నా కళ్లతో అమెరికా-51(యాత్రా సాహిత్యం) – కె.గీత

18D3CA13-785C-4771-A5DB-E979638ADC03 2502FD5A-F2EE-4495-8B90-CA433A41364D E7347D94-6452-49F3-8E52-DBCC788738F2 IMG_0027 IMG_0039 IMG_0056 IMG_8302 152D607F-EF9E-40C1-B069-7D3DE6479082 E479088A-81DD-419A-B7C3-6413D99FF150 IMG_0031 IMG_0052 IMG_8278                                                 డాడ్జిరిడ్జ్(భాగం-1)

అమెరికాలో శీతాకాలం నవంబరు, డిసెంబరు నించి మొదలుకుని ఫిబ్రవరి వరకూ కొనసాగుతుంది. ఫిబ్రవరి రెండూ, మూడు వారాల లో వచ్చే శీతాకాలపు సెలవులకి పిల్లలు ఎపుడూ స్కీయింగ్ అంటూ పెచీ పెట్టడం మామూలే. మేమున్న బే ఏరియాలో మంచు కురవక పోయినా 150- 200 మైళ్ల దూరంలో తూర్పున సియర్రా మంచు పర్వత శ్రేణి ప్రతీయేటా ఆ లోటు తీరుస్తుంది. ఎప్పుడూ వెళ్లే “లేక్ తాహో” కంటే విభిన్నమైన ఒక ప్రదేశానికి వెళ్లాలని మా వరు పట్టుబట్టింది. అంతే కాదు తన స్నేహితులెవరో చెప్పారంటూ “డాడ్జిరిడ్జ్” వివరాలు కనుక్కుని వచ్చింది. ఇదేదో కాస్త స్పెల్లింగు తేడాతో “డార్జిలింగు” లా వినబడడంతో ఆసక్తిగా గూగుల్ చేసాను.

మాకు తూర్పుగా వెళ్తే ఉత్తరాన లేక్ తాహో, దక్షిణంగా యూసోమిటీ వస్తాయి. ఈ డాడ్జిరిడ్జ్ ఈ రెండు ప్రదేశాలకు మధ్యన ఉంది. పైగా ఈ రెంటి కంటే దగ్గర్లోనూ ఉంది.

కిందటేడాది మా అమ్మ అమెరికాకి వచ్చినపుడు తాహోకి వెళ్లేం. ఎప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో ఈ పర్వతాల వైపు వచ్చినా శీతాకాలపు ఆనవాలుగా గట్టి పడ్డ మంచు మాత్రమే కనించేది. ఈ సంవత్సరం అమెరికా అంతటా ఇంకా మంచు తుఫానులు కురవడం వల్లనేమో ఎక్కడిక్కడ మంచు మేటలు ఉన్నాయని విన్నాం.

ఎప్పటిలానే ప్రయాణం సంరంభం వారం ముందే ప్రారంభమయ్యింది మా ఇంట్లో.

మా ఇంటి నుంచి తూర్పు దిక్కుగా ఉన్న సియర్రా నెవాడా పర్వత శ్రేణి లో ఈ “డాడ్జిరిడ్జ్” కూడా ఒకటి. కాలిఫోర్నియాకి తూర్పున ఉన్న నెవాడా రాష్ట్రానికి మధ్య సరిహద్దుగా దాదాపు

నాలుగు వందల మైళ్ల మేరకు విస్తరించి ఉన్నాయివి. డాడ్జిరిడ్జ్ స్కీ రిసార్టు. అక్కడ బాగా స్కీ చెయ్యడం వచ్చిన వారి దగ్గర్నించీ ఇప్పుడిప్పుడే స్కీయింగు నేర్చుకుంటున్న వారి వరకూ విడి విడి స్కీ ప్రదేశాలూ, శిక్షణా తరగతులూ ఉన్నాయి. ఇక్కడి స్కీ తరగతులకి ముందుగా బుక్ చేసుకోవాలి. రెండు గంటల శిక్షణకు స్కీ బూట్లు, స్కీ ఎక్విప్ మెంటుతో కలిపి ఒక్కొక్కరికి దాదాపు వంద డాలర్ల వరకూ ఫీజు అవుతుంది.

ఇక అక్కడికి దగ్గర్లో ఉన్న పైన్ క్రెస్ట్ రిసార్టు దొరకక పోవడం వల్ల ‘స్ట్రాబెర్రీ ఇన్’ అనే హోటలు బుక్ చేసుకున్నాం. డాడ్జిరిడ్జ్ కు పైన్ క్రెస్ట్ దాదాపు మూడు మైళ్ళ దూరంలో ఉంటే, ఈ స్ట్రాబెర్రీ ఇన్ అయిదు మైళ్ల దూరంలో ఉంది.

ఇంటి నుంచి స్కీ పాంట్లు, కోట్లు, మప్లర్లు, మంచులో నడవగలిగే బూట్లు, గ్లోవ్స్ అంటూ అన్నీ సర్దేసరికి నాలుగు బాగ్ లు తయారయ్యాయి.

ఇక బట్టలు వగైరా మరి నాలుగు. అవన్నీ చూడగానే సత్య చేసే గోల గుర్తొచ్చి నవ్వుకున్నాను. ఎప్పుడూ కారెక్కే ముందు ఇన్ని బ్యాగులేవిటని పోట్లాట మొదలు పెడతాడు. చికాకులో అడ్డదిడ్డంగా సర్దేస్తాడు. దారి పొడవునా మోసినప్పుడల్లా సణుగుతూ ఉంటాడు.

సర్దడం వరకే నా పని. మొయ్యడం ఎప్పుడూ తనదీ, పిల్లలదీ. అందుకే పొరబాటున కూడా తనలా సణుగుతున్నపుడు నవ్వు పైకి కనబడకుండా జాగ్రత్త పడాల్సిందే.

కొత్తగా కొనుక్కున్న లెక్సస్ కారులో వెళ్దామని తను, ఎప్పటిలా సియన్నా వ్యానులో వెళ్దామని నేను కాస్సేపు వాదించుకున్నాం. చివరికి తనే నెగ్గాడు. “సర్లే, ఈ బ్యాగులన్నీ చూసి తనే మనసు మార్చుకుంటా”డని నేను ఊరుకున్నాను.

మంచు రోడ్ల మీద ఉన్నపుడు కాలిఫోర్నియా ‘లా’ ప్రకారం కార్ల టైర్లకి స్నో చెయిన్ లు తగిలించాలి. మా పాత కార్లకి స్నో చెయిన్ లు కొని పెట్టుకుని ఇప్పటికి ఆరేడేళ్లుగా ఎప్పుడూ శీతాకాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టుకెళ్ళడం, ఎప్పుడూ వాడకుండా తిరిగి తేవడం చేస్తూ ఉన్నాం. కొత్త కారుకి ఇంకా స్నో చెయిన్ లు కొనలేదు. నేనేదో “స్నో చెయిన్ లు” అని అనబోతే, సత్య “ఆ, ఇప్పటికి చాలా సార్లు ఇలాగే అనవసరమైన లగేజీ గా చెయిన్లు పట్టుకొచ్చావ్” అని కొట్టిపడేసాడు. అయినా నేను ఎందుకైనా మంచిదని హోటలుకి ఫోను చేసి అడిగాను. అవతల అర్థంకాని ఇంగ్లీషు యాసలో “చెయిన్లు అవసరం లేద”న్నట్లు వినబడేసరికి నేనూ అంతగా పట్టించుకోలేదు.

పిల్లలకి వారం మొత్తం సెలవున్నా సత్యకి శలవు లేదు. అందుకే రెండు మూడు రోజుల ప్రయాణాలన్నీ వారాంతానికి కలిసొచ్చేటట్లే పెట్టుకోవాలి.

ఎప్పుడూ శుక్రవారం వెళ్తే, ఆదివారానికి వచ్చేటట్లు వెళ్తాం ఎక్కడికెళ్లినా. కానీ ఈసారి శుక్రవారానికి హోటలు ఎక్కడా దొరకకపోవడంతో బుధవారమే బుక్ చేయవలసి వచ్చింది. “తిరిగి శుక్రవారానికి ఇంటికి వచ్చేస్తాం. శనాదివారాలు సెలవు గాబట్టి రెస్టు తీసుకోవచ్చు.” అని సరిపెట్టుకున్నాను.

ప్లానంతా వింటూనే సత్య “బుధవారం నించి శుక్రవారం” వరకూ మా ఆఫీసు వాళ్లు సెలవిచ్చినా నేను పుచ్చుకుందుకు సిద్ధంగా లేను. “చాలా పనుంది” అన్నాడు.

“బుధవారం మధ్యాహ్నానికైనా మనం బయలుదేరగలమా? అలా కాకపోతే ప్రయాణం కేన్సిల్ మరి. ఇక ఆ వారంలో ఎక్కడా ఖాళీలు లేవు” అన్నాను. “లేప్ టాప్ తెచ్చుకుని రాత్రుళ్ళు పనిచేసుకోవాలని” కండిషను పెట్టి మరీ వెళ్దామని ఒప్పుకున్నాడు సత్య.

హోటలు బుక్ చెయ్యడంతో అయిపోలేదు. సత్యకి, వరుకి స్కీ క్లాసులు కూడా బుక్ చేయాలి. కోమల్ కి పరీక్షలున్నాయని మాతో రావడం లేదీసారి. బుధవారం మధ్యాహ్నానికి బయలుదేరితే 150 మైళ్ళ దూరమే అయినా ట్రాఫిక్, ఘాట్ రోడ్ల వల్ల చేరే సరికి నాలుగైదు గంటలు పట్టొచ్చు. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకి రూము ఖాళీ చేసెయ్యాలి. అంటే గురువారం స్కీ రిసార్టులో క్లాసులు బుక్ చెయ్యాలి. లక్కీగా వీళ్లకు స్కీ క్లాసులు అనుకున్న సమయంలో దొరికాయి.

బుధవారం మధ్యాహ్నం సత్య ఆఫీసు నించి వచ్చేసరికి పిల్లలకు చెప్పులతో సహా వేసేసి రెడీ గా ఉన్నాను. అయినా రెండు గంటలైంది బయలుదేరేటప్పటికి.

ట్రాఫిక్ ని దాటుకుని మేం బయటకు వెళ్లేసరికి నాలుగున్నర దాటిపోయింది. మేం ఉన్న సన్నీవేల్ నుంచి ఉత్తరంగా ఉన్న ప్లెసంటన్ వైపుగా గంట ప్రయాణించి, అక్కణ్నించి యూసోమిటీ వెళ్లే దిక్కుగా తూర్పుకి తిరిగి మరో రెండు గంటలు ప్రయాణించి సొనోరాకి చేరుకునే సరికి సాయంత్రం అయిదయ్యింది. శీతాకాలపు సాయంత్రాలు, త్వరగా చీకటి పడే రోజులు కావడం వల్ల ఇక అక్కణ్ణించి మొదలైన ఘాట్ రోడ్డులో మలుపులు తిరుగుతూ మరో 30 మైళ్లు వెళ్ళడానికి మరో గంట పట్టింది మాకు. స్ట్రాబెర్రీ ఇన్ కు చేరుకునే పది మైళ్ల దూరం నుంచి రోడ్ల పక్క మంచు కుప్పలుగా పక్కకు తీసి ఉంది. రోడ్లు “ఐసీగా ఉన్నాయి జాగ్రత్త” అనే బోర్డులు చూసి నవ్వుకున్నాం. కారు టైర్లకి ఛెయిన్ లు తెచ్చుకోనవసరం లేని మామూలు రోడ్లని చూసి సత్య “చెప్పానా, మోత దండగని” నా వైపు చూసి నవ్వేడు.

ఆరు గంటల వేళ మా బస “స్ట్రాబెర్రీ ఇన్” కు చేరుకున్నాం. ఆ ఊరు పేరు “స్ట్రాబెర్రీ”. అక్కడున్న జనాభా 50 మందని ఆన్ లైను లో చదివాం. అక్కడకు చేరేసరికి అర్థమైంది. ఆ ఊళ్లో ఉన్నదల్లా ఈ రిసార్టు వంటి హోటలు, ఒక చిన్న స్టోరు మాత్రమేనని. అంతకంటే ఎక్కువ మంది అక్కడ ఉండే అవకాశం లేదక్కడ. చుట్టూ చెట్లు చిక్కగా, తడితడిగా అంతకు ముందు వారమెప్పుడో కురిసినట్టున్న మంచు ఛాయలతో చీకటిలో కుంగుతున్నాయి. రోడ్డు మీద అప్పుడప్పుడే వాన కురిసి ఇంకా ఆరనట్లు సన్నగా నీళ్లు ప్రవహిస్తున్నాయి.”అప్పుడే వాన కురిసి ఆగిందని, కాదు కాదు రోజల్లా కాసిన ఎండకి మంచు కరిగి నీళ్లయ్యిపోయిందనీ” వాదించుకున్నాం.

ఇక్కడ రాత్రి ఎనిమిది, తొమ్మిది దాటితే బయట భోజనం దొరకదు. ప్రతీ సారీ హోటలు లో చెకిన్ అయ్యేక సామాన్లు రూములో పడేసి రాత్రి భోజనం కోసం తయారయ్యి, రెస్టారెంట్లు వెతుక్కుని భోజనం కానిచ్చేకనే రెస్టు తీసుకుంటాం. తిరిగి రూముకుకి రాగానే నిద్రొచ్చే వరకూ టీవీ పెట్టుకుని కుకింగ్ ఛానలో, పిల్లల కార్టూన్ ఛానలో పెట్టుకుని గడుపుతాం.

అయితే ఈ సారి మా హోటలు బయట దిగేసరికి ఎదురుగా రెస్టారెంటు కనిపించింది. అసలక్కడ ఏవుందో చూసి వస్తానని లోపలికి వెళ్ళిన సత్య పది నిమిషాలలో వచ్చి, “ఇదే మన హోటలు” అన్నాడు. “అదేవిటి? అక్కడెక్కడో కాటేజీలు కనిపిస్తున్నాయి. ఇక్కడే కారు దిగేస్తే ఈ చీకట్లో పడి ఎంత దూరం నడుస్తాం? అసలు సరిగ్గా కనుక్కున్నావా?” అనే నా ప్రశ్నలకి రెస్టారెంటు లోపలకి వెళ్లే హాలుని ఆనుకుని ఉన్న మరో డోరు తియ్యగానే సమాధానం దొరికింది. రెస్టారెంటు పైనే మేడ మీద పై అంతస్థులో ఉన్న అయిదారు గదులలో చివరనున్న గది మాది. రిసార్టు లో దూరంగా కేబిన్సు చాలానే ఉన్నా హోటలు ప్రధాన బిల్డింగులో ఉన్న గదులలో ఇచ్చాడేవిటని అనిపించలేదు. అంత బావుందా హోటల్. చక్కగా అందంగా అమర్చిన చిన్న హాల్ వే, ఆ పైన రెడ్ కార్పెట్ పరచిన మెట్లు. గదులకి వెళ్లే చిన్న త్రోవలో పూల లతల గోడలు.

లోపలికి రాగానే బయటంతా చూద్దామని ప్రయత్నించేను. కిటికీ లోంచి చీకట్లో ఏవీ కనబడలేదు.

రెస్టారెంటు కిందనే ఉంది, పైగా తొమ్మిదింటి దాకా ఉంటుంది కాబట్టి ధీమాగా ముందే టీవీ పెట్టేసుకుని, కళ్లు వొదిలేసి కూచున్నారు పిల్లలు. కంప్యూటరు తీసి పనిచేద్దామని చూడబోయాడు సత్య. అప్పుడర్థమైన విషయమేవిటంటే అక్కడ ఇంటర్నెట్టు ఫ్రీ కాదు. అయినా సరే, పని ఉన్నపుడు పే చెయ్యాల్సిందే అన్న సత్య చేతిలోని లాప్టాప్ పక్కన పడేయించి ఒళ్లోకెక్కి కూచుంది సిరి. ఇక హాలీడేలో వర్క్ కుదరదని అర్థమైనట్లు నవ్వుకున్నాడు సత్య.

“రిస్టారెంటు పూర్తిగా రష్యన్లతో నడపబడ్తున్నట్లుంది. స్టాఫ్ అందరూ రష్యను యాక్సెంటులో ఇంగ్లీషు మాట్లాడుతున్నారు.” అన్నాను. చుట్టూ గోడలకి “బవేరియన్ ప్రాంతీయ ఆర్ట్” లని చూపించి “కాదు బవేరియన్” అన్నాడు సత్య. కుక్ ఎవరో గానీ మేం ఆర్డరు చేసిన పాస్తా, పీజా చాలా రుచికరంగా ఉన్నాయి. “కుక్ తప్పకుండా ఇటాలియన్ అయి ఉంటాడు. అయితే హోటలు ఇటాలియన్ వాళ్లది ” అనుకుని నవ్వుకున్నాం.

రెస్టారెంటు అద్దాల లోంచి బయటికి చూస్తూ “ఎక్కడా మంచు సరిగా ఉన్నట్టు లేదు. రేపిక్కడ స్కీయింగుక్కూడా బుక్ చేసుకున్నాం. మన పరిస్థితేవిటో” అన్నాడు సత్య.

ఒకసారెప్పుడో ఇలా స్కీయింగంటూ “మౌంట్ శాస్తా” వెళ్లి, అక్కడ మంచు లేక నిరాశగా వెనుతిరిగిన సంఘటన, ప్రయాణం గుర్తుకు వచ్చి నాకూ డౌటు పట్టుకుంది. కానీ పైకి మాత్రం “ఈ సంవత్సరం మంచు చాలా పడిందని వార్తలు విన్నాం కదా. రేపు తప్పక స్కీయింగు ఉంటుంది చూడు.” అన్నాను.

(ఇంకా ఉంది)

-కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యం, , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో