డాడ్జ్ రిడ్జి (భాగం-3)
స్కీ రిసార్టు బయటంతా ఒక పక్క మంచు కురుస్తూనే ఉండడం వల్ల వరండా అంతా నీళ్లతో తడిగా ఉంది. రిసార్టు ఎంట్రెన్సు లైను హాలు సగం వరకూ ఉంది. మేం లైనుకి చివరెక్కడో నిలబడ్డాం. అక్కడ రిజిస్ట్రేషను చెయ్యకుండా లోపలికి వెళ్లడానికి వీల్లేదు. మరో అరగంట తర్వాత మా వంతు వచ్చింది. అక్కణ్ణించి ఎక్విప్మెంటు పికప్ లైను లో నిలబడ్డాం. కావలసిన స్కీ బూట్లు, స్కీ సామాన్లు మాత్రం స్కీ క్లాసు టిక్కెట్టు లో భాగం గా వచ్చేయి కానీ, హెల్మెట్లకి మళ్లీ పదేసి డాలర్లు కట్టించుకున్నారు.
ఈ తతంగమంతా జరుగుతున్నంత సేపూ సిరిని పట్టుకోవడం కష్టమైపోయింది. “నేనూ వెళ్తానని” పేచీ.
డాడ్జ్ రిడ్జి స్కీ రిసార్టు ఇంత వరకూ మేం చూసిన ఇతర స్కీ రిసార్టు ల కంటే బావుంది. రెండు మూడు చిన్న కొండల మీద దట్టంగా కురిసిన మంచుని చక్కగా చెక్కి, స్కీ కోసం నునుపుగా, వాలుగా తయారు చేసినట్లుంది. మెడ తిప్పి చూస్తే మూడు వైపులా మొత్తం స్కీయర్లంతా కనిపిస్తారు. ఒక వైపు బాగా ప్రొఫెషనిస్టులు, మధ్య పిల్లలు, మరో వైపు అప్పుడప్పుడే నేర్చుకుంటున్న పెద్దవాళ్లు. కొండలకి బాగా పైకి వెళ్లి కిందికి స్కీ చేసే వాళ్లు ప్రొఫెషనిస్టులు. వాళ్ల కోసం పై వరకూ తీసుకెళ్లే ఓపెన్ లిఫ్ట్ సర్వీసులున్నాయి. కొండ మధ్య వరకూ వెళ్లి కిందికొచ్చే వాళ్ల కోసం మధ్య రకపు లిఫ్టులు. ఇక ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు కొండకి కొంత మేర వరకూ లైనుకి అటూ, ఇటూ తాడు సహాయంతో నడుచుకుంటూ వెళ్లి, కిందికి స్కీ చేస్తూ రావాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలా స్కీ చేసే వాళ్ళ కూడా వచ్చిన వాళ్ళకి ఉచితంగా అక్కడికి వెళ్లి చూసే అవకాశం, ఫోటోలు, వీడియోలు తీసుకునే అవకాశముంది.
వరు ముందు నడిచింది క్లాసు వైపు. ఒక వైపు వదిలితే సిరి అటూ, ఇటూ పారిపోతూండడంతో నేను వరు కూడా వెళ్ళలేకపోయాను. అక్కడ చాలా బాచ్ లుగా క్లాసులు జరుగుతున్నాయి. తన క్లాసెక్కడో తెలీక అక్కడక్కడే తచ్చాడి, తచ్చాడి మొత్తానికి మరో అరగంట తర్వాత వాళ్ల కోచ్ వచ్చి తీసుకెళ్లాక వెళ్లింది. మరో గంటలో వీళ్లకి క్లాసు అయిపోతుంది. సత్య తన క్లాసు వైపు నడిచేడు. స్కీ బూట్లు వేసుకున్నారేమో ఇద్దరికీ అడుగు తీసి అడుగు వెయ్యడం భారమైనట్లు, ఏదో గ్రహాంతర వాసుల్లా నడిచేరు.
నాకు నవ్వాగలేదు. అప్పటి వరకూ కాస్త తెరిపినపడ్డట్టున్న వాతావరణంలో సరిగ్గా అదే సమయానికి మళ్లీ మబ్బు కమ్మి, మంచు కురిసెయ్యడం మొదలు పెట్టింది.
నిమిషంలో వీళ్లు ఎటు వెళ్తున్నారో తెలీకుండా, చుట్టూ ఎవరూ కనిపించకుండా అయిపోయింది.
ఇక నాపరిస్థితి ఎలా ఉందంటే, వీళ్లకి ఫోటోలు ఒక కేమెరాతోనూ, వీడియోలు మరో కేమెరాతోనూ తియ్యాలి, సిరిని పరుగెత్తకుండా పట్టుకోవాలి. ఇక నా పని అష్టావధానం అన్నమాట. అందుకే ముందుగా సిరిని తీసుకుని ఒక భద్రమైన చోటుకి వెళ్లి కూచుని అప్పుడు ఏదైనా చెయ్యాలని చుట్టూ చూసేను. దబ దబా కురుస్తున్న మంచులో అయిదు నిమిషాల కంటే ఎక్కువ సేపు కూచోవడం అసాధ్యం.
సరిగ్గా వీళ్ళిద్దరి క్లాసులూ కనిపిస్తున్న మధ్య ప్రదేశంలో రెండో అంతస్థులో పెద్ద అద్దాల గది కనిపించింది. అది రిసార్టుకి రెస్టారెంట్ల కాంప్లెక్స్ అని కౌంటర్లో చెప్పేరు. కానీ అక్కడికి వెళ్లాలంటే ఒకే ఒక మార్గం మంచులో తడుస్తూ వెళ్లడం. అలాగని ఆగితే ఎప్పటికి తగ్గుతుందో కూడా తెలియదు. పైగా మేం నించున్న వరండా ప్రాంతం అంతా నీళ్లతో బాగా తడిగానూ, చలి గాలి గానూ ఉంది. ఇక పిల్లని ఎత్తుకుని, బ్యాగులు మోసుకునీ అడుగు కూడా వెయ్యడం నా వల్ల కాదు.
సిరికి బ్యాగులోంచి చిన్న గమ్మీ బేర్ చాక్లెట్లని తీసి చూపించి, నాతో నడిస్తే అవి ఇస్తానని చెప్పేను. హుషారుగా బయలుదేరింది. సరిగ్గా వరండా దిగి మంచులోకి అడుగు పెట్టామో, లేదో కాళ్లు కూరుకుపోయే మంచులో దిగబడిపోయేం. పిల్ల కాళ్లు మునిగిపోయే మంచు. అయినా అడుగుకొక గమ్మీ ఇస్తే గానీ కదలనని మొండికేసింది. కష్టమ్మీద పక్క బిల్డింగు వరకూ నడిచి, మెట్లెక్కబోయేసరికి మెట్లమీద జర్రున బూట్లు జారిపోతున్న మంచుతో ఒక మెట్టు ఎక్కితే మరో మెట్టు కిందికి వచ్చేస్తున్నాం. “మమ్మీ, హెల్ప్ మీ” అంటూ సిరి ఇక మంచులో పాకడం మొదలుపెట్టింది. గమ్మీ పేకెట్టు అయిపోయింది. ఇక నేను పిల్లని చంకనెత్తుకుని, బ్యాగులు పట్టుకుని ఆ ఇరవై మెట్లు జారకుండా కాపాడుకుంటూ ఎలా ఎక్కానో నాకే అర్థం కాలేదు.
రెస్టారెంటు హాలు లోకి వచ్చిపడి అర్జంటుగా పిల్లకి బట్టలు మార్చి, నేను వెచ్చబడేసరికి తల ప్రాణం తోకకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేసి ఛాయా చిత్రాలను చూడండి.
అయితే బయట అరగంటకోసారి తెరలా వెలుతురు కిరణాల్ని మోసుకుంటూ సూర్యుడు రావడం, అంతలోనే మబ్బు కమ్ముకుంటూ మంచు తుపతుపా కురవడం.
భలే తమాషా వాతావరణమది. అద్దాల లోపల వెచ్చగా హాయిగా ఉంది కానీ, చిన్న పిల్లలా ఉరకలెత్తే మనసు ఇలాంటి భద్రత చాటున దాక్కుని అనుభూతుల్ని కోల్పోతుందా?
ఆ రోజంతా సిరి, నేను వెచ్చదనం సరిపోగానే మంచులోకి పరుగెత్తడం, అక్కడ ఉండలేని చలి అనిపించగానే లోపలికి పరుగెత్తుకు రావడం చేసాం.
ఆ వెళ్లిరావడం ఎంత బావుందో చెప్పలేను.
రెస్టారెంటు కాంప్లెక్సు అద్దాలనానుకుని ఉన్న ఒక టేబులు, కుర్చీలు చూసుకుని తెచ్చిన సామాన్లన్నీ అక్కడ పెట్టి కేవలం కేమెరా ఒకటే తీసుకుని, సిరినెత్తుకుని బయటకు వచ్చాను. ఇద్దరం కట్టుదిట్టంగా బట్టలు, గ్లోవ్స్ వేసుకున్నాం.
రెస్టారెంటు చూరు నించి బయటంతా మంచు ముద్దలుగా పేరుకు పోయి ఉంది. ఆ పైన ఇంకా కురుస్తూనే ఉంది.
అప్పుడప్పుడే కురుస్తున్న మెత్తని మంచు. ఉండచుడుతూండగా గట్టి పడి ఘనీభవించే మంచు. అలా చూడగానే నోట్లో వేసుకోవాలనిపించే మంచు. గర గర మంటూ మెత్తగా నలుగుతూ అరచేతిలో చాలా తమాషా కొత్త అనుభూతి అది.
అక్కడికీ ఆగలేక పై నించి మంచు పడ్తూంటే నోరు తెరిచి మంచుని ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించేం. అరచేతిలో కురిసిన మంచుని చిన్న ఉండలు చేసి చప్పరించేసేం.
సిరి ఉండల్ని చూడగానే “సో మేన్, మమ్మీ సో మేన్” అనడం మొదలు పెట్టింది. అంటే “స్నో మేన్” అన్నమాట. మనం ఇసుకలో గూళ్ళు కట్టినట్లు ఇక్కడి పిల్లలు మంచుతో “స్నో మేన్” లని తయారు చేస్తారు. పెద్ద ఉండ మీద, చిన్న ఉండ తలకాయ పెట్టి ముక్కుకి, కాళ్ళకి , చేతులకి పుల్లలు గుచ్చి మనిషి రూపంలో చేయడమన్నమాట. మేం ఇద్దరం కలిసి ఒక గంట సేపు కష్ట పడి “స్నో మేన్” ని తయారు చేసేం. దగ్గర్లో పుల్లలు వగైరాలేమీ లేనందున అదొక పెంగ్విన్ లా తయారైంది. సిరి మాత్రం “హుర్రే, స్నో మేన్” అని కేరింతలు కొట్టింది.
మేం ఇదంతా తయారు చేస్తున్న చోట వరండాలో మంచులో కూరుకుపోయి ఉన్న బెంచీలు, కుర్చీలు ఎప్పటి కప్పుడు శుభ్రం చేసే మెషీన్లతో ఇద్దరు రెస్టారెంటు పనివాళ్ళు అటూ, ఇటూ గంటకోసారి తిరుగుతున్నారు. వాళ్ళు మంచు క్లీన్ చేస్తూనే ఉన్నా, మళ్లీ పడ్తూంది. ఇక మా స్నోమేన్ జోలికి రాకుండా, మాకు పర్మిషన్ ఇచ్చేసారు. ఆ సాయంత్రం మేం వెళ్లేంత వరకూ అక్కడలానే ఉంచారు. కాస్సేపట్లో సిరి అలిసి పోయి ఆ బెంచీల మీద మంచులో తలవాల్చి కూచుంది. అప్పటికొద్దీ లోపలికి తీసుకొచ్చేసేను.
మరి కాస్సేపట్లో కొంచెం ఎండ వచ్చినట్లు కనిపించగానే మళ్లీ బయటికి “స్నో ఏంజల్స్” చెయ్యడం మొదలు పెట్టాం. ఈ సారి మెట్లు దిగి, స్కీ వైపు వెళ్లేం. “స్నో ఏంజల్స్” అంటే మంచులో వెల్లకిలా పడుకుని “సీతాకోక చిలుకల్లా” చేతులు ఆడిస్తూ మంచులో ముద్రలు తయారు చేయడమన్న మాట.
పసిపిల్ల, నేను ప్రకృతిలో నిమగ్నమై, భూమి, ఆకాశం ఏకమైన ఒకటే ధవళ వర్ణం లో మమేకమై ఎంతసేపు గడిపినా ఇంకాస్త సేపు గడపాలనిపించే ఆ ప్రదేశాన సాయంత్రం వరకూ గడిపేం.
మధ్య మధ్య వరుని, సత్యని ఫోటోలు, వీడియోలు తీయడానికి ప్రయత్నం చేసేను.
వరు గంటలో క్లాసు అయిపోయిందని వచ్చి, మధ్యాహ్నం నించి స్వంతంగా నేర్చుకోవడానికి వెళ్లింది. సత్య మధ్యలో కాస్త భోజన విరామం తీసుకుని మళ్లీ వెళ్ళేడు. నేను, సిరి నచ్చినపుడల్లా ఏవేవో కొనుక్కుని తిన్నాం.
క్లాసులు రెండు గంటలు మాత్రమే. ఇక అక్కణ్ణించి సాయంత్రం వరకూ అద్దెకి తీసుకున్న ఎక్విప్ మెంటుతో రిసార్టు క్లోజింగు టైము వరకూ స్వయంగా ప్రాక్టీసు చేసుకోవచ్చు. ప్రాక్టీసు పేరుతో పడ్తూ లేస్తున్న సత్యని, అవలీలగా పై కొండ వరకూ వెళ్లి చాలా స్కిల్ తో కిందికి వస్తున్నా వరుని చూస్తూ కూచున్నాను.
ఇంతకు ముందు స్కీకి ప్రయత్నించి వెల్లకిలా పడి తలకు దెబ్బ తగిలించుకున్నాను. అందువల్ల ఈ సారి నేను స్కీ జోలికి పోకుండా చక్కగా చంటి పిల్లతో ఆడుకున్నాను. కానీ స్కీ వెళ్ళొచ్చినట్లు ఫోటోలైనా కావాలిగా. అందుకే సత్య ఎక్విప్ మెంటు చివర్లో నేనూ ధరించేసి, కాసిన్ని ఫోటోలకి ఫోజులిచ్చేను.
ఇంకా రిసార్టు క్లోజింగుకి చాలా టైమున్నా, నాలుగైదు గంటల ప్రాంతంలో అన్నీ పేకప్ చేసేం. ఆసరికి మంచు ఉధృతం తగ్గి చక్కగా ఎండ కాస్తోంది. బయట కారు పార్కింగులో పలచగా ఊడ్చిన మంచంతా కరిగి నీళ్లలో సూర్యకిరణాలు ప్రతిఫలిస్తూ ఆ ప్రాంతమంతా పసుపు రంగు దాల్చింది. మా కారు కిందుగా వెనక భాగాన్ని ఆనుకుని సూర్య కిరణాల్ని ఒడిసి పడుతూ ఒక సన్నని మంచు కత్తి వేళ్ళాడుతోంది. కారు మీద తల వాల్చి చుట్టూ చూస్తూ న్న నాకు కిందికి చూడగానే కనిపించిన ఆ సుందర దృశ్యాన్ని ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోయాను.
ఉదయం నించీ మనసుని డోలలాడించిన మంచు కురిసిన మొదటి రోజు ఒక పక్క భయాందోళనని రేకెత్తించినా, చలికి నరాల్ని వొణికించినా, అందమైన, అపురూపమైన అనుభూతి పంచిన ఆరోజు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. తిరిగి హోటల్ కి వచ్చేసరికి ఉదయం మమ్మల్ని హడలగొట్టించిన మంచంతా కరిగి, మా కారుకి దారి సుగమం అయ్యింది. “హమ్మయ్య”
అని ఊపిరి పీల్చుకున్నాం.
-డా॥కె.గీత
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~