అందుకే!
అద్దం పగిలినందుకే నాహృదయం రగిలి
ఇంతగా ఆక్రోశిస్తానెందుకోతెలుసా?
అద్దంకూడా హృదయంలా సున్నితమైనదని!
ఉన్నది ఉన్నట్లు చూపగల ధైర్యం
అద్దానికి తప్ప ఇంకెవరికుంటుంది?
భ్రమను చూపదు,శ్రమను దాచదు.
సత్యాన్నే ఆశ్రయించి,ధర్మాన్ని ధరించి,
న్యాయాన్నినీడగా చేసుకొనిమరీ
నిజాన్నినిరూపిస్తున్నట్లున్న అద్దం
ఇలా అర్ధాంతరంగా బ్రద్ధలవటమే
నాకు బాధను కలిగించింది.
ఆ అద్దంలాంటి హృదయాన్ని కలిగిఉండటం వల్లే
అదిపగిలినందుకు హృదయం రగులుతోంది.
లోకమే పగిలినట్లు,శోకమే మిగిలినట్లు అనిపిస్తోంది.
కాలమే కాలధర్మం చెందినట్లు,
ధర్మానికి కాలంచెల్లినట్లు,కనిపిస్తోంది.
నా హృదయంలాంటి అద్దం పగిలిపోయింది,
అద్దంలాంటి నాహృదయం మాత్రం
ఒంటరిగా మిగిలి పోయింది.
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
హృదయం లాంటి అద్దం పగిలితే పరవాలేదు కానీ అద్దంలాంటి హృదయాన్ని పగలనీయొద్దు
బావుంది . భ్రమ, శ్రమ, కాలధర్మం, ధర్మం-కాలంచెల్లడం లాంటి ప్రయోగాలు బావున్నాయి
కృతజ్ఞతలండి!