జ్ఞాపకం – (ధారావాహిక) 1–అంగులూరి అంజనీదేవి

           అంగులూరిఏదైనా ఒక పుస్తకాన్ని నలిగిపోకుండా చదవడం, ఎదుటి మనిషిని గాయపరచకుండా మాట్లాడటం ఓ కళ. ఆ కళ లేకుండా భూమ్మీద ఎక్కడ తిరిగినా అవయవ నిర్మాణం సరిగా లేని ఓ జంతువు అరణ్యంలో అడ్డదిడ్డంగా తిరిగినట్లే.! కొండను ఎక్కటం కన్నా దిగటం తేలిక. కాని కొండపై ఉన్నప్పుడే కదా కిందవున్నవన్నీ చక్కగా కన్పిస్తాయి. అలా జరగనప్పుడు పొందదలచినదేదో, పొందినదేదో గ్రహించలేనప్పుడు ప్రతి కాంక్షా తలతిప్పుకుని తల్లడిల్లుతుంది. అందుకే అంటారు జీవితం ఒక గొప్ప ఆయుధ కారాగారం అని. ఎవరి కోసం ఎప్పుడు ఏ ఆయుధం తీస్తుందో తెలియదు. ఏ మొనతోఎప్పుడు గుచ్చుతుందో తెలియదు. దాటుకుందామన్నా, తప్పుకుందామన్నా, చాటుకువెళ్లి చెప్పుకుందామన్నా వీలుకాదు.

           సహజమైన సంబంధాలను మరచి ఆనందాన్ని పొందటం అంటే నీటి బయటకి వచ్చి చేప పొడిఇసుకలో పొర్లటం లాంటిది. అది తెలుసుకోగలిగినప్పుడే ఏ గురువుతో సంబంధం లేకుండా తమలో వున్న శక్తిని తాము బయటకు తీసుకోగలుగుతారు. పైకి ఎక్కటానికి వాడుకున్న నిచ్చెనను కాలితో తన్నెయ్యకుండా కిందకి దిగటానికి కూడా దానిని ఉపయోగించుకుంటారు. జీవితాన్ని మనసుపొరల్లోంచి జారిపోకుండా ఒడిసిపట్టుకోగలుగుతారు.

             దేనితో నైనా యుద్ధం చేసి తమ ధైర్య, సాహసాలను నిరూపించుకోగలుగుతారు. యుద్ధం లేనిదే ఏదీ దొరకదు. అదే జీవిత యుద్ధo.!
             

                      ఆదిపురి రాగానే బస్‌ దిగిన జయంత్‌కి ఎటు వెళ్లాలో తెలియలేదు. ఆలోచిస్తూ నిలబడ్డాడు. జయంత్‌తో పాటు బస్‌ దిగిన వాళ్లలో కొందరు అతన్ని గమనించకుండా వాళ్లపాటికి వాళ్లు వెళ్లిపోతున్నారు. కొందరు ఎవరీ అబ్బాయి అన్నట్లు అతన్నే చూస్తున్నారు. ఒక్క భరద్వాజ మాత్రం ‘‘నిబడ్డావ్‌ ! ఎవరికోసం బాబూ ! ఎవరైనా వస్తున్నారా! ఈ ఊరికి కొత్తలా వున్నావ్‌ ! ఎవరింటికి వెళ్లాలి…?’’ అని అడిగాడు.
         

                     జయంత్‌ తడబాటుగా చూసి ‘‘రాఘవరాయుడు గారింటికి ఎటు వెళ్లాలో కొంచెం చెబుతారా ? వాళ్ల ఇంటి ముందు కానగ చెట్లు రెండు వుంటాయని మాత్రం తెలుసు. ఇక్కడ నుండి ఆటోలో వెళ్లాలా ? నడుచుకుంటూ వెళ్లాలా?’’
‘‘ఎలాగైనా వెళ్లొచ్చు. నేను వెళ్లేదికూడా అటే ! వస్తావా ? నడవాలి మరి …..’’అన్నాడు భరద్వాజ.
నడుస్తాను అన్నట్లుగా తలవూపాడు జయంత్‌.

                   ‘‘మీది ఏ ఊరు బాబూ ?’’ నాలుగడుగులు నడిచాక అడిగాడు భరద్వాజ… భరద్వాజ నడివయసు దాటిన వ్యక్తి. ఆయన వేషభాషలు ఎలాంటి వారిలోనైనా గౌరవభావం కలిగేలా చేస్తాయి.
అందుకే జయంత్‌ చాలా మర్యాదపూర్వకంగా చూస్తూ… ‘‘మాది కోయంబత్తూర్‌ సార్‌ !’’ అన్నాడు.
ఆశ్చర్యపోతూ ‘‘అంత దూరం నుండి వస్తున్నావా ?’’ అన్నాడు భరద్వాజ.
‘‘రావాలనుకున్నప్పుడు దూరందేముంది సర్‌ ! ఎంతదూరమైనా రావొచ్చు…’’ అన్నాడు ఆలోచనగా జయంత్‌.
       

                  అసలు తనెందుకొస్తున్నాడిప్పుడు ? ఇలా వస్తానని ఎప్పుడైనా అనుకున్నాడా ? అనుకోవడమే కాదు. అలాంటి ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. రెండు రోజు క్రితం తన స్నేహితుడు దిలీప్‌ హడావుడిగా ఫోన్‌ చేసి ‘‘సంలేఖ కథ ఒక మంచి పేరున్న పత్రికలో వచ్చింది జయంత్‌ ! చూశావా?’’ అని అడిగాడు.
ఊహించని పిడుగులా ఇదేం వార్త ? ఆశ్చర్యపోతూ ‘‘సంలేఖ రచయిత్రి ఎప్పుడైంది ? నువ్వేం మాట్లాడుతున్నావ్‌ దిలీప్‌ !’’ అన్నాడు జయంత్‌.

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink
0 0 vote
Article Rating
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
sandhya
sandhya
4 years ago

nice madam