రాత్రికుంపటి(కథ ) – తెలుగు కవితలు

krishna .d“అమ్మా..! అమ్మా..! మనింటికి ఎవరో వస్తున్నారు” లోపలికి పరిగెత్తుకొని వచ్చి తల్లి రమణికి చెప్పాడు కొడుకు గోపాల్. “ఎవరమ్మా?” అని తలపైకెత్తి చూసింది రమణి. ఎదురుగా హరిత. రమణి ఆప్తురాలు హరిత. చాన్నాళ్ళ తర్వాత ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఆనందపడ్డారు. హరిత అంది “ఎప్పుడో చిన్నప్పుడు మాటలు నేర్చుకునేటప్పుడు వీడిని చూశాను. మళ్ళీ ఇన్నాళ్ళకు చూస్తున్నా! హాయ్ బాబు..! నీ పేరేంటి?” అని అడగ్గానే “గోపాల్” అని సమాధానమిచ్చాడు. “ఫర్వాలేదే ధైర్యంగానే మాట్లాడుతున్నాడు వీడు” అంది హరిత. రమణి నవ్వింది. “ఎవరు పేరు అడిగినా వెంటనే చెప్పాలని మా టీచర్ చెప్పారు” అకస్మాత్తుగా అన్నాడు గోపాల్. “ఓ.. అవునా? అప్పుడే బడికి కూడా వెళ్తున్నావా? నీ వయస్సెంతమ్మా?” ఆశ్చర్యపోయింది హరిత. “బళ్లోనా? బస్ లోనా?” అడిగాడు గోపాల్. ఆశ్చర్యం ఇంకా పెరిగింది. “ఏంటి రెండూ వేర్వేరా? అయితే రెండిట్లో కావాలి చెప్పు” అంది హరిత. “బళ్ళో అయితే ఐదు, బస్ లో అయితే మూడు”అని చెప్పి తల్లి చాటుకు వెళ్ళాడు గోపాల్. “ఓరి గడుగ్గాయ్! ఎంత తెలివిరా?” అంటూ బుగ్గలు పట్టుకోబోయింది. తప్పించుకున్నాడు. ముగ్గురూ నవ్వుతున్నారు. కుర్చీలు తీసుకొచ్చి ఎదురెదురుగా ఇద్దరూ కూర్చున్నారు. అఖిలేష్ ఎక్కడని, ఏం చేస్తున్నాడని హరిత అడిగితే రమణి సమాధానం ఇవ్వకుండా కూర్చుంది. కారణం తెలుసుకునే లోపు గోపాల్ మారం చేయడం మొదలెట్టాడు.

“అమ్మా…అమ్మా… నేను కూడా దిలీప్ వాళ్ళ బళ్ళో కెళ్తాను” అంటూ కొంగును పట్టుకొని రమణీని అడిగాడు గోపాల్. “ఆ ప్రకాష్ గాడు వెళ్ళే బడికేళ్తున్నావు కాదమ్మా! మళ్ళీ దిలీప్ వాళ్ళ బడికెందుకు?” అడిగింది రమణి బిడ్డను దగ్గరకు తీసుకుంటూ. “నాకిది నచ్చలేదు. దిలీప్ వాళ్ళది నచ్చింది. నేనక్కడికే వెళ్తాను. పంపించావా అమ్మా..!” అలుగుతూ చెప్పాడు గోపాల్. “ఎందుకని నాన్నా?” అలకని తీర్చడానికి అడిగింది రమణి. “మరేమో… మరేమో… వాళ్ళ బళ్ళో మంచి బట్టలు వేసుకుంటున్నారు. షూలు వేసుకుంటున్నారు. వ్యాన్ లో వెళ్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. నాకు రాదని కిరణ్ గాడు ఏడిపిస్తున్నాడు. నేనక్కడికే వెళతాను. పంపించమ్మా..!” కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు గోపాల్.తన స్నేహితురాలి ముందే తమ బాధలను కొడుకు బయట పెట్టడంతో రమణి చిన్నబుచ్చుకుంది. ఒకరి మొహాలు ఒకరు చూసుకొని “మనకు అంత డబ్బు లేదమ్మా. గవర్నమెంట్ దాంట్లో చదువుకోమ్మా” ప్రాధేయపడింది రమణి. “నాకు తెలవదు నేను కిరణ్, దిలీప్ వాళ్ళ బడికే వెళ్తాను. నన్ను పంపించు. నన్ను పంపించు” మారాం చేశాడు గోపాల్. “అలాగే…అలాగే…ఏడవకు. పంపిస్తాను, అక్కడికే వెళ్దువుగాని సరేనా! వెళ్లి ఆడుకో. తర్వాత అన్నం తిని పడుకుందువు గాని…వెళ్ళు” సర్ది చెప్పింది రమణి.

పిల్లాడు మారం చేయడంలో తప్పు లేదు. సమాజమేంతో మార్పు చెందుతుంది. చుట్టిపక్కల వాళ్ళను బట్టే, పరిస్థితులను బట్టే మన బుద్ధి నడవడిక ఆధారపడి ఉంటాయి. పోటి ప్రపంచంలో పరిగెత్తడానికి కాన్వెంట్ల వెంట పరుగెడుతున్న చిన్నారులను చూసినప్పుడల్లా బిడ్డకు అటువంటి జీవితాన్ని ఇవ్వలేక పోతున్నానన్న బెంగ ఎక్కువుగా రమణిని ఆవహిస్తుంది. పిల్లాడుకు ఏదో సర్ది చెప్పినా తన మనస్సు మాత్రం కుదుట పడలేకపోతుంది.

“సరేనే! నేను బయలుదేరతాను” అంది హరిత. “అదేంటే! వచ్చి ఎంతోసేపు అవ్వలేదు. అప్పుడే వెళ్తానంటున్నావ్” అడిగింది రమణి. “శ్రీకాంత్ వచ్చే టైం అయింది రమ, వెళ్ళాలి” చెప్పి కుర్చీల్లోంచి లేచి గుమ్మం దగ్గర వరకూ వచ్చింది హరిత. “సరే! వీలు చూసుకొని మళ్ళీ కలుద్దాం” అంది రమణి. “సరే! ఉంటాను” అని చెప్పి వెళ్ళిపోయింది హరిత.

ఎక్కడో చిన్న రోదన. అదో మనో వేదన స్వరాన్ని పెంచుకుంది. లీలగా వినిపిస్తుంటే రమణి కంగారు పడింది. శబ్దాన్ని అనుసరించుకుంటూ వెళ్ళగా భర్త అఖిలేష్  కన్నీళ్ళతో కన్పించాడు. రమణి అలికిడి చేసింది. “ఎందుకండీ బాధ పడుతున్నారు?” తడబడుతున్న స్వరంతో అడిగింది రమణి. “అబ్బే! అదేం లేదు రమ. చీకటి బాగా పడింది. వెళ్లి బాబుకి అన్నం పెట్టి పడుకోపెట్టు. వెళ్ళు” తనకు కనపడకూడదన్న ఉద్దేశ్యంతో తుడుచుకుంటూ సమాధానమిచ్చాడు అఖిలేష్. “మీరిలా బాధ పడుతూ కూర్చుంటే నేనింకా బాధ పడతాను. మీరు కొంచెం నిగ్రహంగా ఉండండి ప్లీజ్” అంది రమణి బాధను గొంతులోనే దాచుకుంటూ. “చీకటి సృష్టి కార్యాన్నే కాదు మన లాంటి వాళ్ళ బాధలను కూడా ప్రపంచానికి తెలియకుండా దాచేస్తుంది రమ. నీ బాధ నాకు తెలుసు, నా బాధ నీకు తెలుసు, మన బాధ బాబుకు తెలియక ఆనందంగా ఉన్నాడు. తీర్చలేని కోర్కెలు కోరుతున్నాడు. అవేవి తీర్చలేని వాడిగా దేవుడు నాకీ పరిస్థితి కల్పించాడు.తండ్రిగా నా బాధ్యతను నేను నేరవేర్చలేకపోతున్నాను.బాధ పడడం తప్ప ఇంకేం చేయగలను. నిన్ను సుఖపెట్ట లేకపోతున్నాను. అంతా నా ఖర్మ. పెద్దలను ఎదిరిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి” అంటూ కన్నీటి ప్రవాహాన్ని ఆపలేకపోతున్నాడు అఖిలేష్. నోట మాట లేక అతన్ని కౌగిలించుకొని ఓదార్చింది రమణి. ఓదార్పు మనిషికి దివ్యమైన ఔషదం.

                  *                      *                    *                        *                     *                              *

 అనుకూలంగా లేని పరిస్థితులు. ప్రతికూలంగా మారిన పరిస్థితులు. మనిషి ఆలోచనలను మార్చేసే పరిస్థితులు అతన్ని కోలుకోనివ్వకుండా చేస్తాయి. తప్పులను సరిదిద్దు కొనివ్వకుండా చేస్తాయి. ప్రేమ పెళ్లి. తల్లీదండ్రులను ఎదిరించి చేసుకున్న అపురూపమైన పెళ్లి. కులాంతరాలు, మతాంతరాలు దాటి చేసుకున్న పెళ్ళిళ్ళు అపజయాన్నే చూస్తున్నాయి. కులం నచ్చకపోయినా మతం నచ్చకపోయినా ఆవేశాలు పెరిగిపోతాయి. వివేకం తగ్గిపోతుంది. ఆలోచనలు దారి తప్పుతాయి. వెలివేస్తారు. దూరంగా తరిమేస్తారు. అవసరమైతే నామ రూపాల్లెకుండా చేస్తారు.

ప్రేమించుకునేటప్పుడు రాని ఆలోచన పెళ్ళయ్యాక వచ్చినా వ్యర్ధమే. నలుగురిలో లేనప్పుడు నువ్వంటూ ఉన్నా లేనట్లే. కులానికి బలం లేదు. మతానికి బలం లేదు. కాని వాటిని పాటించే వారిలోనే బలం ఉంది. సంస్కృతి సంప్రదాయాలు మనిషి బ్రతకడానికి నిర్దేశించు కున్నవే అయినా అవి లేకుండా బ్రతకలేక పోతున్నాడు. మిగిలిన జీవులు మాత్రం అవేమి లేకుండా జీవిస్తున్నాయి. అఖిలేష్, రమణి లది కులాంతర వివాహం. అది ప్రేమ పెళ్లి. ఇరవై ఏళ్ల ప్రాయంలో పడుచు అందాలు చూసినప్పుడు రసిక హృదయాలు మేల్కొంటాయి. ఏ మనస్సు ఎవ్వరివైపు మొగ్గు చూపుతుందో చెప్పలేం. అది దైవ నిర్ణయం.

రమణి అందాన్ని చూశాక తను నాకే సొంతం అనుకున్నాడు అఖిలేష్. రమణి కూడా అలాగే ఊహించుకుంది. వీరిద్దరినీ చూసినప్పుడు విడగొట్టి దక్కించు కోవాలనుకున్నాడు నాగరాజు. మనస్సులు కలిసి మనువు దాక వెళ్ళింది వ్యవహారం. ఇరు కుటుంబాలకు నచ్చక వేరే కాపురం అదే ఊరిలో పెట్టారు. కొన్నేళ్ళు బాగానే గడిచాయి. తర్వాతే మొదలైంది రాహుకాలం. అఖిలేష్ కు పక్షవాతం వచ్చింది. బిడ్డను చూసుకుంటూ చిన్న చిన్న పనులను చేసుకుంటూ కుటుంబాన్ని నేట్టుకొస్తుంది. ఇంత జరిగినా పెద్దల మనస్సు కరగలేదు, పట్టింపులు వదల్లేదు. గోపాల్ కు ఊహ తెలిసి నచ్చినవి అడుగుతుంటే అవి సమకూర్చలేక ఇద్దరూ మనోవేదన అనుభవిస్తున్నారు. అర్ధ రాత్రయింది. ఆలోచించింది. ఆలోచించింది. ఒక ఉపాయాన్ని ఆలోచించింది. తమ జీవితాన్నే మార్చే ఒక నిర్ణయాన్ని తీసుకుంది.

                *                         *                     *                        *                *                         *
“ఎస్.ఐ.గారు! ఇదుగోండి బెయిల్ పేపర్స్” ఎదురుగా వచ్చి ఎస్.ఐ.గార్కి బెయిల్ పేపర్స్ అందిస్తూ అన్నాడు లాయరు. “ఏంటండి మీరు కూడా?ఇది రెండో సారి! పట్టుబడడానికి ఆమెకు సిగ్గులేదు. బెయిల్ ఇవ్వడానికి మీకు సంస్కారం ఉండొద్దా? ఇంకాసేపు అయితే కేసు కూడా బుక్ చేసేసేవాడినే. అప్పుడు మీడియా వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. తృటిలో తప్పించుకుంది. ఇంకోసారి అయితే కష్టం సర్. చెప్పండామెకు!” అని చెప్పి తాళాలు తీయమని కానిస్టేబుల్ కు చెప్పాడు ఎస్.ఐ. “చూడమ్మా హరిత! ఎస్.ఐ. గారు కోప్పడుతున్నారు. మళ్ళీ రిపీట్ అయితే నా సాయం మీకు అందదు.తనకి అర్ధమయ్యేలా చెప్పు. అర్ధం చేసుకోలేకపోతే ఇక్కడే జీవితాన్ని గడపాల్సి వస్తుంది” అసహనంగా చెప్పాడు లాయరు. “అలాగే మామయ్యా! నేను చూసుకుంటాను. చాల థాంక్స్ మామయ్యా” కృతజ్ఞతలు చెప్పింది హరిత. “ఫర్లేదు, ఇంకోసారి ఈ విషయమైతే నా దగ్గరకు రాకు” అని చెప్పి కారులో బయలుదేరి వెళ్ళిపోయాడు లాయరు.ఆమెను తీసుకొని ఆటోలో తన ఇంటికి బలవంతంగా తీసుకెళ్ళింది హరిత. ఇద్దరికీ చెరో కంచంలో భోజనం పెట్టింది. బాధతో అన్నంను ముట్టుకోలేదు రమణి. ఓదార్చింది హరిత.

“ఇప్పుడైనా తెలుసుకోవచ్చా?” ప్రశ్నించింది హరిత. “నన్నేమి అడగొద్దు” సమాధానమిచ్చింది రమణి. “పోయినసారీ ఇలానే అన్నావ్.నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక బలవంతం చేయలేదు.ఎవరో కావాలనే నిన్ను ఇరికించారు అన్నావ్. కాని ఇప్పుడు ఆలోచిస్తుంటే నీదే తప్పు అనిపిస్తుంది” అంది హరిత. “ప్లీజ్ హరి, నన్నేమి అడగొద్దు” బ్రతిమాలింది రమణి. “నన్నేమి అడగొద్దు అంటే ఎలా కుదురుతుంది రమ. సమయమొచ్చినప్పుడు చెప్తానన్నావ్.ఇది సమయమొచ్చి రెండోసారి.బాధపడకుండాచెప్పవే అసలేం జరిగింది?” వదల్లేదు హరిత.పర్వతం బద్దలైంది. అగ్నిపర్వతం చిమ్మింది. బాధనంతా కన్నీళ్ళ ద్వారా బయటకు పంపించే ప్రయత్నం చేసింది రమణి.”ఏం చెప్పమంటావ్?! నా బాధలు ఎన్నని చెప్పాను. ఏమని చెప్పను.బాబుభవిష్యత్ కోసమని, అఖిలేష్ జీవితం కోసమని ఇలా చేసానని చెప్తే నమ్మేదెవరు అర్ధం చేసుకునేదేవరు?” బాధ పడుతూ పైటకొంగును అడ్డం పెట్టుకుని ఏడ్వడం మొదలెట్టింది రమణి.

“నేను అర్ధం చేసుకుంటాను. వాళ్ళ కోసమైతే ఇంతకన్నా మరో మార్గం దొరకలేదా?” అడిగింది హరిత. “దొరుకుతుంది. కాని ఈ జన్మలో అనుకున్నవి మాత్రం జరగవు. జీవచ్చంలా ఉండాల్సిందే!టీనేజి లోకి అడుగుపెట్టగానే మనలో కలిగే కోరికలను ప్రేమనుకొని దాని వెంట పరిగెత్తిన నాలాంటి వాళ్ళకీ జీవితమే ఉండదు హరి. కళ్ళ ముందు జరుగుతున్నవి చూస్తున్నా ఉడుకురక్తం ఆగదు. ప్రేమ పేరుతో చదువును నిర్లక్ష్యం చేయడం వలన అర్హతేమొస్తుంది, ఇంక ఉద్యోగాలేమోస్తాయి చెప్పు. ప్రేముంటే చాలు జీవితాన్ని ఎలా అయినా లాగించేయొచ్చు అనుకుంటూ తప్పటడుగులు వేసే వాళ్ళు ఎంత మంది బాగుపడ్డారో తెలుసా? ఎవ్వరూ లేరు. ఇదంతా నా తొందరపాటు తనం. నా ఖర్మ” బాధపడుతూనే బదులిచ్చింది రమణి. “ఓకే! ఓకె!ఇందులోకి ఎందుకేల్లావ్? పోలీసులకు ఎలా దొరికావ్? ఎంతో మంది ఉన్నా నువ్వే ఎలా? అసలేం జరిగిందో నాకన్నా చెప్పవే. సాధ్యమైతే పరిష్కారం ఆలోచిద్దాం”ధైర్యాన్నిచ్చింది హరిత.ధైర్యానికున్న ఆయుధం-తెగించడం. జరిగినదంతా చెప్పడం మొదలెట్టింది రమణి.

              *                            *                      *                  *                       *                       *
“బాబు గోపాల్ కాన్వెంట్ కు వెళ్తానని మారం చేయడం నీకు తెలుసు కదా! వాడు రోజూ అలాగే మారం చేస్తున్నాడు.వాడిని కాన్వెంట్ కు పంపిద్దామని ఫీజులు గురుంచి వాకబు చేస్తే సంవత్సరానికి పది వేలకు పైన కట్టాల్సి వస్తుందని చెప్పారు. అంత కట్టడం నా వల్ల కాదని ఊరుకున్నాను. మా వారికి ఆరోగ్యం బాగోక ఆసుపత్రికి తీసుకెళ్ళాను. ఎదో కొత్త పరీక్షను చేశారు డాక్టర్ గారు. ఎందుకు చేశారోనని నేను ఆలోచిస్తుండగానే ఆయన లోపలి పిలిచి విషయం చెప్పారు. పక్షవాతం నయమయ్యే అవకాశాలు ఉన్నాయని, దాని కోసం 2 లక్షల నుండి 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. ఒక్కసారే నా గుండె పగిలినంత పనయ్యింది. పిల్లాడికి పది వేలే కట్టలేక ఊరుకున్న నేను అంత డబ్బు ఎక్కడ్నుంచి తెచ్చి కట్టను. నా అవస్థను చూసి అఖిలేష్ బాధ పడుతుండేవాడు. చాలా తప్పు చేశామని, నా జీవితాన్ని నాశనం చేశానని తనలో తనే తిట్టుకునేవాడు. ఇటు చూస్తె గోపాల్ కాన్వెంట్ అంటూ మారం చేయడం మానలేదు. ఆయనేమో తన పరిస్థితికి క్రుంగిపోతున్నారు. నా బుర్ర పనిచేయడం లేదు.‘నా పరిస్థితేంటి రా దేవుడా’ అనుకుంటూ పరిపరివిధాలుగా ఆలోచిస్తున్న నాకు అకస్మాత్తుగా షాక్.

ఒకరోజు నాగరాజు నన్ను కలిశాడు. వాడికి విషయమేలా తెలిసిందో నాకు తెలియదు. బయట ఎవ్వరికీ తెలియదనుకున్నా కానీ అందరికీ తెలుసునన్న సంగతే నాకు తెలియదని అర్ధమైంది. ‘నన్నేమన్నా సాయం చేయమంటావా?’ అని అడిగేసరికి నాలో ఆశలు పెరిగాయి. అంత డబ్బు అప్పుగా ఇవ్వడం కుదరదని, ఏదైనా షూరిటీ కావాలని చెప్పాడు.కన్నవాళ్ళకు, మెట్టినిల్లు వాళ్లకు తర్వాతా సమాజానికి దూరమైన మాకు ఆస్థిపాస్తులెం ఉంటాయి. షూరిటీ గా తన దగ్గరే పెట్టేది ఉంటె దాన్నే అమ్మేసి గట్టెక్కే వాళ్ళం కదా! అదే విషయాన్ని అతనికి చెప్తే వినలేదు.

మరోదారి ఏదన్నా ఉంటే చెప్పమని బ్రతిమాలాను. కాని వాడు చెప్పింది విన్నాక సమాజం మీదే విరక్తి కలిగింది. ‘బుద్ధం శరణం గచ్చామీ’ అని బుద్దుడు సమాజాన్ని శరణు కోరుకుంటే సమాజమే అండగా నిలుస్తుందని చెప్పాడు. కాని సమాజంలోని వ్యక్తులకు నేనే ఒక ఆట బొమ్మగా మారాల్సివస్తుందని గ్రహించాక ఏడుపొచ్చింది. ఏం చేయను? నిరాదరణకు గురైన వాళ్ళంటే అందరికీ చులకనే కదా! నేను ఒప్పుకోలేదు. కనిపించినప్పుడల్లా అడిగేవాడు. పైగా దానికైతే షూరిటీ ఏమీ అవసరం లేదనేవాడు. అందుకు నా మనస్సు అంగీకరించలేదు. కష్టాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ లాగానే ఉన్నాయి. రోజులు గడుస్తున్నాయి కానీ పైసలు కనపడ్డం లేదు. సాధ్యమైనంతగా ప్రయత్నించాను. మొహం తిప్పుకున్న వాళ్ళే కానీ సాయం చేసే వాళ్ళే లేరు. అది చూసి వాడు విరగబడి నవ్వేవాడు.వాడి నవ్వు అలవాటైపోయింది.కన్నవాళ్ళు తిట్టి పంపించేసారు. వారిని కాదని వచ్చినందుకు శిక్ష ఇలా విధించారు. అత్తా మామలైతే గుమ్మంలోకే రానివ్వలేదు.నేను ఒప్పుకుంటానని వాడికెందుకు అంత నమ్మకమో అప్పుడర్ధమయ్యి వాడిని కలిశాను.” బాధనంతా దించేసుకున్నట్లు గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలింది రమణి. హరిత మొహం కూడా బాధను అలుముకుంది.

“సారీ రమ! ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఐ యాం వెరీ సారీ!వాడేమన్నాడు?” అడిగింది హరిత అప్రయత్నంగా తన కళ్ళను నలుపుకుంటూ. “ముందు వాడి కోరిక తీర్చుకున్నాడు. తర్వాత ఒక చోటికి తీసుకెళ్ళాడు. భయం వేసింది. ఒక పక్క తప్పు చేస్తున్నానేమో నన్న భయంకరమైన భయం, మరోవైపు అది తప్ప ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. ఎదనిండా నింపుకున్న కఠినమైన ఆలోచనలతో వాళ్ళ ముందు నుంచున్నాను.అక్కడంతా గజిబిజి.సభ్యతలోనూ, మాటల్లోనూ అసభ్యతను పరుష పదజాలాన్ని చూస్తున్న నాకు కొత్తగా తోచి తమాయించుకొని తలవంచుకొని నిల్చున్నాను.వాడు లోపలికెళ్ళి కాసేపాగి వచ్చాడు. ఒక్కసారి ఆ కూపంలోకి వెళ్తే రాత్రింబవళ్ళు అక్కడే ఉండాలని నా విషయంలో మాత్రం మినహాయింపని ఏదో మాట్లాడానని చెప్పి నన్ను లోపలికి పంపించాడు. ఒక గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు.ఉండడానికి ఇళ్ళు లేక, కట్టుకోవడానికి సరైన స్థలాలు దొరక్క జనాలు ఇబ్బంది పడుతుంటే ఈ పనుల కోసమని వాళ్ళకంత వెసులుబాటు ఎలా దొరికిందో అర్ధం కాలేదు. మనస్సేమో బాధపడుతుంది. నా బ్రతుకు కోసం దాన్ని చంపెయ్యాల్సిందే! అది మరణించినా అడిగే ఆప్తులు ఎవ్వరూ ఉండరు. నేనందుకు మినహాయింపు కదా!” అంటూ బాధపడింది రమణి. కొంచెం మంచినీళ్ళు త్రాగింది. మరేం మాట్లాడలేదు.మౌనం వారి ఆశ్రయమైంది.

“అదంతఘోరమైన ప్రదేశమా? అంతలా హింసించారా నిన్ను?” అంటూ గద్గద స్వరంతో అడిగింది హరిత. “మంచం మీద కూర్చున్నానన్న మాటే గాని మనసంతా నా ఆధీనంలో లేదు హరి.దిక్కులు చూస్తూ ఉండిపోయాను. బలిష్టంగా ఉన్న ఒకడోచ్చాడు.ఆడదాన్ని ఎప్పుడూ చూడనట్లు, ఎప్పుడూ ముట్టుకోనట్లు ఒకరితో సంబంధం లేదన్నట్లుగా ఉంది వాడి ప్రవర్తన. నేనెందుకు ఇక్కడికి రావాల్సివచ్చిందో పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. నాకేనా కష్టాలు? అందరికీ ఉంటాయి. వాళ్ళ ఒత్తిడిని తగ్గించుకోవానికి వారెంకున్న మార్గం ఇది.ఎంత సంపాదిస్తే ఏం లాభం సుఖం లేకపోతే అనేది వారి అభిమతమని అర్ధమైంది. అతని చూపు అర్ధం మారింది. పెదవులకు చిన్న వణుకు మొదలైంది. వాడికి తన్మయత్వంతో చిరు చెమటలు పట్టాయి. తట్టుకోలేక నన్ను సమీపించాడు.

పలకరింపులతో మొదలైన రసిక మాటల మాయలో పడిన అతను ఆలస్యం చేయడానికి సిద్ధంగా లేడు. ఇద్దరి తనువుల్లోనూ స్వేదపు ప్రవాహం పరుగులు తీస్తుంది. ఏడుపోక్కటే తక్కువయింది నాకు. అతనేళ్ళిపోయాక డబ్బులిచ్చారు. నా చేతిలో పడిన కరెన్సీ నోట్లను చూడగానే పడ్డ బాధంతా ఎగిరిపోయింది. కొత్త ఆశలకు నీళ్ళు పోసినట్లయింది. క్షణకాలంలో రెండు భావోద్వేగాలకు కొలువైంది నా మొహం.తర్వాత వచ్చేశాను.కొన్నాళ్ళు పాటు అల్లాగే వెళ్లాను. బాబుని కాన్వెంట్ లో చేర్పించాను. అప్పుడు వాడి కళ్ళల్లో కనిపించిన ఆనందానికి నేను పడ్డ బాధ ఒక లెక్క కాదనిపించింది. వాడికన్నీ సమకూర్చ గల్గుతున్నాను. అఖిలేష్ కూడా మంచం పైనుండి లేచి పూర్వంలా నడిస్తే ఎంత బావుణ్ణు అన్న ఆలోచన నన్ను కొనసాగేలా చేసింది” పైటకొంగుతో కన్నీళ్లను తుడుచుకుంటూ అక్కడనుంచి లేచి వెళ్లి కిటికీలోంచి బయటకు చూస్తుంది రమణి.వెనకనే అనుసరిస్తూ భుజంపై చేయి వేసి “బాధ పడకు రమ” అంది హరిత.

“ఎవరికైనా చెప్పుకోవాలని మనస్సులో ఉంటుంది. భయం వేస్తుంది. ఎవరికీ పడితే వారికి చెప్పుకోలెం. నీకు మాత్రం వివరంగా చెప్పాలనిపించింది. ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క ఆప్తురాలివి నువ్వే. నేనేం అనవసరంగా వ్యభిచారంలోకి దిగలేదు. నా కష్టాలే నన్ను బలవంతంగా తోసేశాయి. అందులోనూ కష్టాలున్నాయి. అది నువ్వు అర్ధం చేసుకుంటే చాలు హరి” అంది రమణి, హరిత కళ్ళల్లోకి చూస్తూ.

“అదేం మాట రమ! నీమీదేప్పుడూ సాఫ్ట్ కార్నెర్ ఉంటుంది. అసలు నీవెందుకు అలా మారాల్సి వచ్చిందోనని తెలుసుకోవాలనే అడిగాను కాని బాధ పెట్టడానికి కాదు. దీనివల్ల నీమీదున్న మంచి అభిప్రాయం చెరిగిపోదు. నేను అర్ధం చేసుకోగలను. నీ ప్రేమ పెళ్ళికి అండగా ఉన్నాను కాని తర్వాత ఉండలేకపోయాను. తెలియంది ఏముంది అప్పుడు పుట్టినిల్లు – ఇప్పుడు మెట్టినిల్లు. రెండూ వేర్వేరు భిన్నాలు. ఆడది తనకి నచ్చినట్లు రెండు చోట్లా ఉండలేదు. ఒకరికి తలోంచుకునే నడుచుకోవాలి. అది మన ఖర్మ. అప్పుడు సపోర్ట్ చేసుండకపోతే నీ జీవితం మరోలా ఉంటుందని మొదటిసారి పోలీసులకు దొరికినప్పుడు అన్పించింది రమ! తప్పు చేశాననిపించింది. అది సరే పోలీసులు అంటే గుర్తొచ్చింది. అసలు పోలీసులకు ఎలా దొరికిపోయాయ్?” అడిగింది హరిత. “నేను దొరకలేదు హరి. వాళ్ళే పలుకుబడితో నన్ను పట్టించారు” బదులిచ్చింది రమణి. “ఏంటి.! పట్టించడమేంటి? వ్యభిచారమే తప్పు. అందులో మళ్ళీ ఒకళ్ళు దొరక్కుండా ఇంకొకళ్ళని పట్టించడమేంటి?” ఆశ్చర్యపోతూ అడిగింది హరిత.

“నువ్వు విన్నది నిజమే. కొన్నాళ్ళపాటు వెళ్తూ వస్తున్న నాకో విషయం తెలిసింది. నన్ను ఆ కూపంలోకి దించడం వలన వాళ్లకు బాగానే ముడుతుంది. కాని నాకు ఇచ్చేది మాత్రం సగమే.సగానికి సగం లాభం వాళ్లకి. ఒకరి దగ్గర కొంతకాలం చేశాక పాతదాన్ని అయిపోయానని ఇంకో పార్టీకి అమ్మేశారు. వాళ్లకు కొత్తదాన్ని అవుతాను కదా.!తెలిశాకఆవేశం పెరిగింది. అఖిలేష్ కు త్వరగా ట్రీట్మెంట్ చేయించాలని మనస్సు విపరీతంగా కోరుకుంది. అక్కడికి వెళ్ళడానికి కారణమే వాళ్ళే అయినప్పుడు వాళ్ళ గురించి కాక ఇంకేం ఆలోచనలుంటాయి.ఆవిషయమై వాళ్ళతో గొడవ పడ్డాను. నేనెక్కడ బయట వాళ్ళ సీక్రెట్స్ చెప్పేస్తానని వాళ్ళే ముందు నన్ను వ్యభిచారిగా సమాజానికి తెలిసేలా చేద్దామని తమ పలుకుబడితో కానిస్టేబుల్చేత స్టేషన్ కు రప్పించి జైల్లో పెట్టారు. ఎస్.ఐ.గారు మంచితనంతోమీడియాకు చెప్పకుండా వివరాలు కనుక్కొని మీకు కబురు పెట్టారు. అలా బయటపడ్డాను. నిన్ను స్టేషన్ కు రప్పించాల్సి వచ్చింది నన్ను క్షమించు హరి” అంటూ రెండు చేతులను పట్టుకొని అడిగింది రమణి.

“ఫర్వాలేదే! నేనన్నా ఉండబట్టి సరిపోయింది లేకపోతే నీ పరిస్థితిని తలుచుకుంటే బాధేస్తుంది రమ.రాజకీయాలు అన్ని చోట్లా ఉన్నాయన్నది రూడీ అయిపొయింది. చేసే తప్పులు దగ్గర రాజకీయాలా?” ఆశ్చర్యపడింది హరిత. “చేసే పనులు తప్పులైనప్పుడే రాజకీయాలు చేస్తారు. మంచి పనులకు రాజకీయాలు అవసరం లేదు కదా!” బదులిచ్చింది రమణి. “నువ్వు చెప్తుంటే నిజమేనని అన్పిస్తుంది.మొదటిసారంటే పట్టించారు మరి రెండో సారి కూడా పట్టించారా?” అనుమానంగా అడిగింది హరిత.

“బెయిల్ పై వచ్చాక నా మనసంతా మనస్సులో లేదు. అఖిలేష్ కు ఎక్కడ తెలిసిపోతుందోననిభయం భయంగా రోజులు గడిచాయి. గోపాల్ విషయంలో సంతోషంగా ఉన్నా అఖిలేష్ ను చూసినప్పుడల్లా మనస్సు చివుక్కుమనేది. ఏం చేయాలా! ఏం చేయాలా! అని ఆలోచిస్తుంటే బాగా డబ్బొచ్చే మార్గం కూడా ఇదే! ఈ సారి ఆ కూపంలోకి వెళ్ళకుండా నేనే మరో మార్గం వెతికాను. ఏకాంతంగా నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఆగాను. లారీ వాడు నన్ను చూసి ఆపేశాడు. రాత్రంటే లారీ అమితమైన ప్రేమ. పగలన్నా డ్రైవింగ్ మానుకుంటారేమో కాని రాత్రి మాత్రం మానరు. వారి కారణాలు వారికుంటాయి కదా! సపరేటు బేరం మాట్లాడుకోవడం ఎక్కడ్నుంచి చూశాడోగాని నాగరాజు గాడు చూశాడు. నేనే సొంతంగా అలా చేయడం వాడికి నచ్చుండక పోవచ్చు.వాడే పట్టించి ఉండొచ్చని నా అనుమానం” చెప్పింది రమణి.

“సర్లే జరిగిందేదో జరిగిపోయింది. ఇక మానేయ్. నన్ను అడిగినట్లయితే ఎంతో కొంత సాయం చేసేదాన్ని కదా! మా దగ్గరెందుకు దాచావ్?” అడిగింది హరిత. “ఇప్పుడైతే చెప్పుకోగాలిగాను గాని ఒకప్పుడు చెప్పలేని పరిస్థితి. బయటవారినిఎవరినైనా అడగడానికి మనస్సు ఒప్పుకుంటుందేమోకాని ఆప్తులను అదీ నీ లాంటి స్నేహితులను అడగడానికి ఆత్మాభిమానం అడ్డొస్తుంది హరి. మొహం చెల్లదు. తన తోటి వాళ్ళ వద్ద చులకన అవ్వాలనిపించదు. మీతో పాటే మేం కూడా అనిపించుకోవాలని ఉంటుంది. మీకన్నా తక్కువ అనిపించుకోవాలనిపించదు” చెప్పింది రమణి. “ఎందుకే నా దగ్గర అంత మొహమాటం. మొహమాట పడి పీకలమీదకి తెచ్చుకున్నావ్. కొంత కూడబెట్టా నంటున్నావ్ కదా దానికి కొంత నేను ఇస్తాను. అఖిలేష్ కు ఆపరేషన్ చేయించు. మళ్లేప్పుడూ ఆ కూపంలోకి వేళ్ళకు”అంది హరిత. ఆనందభాష్పాలతో తన రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకుంది రమణి.

                   *                *                  *                   *               *                    *

“నీ సాయం మర్చిపోలేనిది, తీర్చలేనిది హరిత. నీకెప్పుడూ రుణపడి ఉంటాను” అంటూ కాళ్ళు పట్టుకోబోయింది రమణి. “అదేం మాటే!నీ పెళ్ళికి సాయం చేసి తప్పు చేశానేమోనని బాధపడుతుంటే ఇప్పుడీ సాయం చేసి ఆ బాధను తుడిచేసుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాలి”అంది హరిత. “’బుద్ధం శరణు గచ్ఛామి’కి నువ్వు ప్రతిరూపంగా కన్పిస్తున్నావ్ హరి.నీది చాల మంచి మనసే! అది గ్రహించలేక రాత్రి కుంపటి పెట్టాల్సి వచ్చింది. వ్యభిచారిగా మారాల్సి వచ్చింది. ఇప్పుడు నన్ను బయట పడేశావు. లేకపోతే…” అంటూ ఏడుస్తుంది రమణి.

“ఏడవకు! ఇప్పుడు నీకు రావాల్సింది కన్నీళ్లు కాదు. ఆనంద భాష్పాలు. అఖిలేష్ తిరిగి మళ్ళీ మామూలు మనిషి అవుతున్నందుకు పండగ చేసుకోవాలి మనం. చూడు- అదిగో చూడు- అక్కడ ఆపరేషన్ మొదలైంది. శుభవార్తే వస్తుంది. నువ్వు కంగారు పడకు” అంటూ ఐ.సి.యు. వైపు చూపించింది హరిత. “నేను కోరుకునేది అదేనే. నీ సాయం- నీ మాట మా జీవితాన్ని నిలబెడుతున్నాయి హరి” అంటూ ఐ.సి.యు. వైపు చూస్తూ నిలబడిపోయింది రమణి.

-తెలుగు కవితలు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

కథలు, , , Permalink
0 0 vote
Article Rating
2 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
sujatha thimmana
sujatha thimmana
4 years ago

ప్రేమ పెళ్ళిళ్ళ వల్ల జరిగే కష్ట నష్టాల గురించి తెలియజేస్తూ…మంచి కథను అందించారు…అభినందనలు…తెలుగు కవితలు..

తెలుగు కవితలు
తెలుగు కవితలు
4 years ago

ఓపికగా కథ మొత్తం చదివి మీ అమూల్యమైన స్పందనను తెలియజేసినందుకు ధన్యవాదములు “సుజాత తిమ్మన” గారు…!