సహ జీవనం 9 (ధారావాహిక) -టి.వి.యస్.రామానుజ రావు

“ఏమండీ, నాకు ప్రమోషన్ వచ్చింది.” నీరజ సంతోషంగా చెప్పింది.

“పోనీలే, నీకన్నా వచ్చింది. మన కష్టాలు గట్టెక్కినట్లే” అన్నాడు ప్రసాదం ఆనందంగా.
భర్త వంక అదోలా చూసింది నీరజ. తను, తన అవసరాలూ పట్టవా ఈ మనిషికి? తన జీతం జీవితాంతం ఈ మనిషి కోసం, ఇతను చేసే అప్పులు తీర్చడానికేనా?

అది గమనించని ప్రసాదం చెప్పుకుపోయాడు “హౌసింగ్ లోను ఇన్ స్టాల్మెంటు ఇప్పుడుమొదలైనా ఇబ్బంది పడనక్కర్లేదు. ఉషను కూడా మంచి కాన్వెంటులో చేర్పిద్దాం.”

“మీకు ఇప్పుడే రాదా ప్రమోషన్?” మీ జీవితం ఇంతేనా అన్నట్లు అడిగింది.

“ఏమోనోయ్, మా వాళ్ళు తమ చుట్టూ తిరిగే వాళ్ళనే సంవత్సరాల తరబడి తిప్పించుకుని అప్పుడుగానీ ప్రమోషను ఇవ్వరు”అన్నాడు నిరుత్సాహంగా.

మొదటి నెల జీతం రాగానే, ఒక అర డజను ఖరీదైన చీరలు, పిల్లలు ఇద్దరికీ మంచి బట్టలు కొని తెచ్చింది నీరజ. ‘మీకు ఏం తేలేదు, మీరు ఎలాగు ఒద్దంటారుగా’ అంటున్న భార్య మనసు అర్ధమై నిర్వికారంగా చూశాడు ప్రసాదం.

ఆమె ప్రమోషను ఆనందంలో తనకు భాగస్వామ్యం లేదు. అంతే కాదు, తీసుకున్న లోన్లు తీర్చడం, ఇంటి ఖర్చులు మీ బాధ్యతే అన్నట్లు ఆమె ప్రవర్తించడం మొదలుపెట్టింది.

తరచుగా ఎవరితోనో మాట్లాడేటప్పుడు ‘ప్రమోషన్ అంటే మార్కెట్లో దొరికే వస్తువు కాదు, అది అర్హత ఉంటేనే వస్తుంది’ అంటూ భర్త ఎదురుగానే అంటూ వుండేది. ప్రసాదం మౌనంగా ఉండిపోయేవాడు.

తన జీతం తన ఇష్టం అన్నట్లు తనకు నచ్చినవి కొనడం, తను కోరుకున్నట్లు ఖర్చు పెట్టడం ఎక్కువైంది.భార్య ఆడంబరాలకు పోతోందని గ్రహించి కొత్తలో ఒకటి రెండు సార్లు చెప్పి చూశాడు. ఆమె అతన్ని ఈసడింపుగా చూడడంతో చెప్పడం మానేశాడు.
ఇది వరకు మధ్య తరగతి కుటుంబాల్లో సంతానం అధికం, ఆదాయం తక్కువా ఉండేవి. అందువల్ల ఇప్పట్లో లాగా, పిల్లలకు చిన్నప్పటినుంచీ అడిగినవి అన్నీ కొనడం, అమర్చి పెట్టడం వుండేది కాదు. అడిగినవన్నీ అమరిస్తే, పిల్లలకు గారాబం చేసినట్లు అవుతుందని కొద్దిగా కఠినంగానే మందలించే వారు కూడా. బహుశా చిన్ననాటి నియంత్రణ ప్రభావంతో నీరజ అలా ప్రవర్తిస్తోందేమో లెమ్మని ప్రసాదం సర్దుకు పోయాడు. కానీ రాన్రాను ఆమె ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది. ఇంట్లో కొన్ని పన్లు కావాలని వదిలేసి,భర్తకు పురమాయించేది. ఏదన్నా అంటే “ భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు ఇద్దరూ కలిసి పని చేసుకోవాలి. గవర్నమెంటు ఆఫీసులో పని ఎలావుంటుందో మీకు తెలీదు,అందులో నేను ఆఫీసరునాయే” అంటూ భర్తను తేలిక చెయ్యడం నేర్చుకుంది. ప్రసాదం మాత్రం మౌనంగా భరిస్తూ వచ్చాడు.

ఒక రోజు నీరజ తల్లిదండ్రులు , ఆమె చెల్లెలు సరస్వతి వచ్చారు. సరస్వతి అప్పటికే ఎమ్మెసి పూర్తి చేసి, వాళ్ళ ఊళ్లోనే ఒక స్కూల్లో టీచరుగా పని చేస్తోంది. ఆమెకు హైదరాబాదులో పెళ్ళి సంబంధం వచ్చింది. ఆ పెళ్ళికొడుకు వివరాలు వాకబు చెయ్యడానికి, ఆతర్వాత వాళ్ళను కలుసుకుని మాట్లాడడానికి నీరజ తల్లిదండ్రులు నాలుగు రోజులు వుండిపోయారు. ప్రసాదం వాళ్ళకు ఆ వివరాలు అన్నీ కనుక్కుని తెలియ జేయడమే కాకుండా, హైదరాబాదు అంతా తిప్పి చూపించాడు. నీరజ అంతమందికి వంట చెయ్యడం తన వల్ల కాదని వంట మనిషిని పెట్టింది. ప్రసాదమే ఇంటి వ్యహారాలు అన్నీ చూసుకోవడం,కూతురు ఏ పని చెయ్యకపోవడమే కాకుండా అతని మీద పెత్తనం చెయ్యడం చూసి, నీరజ తల్లి ఆశ్చర్యపోయింది. చాటుగా కూతుర్ని మందలించింది. ఆమె ఏమని మందలించిందో ప్రసాదంకు వినబడ లేదు కానీ, ఆ పక్క గది లోంచి రాబోతూ నీరజ జవాబు మాత్రం విన్నాడు.

–టి.వి.యస్.రామానుజ రావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, , Permalink

Comments are closed.