దాటలేని గోడలు

మెడకి గుదిబండల్లా అనిపించే తల్లితండ్రులని వదిలించుకోడానికి, వృద్ధాశ్రమాలు ఎలాగూ ఉన్నాయిప్పుడు.
కానీ ఏ కోర్టూ, రుజువుల గొడవ లేకుండా… ఖర్చెక్కువ పెట్టకుండా చట్టబద్ధంగా విడాకులు పొందాలన్నా, తమ లాభాలకి/జీవితాలకీ అడ్డం పడుతున్నారనుకోవడం వల్ల భార్యలనీ, అన్నతమ్ములనీ, సాటి ఉద్యోగులనీ వదిలించుకోవాలనుకున్నా- ఉన్న దారి! మెంటల్ ఆసుపత్రులు. అవి అనువుగా దొరుకుతున్నాయీ మధ్య.
ప్రభుత్వ ఆస్పత్రులలో అయితే కనుక, ఎవరికయినా సైకాలజీకల్‍ సమస్య ఉందని నిర్థారించడానికి చట్టం ప్రకారం సైకియాట్రిస్టుల అవసరం ఉంటుందని The Mental Health Act Of India చెప్తుంది. ఎవరైనా తమ కుటుంబ సభ్యులని ఒక ప్రైవేటు హాస్పిటల్లో వదిలేద్దామనుకుంటే, కావలిసినది ఒక సంతకం మాత్రమే. మరే పత్రాల అవసరమూ లేదు.
హిందూ మారేజ్ ఆక్ట్‌లో ఉన్న సెక్షన్ 13 విడాకులకని కొన్ని ఆధారాలని పేర్కొంటుంది. దానిలో ఉన్న సబ్ సెక్షన్ (1) (iii) ‘మానసిక ఆరోగ్యం’ అన్న కారణాన్ని ఆధారంగా అంగీకరిస్తుంది. దీన్ని ఉప/దురుపయోగించుకుంటూ, ఈ మధ్య స్త్రీలని మెంటల్ అసైలమ్సులో బలవంతంగా చేర్పిస్తున్నారు కుటుంబ సభ్యులు-ముఖ్యంగా భర్తలు. స్త్రీలకి డబ్బు కానీ, ఆస్థి కానీ కుటుంబ జీవితం కానీ చేజిక్కకుండా- ఈ చట్టాన్ని ఒక ఆయుధంగా మలచుకుంటున్నారు.

mental-main12013 సెప్టెంబర్లో, ఢిల్లీలో పని చేస్తున్న ఒక 33 సంవత్సరాల స్కూల్ టీచరు ఇంట్లోకి హాస్పిటల్ బట్టల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. ఆమెకి బలవంతంగా మత్తు ఇంజెక్షన్ పొడిచిన తరువాత, హాస్పిటల్ వాన్లోకి ఎక్కించి ప్రైవేట్ మెంటల్ హాస్పిటల్లో చేర్పించారు. అది కూడా, ఏ డాక్యుమెంట్లూ లేకుండానే. ఆమె గురించి బంధువులకి తెలిసి వారామెని విడిపించారు. అదీ- రెండు నెల్ల తరువాత. ఇదంతా కొడుకు మీద లైంగిక అత్యాచారం చేసే ఉద్దేశ్యం ఉన్న తన భర్త కుట్ర అని ఆమెకి అప్పుడు తెలియలేదు.
46 సంవత్సరాల జెస్సికా పౌలు ఒక రాత్రి వంటరిగా ఉన్నప్పుడు, వాక్సినేషన్ చేయడానికి వచ్చామంటూ కొంతమంది ఇంట్లోకి దూరి, మత్తుమందిచ్చి తీసుకు వెళ్ళారు. మరుసటి ఉదయం ఒక ప్రైవేట్ మెంటల్ హాస్పిటల్లో కళ్ళు తెరిచిందామె. అక్కడామెని నెలరోజుల పాటు ఉంచారు. ఆమె అంగీకారం లేకుండానే, ఎలెక్ట్రిక్ షాకులిచ్చారు. కుటుంబంతో అంతకాలం ఏ సంబంధం లేదామెకి. తన భర్త ఏ కోర్టు ఆర్డరూ లేకుండానే తనని అక్కడ చేర్పించాడని ఆమెకి తెలిసింది. మనోవర్తి ఇవ్వనవసరం లేకుండా విడాకుల పొందడానికని, ఆమెకి ‘పిచ్చి’ అన్న సర్టిఫికెట్ కోసం అతను పన్నాగం పన్నాడు. కారణం- అతనికి వివాహేతర సంబంధం ఉండటం.
30 సంవత్సరాల కాథలిక్ ప్రీస్ట్ అయిన ఫాదర్ పీటర్ మాన్యుయేలు తనకోసం మతమార్పిడి చేయించుకున్న ఒక ముస్లిమ్ యువతిని పెళ్ళి చేసుకున్నాడు. క్రైస్తవ మతాధికారులకి కోపం వచ్చి, అతనికి మత్తుమందిచ్చి త్రిస్సూరులో ఉన్న పిచ్చాసుపత్రిలో చేర్పించారు. ఆ చర్యకి కారణం- వివాహం చేసుకున్నదువల్ల జరిగిన మతదూషణ మాత్రమే కాదనీ, అతని వల్ల చర్చికి వస్తున్న ఫండ్స్ ఆగిపోతాయేమోనన్న భయం వల్ల congregation ఆ పని చేసిందనీ భార్య మరియా చెప్తుంది.
కులాంతర, మతాంతర సంబంధాలు/వివాహాలూ, ఆస్థి పంపకాలు, తగాదాలు కూడా బలవంతంగా ఈ హాస్పిటళ్ళలో చేర్పించే కారణాలు. భిన్నమైన మత, రాజకీయ లేదా సాంస్కృతిక నమ్మకాలు కలిగి ఉన్న కొందరిని మానసికభ్రాంతి కలిగి ఉన్నవారని నిర్థారిస్తుంటే, భయం కొలిపే పరిస్థితి తలెత్తుతోంది.
ఈ పరిస్థితి భారతదేశంలో మాత్రమే కనపడ్డం లేదు. చైనాలో వాంగ్ వాన్క్సింగ్ మనోరోగ సంబంధిత ఆసుపత్రిలో 13 సంవత్సరాలు గడిపాడు. కిందటి సంవత్సరం భారత సంతతికి చెందిన జైనుబ్ ప్రియా దాలా మీద డర్బన్లో దాడి చేసి, మెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. కారణం- ఆమె సల్మన్ రష్దీని ప్రశంసించడం.
సగటున ముగ్గురు స్త్రీలల్లో ఒకరు, ఈ ఇన్స్టిట్యూషన్లలో ఏ వైద్యపరమైన కారణం లేకుండానే చేర్పించబడతారని 20 ఏళ్ళగా వెస్ట్ బెంగాల్లో, మానసిక హక్కుల రంగంలో పని చేస్తున్న రత్నాబోలీ రే చెప్తారు. అక్కడ మందులు కలిపిన అరటిపళ్ళనీ, టీ నీళ్ళనీ, ఎలెక్ట్రిక్ షాకులనీ ఇవ్వడం పరిపాటే.
తమ జాడ తెలియకుండా, కొన్నిసార్లు కుటుంబ సభ్యులు నకిలీ చిరునామాలనీ, ఫోన్ నంబర్లనీ వదిలిపెడతారు. అందువల్ల ప్రభుత్వపు ఆస్పత్రులలో అయితే, కోర్టు ఆర్డర్ల గడువు తీరి చాలాకాలం అయినప్పటికీ కూడా, ఆస్పత్రులని విడిచే అనుమతి లేకపోవడం వల్ల సంవత్సరాలుగా అక్కడే పడున్న స్త్రీలున్నారు. చాలామందికి తమ వ్యాధి నిర్ధారణ ఏమిటో కూడా తెలియదు.
ఈ నిస్సహాయ పరిస్థుతుల్లో జీవిస్తున్న స్త్రీల వీడియో ఇది.
కొద్ది సంవత్సరాల క్రితం, ముంబయిలో ఉన్న విద్య అన్న 35 ఏళ్ళ స్త్రీ రాత్రిపూట ఇంట్లో వంటరిగా ఉంది. ఆమె భర్త కొడుకులిద్దరికీ ఐస్‌క్రీమ్ కొనిపెడతానంటూ, వాళ్ళని బయటకి తీసుకు వెళ్ళాడు. హెల్త్ వర్కర్ల యూనిఫామ్ వేసుకుని ఉన్న ముగ్గురు వ్యక్తులు తలుపు కొట్టి, ఆ ప్రాంతంలో ఉన్నవారికి వాక్సినేషన్ చేస్తున్నామంటూ, ఆమెకి ఇంజెక్షన్ ఇచ్చారు. ఆమెకి స్పృహ వచ్చేటప్పటికి, కిటికీ ఊచలకి ముళ్ళతీగలు చుట్టిన గదిలో ఉంది- మెంటల్ హాస్పిటల్లో.
ఆమె తల్లి కూతురి జాడ కనుక్కునేటంతవరకూ, విద్య అక్కడ నెల రోజులు గడిపింది. ఆ తరువాత చాలా కాలానికి కానీ, తన భర్త తనకి మనోవర్తి ఇవ్వకుండా, సులభంగా విడాకులు పొందడానికి ‘పిచ్చిది’ అన్న సర్టిఫికెట్ తీసుకునేటందుకు, తనని అక్కడ చేర్పించాడని ఆమె గ్రహించలేదు.
ఈ చదువుకున్న స్త్రీలే ఈ పరిస్థితికి లోనయినప్పుడు, ఇలా ఎవరికయినా జరగవచ్చు.
ఈ ఆస్పత్రులలో ఇలా చేర్చబడిన స్త్రీలందరూ అంగీకార పత్రాలని చదవలేరు. తమకి హక్కులంటూ ఉన్నాయని కూడా వారికి తెలియదు. కానీ విద్య సరైన ప్రశ్నలు వేయగలిసింది. ఆఖరికి ఒక జడ్జ్ ఆమె భర్త విడాకుల క్లెయిముని కొట్టివేసి, ఆమెమీదున్న ‘పిచ్చితనం’ అన్న ముద్రని తొలిగించాడు. కానీ, దీనంతటికీ ఏడేళ్ళు పట్టింది. ఇప్పుడు విద్య ఒక ఏక్టివిస్టుగా మారి, తనవంటి ఇతర స్త్రీలకి సహాయపడుతోంది.
ఏ వైద్య ప్రక్రియలోనైనా, రోగికి ‘అంగీకారం’ అన్న హక్కుంటుంది- మానసిక వైకల్యం ఉన్నా, లేకపోయినా కూడా. మానవ హక్కుల చట్టం కింద, వ్యక్తులకి తమ స్వంత నిర్ణయాలు తీసుకునే హక్కుంది. వైద్య చికిత్సని నిరాకరించడం కూడా వాటిల్లో ఒకటి. కానీ చాలామంది ఆ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసే ఏ దారీ లేకుండానే, ఈ ఆస్పత్రుల బారిన పడుతున్నారు. ఈ ప్రక్రియలో, సంబంధిత వ్యక్తి సమ్మతి పొందే ఏ ప్రయత్నమూ చేయబడటంలేదు కనుక ఇది మానవహక్కుల ఉల్లంఘింపు.
‘పిచ్చితనం’ అన్న ఈ ముద్ర ఎలాగో జీవితాంతం వీరిని వెంబడించేదే. ఈ బహిష్కారంతో జీవించడమే కష్టం. దీనికి తోడు, చట్టవ్యతిరేకమైన నిర్బంధాన్ని అనుమతించే మానసిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఉన్న లొసుగులు, పరిస్థితిని మరింత కష్టతరం చేస్తున్నాయి.
ఈ స్త్రీలని ఆస్పత్రుల్లోనుండి ఇంటికి వెనక్కి తెచ్చుకోని కుటుంబ సభ్యులని శిక్షించేటందుకు కొత్త చట్టాలని తేవడానికి ప్రయత్నిస్తోంది ముంబయిలో ఉన్న థాణే మెంటల్ హాస్పిటల్. ఆ బంధువుల చిరునామాలు, వివరాలూ-వీటన్నిటికీ పోలీసుల వేరిఫికేషన్ చేయిస్తోంది.
‘ప్రభుత్వం చట్టాలని ఏర్పాటు చేసి, సంస్థలనీ, మనోవిక్షేప ఆసుపత్రులనీ క్రమం తప్పకుండా పరిశీలించవలిసిన అవసరం ఉంది. కడపటిగా- సంస్థల నుంచి దూరం తరలి, ప్రభుత్వం కమ్యూనిటీ ఆధారిత స్వచ్ఛంద సర్వీసులని మొదలు పెట్టాలి.” అని డిసబిలిటీ రైట్స్ డైరెక్టర్ అయిన శాంతా రావు బార్రిగా చెప్తారు.
ఈ మధ్య బాగా ఊపందుకుంటున్న ఈ దురాచరణ త్వరలోనే అంతం అవడానికి ఈ ఏక్టివిస్టులందరూ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవాలని ఆశిద్దాం.

– క్రిష్ణ వేణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్, కృష్ణ గీత, , , , , , , , , , , , , Permalink

16 Responses to దాటలేని గోడలు

 1. Srinivas Sathiraju says:

  చాలా మంచి వ్యాసం తెలియని ఎన్నో విషయాలు తెలిపారు కృతజ్ఞతలు

  • Krishna Veni says:

   ఆలస్యంగా చూశాను శ్రీనివాస్ గారూ.
   ధన్యవాదాలు.

 2. ఆర్.దమయంతి. says:

  స్త్రీలపై ఎన్ని రకాల హింసలు, దాడులు జరుగుతున్నాయో చెప్పడానికి మీ రచన ఒక ఉదాహరణ గా నిలుస్తుంది కృష్ణవేణి.
  కుటుంబం, స్నేహితులు, సమాజం, – బాధితురాలికి సంఘటితం గా నిలిసితే తప్ప ఇలాటి దుర్ఘటనలనించి స్త్రీలకు విముక్తి వుండదు.
  అదెప్పుడు జరిగేను?
  ఆమె ఒంటరితనం పసిగట్టడం వల్ల, నిస్సహాయురాలువడం వల్ల ఇలాటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి నేటి సమాజంలో.
  నేరం చేసే వాడికి భయం వుండాలి.
  సమాజానికి వొణకాలి. లేదా ప్రభుత్వం నించి కఠిన శిక్ష గుర్తొచ్చి భయపడాలి.
  నేరాలు చేసే వాడికి భయం లేనంత కాలం, ఇలా స్త్రీలు నరకమనుభవిస్తూ వుండాల్సిందే.
  రేప్ చేసి, ఆమెని అతి దారుణం గా చంపేసి పోతున్న వారికే శిక్షలు లేవు. మనం చూస్తూనే వున్నాం కదా!
  మంచి సమాచారంతో కూడిన వ్యాసాన్ని అందచేసారు.
  మోసాలు ఇలా కూడా వుంటాయి కాబట్టి ‘తస్మాత్ జాగ్రత్త ‘ అంటూ ముందొస్తు హెచ్చరికను అందచేసారు.
  ధన్యవాదాలు.

  • Krishna Veni Chari says:

   నేరం చేసే వాడికి భయం వుండాలి————-
   ———–అసలు ఇలా తమింటి స్త్రీలని తామే వదిలుంచుకుంటున్నవారు నేరస్థులే . మీరన్నట్టు ‘నేరం అన్న భయం’ ఏ/ఎటువంటు నేరస్థుడికీ వేయదు. వేస్తే అసలు నేరాలే ఉండవు దమయంతిగారూ.
   ఇంత వివరమైన కామెంటుకి నేను చెప్పగలిదేదల్లా పేద్ద “థేంక్యూ” మాత్రమే. 🙂

 3. భయంకరమైన వాస్తవం.మీ సహజమైన శైలి బాగుంది.ఇటువంటి కథనాలు మీ నుండి మరిన్ని ఆశిస్తున్నాను.ధన్యవాదాలు

  • Krishna Veni Chari says:

   నరేశ్‍ గంటలగారూ,
   భయంకరమైన వాస్తవం- నిజమే కదా!
   మీ మెప్పుకి థేంక్యూ 🙂
   పతీ నెలా ఏదో అంశం మీద విహంగకి రాస్తున్నాను. వీలయితే చూడగలరు.

 4. Y RAJYALAKSHMI says:

  భయంకరమైన వాస్తవం. Thank you for a good article.

  • Krishna Veni Chari says:

   వై రాజ్యలక్ష్మిగారూ,
   అవునండీ. ఓపికగా చదివి కామెంటు పెట్టినందుకు కృతజ్ఞతలు. 🙂

 5. S. Narayanaswamy says:

  చాలా వాయద భరితమైన కథనం. మీ సహజమైన శైలిలో బాగా రాశారు.

  • Krishna Veni Chari says:

   థేంక్యూ నారాయణస్వామిగారూ,
   నాకంటూ తెలుగులో ఒక శైలి ఉందని వినడమే సంతోషం కలిగించింది. 🙂

 6. Suresh says:

  అబ్బా వినటానికే చాలా కష్టంగా ఉంది. ఇలాంటి దారుణాలు ఎన్ని జరుగుతున్నాయో!!. మొన్నీ మద్య ఫేస్బుక్ లో ఒక ఫ్రెండ్ చేసిన పోస్ట్స్ గుర్తొస్తున్నాయి. ఒక వృద్దురాలైన తల్లిని, పిచ్చిది అనే ముద్ర వేసి .. ఆమె ఆస్తిని కొట్టేయాలి అని చూసిన కూతురు, అల్లుడు ఆమె కి antipsychotics ఇచ్చి ఎన్ని హింసలు పెట్టారో చదివాను. త్వరలో ఏదైనా చట్టం అమలులోకి వచ్చి ఇటువంటివి జరగకుండా ఏదైనా చేస్తే బాగున్ను :(. ఇలాంటి విషయాలు చాలా మంది ఊహకి కూడా అందనివి. ఇటువంటి ఆర్టికల్స్ తో రీడర్స్ ని చైతన్య పరుస్తున్న మీకు … అభినందనలు

  • Krishna Veni Chari says:

   సురేశ్ గారూ, ఆస్థికి కొట్టేయడానికీ, పెన్షన్ కొట్టేయడానికీ.. ఇంకెన్నెన్నిటికో.
   బహుసా ఒక టాపిక్ ని dogged గా follow అయి ఉండకపోతే, నా ఊహకీ ఇవన్నీ అంది ఉండవు… చైతన్యపరిచేటంతగా కాలమ్ ఉందనుకున్నందుకు, చాలా కృతజ్ఞతలు. 🙂

 7. Mohan says:

  దాట లేని గోడలు బాగుంది,
  కాని ఆ బాటలో వెళ్ళే మగ వాళ్ళు ఎక్కువ ఔతారేమో?
  స్తీలకు ఆ స్థితి ని ఎలా రానీకుండా చూసుకోవాలో అనే విషయం
  మీద కూడా చర్చిస్తే ఇంకా ఉపయోగం గా ఉండేది, అని అనిపిస్తుంది.

  • Krishna Veni Chari says:

   మోహన్ గారూ,
   నిజమే, చర్చించవలిసింది కానీ ఇప్పటికే, ఈ అంశంమీదే ఎంత కుదించాలనుకున్నా కుదరక, ఇంత పొడుగు కాలమ్ రాశాను. బోర్ కొట్టి ఎవరూ చదవరేమోనని ఇంక వివరాలు జోడించలేదు.
   ఓపికగా చదివి, కామెంటు కూడా పెట్టినందుకు థేంక్యూ. 🙂

 8. Krishna Veni Chari says:

  వెంకట్‍ ఎస్‍ అద్దంకిగారూ,
  ఒక సైక్రియాటిక్ డాక్టర్
  ———అవసరం ఎలాగో ఉంది కానీ మన దేశంలో లంచాలు చేయించలేని పనేమిటి!
  మీ కామెంట్లో ఉన్న రెండో భాగపు మెప్పుదలకి చాలా కృతజ్ఞతలు. నేను దానికెంత అర్హురాలినో తెలియకపోయినా.

 9. Venkata S Addanki says:

  మంచి విషయం తెలియజేసారండి. అన్నిటికన్నా ముందు ఎవరినైనా పిచ్చి వారిగా ముద్రవేసి హాస్పిటల్స్ లో జాయిన్ చెయ్యాలి అనుకున్నప్పుడు, ఒక సోషల్ ఆర్గనైజేషన్, ఒక సైక్రియాటిక్ డాక్టర్ పర్యవేక్షణలో కౌన్సెలింగ్ ఏర్పాటుచేసి వారి రిపోర్ట్ ఆధారంగా మాత్రమే హాస్పిటల్స్ అడ్మిట్ చేసుకోవాలి అన్న రూలు వచ్చినా చాలు, ఇలాంటి తప్పుడు కేసులు తగ్గుతాయేమో. ప్రపంచంలో డబ్బు ఎన్ని రకాల పన్నాగాలకి తెరతీస్తోందో ఈ ఆర్టికల్ చదివాక తెలిసింది. మీరు ఎన్నుకున్న టాపిక్ చాలా బాగుంది, మీరు మరిన్ని విశేషాలతో మరికొన్ని కొత్త అంశాలతో ఇలాగే మమ్ములని జాగృతం చేసేవిధంగా మరిన్ని వ్యాసాలు అందిచాలని కోరుతున్నాను.