పంచాయతీ ఆఫీసుకు రావడంతోనే గ్రామ పంచాయతీ ముందు గోడ మొత్తం బ్లాక్ బోర్డుగా మార్పించమని ఈఓకి చెప్పింది.
”ఎందుకు..?” జగపతిరావు
”జామా, ఖర్చుల వివరాలు రాయించడానికి”
”ఎందుకు…? తెల్సుకొని ఏం చేస్తరు? పని లేక… పైస దండుగ…” జగపతిరావు మొండిగా వాదించాడు.
”ఈఓ సాబ్… రేపు పంచాయతీ మీటింగ్ ల బెడ్తం, అంత సరే నంటే ఖరా చేద్దాం లేకుంటే వదిలేద్దాం” చెప్పింది సర్పంచ్.
ఈ జోగుది జోగుదాన్లెక్క ఉండక సర్పంచ్ అయింది. ఇక ఏడ ఆగుతలేదు. ఏందో… ఏందో చేస్తనంటది. పేనుకు పెత్తనమిస్తే గుండంతా గోకేసిందట. గీ ఆడోల్లకు పెత్తనమిస్తే అంత మేమే చేస్తమనుకుంటరు. సక్కగ తిని ఇంట్ల కూకోక” అక్కసు వెళ్ళ గక్కుకున్నాడు జగపతిరావు అప్పుడే వచ్చిన పంచాయతీ మెంబరుతో.
వినీ విననట్లుగానే ఉండిపోయింది సర్పంచు పోశవ్వ. వారితో వాదనకు దిగడం ఇష్టంలేక.
మరుసటి రోజు జరిగిన పంచాయతీ మీటింగులో మెజారీటి సభ్యులు వాల్ బోర్డుపై జమా ఖర్చుల పెట్టక నిర్వహణకు ఉత్సాహం చూపడంతో వెంటనే ఏర్పాటు చేయించింది పోశవ్వ.
”ఏంది రాజవ్వా… అంత సంచులతోని అచ్చి ఎన్కకు మర్ల బెట్టిరి ?” చేతిలో రేషన్ కార్డు, సంచీలతో వచ్చి వెనక్కి వెళ్తున్న వార్ని చూసి ప్రశ్నించింది పోశవ్వ.
”బియ్యం రాలేదట బిడ్డా” పోశవ్వ తల్లి వయస్సులో ఉండే రాజవ్వ జవాబు.
”ఎవరు చెప్పింన్రు” ” సావుకారి”
”అట్లనా…! అని రెండడుగులు వేసిన పోశవ్వ నిన్న సాయంత్రమేకదా బియ్యం వచ్చింది. రాలేదని ఎనక్కి ఎందుకు పంపుతున్నట్లు…? సందేహం కల్గింది.
సరాసరి రేషన్ షాప్‌కి వెళ్ళింది.
”కారటు బియ్యం ఇస్తున్నరా..?” ప్రశ్నించింది.
”రాలే…” తలెత్తకుండా ఏదో రాసుకుంటూ డీలరు.
”ఏంది సావుకారు… నిన్ననే లోడు దిగింది. గద…”
”కారటు బియ్యం రాలె చెప్తే ఇనస్తలేదా….?” కసురుకున్నాడు డీలరు రమణయ్య షావుకారు.
”నా కండ్లతోని నేను జూస్తేనే ఇట్ల చెప్పబడ్తివి. జనమంత బియ్యం రాకడ చూసిన్రు. సంచులు, కారటు తీస్కోని బియ్యం తీస్కపోదామని అస్తే ఇట్ల అంటున్నావ్… మరి నిన్న పొద్దు మీ కినంక అచ్చిన బియ్యమేయి..?” సూటిగా ప్రశ్నించింది పోశవ్వ.
ఓ మాదిగది, జోగిది, తక్కువ వర్గంది తనని నిలదీసి అడగడమా? తిరస్కారంగా చూశాడు డీలరు రమణయ్య షావుకారు.
అతని తిరస్కార భావాన్ని, నీ వెంటీ నన్నడిగేది అనే భావననీ గమనిస్తున్న పోశవ్వ అతన్ని అలాగే వదిలేస్తే మంచిది కాదనుకుంది.
ప్రజల చేత బుద్ధి చెప్పించాలనుకుంది.
ఒట్టి చేతులతో వెనక్కి వెళ్తూన్న వారికి బియ్యం వచ్చాయి అని చెప్పి వెనక్కి పిలిచింది. నిన్న సాయంత్రం బియ్యం రావడం తాను చూశాననీ లోనికి వెళ్ళి చూడండి ఉన్నాయో లేదోనని వారితో అనడంతో జనం ఒక్కసారిగా లోనకి వెళ్ళారు. అక్కడ ఉన్న కొట్లో బియ్యం స్టాకు చూసి డీలరుపై దండెత్తారు. ఈ వార్త ఊరంతా వ్యాపించింది. క్షణాల్లో కంగు తిన్న రమణయ్య షావుకారు పరుగుపరుగున రాజాగౌడ్ ఇంటికేసి ఉరుకుతున్నాడు”
-శాంతి ప్రబోధ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~