భారత స్వాతంత్ర్య సమరం లో వీర మరణం పొంది అమరులైన అస్సాం వీర నారీమణులు శ్రీమతి కనకలతా బారువా ,మరియు శ్రీమతి సతి జయమతి మొదలైనస్త్రీ మూర్తుల నిస్వార్ధ త్యాగాలను ఈస్వాతంత్ర్య దినోత్సవ సమయం లో స్మరించుకొందాం .
కనకలతా బారువా:
అస్సాం లో దారంగ్ జిల్లా బోరంగ బారి గ్రామం లో 22-12-1924న కనకలతా బారువా జన్మించింది .ఆమెను బీర్బలా అని కూడా పిలిచేవారు .తండ్రి కృష్ణ కాంత్ ,తల్లి కామేశ్వరి .తాత గారు ఘనకాంత బారువా గొప్ప వేటకాడు .ఈమె పూర్వీకులు పూర్వపు దోలాఖారియా రాజ్యం వారు .తర్వాత దోలకారియా బిరుదును త్యజించి బారువాబిరుదును మాత్రమే ఉంచుకొన్నారు .అయిదేళ్ళప్పుడే తల్లిని కోల్పోయిన అభాగ్యురాలు కనకలత .తండ్రి రెండో పెళ్లి చేసుకోన్నాడు .కాని ఈమె 13 వ ఏట తండ్రికూడా గతించగా అనాధ అయ్యింది .మూడవ తరగతి వరకు స్కూల్ లో చదివి తన చెల్లెళ్ళు తమ్ముళ్ళ సంరక్షణ కోసం చదువు మానేసింది .
భారత స్వాతంత్రి సమరం లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం లో కనకలత పాల్గోని’’ అస్సాం సబ్ డివిజన్ లోని ‘’మృత్యు వాహిని ‘’అనే యువ దళంలో చేరింది .20-9-1942 న ఈ మృత్యువాహిని దళం పోలీస్ స్టేషన్ దగ్గర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయి౦చుకొన్నది .చేతులలో యే ఆయుధాలు లేకుండా ఆ గ్రామ యువజనం కనకలతా బారువా నాయకత్వం లో పోలీస్ స్టేషన్ కు పెద్ద ఊరేగింపుగా బయల్దేరింది .పోలీస్ ఇన్స్పెక్టర్ రేబతిమోహన్ శోం వారిని ఊరేగింపు అపు చేయకపోతే తీవ్ర పరిణామాలు జరుగుతాయని హెచ్చరించాడు .బెదరక చెదరక మొక్కవోని ధైర్యం తో కనకలత తన బృందాన్ని ముందుకే నడిపించింది ..పోలీసులు వారిపై తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు .చేతిలోని జాతీయ పతాకను వదిలిపెట్టకుండా కనకలత తుపాకి గుళ్ళకు ఎదురొడ్డింది .తూటాలు ఆమె గుండెను చీల్చుకొని రాగా కనకలతా బారువా అక్కడికక్కడే కుప్పకూలి వీరమరణం పొందింది .అప్పటికి ఆమె వయసు 17 సంవత్సరాలు మాత్రమే .ఆమె చేతిలోని జాతీయ పతాకను ముకుంద కాకోటి చేతిలోకి తీసుకొని ముందుకు నడిచాడు .అతనిపైనా కాల్పులు జరుపగా ఆయనా అక్కడికక్కడే మరణించి అమర వీరుడయ్యాడు .
ఇండియన్ కోస్ట్ గార్డ్ కు చెందిన తీర రక్షణ నౌకకు కనకలతా బారువా పేరు పెట్టి భారత ప్రభుత్వం గౌరవించింది .20 11 లో కనకలత నిలువెత్తు విగ్రహాన్ని గౌరీ పూర్ లో నెలకొల్పి ఘనమైన నివాళులు అర్పించారు .
సతి జయంతి:
భారత స్వాతంత్ర్య పోరాటం లో ఏమాత్రం సందేహించకుండా తమ రక్త తర్పణం తో భారత మాత ఋణం తీర్చుకొన్న అస్సాం దేశ భక్తు లెందరో ఉన్నారు .అందులో సతి జయంతి త్యాగం స్మరించ దగినది .అస్సాం రాజ్యం లో లోరా రాజ్యం లో విచ్చల విడిగా పెరిగి పోయిన అన్యాయం ,అవినీతి లపై ఎదురు తిరిగి పోరాడి ప్రాణాలర్పించిన మహా గొప్ప మహిళా సత్యాగ్రహి ,త్యాగ మూర్తి సతి జయతి .ఆమెను పెట్టిన మానసిక, శారీరక క్షోభ ,కాని చావు అంటే భయం కాని ఆమె స్థిర నిర్ణయాన్ని మార్చలేక పోయాయి .అంతటి నిర్భీక నిర్ణయాత్మక స్త్రీ మూర్తి ఆమె .అస్సాం రాజు సులిక్ఫా అవినీతి అన్యాయ పాలనపై జయంతి స్పందించిన తీరు అస్సాం ప్రజల కు కనువిప్పు కలిగించి ఆమెకు మద్దతునిచ్చి గొప్ప ఉద్యమాన్నే నిర్వహించారు .ఫ్రాన్స్ దేశపు జోన్ ఆఫ్ ఆర్క్ లాగా సతి జయంతి భాసించింది .
ఉషామెహతా:
ఎనిమిదేళ్ళ వయసులోనే ఉషా మెహతా బాల విప్లవ కారిణిగా గుర్తింపు పొందింది .సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమం లో బ్రిటిష్ ప్రబుత్వం పై పోరాడిన చిట్టి తల్లి ఉషా మెహతా .తండ్రి బ్రిటిష్ ప్రభుత్వం లో జడ్జి అయినా ఆమె భయ పడలేదు వెనుకడుగు వేయలేదు .తండ్రి నయానా భయానా ఆమెను ఉద్యమంలో పాల్గొనవద్దని హెచ్చరించాడు .ఆమె అన్ని బంధనాలను త్యజించి భారతమాత దాస్య విముక్తికోసం ముందుకే ఉరికింది .చదువు మానేసి ఉద్యమమే ఊపిరిగా జీవితం సాగించింది .అండర్ గ్రౌండ్ లో రహస్య రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేసి క్విట్ ఇండియా ఉద్యమం లో వార్తా ప్రసారం చేసిన ధైర్య సాహస నారి మెహతా .తనతో బాటు అనేక బాలబాలికలను ఉద్యమ సభలలో ఊరేగింపులలో మొహరించి గొప్ప చొరవ చూపింది .
– గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~