”కళమ్మా… వస్తన్నావా?” మీనమ్మ, సత్తెమ్మ, కళమ్మ ఇంటి ముందు ఉన్న అరుగు దగ్గర నిలబడి పిలిచారు.
”ఆఁ… వస్తన్నా మీనక్కా” అంటూ బాక్సు ఉన్న చేతి సంచితో బయికి వచ్చింది కళమ్మ. అప్పుడు సమయం ఉదయం 9 గంటలు దాటింది . మే నెల మండు వేసవి కాలం. అప్పటికే ఎండ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఆ పల్లెలో చిన్నపిల్లలు, ముసలివాళ్ళు తప్ప వయసులో ఉన్నవాళ్ళందరూ కరువు పనులు చేయానికి గుంపులు గుంపులుగా ఊరికి దూరంగా ఉన్న పొలాలవైపుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఉన్న ఇళ్ళన్నీ ఎక్కువ శాతం పాత పెంకిటిల్లు , పూరి గుడిసెలే. మిట్టే గోడలు, పాత ఇళ్ళు కావాన మధ్యమధ్యలో పెంకులు ఊడిపోయి ఉన్నాయి. మరలా కట్టించుకునే ఆర్థిక స్థోమత లేక వర్షాకాలంలో వర్షం, ఎండాకాలంలో ఎండ ఆ ఇళ్లల్లోనే కాపురం ఉంటున్నారు . పొలమూ గా ఏ ఆధారం లేనివాళ్ళు సంవత్సరం పొడవునా కూలి పనులు, కరువు పనులు చేసుకుని బతుకుతుంటారు. ఎకరం, అరెకరం పొలం ఉన్నా సంవత్సరానికి సరిపడా బియ్యం అందడం గగనం అవుతూ ఉంటుంది. పైగా అప్పులు. తమ పొలాలలో పనులు అవగానే భార్యాభర్తలిద్దరూ కలిసి కరువు పనులకు వెళ్తుాంటారు. ఎక్కువశాతం కరువు పనులు ఎండాకాలం రెండు మూడు నెలలు మాత్రమే ఉంటాయి.
సమయం 12 గంటలు కావస్తోంది.ఎండ తీక్షణత పెరిగింది. ఆ పల్లె నుంచి కరువు పనికి ఈ రోజు వెళ్ళిన వారందరూ గుంటలు తీసే పనిలో ఉన్నారు.
”మీనక్కా… జర… అవతలకు (మూత్రానికి) పోవాలె…” పక్కనే పనిచేస్తున్న మీనమ్మతో కళమ్మ అన్నది.
”ఎట్ల పోదాం…” అన్నది మీనమ్మ. గుంటకు అవతలవైపు పనిచేస్తున్న 40 సం||ల సత్తెమ్మ కల్పించుకుని, ‘ఇటెళ్ళి ఇటొచ్చే దానికి… పోరి…పోయి జల్ది రారి” అన్నది.
”రాసుకునేయన వస్తడో…ఏమో…” అనుమానంగా అన్నది మీనమ్మ.
”ఇదివరదాకా రాకపోయె…ఇంతలోకి వస్తడా….ఏంకాదు పోరి” సత్తెమ్మ ధైర్యాన్నిస్తూ అన్నది. కళ్ళమ్మ, మీనమ్మ, నర్సమ్మ….ముగ్గురూ దూరంగా వెళ్ళి 5, 10 నిమిషాల తర్వాత వచ్చారు. వాళ్ళు రాంగనే…. సత్తెమ్మ, మంగవ్వ ”అయ్యో! రాసుకునేయన వచ్చిండు… వస్తుండ్రని ఎంతసెప్పినా ఇనకుండా ఎర్రగుర్తు పెట్టిండు .” వాళ్ళ మాటలు వింటుంటే వీళ్ళకు పై ప్రాణాలు పైనే పోయినట్టయింది.
”ఇప్పుడే…ఎళ్తిమి… ఇప్పుడే వస్తిమి.” అంటూ ముగ్గురూ వాపోయారు.
”నిన్నంతా కంప చెట్లు కొట్టి కొట్టి ఈడ్చకపోయి పడేస్తే…పని అయిపోయే ముందు వచ్చి ‘ఆడ సెయ్యమంటే ఈడ సేసిండ్రు ఏంద’ని గుంపులోలందరికీ పైసలీయమన బట్టె…ఈయాల ఇట్లనె…” వాపోయింది నర్సమ్మ. నిన్న పని, ఈరోజు పని కలుపుకుంటే 200 రూపాయలు…! కింద భూమి కదుల్తోందా అనిపించింది వాళ్ళకు.
”కరువు పని అనబ్టిరి కానీ…. నిన్నంతా కంపకొడ్తిమి…కంప కొట్టాలంటే కంప గుంజకపోతే ముళ్ళు గుచ్చుకునే…చేతులు గీర్కపోయి, చేతులకు పొక్కలొచ్చె… రక్తాలొస్తనయ్…రాయి పట్టుకుంటే సర్రున అంటుకుంటుండె… గంతంత రాళ్ళు దొర్లించకపోయి ఆడ ఏసి రావాలె… నిన్న పైసలీయమనబట్టె… ఈయాల పొద్దాక పనిచేసినాక కూడా అవతల పోయినామని ఆప్సంటు ఏసి పోయిండు…గింతన్నాయం ఉంటదా…” కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరుగుతుంటె అన్నది కళమ్మ.
”పైసలిస్తన మని సర్కారంటరు గానీ…సెలకలు తేటగ కావాలె.. ఆఁ సెలకల్లో రాళ్ళు ఏరాలె…కంప కొట్టాలే …కొర్లు ఏరాలె… కొర్లు ఒక తాన ఎయ్యాలె…కొర్లు రావాలంటే గుంట తీయాలె…గుంట కింతాని లెక్కగ్టి, ఎన్ని ఫీటులో నెంబరేసుకుని కొలిసి పైసలిస్తమనిరి…అదేందో కంపూటరంట…ఏలుపోయి ఆ ముద్దర పడ్తెనే పైసలు. లేకపోతే ఇస్తలేరు. కష్టం చేస్తిమి…పైస రాకపోయె…” నర్సవ్వ కల్పించుకుని అన్నది.
”మిట్ట పని చేస్తుంటిమి…’మట్టంతా తీస్కపోయి టాక్టర్లు నింపితిమి…తొవ్వాలంటే ఊకనేనా…ఎండకు ఎండాలె…వానకు తడ్సాలె…”రాళ్ళు మోసుకెళ్తూ అన్నది సత్తెమ్మ.
”10 గంటలకు పోయి ఆ చెట్లన్నీ తోమాలె… మన్నంతా గడ్డపారతో తీయాలె…ఆఁ…మనిసికి 100 రూ.లు ఇస్తమనిరి… ఏం దొర్కుతలేవు.” అన్నది లింగమ్మ.
”రాళ్ళు పోసుడు, తట్టనెత్తికెత్తుకునుడు చెట్ల తోముడు, చెట్లు కొట్టుడు… ఆఁ… గట్ల తట్ట నెత్తిన పెట్టుకోవాలె…మన్ను రోడ్డుకెయ్యాలె…ఆఁ…గడ్డపారస్తే ఏం జంగ్తలేదు (జరగట్లేదు)…” ఆయాసపడుతూ అన్నది అండాళ్ళు.
సాయంత్రానికల్లా అన్యమనస్కంగానే పనిముగించుకుని గుంపంతా ఇంటి దారి పట్టారు .
”నిన్న కూలీ సేసినా చెయ్యలేదనబట్టె…ఈయాల ఇల్లాయే ….ఎట్ట బతకాలె…పిల్లల నెట్ల సాదాలె…” కళ్ళలో నీళ్ళు నింపుకుని సత్తెమ్మతో అన్నది మీనమ్మ.
”గింతన్నాయం ఏడన్నా ఉంటదా చెప్పు….” కళమ్మ అన్నది.
”కరువు పనిసేయబెట్టి రెండు నెలలు అవుతుండె ఎన్నడన్నా సక్కంగా పైసలిచ్చిండ్రా… వారానికి ఒక్కపాళె సర్కారీ ఇస్కూల్లో పైసలిస్తుండ్రు. రోజుకు వంద అనిరి…యాభై అయినా ఇయ్యకపాయె. నిన్న ఎంత కష్టపడ్తిమి…గా కంపసెట్లు ఈడ్చుకపోవుడు… సేతులు ఎాలయెనో సూడు…” అంటూ బొబ్బలెక్కిన చేతుల్ని సత్తెమ్మకు చూపిస్తూ అన్నది ఉపేంద్ర.
”రాతపూత వచ్చిన యాదన్నను గుంపు (గ్రూపు) లీడరుగా పెట్టుకుంటిమి… మన గుంపు 15 మందిమాయె. గుంపులొక తీరుగుండె… ఆయన తినేది తెలవదు…ఏమయ్యేది ఎంతొస్తది యాదన్నకే తెలవట్లే…” అన్నాడు భిక్షపతి, దూరంగా వీళ్ళ మాటల్నే వింటున్న యాదగిరిని చూస్తూ…
”పొద్దాక పనిసేసినా కూడా ఆప్సెంటు ఏస్తుండు” యాదగిరితో అన్నడు భిక్షపతి.
”నువ్వు లెక్కన లేవంటడు…అటుబోయి ఇటు వచ్చినందుకు జీతం క్ చేస్తుండు…” అన్నది ఆండాళ్ళు.
”ఆడు మంచోడు గాడు…. మనోళ్ళ గిట్ల మోసం చేస్తుండు. వందరూపాయల కాడ 50, 60 ఇస్తుండు… ఒక్కోసారి పూరాగా క్ చేస్తుండు” అన్నాడు గ్రూపు లీడరు యాదగిరి. ”ఊకోకురి…ఎంతకాలమిట్ల…అందరం కలిసి అడగాలె…” అన్నారు భిక్షపతి, శీనయ్య.
”అవ్….అడగాలె….” అని అందరూ ముక్త కంఠంతో అన్నారు. ఇంతలోకి ఊర్లోంచి పక్క ఊరికి స్ల్పెండర్ మీద వెళ్తున్న లక్ష్మణరావు వాళ్ళకు ఎదురయ్యాడు.
”ఆగు సారు…ఆగు” అంటూ గ్రూపు వాళ్ళంతా గట్టిగా అరిచారు. లక్ష్మణరావు బండిని ఆపాడు. గ్రూపు గ్రూపంతా గుమిగూడింది.
”మాకు జీతాలు సరిగీయవ్. ఇక్కడ చేసేదుంటే అక్కడ ఇచ్చినవ్. ఇంక అక్కడ చేసినామాని రోజంతా పని పైసలు ఈయనన్నావ్…” అని నిలదీసింది సత్తెమ్మ.
”పొద్దంతా పనిసేస్తే…నువ్ ఎర్రగీత పెడ్తవా?” మీనమ్మ అన్నది.
”మాకు పైసలు ఇయ్యవా… నీ ఇంటిలో కెళ్ళి ఇత్తన్నావా….” అన్నది కళమ్మ.
”సరిగా పనీయక…ఇట్ల పోతే అట్లపోతే చేస్తవ్…ఏలి ముద్దర రాలె అని పైసలీయవ్….” భిక్షపతి అందుకున్నాడు.
”నువ్వు రాలె… నువ్వు రాలె… అనుకుంటూ వారమంత పైసలీయక పోతివిగా” వస్తున్న కోపాన్ని అదిమిపడ్తూ అన్నాడు యాదగిరి.
అటుగా వస్తున్న ఇంకొక గ్రూపు కూడా వచ్చి వీళ్ళల్లో కలిసిపోయింది. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ‘సరిగానే ఇచ్చినా…’ అంటూ వెహికిల్ స్టార్ట్ చేయబోయాడు లక్ష్మణరావు.
”మమ్ముల దోసుకుని నువ్వు తినుడు…మేమేమో ఎండుడా… నువ్వు బతుకుడా….” అందరు కలిసి నిలదీశారు.
”ఇట్ల గాదు. మేము ఆఫీసుకే వస్తం…” అని అందరూ అన్నారు.
”రండ్రి…ఆడికే రండ్రి…” అనుకుంటూ వెహికిల్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు లక్ష్మణరావు. 4, 5 రోజులు లక్ష్మణరావు వస్తాడేమోనని ఎదురుచూసినా రాలేదు. పని ఇవ్వలేదు. జీతాలు ఇవ్వలేదు. ఆ ఊరి ఛాయలకు రావడమే పూర్తిగా మానేశాడు. పల్లెలోని 40, 50 మందికలిసి తలా 20, 30 రూ.లు వేసుకుని ఆఫీసుకు వెళ్ళి పెద్దసారుని కలవాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు.
– కవిని
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~