివాళ్ళేనా? నువ్వు కరెక్ట్ గా తెలుసుకున్నావో లేదో వినీ?”
“నేను కరెక్ట్ గానే తెలుసుకున్నాను. వాళ్ళు సరాసరి నా దగ్గిరకే వచ్చి అడిగారు ప్రసాద్ గారు ఏరని?”
“నేను వాళ్ళనడిగా. బయటికి వెళ్ళారు, మీరెవరు అని?”
“మేము వాళ్ళింటికే వెళ్తున్నాము, అయితే అబ్బాయి ఇక్కడే పని చేస్తున్నాడని తెలుసు ఎలాగూ ఈ టైంకి హాస్పిటల్ లో ఉండే ఉంటాడని కలసి అందరం ఇంటికి వెళ్ళొచ్చని వచ్చాం అని చెప్పారు”.
“అంతేగానీ… పెళ్ళివారమనలేదు కదా?”
“హయ్యో… నువ్వొక మెద్దువి. హాస్పిటల్ కి పేషంట్లు, వాళ్ళ తాలూకు మనుష్యులు వస్తారు గానీ టిప్పు టాపు గా కార్లో ఎవరూ రారు. ఖచ్చితం గా అతను సంబంధాలు చూసుకుంటున్నాడు. ఇంత వరకూ నీకు చెప్పలేదంటే … అతనికి పెళ్ళి గురించి గానీ, ముఖ్యం గా నీ గురించి అస్సలు వర్రీ లేదు. తన విషయాలన్నీ అమ్మా, నాన్నకు వదిలేసాడు. స్పష్టంగా తెలిసిపోయింది”.
“అందుకే వర్రీ లేని ఆ బుర్రకి నీ గురించి ఆంధోళన కలగాలి. అందుకే ఆ మనిషిని ఆంధోళనతోనే నీ గ్రిప్పు లో పెట్టుకో. లేకపోతే నే పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఎలాగోలా హేమలతని తప్పించాను. ఇహ నీ ఇష్టం”.
సరితకి ఆంధోళన పెరిగింది.
“నువ్వు నన్నలా వదిలెయ్యకే బాబూ. ఇందులోకి నన్ను దింపిందే నువ్వు”
“అబ్బో … పాపం నువ్వేమీ ఎరగనిదానివి, నీ పాతాఫీసులో పనిచేసే ఆ స్టెనోగాడిదగ్గిరేముందనీ? అక్కడినుండి తప్పించాను సంతోషించు”.
“ఆ… అతన్ని పెళ్ళిచేసుకుంటానని చెప్పానా? నీకు ముందే చెప్పాను, నిజాయితీగా బ్రతకడం చాలా కష్టమని. అందుకేగా పెళ్ళొద్దనుకున్నది”.
“ఆ మాటకొస్తే నేను పెళ్ళి చేసుకోలేదా? ఆ పెళ్ళి వల్ల నాకు ఇల్లు ఫ్రీ, ఫుడ్డు కూడా ఫ్రీ. ఉద్యోగానికేముందిలే. బోనస్సులు లాగ మధ్య మధ్యలో నా అవసరాలు తీరుతుంటాయి. అలాగే నీ జీవితం కూడా సౌక్యంగా ఉండాలని కోరుకున్నాను”.
“అది కరక్టేగానీ, ఈ ప్రసాద్ విషయం నువ్వంకున్నంత తేలికలా లేదు. ప్రసాద్ కి, మీ ఆయనకి చాలా తేడాఉంది. ప్రసాద్ కుటుంబం పెద్దింటి కుటుంబం. నటించలేక చస్తున్నానే బాబూ. మీ ఆయనది, మనది… అంటే దొందూ దొందే. ఒక మాట చెప్పుకుంటే చాలు. లెక్కా డొక్కా లేని జీవితాలు మనవి. ప్రసాద్ వాళ్ళవలా కాదే. అతని పరిచయంలో ఇప్పటిదాకా నా కర్ధమయ్యింది అదే.
రేపొద్దున్న పెళ్ళయ్యాక ఎలా వేగుతానో వాళ్ళతో?”
“సరేలే … నీ వాలకం చూస్తుంటే పెళ్ళి చేసుకునేటట్టే ఉన్నావ్, ఆస్తి సంపాదించేటట్టే ఉన్నావ్!”
“వాళ్ళివ్వాలి కదే. మనలాంటి వాళ్ళ మధ్య ఉన్నంత స్వాతంత్రము పెద్దింటి కుటుంబాల్లో ఉండవు. పేరుకీ, పరువుకీ నలుగురికోసం ఆలోచిస్తూ బ్రతుకుతారు. మనలా సేచ్చగా హాయిగా ఉన్నదాన్ని ఖర్చు పెట్టుకుంటూ బ్రతకరు. వాళ్ళ ఫ్యామిలిలో ప్రతి ఒక్కరికీ ఒక మంచి చరిత్రుంది. చచ్చినట్లు వాళ్ళది మోసుకోని బ్రతకాలి. మనకా సమస్యలేదు. ఎవరి చరిత్రలు వాళ్లే రాసుకుంటాం”.
“అదీ ఒక బ్రతుకేనా సరీ?” … సరిత తల్లి మంగమ్మ అందుకుంది.
“ఏమో అమ్మా. ఏమని చెప్తాం. ఎవరి ఇష్టం వాళ్ళది కదా?”
“అంతేలే. బావిలో కప్పలు కొంతమంది. మిమ్మల్ని నేనలా పెంచలేదు తల్లులూ. మీరు స్వేచ్చగా కావలసిన తిండి, నచ్చిన బట్ట కట్టుకొని హ్యాపీ గా ఉండాలి. అందుకే మీకు తగిన జీవితాల్ని నేనార్పాటు చేస్తున్నాను”.
“నీకు నాన్నమంచివాడు దొరికాడు మరీ”.
“ఏ మగాడు మంచివాడు కాడు. మనకనుగుణం గా తిప్పుకోవాలి అంతే. మీ నాన్నను వెంపాడు నుండి పెళ్ళయిన వెంటనే తీసుకుపోయాను. అందుకే హాయిగా బ్రతకగలిగాను. డబ్బంతా నా చేతిలోనే పోసేవాడు ఆ మహానుభావుడు … ఏ చేస్తాం 45 ఏళ్ళకే పుట్టుక్కుమన్నాడు, ఆ దేవుడు కన్నుగుట్టి తీసుకుపోయాడు, అప్పటికి నా వయసింకా 35.
“అందరూ నాన్నని నువ్వే చంపేసావంటారేంటమ్మా?” … పాపం వినీత అమాయకంగా అడిగింది.
“ఆ… గిట్టని వాళ్ళు అలాగే చెప్తారు మరీ. మీ నాన్నకి స్నేహాలు ఎక్కువయి తాగుడూ, నల్లమందూ నేర్చాడు. ఆ మత్తులో ఏదోదో వాగేవాడు నా మీద. నేనంటే గిట్టని వాళ్ళు అలా ప్రచారం చేసేవారు. మనం హాయిగా బ్రతకడం ఎవరికీ నచ్చదు”.
“అంతేలే భోజనం చెయ్యాలన్నా, నోట్లో కిళ్ళీ వేసుకోవాలన్నా, సరదాగా సినిమాకెళ్ళాలన్నా కూడా పదిమంది గురించి ఆలోచించే ప్రసాద్ లాంటి వాళ్ళు ఏం ఆనందంగా వుండగలరు? హహహ… “
గొల్లుమని అందరి నవ్వులు.
“మీ నాన్న వాళ్ళు కూడా అంతే. అందుకే తీసుకుపోయాను. వాళ్ళెలాగూ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించే మనుష్యులుగాబట్టే … నలుగురిలో పడి ఏమీ చెయ్యలేరు.
మా పరువు తీసావని మీ నాన్నని తెగ నిందించారు. దానికే బెంగ పడిపోయి నల్లమందు నేర్చేసాడు. నాకెందుకు వాళ్ళు వాళ్ళూ ఎలా పోతారో. నామీదకి ఎవరూ రాలేకపోయేవారు, పరువుకోసం ప్రాకులాడే మనుష్యులు కదా.
యాతా వాతా ఏమైనా జరిగినాకూడా నామీదకి వాళ్ళెవరూ రాకుండా చూసుకుండేవాడు మీ నాన్న”
సరితకి ముందు ముందు కి ఏం చెయ్యాలో మంచి ఫీడ్ బ్యాక్ దొరికేస్తోంది.
(ఇంకా ఉంది)
-శ్రీసత్యగౌతమి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
3 Responses to ముసుగు-2(కథ ) -శ్రీసత్యగౌతమి,