నా జీవనయానంలో (ఆత్మ కథ ) జీవితం… – కె. వరలక్ష్మి

మోహన్ ఒకరోజు నన్నుగోదావరి ఒడ్డుకి వెళ్దామని పిల్చుకెళ్ళేడు. అప్పట్లో మెయిన్ బజారు రోడ్డు బారెడు వెడల్పుండేది. పూల మార్కెట్లో రెండువైపులా పేర్చిన పూల పరిమళం కదలనిచ్చేది కాదు. కొంచెం ముందుకెళ్తే ఒకతను మిఠాయికిళ్ళీలు ఘుమఘుమలాడుతుంటే ఒక జింగెడీలో పెట్టుకుని అమ్ముతుండేవాడు. కొనకపోయినా నడుస్తూ నడుస్తూ నేనెప్పుడూ కాస్సేపు నిలబడిపోయే బోట్లు అవి. ఆరోజు దేని మీదా ధ్యాస లేదు నాకు. గోదారి ఒడ్డున కూర్చున్నాక అసలు కబురు చల్లగా చెప్పేడు మోహన్. మొదటిసంవత్సరం నుంచీ డిగ్రీలో తను ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ కాలేదట. నాకో పిచ్చి నమ్మకం అతను BSC పాస్ కాగానే ఉద్యోగం వచ్చేస్తుందని, మా కష్టాలు గట్టెక్కేస్తాయనీ. ఇప్పుడా హోప్ కూడా పోయింది. ముందు గోదావరి వెనక మార్కండేయేశ్వరాలయం, మరణాన్నా, జీవించడాన్నా దేన్ని కోరుకోవాలి? వెనక్కి తిరిగి తల నేలను తాకించి మార్కండేయేశ్వరుడికి మొక్కుకున్నాను. ఈ కష్టాల్నుంచి గట్టెక్కించమని, అతన్ని పరీక్ష పాసయ్యేలా చెయ్యమని, అలా చేస్తే జీవితకాలమంతా నెలలో వచ్చే రెండు ఏకాదశులూ పూర్తి ఉపవాసం చేస్తానని. పదిహేడేళ్ల ఆ వయసులో నాకు మరో దారేదీ స్పురించలేదు.
ఈ ఒత్తిళ్ల ప్రభావం నా మీద ఉండగానే బేబక్కయ్యతో కలిసి మేట్నీ సినిమా కెళ్ళి వచ్చేటప్పుడు వర్షంలో బాగా తడిసిపోయాను. ఇంటికొచ్చిన కాసేపటికే తలనొప్పితో ప్రారంభమై జ్వరం వచ్చింది. నేను జ్వరంతో మూలగడం చూసి మోహన్ నా మంచం పక్కనే మడత మంచం వేసుకుని పడుకుని తనూ మూలగడం మొదలుపెట్టేడు. నాకు మెలకువొచ్చినప్పుడల్లా మోహన్ మూలుగుతూనే ఉన్నాడు. ఒక్కటేబ్లెట్ తెచ్చి వెయ్యడం గానీ, నన్ను డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళడం గానీ చెయ్యలేదు. నాకెప్పుడు పూర్తిగా స్పృహపోయిందో, మా నాన్న ఎప్పుడొచ్చి నన్ను ఎలా జగ్గంపేట తీసుకెళ్లారో తెలీదు. ఇరవై ఒక్క రోజులు టైఫాయిడ్ తో బాధపడి వేపుడు జావ పధ్యంగా తిన్నరోజు మళ్లీ తిరగబెట్టి మరో ఇరవై ఒక్కరోజులు పడకేయించింది. పూర్తిగా కోలుకోడానికి రెండు నెలలపైనే పట్టింది. మోహన్ ఒక్కసారి మాత్రమే వచ్చి వెళ్లాడు. ఎందుకంటే జ్వరంలో నా శరీరం అతనికి ఉపయోగపడదు కదా! నాకు జ్వరం వచ్చినరోజు నన్ను ఆట పట్టించాలని అలా మూలిగేడట.

“వద్దంటే వినకుండా అష్టమి నాడు వెళ్ళేను, ఏమైందో చూడు” అంటూ మధనపడిపోయారు మా నాన్న. ఈసారి హార్లిక్సులూ పళ్లరసాలూ లేవు. డా॥ జయగారు ఉచితంగా ఇచ్చిన టానిక్స్ తోనే కాస్త ఓపిక వచ్చింది. నేను గోడలు పట్టుకుని నడుస్తూంటే మా నాన్నవెనక్కి తిరిగి కళ్ళు తుడుచుకునేవారు. ఒక రోజు మా నాన్నమ్మతో అంటూంటే విన్నాను, “ఇంకొంచెం ఉంటే పిల్ల ప్రాణాలు పోయేదే కదా! ఇంటికోడల్ని డాక్టరుకైనా చూపించలేని ఆళ్ళేం మనుషులు! వొద్దమ్మా, పిల్లని ఆళ్ళింటికి పంపొద్దు, ఉన్నదేదో తిని మనింట్లోనే ఉంటాది. నా తల తాకట్టు పెట్టైనా తనకిష్టం వచ్చినంత చదివిస్తాను. అవసరమైతే ఇంకో పెళ్ళి చేస్తాను” అని.

“మా నాన్నఇంట్లో లేనప్పుడు మా అమ్మ నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని “మీ నాన్న కోపంలో అలాగే అంటారు. ఆడపిల్లకి ఇంకో పెళ్ళంటే ఎంత అప్రతిష్ట? నీ ఎనక నలుగురున్నారు, మగపిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్ళిళ్ళు..” అంది కళ్లనీళ్ళు పెట్టుకుంటూ.

“లేదమ్మా భయపడకు. నేనెళ్ళిపోతాను. కష్టమో సుఖమో అక్కడే” అన్నాను. వెళ్ళేను. వెళ్ళిన నెల తిరక్కుండా మా నాన్నమ్మ కాలంచేసిందని కబురొచ్చింది. కబురు తెచ్చిన వ్యక్తి వెంట నన్ను, మోహన్ ని మాత్రమే పంపించారు. మా రిక్షా నేరుగా స్మశానానికి వెళ్లింది. అప్పటికే చితికి నిప్పు ముట్టించారు. నన్ను దగ్గరకు వెళ్లనీయలేదు. అలా నాకు అత్యంత ఆప్తురాలు మా నాన్నమ్మ ముఖాన్ని చివరిసారిగా చూడలేకపోయేను. కాలుతున్న చితిలోంచి నాన్నమ్మ చెయ్యిపైకి లేచి కన్నీరు మున్నీరవుతున్న నన్ను ఆశీర్వదించింది.

ఇంటికెళ్తే ఇల్లంతా నాన్నమ్మ జ్ఞాపకాలే. అరుగుమీద సగం విసిరిన కందుల తిరగలి, గోడకి వేసిన పిడకలమీద నాన్నమ్మ చేతి ముద్రలు, టేబుల్ సొరుగులో నాన్నమ్మ చేతుల వెండి మురుగులు, ట్రంకుపెట్టెలో నాన్నమ్మ పోగేసిన చిల్లర నాణేలు, ఆ పెట్టెలోనే ఒక మూలగా దాచిపెట్టిన నా అందె ఉంగరం – దాన్ని తీసి వెంటనే నా వేలికి తొడుక్కున్నాను. నా స్నేహితురాళ్ళు తిరిగి పరీక్షకు చదువుకునే హడావుడిలో ఉన్నారు. జి.వి.బి నాన్నగారికి బదిలీ అయ్యి రాజమండ్రి వెళ్ళిపోయారట. నాన్నమ్మ మీద చిన్న కథ ఒకటి రాసేను. కానీ, ఏ పత్రికకూ పంపలేదు. దినకార్యాలు ముగిసి తిరిగి రాజమండ్రి వచ్చేటప్పుడు నా వేలి ఉంగరం తీసి మా అమ్మకు ఇచ్చి రావడం మరచిపోయాను. ఈ సారి మళ్లీ అమ్మమ్మగారింటికి వెళ్లాం. మా అత్తగారు వాళ్ళూ అద్దె ఇల్లు ఖాళీ చేసి కోనేరుపేట (ఇప్పుడు దాన్ని మోరంపూడి సెంటరు అంటున్నారు) వెళ్లిపోయేరట. నా ట్రంకుపెట్టె అమ్మమ్మగారింటి వరండా చివర పెట్టి ఉంది. లోపలంతా చిందరవందరగా ఉంది. బట్టలన్నీ సర్ది వేలి ఉంగరం తీసి చిన్నబాక్స్ లో ఉంచి పెట్టెలో బట్టల అడుగున దాచి పెట్టి, పెట్టెను తాళం వేసి తాళంచెవిని పిన్నుతో నా జాకెట్టుకు పెట్టుకున్నాను. ఆ సాయంకాలం మోహన్ పెట్టెతాళం తియ్యమన్నాడు. నేను తియ్యలేదు. అతను బలంగా నా జాకెట్టు చింపేసి తాళం తీసుకున్నాడు. ఉంగరం, పెట్టెలో ఉన్న చిల్లరా తీసేసుకుని, ‘నాకే ఎదురు చెప్తావా?’ అంటూ ఒళ్లంతా తట్లు వచ్చేలా విపరీతంగా కొట్టాడు. నేను ఎంత బలహీనంగా ఉండే దాన్నంటే అతని దెబ్బల్ని కాచుకోలేకపోయేదాన్ని. ఎటు తోస్తే అటు పడిపోయేదాన్ని. ఇంట్లో వాళ్ల బాబాయిలు, పిన్నులు, అమ్మమ్మ అందరూ ఉన్నారు. ‘అది తప్పు’ అని ఎవరూ చెప్పలేదు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోవాల్సిందే కానీ, ఎవరూ పట్టించుకునేవాళ్ళు కాదు. “ఈ నరకంలోనా బ్రతకమని చెప్తోందిమా అమ్మ నాకేది దారి?’ నా మనసులోనూ కళ్లలోనూ ఎప్పుడూ గోదారి ప్రవహిస్తూ ఉండేది. నా కాళ్ళూ చేతులూ సంకెళ్లతో బిగింపబడిన భావన. చివరికి తెగించి ‘నేను మా ఇంటికెళ్ళిపోతాను. ఈ నరకపు కాపురం నావల్ల కాదు.’ అన్నాను.
‘కదులు చూద్దాం; నిన్నూ, మీ వాళ్లనీ నరికి పోగులు పెడతాను. ఈ లోకంలో ఎక్కడ దాక్కున్నా నానుంచి తప్పించుకోలేవు.’ అన్నాడు. అతని ముఖంలోని కౄరత్వం చూస్తే అన్నంతపనీ చేస్తాడనిపించేది. తనంటే ఇష్టానికి బదులు విపరీతమైన భయం పట్టుకుంది. రెండురోజుల తర్వాత నాపెట్టెని ఖాళీ గడ్డిబండి మీద వేసుకుని కోనేరుపేట వెళ్ళాం. ఇప్పటి R.T.C కాంప్లెక్స్ నుంచి వెళ్ళే బస్సు హైవే దగ్గర కుడివైపు బొమ్మూరువైపు మళ్ళేచోట ఎడంవైపు షాపింగ్ కాంప్లెక్స్ కట్టినచోట రెండిళ్లు ఉండేవి. తూర్పువైపు హైవేని ఆనుకుని ఎప్పటిదో పాతకాలం నాటి చిన్నపెంకుల క్రుంగిపోయిన ఇల్లొకటి. ఆ ఇంట్లో పొడవైన వాళ్ళు వొంగి నడవాలి. బారెడు మందమైన మట్టిగోడలు వానకి కరిగిపోయి, ఎలకలు పెట్టిన బొరియల్లో పాములు కూడా నివసిస్తూ ఉండేవి. అది చాళుక్యుల కాలం నాటి సత్రమట. ఆగ్నేయంలో మట్టితో గట్టిన గట్టుమీద కర్రలపొయ్యి, ఆ ప్రక్కనే మంచినీళ్ల బిందెలు, వండిన పదార్థాల గిన్నెలు పెట్టుకునే అరుగు. వేసవి కాలంలో ఒకోసారి ఆనీళ్ల బిందెల్ని చుట్టుకుని పాములు పడుకునేవి. ఆ అరుగుల ముందు నేలమీద భోజనాలు, దానికి కొంచెం ముందు సందులో మా మావగారి నవారు మంచం, మంచం కాళ్ళవైపు తడిక గుమ్మం, దానికో కర్టెను, మిగిలిన 7 షేపులో ఉన్నదంతా చిన్నసైజు, ఒకే ఒక తొట్టి ఉన్న రైస్ మిల్లు, చుట్టుప్రక్కల చిన్న చిన్న ఊళ్ల నుంచి అరబస్తా, పావుబస్తా వడ్లు తెచ్చి ఆడించుకుని పావలానో, అర్ధో ఇచ్చి, దోసెడు బియ్యం అక్కడున్న బేసిన్లో పోసి వెళ్ళేవారు. ఒకోసారి తౌడుగొయ్యిలో కొండ చిలువలు, పొడపాములు పడుకుని ఉండేవి. ఈ ఇంటికెదురుగా పశ్చిమంవైపు రెండు విశాలమైన పక్కపక్క గదుల తాటాకుల ఇల్లు. మొత్తం రెండిళ్లూ గచ్చులు లేని అలుకిళ్ళు. ఇంటికానుకుని పొగాకు నారుమళ్ళు. ఆ పైన జీడిమామిడి తోటలు, ఆ పైన I.L.T.D ఆఫీసు, దానికవతల మళ్లీ జీడిమామిడి తోటలు. ఇదివరకొకసారి కొన్నేళ్ళు ఇక్కడున్నారట మా అత్తగారు వాళ్లూ.

ఇక ఇంటికివతలున్న చిన్నరోడ్డుకవతల ఓ చర్చి, దానికానుకుని ఓ పది దళితుల ఇళ్ళు, ఆ ఇళ్లలోంచి పాపమ్మ అనే ఓ పెద్దావిడ రైస్ మిల్లులో ధాన్యం పొయ్యడం, బియ్యం ఎత్తి ఇవ్వడం, ఇల్లు అలకడం లాంటి పనులు చేసేది. ఈ కాస్త ప్రాంతాన్నీ కోనేరు పేట అనేవారు. ఆ కాసిన్ని ఇళ్లకవతలనుంచి రైల్వేస్టేషన్ ప్రాంతం వరకూ, ఇప్పటి R.T.C. కాంప్లెక్స్ కి ఎదుట ఉన్న కాలనీలు, పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్న చోటంతా ఆఁవ అనే ఊబి ప్రాంతం రెలుగడ్డితో నిండి ఉండేది. కాంప్లెక్స్ ఉన్న ప్రదేశం, ఆ వెనక, పక్కల ఉన్న ప్రదేశాలన్నీ కొబ్బరితోటలు, ఇప్పుడు రామకృష్ణా థియేటర్ ఉన్న ప్రాంతమంతా రెల్లు కులస్తుల గుడిసెలు, దానికవతల పెద్ద కబేళా ఉండేవి.

పొద్దుపోయి కోనేరుపేట నుంచి రాజమండ్రి వెళ్లాలన్నా, రాజమండ్రి నుంచి కోనేరుపేట వెళ్ళాలన్నా భయం వేసేది. చిమ్మెటలు, జీబురు పిట్టల ఎడతెగని అరుపులతో అడవిలో ప్రయాణిస్తున్నట్టు తోచేది.

నాకు మాత్రం ఆశ్రమంలా ఉన్న ఆ ఇల్లు చాలా నచ్చేసింది. చుట్టూ ఉన్న ముళ్ల పొదల మీద పాకి ఇబ్బడిముబ్బడిగా విరిసిన పింక్ కలర్ బఠానీపూల అందాలు, రెండిళ్లమధ్య వాకిట్లో విరిసే గడ్డిపూల చందాలు, కట్టవల మీద కాసి రంగులు మార్చుకునే వాక్కాయల పుల్లందనాలు, కొనుక్కోక్కర్లేకుండా ఇంటిచుట్టూ మళ్లల్లో కాసే వంకాయలు, బెండకాయలు, గోంగూర, పొన్నగంటికూర, మునక్కాయలు, వాకిట్లో తిరిగే మా అత్తగారు పొదిగించిన కోడి పెట్టలు- పిల్లలు, అవతల ఆఁవలో పట్టితెచ్చే మెరిసిపోయే గొరస చేపలు, తిండికి లోటు లేకుండా మిల్లునుంచి వచ్చే బియ్యం అన్నిటికన్నా ప్రశాంతత ఏమిటంటే వాళ్ళ అమ్మమ్మగారింట్లో ఉండిపోయి అప్పుడప్పుడూ మాత్రమే వచ్చే మోహన్.

పొద్దుట లేవగానే ఇంటిపనులన్నీ పూర్తి చేసేసి, కాసిన్ని పుల్లలేరుకొచ్చి కూరగాయలు కోసుకొచ్చి వంట చేసెయ్యడం, ఏదో ఒకటి రాసుకోవడం, మా అత్తగారికి హుకుంపేటలో కమ్మక్క అనే ఓ ఫ్రెండ్ ఉండేది. మాకు చిక్కని గేదె పాలు వాళ్ళింటినుంచి వచ్చేవి. ఓసారి మా అత్తగారి వెంట వాళ్ళింటికెళ్ళినప్పుడు వాళ్ళింట్లో ఓ బీరువా నిండా రకరకాల నవలలు, హిస్టారికల్ పుస్తకాలు చూసేను. ఇకనేం, నా అసలైన దాహం అదే కదా! కొన్ని పుస్తకాలు తెచ్చుకోవడం చదివి ఇచ్చేసి మరికొన్ని తెచ్చుకోవడం, మా అత్తగారు నా గురించి ఏం చెప్పేరో, లేక ఆవిడకే ఇష్టం ఉండేది కాదో, ఆవిడ నాతో అసలు మాట్లాడేది కాదు. ముఖం తిప్పుకునేది. అయితేనేం నాక్కావల్సినవి పుస్తకాలు కదా!

మా అత్తగారంటే మరీ పెద్దావిడేం కాదు. మోహన్ కన్నా పన్నెండేళ్ళే పెద్దట. చర్చికెళ్ళేటప్పుడు హై హీల్స్ వేసుకుని, ఫేషనబుల్ సిగ చుట్టుకుని, ఖటావ్ చీర కట్టుకుని తలపైన చీరకొంగు కప్పుకొని, బైబిల్ గుండెకానించుకుని ఆవిడ చర్చికి వెళ్తూంటే నేను కళ్ళు వదిలేసి చూస్తూ ఉండేదాన్ని. నిజానికావిడ చేతిలో డబ్బుంటే చాలా మంచివారు. ఒక ఉదాహరణ చెప్తాను. నేను రేపటిగురించి జాగ్రత్త పడుతూ మిల్లులో వచ్చిన బియ్యాన్ని ఒక కావిడిపెట్టెలో పోసి ఉంచేదాన్ని. ఒకోసారి ధాన్యం మిల్లుకి రాకపోతే ఇబ్బంది పడేవాళ్ళం. ఆవిడమాత్రం ఏ రోజు బియ్యాన్ని ఆ రోజు పాస్టరు గారికో, ప్రార్థన చెయ్యడానికొచ్చే కాంతమ్మగారికో ఇచ్చేసే వారు. ఓసారి రైల్వే క్వార్టర్స్ నుంచి ఆవిడ పెద్ద చెల్లెలి కొడుకులు సైకిల్ కి పెద్ద పెద్ద సంచులు తగిలించుకొచ్చి పట్టుకుపోయేవారు. ఇంట్లో బియ్యం లేకపోతే ఈవిడేమో పేటలో ఉన్న టీచరు గారింటికి బిందో, చెంబో తాకట్టుకి పంపించేవారు. ఆ ఇల్లు నిజంగా సత్రం లాగే ఉండేది. ఎవరో ఒకళ్ళు కుటుంబాల్తో దిగిపోయేవారు. ఈవిడ అప్పులు చేసి, కోళ్ళు కోసి పలావులు వండి పెట్టేవారు. నాకు అదొక సందిగ్ధ సమయం, భవిష్యత్తులో నేను మా అమ్మ పొదుపరితనాన్ని పాటించాలా, అత్తగారి దుబారానా?

నన్ను కూడా ప్రార్థనలో కూర్చోబెట్టేవారు. నా దృష్టేమో పొయ్యి మీద కూర మాడిపోతుందేమో అని ఉండేది. ఒకసారి కాంతమ్మగారితో నా బియ్యం జాగ్రత్త చేసే లక్షణం గురించి ప్రస్తావించి, ఆరోజు ప్రార్థనలో ఆ విషయాన్ని పెట్టి “ప్రభువా! ఈ బిడ్డకు స్వార్థం లేకుండా చెయ్యి” అని అడిగేరు. ప్రభువు ఈ రోజు గురించి తప్ప రేపటి గురించి ఆలోచించవద్దన్నాడని నాకు బోధించేరు. తర్వాతి కాలంలో కాంతమ్మగారు కూతుర్ని పెద్ద చదువులు చదివించి వెల్ సెటిల్డ్ చేసేరు. అప్పులిచ్చే క్రిస్టియన్ టీచర్ గారు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు. వడ్డీకి బదులుగా బియ్యాన్ని పట్టుకెళ్ళే పెద్ద చెల్లెలు ఈవిడ బంగారమంతటినీ కైంకర్యం చేసుకున్నారు.

– కె. వరలక్ష్మి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, నా జీవన యానంలో..., , , , Permalink

5 Responses to నా జీవనయానంలో (ఆత్మ కథ ) జీవితం… – కె. వరలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో