కృషి తో నాస్తి దుర్భిక్షం(కథ) -ఉమాదేవి అద్దేపల్లి

ఇండియా లో ఇంచుమించు అన్ని రాష్ట్రాల వారితో పరిచయం వున్ననాకు ,గుజరాతీలు ఎక్కువగా కర్మవీరులుఅనిపిస్తుంది .పంజాబీల విషయానికి వస్తే వారిని ఖడ్గ వీరులు గా చెప్పోచ్చేమో,అందుకే వారిలో ఆడ మగ వారి సాంప్రదాయమంటూ మొలలో ఒక చిన్న చురకత్తిని అలంకారం లా ధరిస్తారు..కుటుంబానికొకరయినా దేశ రక్షణ భారం భుజాల మీద వేసుకొని,ఆర్మీలో చేరతారట. వారికి బుద్ధిబలం కన్నా ,భుజ బలం మిన్న .స్త్రీ ,పురుషులంతా భారీ కాయులే .

ఇక గుజరాతీయుల విషయానికి వస్తే, తక్కువ శరీర శ్రమతోఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.ఆడ ,మగ అందరు నిరంతరం ఏవో చిన్నా చితకా పనులు చేసుకుంటూనే వుంటారు.నా జీవితారంభం గుజరాతీయుల సాంగత్యంతోనే ప్రారంభం కావడం వలన చాలా విషయాల్లో నాకు తెలియకుండానే నా మీద వారి ప్రభావ పడిందని చాలా కాలం తర్వాత గ్రహించాను.మేము సంబల్ పూర్ లో వుండేవాళ్ళం. అవడానికి సంబల్ పూర్ ఒరిస్సా అయినా చిన్న సైజు కాస్మాపాలిటన్ నగరం. దేశంలో వున్నఅన్ని భాషల వాళ్ళు వుండేవారు అక్కడ .మా ఇంటి ఎదురుగా రాజస్థానీ వాళ్ళు,ఇరుగు ,పొరుగు గుజరాతీలు.
ఇంటిని కళాత్మకంగా అలంకరించుకోవడం అనేది గుజరాతీలు తర్వాత మన తెలుగు వారే అనిపిస్తుంది నాకు ,కాకపోతే మధ్యతరగతి మహిళలు గుజరాతీ వారిలా అన్ని పనులు అవలీలగా చేసుకొనడం మనవారిలో తక్కువ .’ఇంట గెలిచి రచ్చ గెలవాలి’అన్నట్టు,ఇంట్లో చురుగ్గా వుంటారు కనుక బయట బిజినెస్ విషయాల్లో కూడా మగవారికి అండదండగానిలుస్తూ అన్ని రంగాల్లో విజయం సాధిస్తూ వుండడం గమనించాను. ఆడవారి డామినేషన్ అయినా సంసారాన్ని గుట్టుగా లాగడం లో దిట్టలు గుజరాతీ మహిళలు.

శ్రమే పెట్టు బడిగా,కట్టు గుడ్డల్తో వచ్చినవారు మా కళ్ళఎదుటే ఎంతో గొప్ప స్థాయికి ఎదగడం చూస్తే ‘శ్రమ జీవికి జగమంతా లక్ష్మి నివాసం’ అనే పాటలో ప్రతి మాట అక్షర సత్యం అనిపిస్తుంది.ఆ నేపధ్యం లో ‘ఇంతింతై,వటుడింతై ..”అన్నట్టు స్వయం కృషి తో అంచెలంచెలుగాఎదిగిన ఒక టైలర్ గురించి చెప్పాలనిపించి యీ కధకాని కధ వ్రాస్తున్నాను .

నా పెళ్ళయిన వారం రోజులకే మా వారికి సెంట్రల్ గవర్నమెంట్ ( రైల్వేస్ )లో జాబ్ దొరకడం ,ఒరిస్సా కటక్ లో పోస్టింగ్ రావడం జరిగింది .అప్పుడే సంబల్పూర్ లో వున్నమా మేనమామ శ్రీరంగం రాధా కృష్ణ గారి ఇంటికి కటక్ నుండి నేను మొదటిసారి వెళ్ళాను.ఆ సందర్భంలో ఒకరోజు మా మామయ్య తమ మిత్రబృందంతో హీరాకుడ్ డామ్ చూడడానికి జీప్ లో వెళ్తూ మమ్మల్ని ,అంటే నన్ను ,మా అత్తయ్యని తీసుకెళ్ళారు ..జీప్ లో వున్నవారంతా పెద్దవారే( స్థాయిలో) వారిలో సుప్రసిద్ధ రచయిత,సినీ నటులు గొల్ల పూడి మారుతీ రావు గారు,ప్రముఖ రచయిత్రి శ్రీమతి డి.కామేశ్వరి గారు కూడా వుండడం విశేషం.అప్పుడు వారిలో వున్నవిశిష్టత నాకు తెలియదు.తెలుసుకొనేంత వయసు లేదు.” నా మేనగోడలు” అని మామయ్యపరిచయం చేసినపుడు పెద్దవారని ‘నమస్కారం’ చేశానంతే.అప్పట్లో తెలుగు సాహిత్యం తో ,రచయితలు ,రచయిత్రులతో ( ఇప్పటికి కూడా) అంతగా పరిచయం లేదు.

సరే, ఆ మర్నాడే కటక్ నుండి మా వారు వచ్చి తిరుగు ప్రయాణం కట్టమన్నారు.లంగా ,వోణీ లే,చీరలు కట్టే ఆరిందాను కాదు పెళ్లయినా.మొదటిసారి మా అత్తయ్యనాకు చీర ,జాకెట్టు పెడుతూ,అక్కడ ఎవరయినా టైలర్ వుంటే అప్పటికప్పుడు బ్లౌస్ కుట్టించుదామనినన్ను తీసుకొని బయలుదేరింది.పెద్ద టైలర్స్ వారం పడుతుంది అన్నారుమాకేమో మర్నాడు కావాలి.మేము తిరిగి వచ్చేస్తుంటే అక్కడొక వీధి అరుగుమీద ఒక కుట్టు మిషన్ పెట్టుకొని,బట్టలు కుడుతూ టైలర్ కనిపించాడు.పక్కనే కొద్దిగా కుడుతున్న బట్టలువున్నాయి ,ఒక చిన్నకుర్రవాడు బ్లౌసేస్ కి బటన్స్,కాజాలు కుడుతున్నాడు.

”అత్తా ! అదిగో టైలర్.అతన్ని అడుగుదామా !”అన్నాను.ఎవడో టైలర్ అయితే చాలు,ఆ మాత్రం బ్లౌస్ కుట్టలేడాఅనుకున్నానే కానీ , ఫేషన్ బుల్ గా ఉండాలనే ధ్యాస లేని వయసది.

”ఏమిటోనే అమ్మలూ! ఇలాటి వీధి టైలర్ ఏమి కుడతాడులే..సరే.అడిగి చూద్దాం.నీమాటేందుకు కాదనాలి ..” అంటు.అరుగు మెట్లు ఎక్కుతూ ,

”దేఖో భాయ్..”అంది మా అత్త .అతను గుజరాతీ..మా అత్త అలా పిలవడంతో అదాటున లేచినిలబడ్డాడు.పార్శీ లేడీ లా కనిపిస్తున్న ఆమె తననే పిలుస్తోందా! అని చుట్టూ చూసుకొని,తననే అని నిర్ధారించుకొని,చేతులు కట్టుకొని వినయంగా ,

”బోలీయే మేమ్ సాబ్..!” అన్నాడు .

”మా మేనగోడలి బ్లౌసు లు రెండు కుట్టాలి.నువ్వు కుట్టగలవా!”కాస్త అనుమానంగానే అడిగింది.

”తప్పకుండా మేమ్ సాబ్!”అన్నాడు మెరిసే కళ్ళతో.

”బాగా కుడతావా?” ఇంకా సందేహమే ఆమెకి .

”మీరు సరయిన కొలత ఇవ్వండి మేమ్..ఎలా ఇస్తే అలా కుడతాను”అనడంతో కొలజాకెట్టు,బ్లౌస్ పీస్ లు ఇస్తూ ,

”రేపు మధ్యాహ్నం వీళ్ళు వెళ్ళిపోతారు.రేపు పొద్దున్నకిఇవ్వగలవా !” అంటే ,

”పొద్దుట వరకు ఎందుకు మేమ్ సాబ్ ! సాయంత్రానికి కుట్టేసి ,నేనే మీ ఇంటికి తీసుకు వచ్చి ఇస్తాను.అడ్రస్ చెప్పండి .”అనగానే ”అమ్మయ్య అనుకుంటూ అడ్రస్ చెప్పి వచ్చేసాము.అన్నట్టుగానే సాయంత్రానికి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు బ్లౌస్ లు.చాలా బాగా కుట్టాడు..మా అత్తయ్య ఆనందానికి అవధులు లేవు..చాలా చక్కగా ,పైగా చాలా చౌకగా అంతేకాదు ఇంటికి వచ్చిమరీ కుట్టినవి ఇచ్చిపోతున్నాడు..ఆమె సంబరపడిపోతూ ,తన బ్లౌస్ లు కూడా అతనికే ఇవ్వడం ప్రారంభించింది..ఆమెకి సంతృప్తి కలగడంతో,మా అత్తకి ఫ్రెండ్స్ సర్కిల్ చాలా పెద్దది .గుజరాతీ,ఒరియా ,మార్వాడీ ఇలా తన కి తెలిసిన వాళ్ళందరికీ కూడా అతని గురించి చెప్పడంతో అందరు అతనికే ఇచ్చేవారు. బ్లౌస్ లు ,చుడీ దార్స్, లేడీ టైలర్ గా తక్కువ సమయంలో బాగానే పాప్యులర్ అయ్యాడు.

మేము తరువాత సంబల్ పూర్ వచ్చి అక్కడదగ్గరలో ఒక గ్రామంలో ( మావారి వ్యాపార రీత్యా ) సెటిల్ అయ్యాము.మా వూరి నుండి సంబల్పూర్ రెండుగంటలు ప్రయాణం.మా పెద్దమ్మాయి రాధ పుట్టాక,నా బ్లౌస్ లు ,పాప గౌన్లు అతనికే ఇచ్చేదాన్ని..ఈ మధ్య కాలం లో అరుగుమీద నుండి చిన్న షాపు అద్దెకి తీసుకొని,దానికి ముందు ‘సంగీతా టైలర్స్’అనే బోర్డు కూడా పెట్టాడు..మరో ముగ్గురు టైలర్స్ ని షాపులో పెట్టుకున్నాడు..అతని స్థాయి రోజు రోజుకీ పెరుగుతున్నా అదే నిరాడంబరం కనిపించేది..నన్ను చూసినపుడెల్లాకృతజ్ఞతా భావం తోణికిసలాడేది అతని కళ్ళల్లో.

”చాలా డెవలప్ చేసారు షాపుని ..” అంటే ”అంతా నీ చేతి చలవమ్మా!” అన్నాడోకసారి..నేనేమి చేసాను..? అనుకున్నాను మొహమాటంగా పండుగులకీ ,పబ్బాలకీ ఉదయం మా పిల్లలిని ఇంట్లోవదలి,టౌన్ కి వచ్చి ,బట్టలు కొని ‘సంగీతా’లో ఇస్తే ,సాయంత్రం నేను తిరిగి వెళ్ళేటప్పటికి అన్నీ రెడీ చేసి,చక్కాగా ఇస్త్రీ చేసి,పాలిథిన్ కవర్లో పెట్టి అందించేవాడు..మధ్యలో చాలా కాలం నాకు వీలు పడక మా గుమస్తాలకిఇచ్చి కానీ ,ఒక్కోసారి మా వారిచేత కానీ పంపితే , అప్పటికప్పుడు కుట్టి వారికిచ్చి పంపేవాడు.మా వూరివాళ్ళు కూడా నేను చెప్పగా అతని వద్దకే బట్టలు కుట్టించుకోనేందుకు వెళ్ళేవారు ..

మా పెద్దమ్మాయి రాధని సంబల్పూర్ GMకాలేజ్ లో చెరినపుడు మేము సంబల్ పూర్ మకాం మార్చేసాము . రాధని కాలేజ్ లో చేర్పించే ముందు డ్రెస్సెస్ కుట్టించడానికి ‘సంగీతా టైలర్స్ ‘దగ్గరకు తీసుకొని వెళ్లాను.అక్కడ నాకు అతని చిన్న షాప్ కనపడలేదు..అడ్రస్ మారిందా !అనుకున్నాను .సందుకి ఒకవైపున్న చిన్న షాపు అతనిది ,అటుఇటు చూస్తుంటే ,సందుకి అవతల వైపు ఇంచుమించు నాలుగైదు షాపుల విస్తీర్ణంతో ఒక పెద్ద అద్దాల షాపు..దానిపై ”సంగీతా మాస్టర్ టైలర్స్ ‘అనే పెద్ద సైన్ బోర్డు..నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను.అదవునో,కాదో అనే సందేహంతో అడుగుపెట్టాను లోపలికి ..అదే ,ఆ టైలరే..వరుసగా బోలెడన్ని కుట్టు మిషన్లు,పెద్ద అద్దాల బీరువాలు ,హంగర్స్ కి తగిలించిన రకరకాల దుస్తులు ,పెద్ద రెడీ మెడ్ షాపు లా వుంది .అప్పుడు జెంట్స్ డ్రెస్సెస్ కూడా కుడుతున్నాడులా వుంది..ఖరీదయిన డ్రెస్ వేసుకున్నాడు,రిమ్లెస్ కళ్ళజోడు.అజామాయిషీ చేస్తూ అటుఇటు తిరుగుతున్నఅతన్ని నేను గుర్తు పట్టలేదు.కానీ నన్ను గుర్తుపట్టాడు అతను..”అమ్మా !రండి.చాలా కాలానికి..”అంటూ ఆహ్వానించాడు.సినిమాల్లో సాధారణంగా ఇలాటి దృశ్యాలు చూసినపుడు కల్పితాలు అలాగే వుంటాయి అనిపించేది ,కానీ కళ్ళఎదుట వాస్తవం నిజంగానే అబ్బుర పరిచింది ..’

”పాప బాగుందా? ” అడిగాడు .”ఈ అమ్మాయే మా పాప.కాలేజ్ లో చేరింది..అందుకే స్వయంగా తీసుకొచ్చాను .డ్రెస్సెస్ కుట్టాలి.”అంటే ”అప్పుడే ఇంత ఎదిగిపోయిందా ! నిన్నకాక మొన్న నెలల పాపని చూస్తున్నట్టుంది.మీరు వచ్చి చాలా కాలం అయింది ,మీరు పంపే బట్టలు కుట్టి పంపెస్తున్నానే కానీ నా ఉహల్లో మీ పాప అలాగే వుంది .”అన్నాడు వాత్సల్యంగా .
”ఆడపిల్ల ,అరటిచెట్టు ఎదగడానికి ఎంతసేపు..మీ షాపు కూడా చాలా చాలా ఎదిగింది .”అన్నాను .మళ్ళీ అదే మాట .
”నీ చేతి చలవతల్లీ.నీ సహకారం .!” అని..అతనిలో దీక్ష ,పట్టుదల ,అవిశ్రాంత స్వయంకృషి అతన్ని పైకి తెచ్చింది, .మేము చేసింది ఏమీలేదు .అయినా అతను మాటల్లో,చేతల్లో చూపే కృతజ్ఞతా భావం దశాబ్దాలు అయినా మరచిపోలేక పోతున్నాను..
మా రాధ ఏడాది పుట్టిన రోజుకి చక్కని డిజైన్ తో గౌను కుట్టి ఇచ్చిన అతనే ,మా అమ్మాయి కాలేజ్ కి వచ్చేవరకూ కుట్టి ఇచ్చాడు.. Bsc ఫస్ట్ రాంక్ లో పాసయిన రాధ చేత మెడికల్ ఎంట్రన్స్ వ్రాయించి ,మెడికల్ సీటు వచ్చాక మరీ మా వారు దగ్గర సంబంధం అని ,మా అమ్మాయి కి ఇష్టం లేకున్నా ఒప్పించి పెళ్లి ఏర్పాట్లు చేసారు.అప్పుడు పెళ్ళిబట్టలు కుట్టించడానికి ‘సంగీతా టైలర్స్ ‘కే వెళ్ళాను..పాపకి పెళ్లి బ్లౌస్ లు కుట్టాలి ,అంటే చిరునవ్వుతో చూసాడు నా వంక ,
”చీర కట్టడం తెలియని వయసులో ఒక బొమ్మలాగా బ్లౌస్ కుట్టమని నా దగ్గరకు వచ్చారు.అమ్మ అయ్యాక బొమ్మలాటి పాపని ఎత్తుకొని వచ్చారు .ఇప్పుడు ఆ బొమ్మ కూడా ఒక ఇంటి ఇల్లాలు కాబోతోంది ..మీ మనుమలకి కూడా నేనే కుట్టాలి డ్రెస్సులు .”అన్నాడు మాచింగ్ బ్లౌస్ కుట్టమని అతని చేతికి అందించిన మా అమ్మాయి పట్టు చీరని ఆప్యాయంగా,అభిమానంగా చూస్తూ ,ప్రేమగా చీరను నిమురుతూ..
”తప్పకుండా ” అన్న నా మాటలకి అతని ముఖం వెయ్యి వోల్ట్ ల బల్బ్ లా వెలిగింది కానీ ఆ అవకాశం మాకు దొరకలేదు

,ఎందుకంటే మా అమ్మాయి పెళ్ళయిన సంవత్సరమే మేము సంబల్ పూర్ వదిలి పాండిచ్చేరీ సకుటుంబంగా వెళ్ళిపోయాము .తరువాత ఖండాంతరం ,మళ్ళీ సంగీతా టైలర్స్ ని చూడలేదు ..కానీ చివరిసారిగా కలిసినపుడు అతని కళ్ళల్లో ,ముఖం లో మా అమ్మాయి పట్ల వ్యక్త పరచిన వాత్సల్యం చూసినపుడు నాకు విశ్వ కవి రవీంద్రుని ‘కాబులీ వాలా ‘ కధ గుర్తుకొచ్చింది.ఈ ప్రపంచంలో ఎవరికెవారుఏమీ కాము,ఎవరినుండి ఎవరు ఆశించేది ఏమీ లేదు .అయినా కొందరు వ్యక్తులు,కొన్ని సంఘటనలు జీవితాంతం మరచి పోలేని ‘చిరస్మరణీయాలు ‘ అనిపిస్తుంది.

-ఉమాదేవి అద్దేపల్లి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , Permalink

7 Responses to కృషి తో నాస్తి దుర్భిక్షం(కథ) -ఉమాదేవి అద్దేపల్లి

 1. ఉమాదేవి says:

  నా కధ కాని కధ ని చదివి మీ అమూల్య అభిప్రాయాలు తెలియజేసిన వారికి , ఆదరించిన వారికి ,ప్రచురించిన హేమలత గారికి నా ధన్యవాదములు .

 2. Mohammed Nazeeruddin says:

  Katha kathala ledu Autobiography chadivinattundi.Thanks katha chalabagundi.

 3. చాలా బావుంది..కథ ఆసక్తి కరంగా అనిపించింది.

  • ఉమాదేవి says:

   ధన్యవాదాలు మహమద్ నజీరుద్దీన్ గారు

  • ఉమాదేవి says:

   ధన్యవాదాలు పద్మజ గారు .

 4. TVS SASTRY says:

  చాలా బాగుందండీ!అభినందనలు ఉమాదేవి గారు!

  —-టీవీయస్.శాస్త్రి

  • ఉమాదేవి says:

   ధన్యవాదాలు టీ వి ఎస్ శాస్త్రిగారు .