అతను- ఆమె-కాలం(పుస్తక సమీక్ష ) – మాలా కుమార్

అతను- ఆమె-కాలం
బహుమతి కథల మణిహారం
రచయిత్రి; జి.యస్.లక్ష్మి
athanuశ్రీమతి జి..యస్.లక్ష్మి గారు గత పన్నెండు సంవత్సరాలుగా కథలు వ్రాస్తున్నారు.ఇప్పటి వరకూ దాదాపు డెభై కథల పైగా వ్రాసారు.అందులో చాలా వాటికి వివిధ పత్రికలల్లో బహుమతులు వచ్చాయి.ఆ బహుమతి వచ్చిన కథల మణిహారమే ఈ “అతడు- ఆమె-కాలం”.ఈ కథలే కాకుండా “ఒక ఇల్లాలి కథ”అన్న నవల 6 సెప్టెంబర్ 2007 నుంచి జనవరి ,2008 వరకు 20 వారాలపాటు ఆంధ్రభూమి పత్రిక లో ప్రచురించబడింది.                                 ఇంకా “నాన్నలూ-నేర్చుకోండిలా”మినీ నవలగా 2011 ఆంధ్రభూమి మాసపత్రిక లో ప్రచురించబడింది.కొన్ని కథలు కథావాహిని, ఆటా జ్ఞాపక సంచిక, కథాకేళి,ప్రమదాక్షరి కథా సంపుటాలల్లో చోటు చేసుకున్నాయి. కొన్ని కథలు ఇంగ్లీష్, కన్నడ,తమిళ బాషలలోకి కూడా అనువదించబడి ప్రచురించబడ్డాయి. ఇరవై సంవత్సరాల నుండి ఆకాశవాణిలో పలు ప్రసంగాలు ,కదంబ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి.

మనము అన్నదానం చేస్తున్నాము.విద్యాదానం చేస్తున్నాము.దీపదానం చేస్తున్నాము . ఇంకా బోల్డు రకరకాల దానాలు చేస్తున్నాము.అవీ మనకు తెలీకుండానే అంటే అవును నిజమే అని “ఏది పుణ్యం”లో పార్వతి చెప్పేదాకా మనకు తెలీదు!

భార్యా భర్తల మధ్య ఉండవలసిన అనుబంధాలు ఎలాంటివి?భర్తపొమ్మనగానే భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిందేనా? పెళ్ళైనప్పటి నుంచి తన ఇల్లు, తన వాళ్ళు అనుకొని తన సర్వ శక్తులూ ధారపోసి ఆ ఇంటిని తీర్చి దిద్దిన ఆ ఇల్లాలికి ఆ ఇంటి మీద ఏ హక్కూ లేదా? ఆ ఇల్లాలి ఆత్మవిశ్వాసం గురించి చక్కగా చెప్పారు “దాంపత్యం” కథలో!

కాంతి, శరత్ ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు.వారి కొడుకు బున్ని.వాడి ని మంచి స్కూల్లో, కాలేజీ లో చదివించాలి, ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి దానికోసం ఇద్దరూ ఎంత కష్టపడటానికైనా సిద్దమే.అందుకే ఇద్దరూ సంపాదిస్తున్నారు.వాడి పెంపకంలో ఏవిధమైన లోటూ చేయలేదు.పిల్లల పెంపకం లో ట్రైనింగ్ ఐన ఆశాను రెండువేలిచ్చి వాళ్ళు ఆఫీస్ కెళ్ళినప్పుడు చూసుకునేందుకు నియమించారు.ఆశా చాలా కరెక్ట్ మనిషి. ఎట్టి పరిస్తితులల్లోనూ తన డ్యూటీ మర్చిపోదు.బున్నీకి అన్ని రకాల పద్దతులూ చక్కగా బోదిస్తుంది.మరి బున్నీ కి కావలసింది ఈ క్రమశిక్షణలేనా? “చందమామరావే”కథలో చిన్నపిల్లలకు కావలసిందేమిటో సున్నితంగా చెప్పారు లక్ష్మి గారు.

మొహమాటానికి పోతే ఏదో అయ్యిందిట.పాపం మాలతి ఓ పక్క భర్త , కూతురు తెచ్చి పెట్టిన కుక్కపిల్లతోటే కష్టాలు పడుతుంటే ఆ పైన తెలుగు అసోషియేషన్ సెక్రెటరీ ప్రమీల గారితో పెద్ద కష్టం వచ్చింది. మొహమాటానికి ఆవిడ హేంస్టర్స్ ను చూసుకోవలసి వచ్చి ఎన్ని ఇబ్బందులు పడ్డదో “పాపం మాలతి” లో చదివి సరదాగా నవ్వుకోవచ్చు.

దాంపత్యం గురించి మరో మంచి కథ “అతడు-ఆమె-కాలం”.పెళ్ళైన్ ముప్పయ్యేళ్ళకి ఇంట్లో ఇద్దరే. ఆ ఇద్దరి మధ్య కొన్ని యోజనాల దూరం. ఆ భార్యా భర్తలు ఇద్దరూ ఆ దూరాన్ని ఎలా అదిగమించారు? వారిలో మార్పు వచ్చింది.అతను ఆప్యాయంగా ఆమె చుట్టూ చేతులు వేసాడు. ఆమె భధ్రంగా అందులో ఇమిడిపోయింది.చక్కని మనో విశ్లేషణతో సాగుతుంది ఈ కథ.

అరే భూమికి జానెడెత్తు లేడు తనని చూసి నవ్వుతాడా !మనస్సు చివుక్కు మనిపించింది.మనవడితో చక్కగా ఆడుకోవాలి, పాడుకోవాలి అని బోలెడంత ఆశతో అమెరికా వచ్చినప్పటి నుంచి వాడిని చూసి, ఎంతసేపూ ఆ పిచ్చి బాక్సూ , బ్లాక్సూ పెట్టుకొని కూర్చుంటాడు తన దగ్గరికే రాడు అని బోలెడు నిరాశపడిపోయింది పార్వతమ్మ.అలా మామ్మను ఏడిపించిన ఆ బూరెబుగ్గల , గుండ్రటి కళ్ళ ముద్దుల మనవడు రాత్రి కాగానే మామ్మ వళ్ళో “ఐ ఆం స్కేర్డ్”అంటూ దూరిపోయాడు.మామ్మా మనవళ్ళ ముచ్చట్లు మురిపెంగా మన కళ్ళ ముందుంచారు రచయిత్రి “పెన్నిధి దొరికింది” లో.

“ఎదుగుతున్న పిల్లలతో ఎలా ఉండాలో, వాళ్ళను హాండిల్ చేయటం ఎంత కష్టమో చెబుతారు “కాస్త ఆలోచిస్తే ” కథలో!
ఒక కుటుంబ గౌరవం నిలబడాలన్నా కూలిపోవాలన్నా కారణం ఆ ఇంటి ఇల్లాలే.ఆ ఇల్లాలి లక్ష్యం పిల్లల అభివృద్ధి ఐనప్పుడు మిగిలిన విషయాలన్నీ చిన్నవైపోతాయి” ఒక ఇల్లాలు ఎలా ఉండాలో ఎంత బాగా వివరించారో ఈ కథ “ఇప్పుడైనా చెప్పనీయమ్మా”లో!

మోడరన్ కలికి చిలకల కొలికి కాత్యాయిని తండ్రి షష్ఠిపూర్తి కి వెళ్ళేందుకు ,ఆఫీస్ లో అత్తగారిలాంటి బాస్,ఖచ్చితంగా రూల్స్ పాటించే మామగారిలాంటి పిల్లల స్కూల్ ప్రిన్సిపల్ ,ఇంటి పెత్తనం చెలాయించే పెద్దతోడికోడల్లాంటి పిల్లల ట్యూషన్ టీచరూ,గంభీరంగా ఉండే పెద్దబావగారి లాంటి సంగీతం మాస్టారు లను సెలవు అడిగేందుకు ఎలాంటి సమస్యలో చిక్కుకుందో, కాత్యాయిని భర్త రాజేంద్ర భోగిలా ఆ సమస్యల చిక్కును ఎలా విడదీసాడో ,”కలవారి కోడలు కలికి కామాక్షీ “పాటతో అన్వయిస్తూ బహు చమత్కారంగా చెప్పారు రచయిత్రి.

“ఇస్తినమ్మ వాయనం , పుచ్చుకుంటినమ్మ వాయనం” లో ఈ కాలం పిల్లలకు కంప్యూటర్లో నోములు ఎలా నోమించాలో సరదా గా ఉంది.

“పాతసీసాలో కొత్త సారా”లో ఈవెంట్ మారేజ్ లూ,మరదలు మాడ గురించి చదివి కడుపుబ్బ నవ్వుకోకుండా ఉండలేము.

సరదాగా , ఆహ్లాదంగా సాగిన వెర్రిబాగుల వదిన వ్రతకథను, ఆటో అతనిని ముప్పతిప్పలు పెట్టిన వదిన కథను చదివి జయహో వదినా అని నవ్వీ నవ్వీ కళ్ళల్లో నీళ్ళు రాక తప్పదు 🙂

మరికొన్ని కథలతో మొత్తం ఇరవై మూడు కథలు ఇందులో ఉన్నాయి.అన్నీ వివిధ పత్రికలలో బహుమతులు వచ్చినవే.జి.యస్.లక్ష్మి గారు పోటీకి కథ పంపుతే ఏదో వొక బహుమతి రాకుండా ఉండదేమో!మరి వారి రచనా శైలి అలాంటిది.వారు తీసుకునే కథా వస్తువు కూడా మన చుట్టుపక్కల జరుగుతున్న సంఘటన ల నుంచే తీసుకున్నారు.అందుకే అంత సహజంగా ఉన్నాయి. అన్నీ తప్పక చదవవలసిన కథలు.

ఈ పుస్తకము అన్ని ప్రముఖ పుస్తకాల షాప్ లల్లోనూ, రచయిత్రి దగ్గరా, కినెగె లోనూ లభ్యం అవుతాయి.
రచయిత్రి సెల్ నంబర్;9908648068.

-మాలా కుమార్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలు, , , , , Permalink
0 0 vote
Article Rating
5 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
G.S.Lakshmi
G.S.Lakshmi
4 years ago

ఉమాదేవిగారూ, అద్భుతమైన మీ న్యాఖ్యకు ధన్యవాదాలండీ..

G.S.Lakshmi
G.S.Lakshmi
4 years ago

చక్కటి మీ సమీక్షకు ధన్యవాదాలు మాలాగారూ…

mala`
4 years ago
Reply to  G.S.Lakshmi

వెల్కమ్ అండి లక్ష్మిగారు .

mala`
4 years ago

ఉమాదేవి గారు మీ వాఖ్యకు ధన్యవాదాలండి.

C.uma devi
4 years ago

కథ రాయాలంటే ఏం కావాలి?విషయం,ఆపై ఆ విషయంపై పూర్తి అవగాహన,అబ్బురపరిచే రచనాపటిమ,అలవోకగా సాగే కథనంలో ఆకట్టుకునే శైలి,సున్నితమైన హాస్యం అన్నిటినీ మించి సమకాలీన సామాజికాంశం.ఇవన్నీ ప్రతి పుటలోను పేర్చి మనకందించిన విలువైన బహుమతి అతడు-ఆమె-కాలం.ఈ బహుమతిని అందించిన రచయిత్రి జి.యస్.లక్ష్మి గారికి,ఈ బహుమతికథల మణిహారాన్ని అందులో మెరసిన కథాంశాలను చక్కగా విశ్లేషించి కథ నడకను పారదర్శకం చేసి మనకందించిన మాలాకుమార్ గారికి అభినందనలు.