“పక్షి విలాపం” (కవిత)-ఆచాళ్ళ ఉమా మహేష్

కావ్యం రాసిన మాయలో
మాగ్గాయం చేసిన బోయను
దైవం చేసేసినారు

అవునో కాదో తెలియదు
పూవుకీ జీవం ఉందని
పుష్ప విలాపము పాడగ
ఇష్టముగా విన్న మీరు
లొట్ట లేసుకుని తినిరి
మా పిట్టల మాంసాన్ని

మీలా బిల్డర్లు లేక
ఇళ్ళూ వాకిళ్ళు తిరిగి
పుల్లలు మా నోట కరిచి
అల్లిన గూడుని చేర

గాలి భయం, వాన భయం,
పిల్లి భయం, పాము భయం
బిక్కు బిక్కు జీవితం
రెక్క తెగితె బతకలేం
పగిలిన గుడ్లన్నీ పోనూ
మిగిలెను బిడ్డొకటి, అరా

మీ విలువను పెంపు కొరకు
మేం నిలువగ నీడ కరువు
సెల్ టవర్ల ధార్మికతకి
విల్ పవర్లు కరువాయెను
మా తరములు మరుగాయెను

మా వంతు ప్రకృతినీ
మీరంతా ఆక్రమించి
బలవంతుల రాజ్యమంటు
మా గొంతులు కోస్తుంటే
మేమేడికి పోయేది
మేమేంతని ఎగిరేది

మము చూసి కనిపెట్టె
విమానమ్ము ‘రైటు’
మేమడగలేదే పేటెంట్ రైటు
మమ్మెగరనిస్తే మీరెంతో గ్రేటు
సమతౌల్యమే మరచి తేవద్దు చేటు
జగమంటే మనమంతా ఒకటైన చోటు

– ఆచాళ్ళ ఉమా మహేష్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , Permalink

5 Responses to “పక్షి విలాపం” (కవిత)-ఆచాళ్ళ ఉమా మహేష్

 1. D.Venkateswara Rao says:

  కావ్యం వ్రాసిన బోయను దైవం ఎవరుచేశారండి
  బోయవాడే తన కావ్యంతో దైవాన్ని సృష్టించాడు
  శ్రీరామచంద్రుడ్ని మనకిచ్చాడు
  ఎన్నో పశుపక్షాదులను కాపాడే గుణమిచ్చాడు

  పుష్పాలకు జీవముంది అంటే వాటిని తెంపలేము
  ఫలాలను కోసుకుని అందరూ హాయిగా తినలేము
  పుట్టుకతో మాంసాహారులమైన మానవులు
  లొట్టలేసుకోకుండా ఆహారాన్ని తినలేరు

  మొక్కలు నాటుతున్నారు చెట్లను పెంచుతున్నారు
  క్లోనింగ్ చేసి పశుపక్షాదుల సంతతిని పెంచాలనుకుంటున్నారు
  గాలికి వానకి జీవులందరూ చస్తున్నారు
  మానవుల్ని చంపే మహమ్మారులూ ఉన్నాయి

  తనకోసమే ఈ సృష్టి అంతా అఅనుకునే మానవుడు
  తనుకూడా ఈ సృష్టిలోని జీవునన్నింటిలో ఒకడని అనుకోడు
  మనుగడకోసం పోరాటంలో మానవుడు ఏకాకిగా జీవిస్తున్నాడు
  జీవించు జీవించనివ్వు అనే మార్గంలో నడవలేకపోతున్నాడు
  మరపు అనే గుణమున్న మానవుడు
  మానవత్వాన్ని కూడా మరచిపోయాడు
  తన తోటివారిని కలుపుకుపోలేని మాయదారి మానవుడు
  తను ఆహారంగా భావించే జీవులను ఎలా ఆదరించగలడు
  మళ్ళీ ఎవరో దేవుడు పుడతాడు
  ఈ మానవుల్ని వారి మనుగడకి మారుస్తాడు
  సమస్తజీవులు ఒక్కటిగా మెలగాలని బోధిస్తాడు

 2. srinu says:

  బావుంది మహీ ! హరిత విన్నపం కూడా వినిపించు త్వరలో

  • sudha says:

   గుడ్ జాబ్ మహీ !! సుధ ఆర్యసోమయాజుల

 3. Siva kumar says:

  ఫీల్ గుడ్ కవిత .. చాలా బాగుంది సార్
  పక్షి తరపున అడ్వొకేట్ లా చక్కగా చెప్పారు

 4. chalapathy reddy says:

  వెరీ గుడ్ ఉమా. కొన్ని మాటలు నాకు అర్థం కావాట్లేదు. కాని ఎక్స్ల్లెంట్. కీప్ కంటిన్యూఇంగ్.