నా జీవనయానంలో (ఆత్మ కథ )- జీవితం…..4- కె.వరలక్ష్మి

నేను భయంతో వణికి పోయేను , ‘అత్తమ్మా …..’అని ఒక్క అరుపు అరిచేను . మావయ్య వెంటనే నన్నొదిలేసి ఇంట్లోకి పరుగెత్తేడు . అతనికి భార్యంటే చాలా భయమని నాకు తెలుసు .

మా మేనమామలు ఐదుగురూ మమ్మల్ని ఎత్తుకుని ఆడించిన వాళ్లు . వాళ్ల దగ్గరుంటే మా నాన్న దగ్గరున్నంత ధైర్యం అనుకునే దాన్ని .’ఇదేంటి ఈయనిలా ప్రవర్తించేడు ‘అని మధన పడిపోయేను . నేనిక్కడ చదువు కోవడం సాధ్యపడదని నాకర్ధమైంది . నన్ను పంపించెయ్యమంటే ఏమంటాడో ! ఆలోచించగా ఇల్లు గలావిడే నాకు ఆత్మీయ బంధువుగా తోచింది . ఆవిడకు పది పైసలిచ్చి ఒక ఇన్ లేండ్ కవరు తెప్పించి పెట్టమని అడిగేను . థానూఖాన్ కీ చెప్పొచ్చు . తల్లి చాటు కొడుకు అతను , నేనేమో పెళ్లై పోయిన అమ్మాయిని . ఎంత టీనేజ్ లో ఉన్నా మా మధ్య కనిపించని కంచె లేవో ఉన్నట్టు అనుకునే వాళ్లం . అందుకే ఇద్దరం ఎప్పుడూ పన్నెత్తి పలకరించుకోలేదు . నాకు పుస్తకాలంటే ఇష్టమని తెలిసి అతను మేగ జైన్స్ నీ , కథల పుస్తకాల్ని తెచ్చి ఇచ్చిన ప్పుడైనా థేంక్స్ కూడా చెప్పలేదు . నేను గుమ్మం బైట కన్పించకపోతే వెంటి లెటర్ బిగించాలనో , కిటికీ తలుపు సరి చెయ్యాలనో వంక పెట్టుకుని లోపలికొచ్చి నన్ను చూసి వెళ్లేవాడు . నన్ను చూడగానే ఒక చిన్న నవ్వు అతని పెదవుల మీద మెరిసేది . మొత్తానికి వాళ్ళమ్మ చెప్పగా థానూఖాన్ ఒక ఇన్ లేండ్ పోస్టల్ కవరు తెచ్చి ఇచ్చేడు .

రెండు రోజులు అదే పనిగా ఆలోచించేను ఉత్తరం మా నాన్నకి రాయాలా మోహన్ కా ? అని . మోహన్ కే రాయాలని నిర్ణయించుకున్నాక మనసు తేలిక పడింది . నేనూ పిల్లలూ ముందు గదిలో పడుకునే వాళ్లం . అందరూ నిద్ర పోయేక అర్దరాత్రి డిమ్ లైటు వెలుగులో ఉత్తరం రాసేను . నేనిక్కడికి ఎందుకు వచ్చెనో , ఆ చదువు ఇక్కడ కొనసాగేలా లేదని , ఇక్కడి నుంచి ఒక్క దాన్నీ ఎలా రావాలో తెలీడం లేదని రాసి చివరగా వాళ్ళమ్మ గారు చెప్పే పనులు – ఇల్లు అలకడం , కారం దంచడం లాంటివి నాకెంత కష్టమైన పనులో రాసాను .

బహుశా ఉత్తరం మూడో రోజుకి చేరి ఉంటుంది . నాలుగో రోజుకి మోహన్ కడపలో ఉన్నాడు . మోహన్ ని చూసేక మా అత్తమ్మ ముఖంలో గొప్ప రిలీఫ్ కన్పించింది . అతను బైటి కెళ్లినప్పుడు చూసి నాకో పెద్ద క్లాసు తీసుకుంది . – “ఆడదంటే ఎలా ఉండాలి , మొగుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పక్క మీదికి పరుగెత్తి అతన్ని కొంగుకి ఎలా ముడేసు కోవాలి , చదువులు చట్టబండలు ఎంత నిరర్ధకమైనవి , కథలు కాకరకాయలు ఎంత పనికిమాలినవి , ఆడదంటే పని చేసే యంత్రంలా తనకు తను ఎలా మలుచుకోవాలి , మొగుడు కొట్టినా తిట్టినా ఎలా పడి ఉండాలి , మొగుడి కన్ను పక్కకి తిరక్కుండా ఎలా అలంకరించుకోవాలి “ అంటూ .

వీధిలో వెళ్ళిపోతున్న చీరల వాడిని పిలిచి బేరమాడి బేరమాడి పన్నెండు రూపాయలకి ఒక చీర కొని నాకిచ్చింది . టిఫిన్ పెట్టి , టీ ఇచ్చింది . మావయ్య ఆఫీసు కెళ్లిపోయేడు .

మేం బయలుదేరి బైటికి వస్తూ ఉంటే ఇల్లుగలామే నన్ను చెయ్యి పట్టుకుని వాళ్లింట్లోకి తీసుకెళ్లింది .పెద్ద పళ్లెం నిండా పేర్చిన అరిసెల మీద ఒక జాకెట్టు ముక్క పెట్టి ఇచ్చింది . నేను ఆమె పాదాలకి నమస్కరించి లేవగానే నన్ను హత్తుకుని , తలపైన చెయ్యి పెట్టి ఆశీర్వదించింది . పెద్ద పేపర్లో అరిసెల్ని పొట్లం కట్టి దారిలో తినమని నా సంచిలో పెట్టింది . ఇదంతా చేస్తున్నంత సేపూ ఆమె ఏడుస్తూనే ఉంది . నా చెంపలు నిమురుతూ “ బేటీ నా కొడుకు ఎప్పటికి కోలుకుంటాడో “ అన్న మాట నాకు బస్సు స్టాండు లోకాని అర్ధం కాలేదు . థానూఖాన్ ఉదయం నుంచీ కన్పించలేదు . మేం బస్టాండులో రిక్షా దిగేసరికి స్పీడుగా సైకిల్ తొక్కుకుంటూ వచ్చేడు . రాత్రంతా ఏడుస్తూనే ఉన్నట్టున్నాడు కళ్ళు ఎర్రగా వాచిపోయి ఉన్నాయి . ఎటో చూస్తూ నుంచున్నాడు కాని , అతని కళ్ళు ధారాపాతంగా వర్షిస్తూనే ఉన్నాయి . నా మనసు కరిగి నీరైంది . కాని , నిస్సహాయంగా శిలలా ఉండిపోయాను . ఊరి బైట చాలా దూరం వరకూ బస్సు పక్కనే సైకిల్ తొక్కుకుంటూ వచ్చి , వెను తిరిగేడు .
నాకడప ప్రయాణానికి కొంత కల్పన చేర్చి ‘అఘాడీ ‘ కథ రాసేను . అలా ఆనాటి 45 రోజుల నా కడప నివాసం ఇప్పటికీ మనసులో నిలిచి పోయింది .

కడప నుంచి తిరుమల వెళ్లేం . ఉచిత సత్రంలో బస . అప్పటికి దైవ దర్శనానికి ఇప్పటంత జన సమ్మర్దం ఉండేది కాదు . ఇంతంత క్యూలైన్లూ లేవు . శ్రీనివాసుడి దర్శనం చాలా సార్లు అయ్యేది . అలా దర్శనానంతరం ఇచ్చే దద్యోజనం , చక్కెర పొంగలి ప్రసాదాల్తో కడుపు నింపుకొని చేతిలో చెయ్యి వేసుకుని తిరుమల మొత్తం తిరిగేం . కొండల పైకీ , గుట్టల పైకీ ఎక్కేం . అన్నాళ్లు దూరంగా ఉండడం వలనో ఏమో మోహన్ చాలా సాత్త్వికంగా , ప్రేమగా మెలగ సాగేడు . ఆంక్షలు విధించే పెద్ద వాళ్లెవరూ లేరు . ఆ ప్రయాణం చాలా హేపీగా అన్పించింది . కొండ దిగి తిరుపతి వీధిలో గోవింద రాజస్వామి ఆలయంలో పుల్హార ప్రసాదం తిని, తిరుపతి వీధుల్లో చక్కర్లు కొట్టి శ్రీకాళహస్తి వెళ్లేం . బట్టల సంచులు బైట మంటపంలో ఒక స్తంభం దగ్గర పడేసి ఆలయంలోకి పరుగెత్తేం . ట్రెయిన్ కి టైమైపోతోందట మరి ! అంతటి బృహదాలయాన్ని అంతకు ముందెప్పుడూ చూడ లేదు నేను . ఊహ తెలిసేక అదే నా మొదటి తిరుపతి ప్రయాణం కూడా . శిల్పాల్ని చూస్తూ ఎక్కడికక్కడ ఆగి పోతూంటే మోహన్ చెయ్యి పట్టుకుని లాక్కెళ్లేవాడు . శ్రీకాళ హస్తీశ్వర దర్శనం తర్వాత శ్రీజ్ఞాన ప్రసూనాంబ పేరు చూస్తే ముళ్ళపూడి వారి శీగేన పెసూనాంబ గుర్తు కొచ్చింది . అమ్మ వారికి నమస్కరించుకొని బైటి కొస్తూంటే ఓ పక్క అద్దాల గదిలో ఓ ఉయ్యాల మంచం . దానికి దారంతో కట్టిన బోలెడన్ని బుల్లి బుల్లి వెండివీ , చెక్కవీ ఉయ్యాలలు కన్పించాయి . అక్కడ ఎవర్నో అడిగితే చెప్పేరు . అక్కడ మొక్కుకుంటే పిల్లలు పుడతారని , ఆ తర్వాత ఉయ్యాలలు తెచ్చి కడతారని . పెళ్లై ఎన్నాళ్లో అయిపోయిన వాళ్ల లాగ మేం కూడా మొక్కేసుకున్నాం . సాధ్యా సాధ్యాలు ఆలోచించకుండా వెండి ఉయాల మొక్కేసాను నేను .
పాసింజర్ ట్రైయిన్లో హాయిగా బల్లల మీద పడుకుని , ఆకలేసినప్పుడు అరిసెలు తింటూ ప్రయాణం సాగించేం . సామర్లకోటలో దిగి జగ్గంపేట వెళ్లి మా అమ్మ నాన్నలకి కన్పించి రాజమండ్రి వెళ్లిపోయేం . మేం కోనేరుపేట చేరే సరికి మా అత్తగారు మిల్లులో ధాన్యం ఆడుతున్నారు . నేను హుషారుగా వెళ్లి ఆవిడ ముందు నుంచున్నాను . మరు క్షణం ఆవిడ కాళికావతారం దాల్చేసి , నా జడను చేతికి చుట్టుకుని ఈడ్చుకెళ్లి మూలనున్న కొబ్బరి ఈనెల చీపురుతో నావొళ్ళు తట్లు తెలిపోయేలా కొట్టేసింది . అడ్డు పెట్టుకున్న అరచేతులు కూడా వాచిపోయి నీళ్లలో పెట్ట లేకుండా అయిపోయాయి . “మొగుడూ సంసారం వద్దనుకుని ఎళ్లి పోయిందానివి మళ్లీ ఏ మొహం పెట్టుకుని వచ్చేవే ? నా మీద చాడీలు చెప్తూ నా కొడుక్కి ఉత్తరం రాస్తావా , ఇల్లలకలేని , కారం దంచలేని సుకుమారివి మళ్లీ ఇందులోకే ఎందు కొచ్చేవు ?”అంటూ కిందపడి ఏడుస్తున్న నన్ను నానా మాటలూ అంది . అదంతా ముగిసే వరకూ మోహన్ అక్కడే నిలబడి చోద్యం చూసి , కాలేజ్ కి టైమవుతుందంటూ వెళ్లి పోయేడు . మా గదిలోకెళ్లి ఎవర్నీ ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో , దెబ్బల నొప్పితో ఏడ్చి ఏడ్చి , ఉక్రోషం ఆగక పెళ్లికి ముందు నుంచీ మోహన్ నేనూ రాసుకున్న ఉత్తరాల కట్టను పెట్టెలోంచి తీసి అగ్గి పుల్ల గీసి మంట పెట్టేసేను . నేను రాసిన ఉత్తరాన్ని వాళ్ళమ్మకి చూపించి , ఆవిడ చేత కొట్టించాడనే బాధ చాన్నాళ్లు నన్ను వెంటాడింది . అలా ఆప్రయాణపు ఆనందానుభూతి అంతా ఆవిరై పోయింది .

నేను అప్పుడప్పుడూ తెలివిడి పెద్దగా లేకపోయినా భమిడిపాటి కామేశ్వర్రావు గారి హాస్య నాటికల గురించి , కొన్ని సీరియస్ నాటకాల గురించి ఇద్దరమే ఉన్నప్పుడు మోహన్ తో కబుర్లు చెప్తూండే దాన్ని . అతనికి హిస్టారికల్ సంఘటనల్ని గురించి మాట్లాడ్డం , వినడం ఇష్టమని నాకు అర్ధమైంది . స్పార్టకస్ , చెంగిజ్ ఖాన్ లాంటి నవలల్ని ఇద్దర్లో ఒకళ్లం చదువుతూ , మరొకరు వినేలా అలవాటు చేసేను . చదవడం పూర్తయ్యేక ఆ పాత్రల్ని గురించి చర్చించుకునే వాళ్లం . ఆ రోజుల్లో బుల్లయ్య గారి గురుకులంలో పెద్ద స్టేజి తో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉండేది . అక్కడ పరిషత్ నాటక పోటీలు జరుగుతూండేవి . నాకా సంగతి తెలీదు , తానే చెప్పి కొన్ని సార్లు ఆ నాటకాలకు తీసుకెళ్లేడు . మరో మొహంజోదరో ‘ నాటకాన్ని మొదటి సారి నేనక్కడే చూసేను . అప్పుడప్పుడు మామూలు నాటక ప్రదర్శనలు జరుగుతూండేవి . మోహన్ కి నటించాలనే సరదా ఉందని నాకప్పుడే తెలిసింది . ప్రేక్షకుల్లో నా పక్క నుంచి లేచి వెళ్లి హఠాత్తుగా పోలీసు లాంటి ఏ చిన్న కేరెక్టర్ లోనో ప్రత్యక్ష మయ్యేవాడు స్టేజి పైన . షర్టు విప్పితే ఎముకలు లెక్క తెలిసేంత సన్నగా ఉండేవాడు . ఒకసారి తన కన్నా బాగా పెద్ద సైజున్న ఇన్స్పెక్టర్ డ్రెస్సు , టోపీల్లో స్టేజి మీద కన్పించే సరికి అందరూ నవ్వడం మొదలు పెట్టేరు . నాకు బలే అవమానం అన్పించింది . మరోసారి చిన్న పంచె కట్టుకుని షర్టు లేకుండా భిక్షగాడి పాత్రలో కన్పించే సరికి నాకు ఏడు పొచ్చింది . ఎందుకంటే జనంలోంచి ఎవరో ‘ఫిట్టింగ్ కేరెక్టర్ ‘ అని అరిచేరు .

అలా గురుకులం నాటకాలకి వెళ్ళినప్పుడు అక్కడికి దగ్గరని ఆ రాత్రి ఆంటీ ఇంట్లో ఉండి పోయే వాళ్లం . ఉదయం లేవగానే ఆంటీ “మొన్న మీ పుట్టింటి కెళ్లినట్టున్నావ్ , ఏం తెచ్చుకున్నావ్ ? ఎళ్లినప్పుడల్లా ఒక ఇత్తడి బిందో , డేగిసానో , బకెట్టో ఏదో ఒకటి తెచ్చుకుంటా ఉండాలి . మీ చెల్లెళ్లు ఎదిగితే ఇంక నీకేం పెడతాది మీయమ్మ ?” అంటూ దండకం మొదలు పెట్టేది . చిత్రంగా నేను జగ్గంపేట వెళ్లోచ్చినప్పుడల్లా మా అత్తగారూ అవే మాటలు మాట్లాడే వారు . నాకేమో పుట్టింటి వాళ్ళనైనా సరే ఏదైనా అడగడానికి చాలా మొహమాటంగా ఉండేది .

మోహన్ బి .ఇ డి క్లాస్ మేట్స్ ఆర్చ్ బాల్డ్ , సత్యన్నారాయణ శాస్త్రి కంబైన్డ్ స్టడీ కోసం కోనేరుపేట వచ్చేవారు . ఆర్చ్ బాల్డ్ ఒక బ్రహ్మల అమ్మాయిని ప్రేమిస్తూండే వాడట . సత్యన్నారాయణ శాస్త్రి “ వదిన గారూ , నాకు మీలాంటి అమ్మాయి దొరికితే ఈ జందెం గిందెం తీసి పడేసి ఏ కులమైనా ఫర్వాలేదు , పెళ్లాడే స్తానండి , నిజ్జం “ అంటూ నవ్విస్తూండే వాడు . వంటింట్లో కొచ్చి “ మడి కట్టుకుని చేపల కూర వండేస్తానండి . అసింటా …అసింటా ….” అని అభినయించేవాడు . ఒకసారి రామచంద్రపురం పక్కనున్న వాళ్ల పల్లెటూరు యనమదల కి నన్నూ మోహన్ నీ తీసుకెళ్లేడు. శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబ మైనా వాళ్ల తల్లిగారూ , తండ్రి గారూ మమ్మల్ని వాళ్ల అబ్బాయితో సమానంగా ఆప్యాయంగా చూసి పంపించేరు .

బి .ఇడి వాళ్ల యానవర్సరీ జరిగింది ట్రెయినింగ్ కాలేజ్ లో . దానికి నన్ను తీసుకేళ్లేడు మోహన్ . ఆ రోజు అమ్మాయిలు , అబ్బాయిలు అందరూ నాటికలు , ఏక పాత్రాభినయాలు చేస్తున్నారు . నన్ను గ్రీన్ రూంలో అమ్మాయి దగ్గర వదిలేసి మోహన్ మేకప్ చేసుకోవడానికి వెళ్లి పోయేడు . అందరూ నా చుట్టూ చేరి బోలెడన్ని కబుర్లు చెప్తూ చాలా అభిమానంగా చూసేరు . నాకు అప్పటికి చీర కట్టుకోవడం సరిగ్గా వచ్చేది కాదు . చీరను అందంగా ఎలా కట్టుకోవాలో నేర్పించేరు . అడుగడుక్కు జూస్ లు , కూల్ డ్రింకులు తెచ్చి ఇవ్వడం , అలా అమ్మాయిలు , అబ్బాయిలు కలిసి మెలిసి కలివిడిగా తిరగడం నాకెంతో నచ్చింది . “నేనూ కాలేజ్ లో చదువుకోగలిగితే ఎంతో బావుండేది కదా !’ అని చాలా అన్పించింది . నేను కడప వెళ్లినప్పుడు మోహన్ చాలా దిగులు పడుతూ ఉండేవాడని వాళ్లు చెప్తే ‘నిజమా ?’ అన్పించింది కాని , ఆనందంగానూ అన్పించింది .

మోహన్ ఆ బేచ్ కి జనరల్ సెక్రటరీ అట . స్టూడెంట్ ఫండ్ నుంచి వంద రూపాయలు తీసి మా ప్రయాణానికి వాడేసాడట . కొసమెరుపేంటంటే నన్ను చూసేక అందరూ తలో 5 రూపాయిలు వేసుకుని ఆ ఫండ్ ని భర్తీ చేసారట .

మోహన్ బి.ఇడి పూర్తైంది . నాకైతే తనకి ఎప్పుడెప్పుడు ఉద్యోగం వస్తుందా అని ఉండేది . ముఖ్యంగా తనకి ఉద్యోగం వస్తే నన్ను చదివిస్తాడనే ఆశ . ఇప్పుడు రామక్రిష్ణా థియేటర్ ఉన్న చోట రోడ్డుకివతల వైపు చిన్న పాక ఉండేది . అది చెక్ పోస్ట్ . మోరంపూడి , కోనేరు పేట వైపు నుంచి వచ్చే గడ్డి బళ్ల వాళ్ల నుంచి మునిసి పాల్టీ డబ్బులు వసూలు చేసేదట . జీతం కాక రోజూ ఎంతోకొంత చిల్లర వచ్చేదట . దాన్ని అక్కడే పేకాటలో ఖర్చు పెట్టేసి వచ్చేవాడు . తర్వాతెప్పుడో కొన్నేళ్లకి తెలిసింది .
తర్వాత ILTD లో అరవై రూపాయల జీతానికి కొన్నాళ్లు టెంపరరీ పోస్ట్ లో పని చేసాడు . పోలుదాసు రమణయ్య గారు , సుబ్బారావుగారు అనే ILTD ఉద్యోగులు కోనేరు పేట మీదుగా సైకిళ్ల మీద ఆఫీస్ కి వెళ్లే వారు . వాళ్లు ఇప్పించిన జాబ్ అది .
ఇంకోసారి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్లో జాబ్ కోసం వెళ్లి , నచ్చలేదని సాయంకాలానికి తిరిగి వచ్చేసాడు . నాకు మాత్రం గుండెల్లో రైళ్లు పరుగెడుతూ ఉండేవి .

-కె .వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , Permalink

One Response to నా జీవనయానంలో (ఆత్మ కథ )- జీవితం…..4- కె.వరలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో