పెళ్ళొక సామాజిక ఒడంబడిక -అత్తలూరి విజయలక్ష్మి తో ముఖాముఖి

తెలుగు రంగస్థల సాహిత్యంలో ‘రేడియో నాటకాల రచయిత్రి’ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు అత్తలూరి విజయలక్ష్మి!

జీవిత ప్రయాణంలో మార్పుల్నీ, సరికొత్త కోణాలనీ, దృక్పథాలనీ సునిశితంగా ఆమె రచనల్లో వ్యక్తీకరిస్తారు.
నాటకం, కథ, నవల…ఇలా ఏ సాహిత్య ప్రక్రియలోనైనా కొత్తదనం కోసం ఆకాక్షించే విజయలక్ష్మి గారు ‘మూస రచనల్లోంచి బయటపడితేనే ప్రస్తుత తెలుగు సాహిత్యం బాగుపడుతుంద’ని అంటారు.
రంగస్థల సాహిత్య వ్యాప్తికి అహరహం కృషి చేస్తున్న అత్తలూరి విజయలక్ష్మిగారితో ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘విహంగ’ తో పంచుకున్న సాహిత్య కబురులు…

రచనా వ్యాసంగం ఇలా మొదలైంది…

10988593_10203577226782313_5610162204252663881_nనా రచనా వ్యాసంగం కథలతో మొదలైంది. అప్పట్లో హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమయ్యే కథలు వింటూ పదిహేడేళ్ళవయసులో ఏదో రాయాలన్న తపనతో మొదలు పెట్టి మెల్లగా పత్రికలకి పంపడం మొదలు పెట్టాను. అయితే కథలూ నాటకాలూ ఎన్ని రాసినా నాకు రచయిత్రిగా గుర్తింపు రాలేదు అనే ఒక బాధ కలిగేది. అప్పుడు బ్లాగ్, ఫేస్ బుక్ లాంటివి లేవు కదా మనకు మనం ప్రచారం చేసుకోవడానికి! నవలలు రాస్తేనే రచయితగా గుర్తింపు వస్తుంది కాబట్టి కొందరు రచయితలు నవలలు రాయమని సలహా ఇచ్చారు. అప్పుడే మొట్టమొదటి సారిగా ‘దత్తపుత్రుడు’ అనే నవల రాశాను.

వృత్తికీ రచన కీ మధ్య నేను…

టైం మానేజ్మెంట్!! నేను పబ్లిక్ రిలేషన్స్ లో డిగ్రీ చేసినప్పుడు సమయాన్ని వృధా చేయకుండా ఎలా వాడుకోవాలో నేర్చుకున్నాను. అది ఇప్పటికీ పాటిస్తాను. Hyderabad Metropolitan Water supply & Sewerage Board లో Senior Manager గా ఉంటూ ఇన్ని ప్రక్రియల్లో రచనలు ఎలా చేయగలరు అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. మనకి ఇష్టం అనిపిస్తే దేనికీ వెనుకడుగు వేయకూడదు!

రసిజ…

సరసిజ అంటే సరసులోంచి పుట్టినది లక్ష్మీదేవి! తెలుగు మహిళలకు నాటక రంగాన్ని పరిచయం చేయాలన్న తృష్ణతో స్థాపించిన సాహిత్య సంస్థ. మా అమ్మాయి రాజేశ్వరి, అల్లుడు, మనవల పేర్లలలో ఒక్కో అక్షరంతో ఈ పేరు పెట్టాను. నాటకరంగం అంటే ఒక చులకన భావం, మర్యాదస్తులు చేయని పని అనే తేలిక భవన పోగొట్టడమే నా లక్ష్యం! ఇది స్థాపించి రెండేళ్ళు అవుతోంది.                                                                                                                                                  

కూతురు రాజేశ్వరి తో

కూతురు రాజేశ్వరి తో

మా అమ్మాయి రాజేశ్వరి…                                                                  మా అమ్మాయి రాజేశ్వరి బహుముఖ ప్రజ్ఞ్యాశాలి. కొంత కాలం ఇక్కడ ప్రముఖ చానల్స్ లో యాంకర్ గా పని చేసి అమెరికాలో స్థిర పడింది. ఆమె డాలస్ లో కూడా ‘సరసిజ’ పేరు తో ఓ సాంసృతిక సంస్థను ఏర్పాటు చేశారు. ఎంతోమంది తెలుగు వారిని ఆర్టిస్టులు గా తీర్చిదిద్దారు. తానా సభలకు అధ్యక్షత వహించారు. ఎన్నో నాటక ప్రదర్శనలను నడిపించారు. ఆమె మంచి బ్లాగర్ కూడా!

బాగా పేరు తెచ్చిన నాటకం…

నాకు బాగా పేరు సంపాదించి పెట్టిన నాటకం ‘మాచ్ ఫిక్సింగ్’. అదొక హాస్య నాటకం. పదేళ్ళ పైగా అమెరికా భారత దేశమంతా పెద్ద పెద్ద నటులతో ప్రదర్శన జరిగింది.  ఉత్తమ హాస్య నాటకం గా ఎన్నో అవార్డులు గెలుచుకుంది!

మహిళాదినోత్సవం అంటే?

మహిళలుగా వోటు హక్కును సాధించాం. పని వేతనాల్లో చాలా వరకు సమానత్వం సాధించాం. ప్రసూతి సెలవలనూ సాధించాం. కానీ ఇంకా గౌరవాన్ని మాత్రం సాధించుకోలేదు! స్త్రీ ల వెల్ఫేర్ మాత్రమే కాదు ఆమె గౌరవం కూడా ముఖ్యం!

నాటక,సాహిత్యరంగాలలోమహిళలస్థానం…?

మహిళలు నాటక రంగంలో రచనలు చేయడం లేదు అని నాకో పెద్ద అసంతృప్తి! కథల పోటీలకు రాసేంత తీరిక ఉత్సాహం అన్ని ప్రక్రియల్లో చేస్తే బావుంటుందేమో! నటీమణులకు మంచి గుర్తింపు ఉంది.

నాటక రచనకి, కథ, నవల రచనలకి ఉన్న వ్యత్యాసాలు…

కథ పరిధి చిన్నది. అందులో వస్తువు విస్తృతం, విస్తృతమైన విషయాన్ని చిన్న కాన్వాస్ మీద చిత్రించడం కష్టం. ఈ 1కథనంఇష్టంగా చేశాను. అందుకే ‘తెర’, ‘తోటమాలి’, ‘మాతృభాష’, ‘అపురూపం’, ‘ఒప్పందం’ లాంటి ప్రేక్షక ఆదరణ పొందిన కథలు రాయగలిగా…నాటకం అంటే రంగస్థలంపై ఒక కథను పాత్రల ద్వారా సంభాషణలతో చెప్పడం. ఇది కష్టం! కాని నాకు ఎంతో ఇష్టమైన ప్రక్రియ. అందుకే ప్రయత్నించాను…విజయం సాధించాను. అందుకే నాకు శిక్షణ ఇచ్చిన కళాకృష్ణ గారు నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి. కారణాలు, సమయం, స్థలం, హావభావాలన్నింటినీ డైలాగ్ ద్వారా చెప్పాలంటే సంభాషణలు రాయడంలో నేర్పు కావాలి. అది నాకు సహజంగానే వచ్చింది.

ఇక నవల విషయానికి వస్తే ఒక జీవితాన్ని, కొన్ని తరాలని అనేక సంఘటనలని కలుపుకుంటూ ఆసక్తికరంగా రాయాలి. మొదట ఇబ్బంది పడ్డాను కానీ ఇప్పుడు అలవాటు అయ్యింది. కాకపోతే ఎందుకో కానీ ఇప్పుడు కథ కష్టం అయ్యింది!!

రచనలపై ప్రముఖుల ప్రభావం

నా రచనల పై డా. శ్రీదేవి గారి ‘కాలాతీత వ్యక్తులు’ అనే నవల బాగా బలంగా ప్రభావం చూపింది. కొంతవరకు లత ప్రభావం కూడా ఉంది. రంగనాయకమ్మ గారి రచనలు నా ఆలోచనా విధానం పై ఎంతో ప్రభావం చూపాయి. ఆమె రచనలలో స్త్రీ పాత్రల ద్వారా ఎంతో స్ఫూర్తినిచ్చారు.

రచనా పోటీల గురించి…

ఎప్పుడైనా ఏదో ఒకటి రాయాలి అని మొదలుపెట్టను! నాకు ఏదైనా కథా వస్తువు దొరికితే దాని గురించి బాగా ఆలోచించిన తరవాతే రచన మొదలు పెడతాను. అందుకే నేను పోటీలకు రాయను. వాళ్ళు ఇచ్చిన సమయంలో నేను రాయలేను. వస్తువు దొరికితే చాలదు, అది మొదలు పెట్టడం, నడిపించడం, ముగించడం అన్నీ సక్రమంగా జరగాలి. కొందరు అంటారు రాసిపెట్టుకుని, ఏదన్నా పోటీ వచ్చినప్పుడు పంపవచ్చు కదా అని…కాని ముగించాక నా దగ్గర ఉంటే ఏదో ఒకటి మారుస్తూ ఉంటాను…(నవ్వులు)

నాటక రంగానికి పూర్వ వైభవం రావాలంటే…

నాటక రంగానికి ఆదరణ, ఆసక్తి రెండు ఇంకా ఉన్నాయి. కాకపోతే ఎప్పుడూ చెప్పేదే చెబుతాను. మారుతున్న ప్రజల అభిరుచి, మనకి అందుబాటులో ఉన్న ఆధునిక సౌకర్యాలను ఉపయోగించి మూస నాటకాలకి స్వస్తి చెప్పి కొత్తదనం ఉన్న నాటకాలు రావాలి. కళాకారులు సాధారణంగా ఎలా ఉంటారంటే 16 ఏళ్ల అమ్మాయి, 25 ఏళ్ల అమ్మాయి, 50 ఏళ్ల అమ్మాయి అన్ని ఒకరే వేస్తారు. దాదాపు 50 ఏళ్ళు ఉన్నవాళ్లు 16 ఏళ్ల అమ్మాయిగా వస్తే చూడగలమా…? అలాగే పురుష పాత్రలు కూడా…!నాటక రంగంపై ఎన్నో వర్క్ షాప్స్ జరగాలి. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
నటులు నాటక రంగాన్ని గౌరవించి, అభిమానించి ఒక నిబద్దత తో నటించాలి. ‘చిత్తం చెప్పుల మీద దృష్టి దేవుడి మీద’ అనే సామెతలా టెలివిజన్ ధారావాహికల మీదా, వాటి ద్వారా వచ్చే సంపాదన మీద ఆశ ఉండి మొక్కిబడిగా ఓ నాటకం వేసి వెళ్తే ఆ నటనలో జీవం ఉండదు . ప్రేక్షకులని ఆకట్టుకోలేరు. అందుకే నాటకం పట్ల ఆసక్తి మాత్రమే చాలదు నిబద్దత కూడా ఉండాలి.

పాఠకురాలిగా నేటి రచనలు…

కొందరు బాగా రాస్తున్నారు. కొత్త వస్తువులు, సమకాలీన అంశాలతో రాస్తున్నారు. కాని కొందరు ఇంకా పాత తరహాలోనే రాస్తున్నారు. కొన్ని పాత సమస్యలే అయినా కొత్తగా మనల్ని ఏడిపిస్తున్నాయి. వాటి గురించి కూడా రాయాలి.

స్త్రీ పురుష సంబంధాల గురించి…

ఏ కాలంలోనైనా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ నిజమైనప్పుడు మాత్రమే వారి జీవితాలు సఫలమౌతాయి. పెళ్ళొక సామాజిక ఒడంబడిక. ఈ రోజుల్లో అన్యోన్యత లోపిస్తోంది. మొక్కుబడి కాపురాలు మాత్రమే! ఆధునికత పెరిగాక మగవాళ్ళు స్త్రీల సంపాదన మాత్రమే చూస్తున్నారు! సంబంధాలు ఆర్ధికమైపోయాయి. అందుకే స్త్రీలకి నమ్మకం లోపించి సహజీవనం వైపు మొగ్గు చూపెడుతున్నారు. కుటుంబం సమాజం వేరు వేరు కాదు! స్త్రీ పురుష సంబంధాలు దెబ్బ తింటే వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. బలహీనతలు అందరికీ ఉంటాయి కాబట్టి క్షమాపణలతో ముందుకు సాగాలి. అప్పుడే వ్యక్తి గా ఎదగగలం.

యువ రచయితలకు సలహా

యువ రచయితలు సమకాలీన సమాజాన్ని అధ్యయనం చేయాలి. రచనలు ఉపయోగపడేలా ఉండాలి. నా వరకు రచన అనేది ఒక ‘యాక్ట్’ లాంటిది! చెడు బయటకు రాకూడదు. రచన చెడులోంచి మంచి చూపాలి కానీ చెడుని పాఠకులపై రుద్దకూడదు! రంగనాయకమ్మ గారి రచనల ద్వారా ఆమె సృష్టించిన ప్రాతల ద్వారా ప్రేరణ పొంది నాలాంటి రచయితలు ఎంతోమంది పుట్టారు.*

– మానస ఎండ్లూరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ముఖాముఖి, , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)