భారత స్వాతంత్ర్య సమరం లో మేడం కామా కు ప్రత్యేక స్థానం ఉంది .భికాజీ రుస్తుం కామా అనే పేరున్న ఈమె 24-9-1861న బొంబాయి లో బహు సంపన్న పార్శీ కుటుంబం లో సొరాబ్జీ ఫ్రాంజి పటేల్ ,జైజిబాయ్ సొరాబ్జీ దంపతులకు జన్మించింది .వీరికి కుటుంబానికి సంఘం లో మంచి పరపతి ఉంది. తండ్రి వ్రుత్తి రీత్యా వ్యాపారే కాని ప్రవ్రుత్తి రీత్యా లాయర్ .పార్శీ లలో బాగా ప్రాపకం గౌరవం ఉన్నవాడు .అలేక్సా౦డ్రా నేటివ్ గర్ల్స్ ఇంగ్లీష్ స్కూల్ లో చేరి, భికాజీ బహుభాషా పరిచయం పొందింది .24ఏళ్ళకు ఆమెకు ధనవంతుడు, బ్రిటిష్ వేష భాషలపై అపరిమిత అభిమానం ఉన్న రుస్తుం కామాతో వివాహం జరిగింది . కామాకు రాజకీయాలలో రాణించాలని కోరిక ఉండేది .భార్య మాత్రం సేవాకార్యక్రమాలు , దాన ధర్మాలతో సమయం గడిపేది .
1896లో బొంబాయి రాజ్యం తీవ్రమైన కరువుతో ఆ తర్వాత బుబానిక్ ప్లేగు(బొబ్బలతో వచ్చే ప్లేగు వ్యాధి ) తో తీవ్రంగా నష్టపడింది .ప్రజా సేవా దృక్పధం ఉన్న భికాజీ మిగిలిన స్వచ్చంద సేవకులతో పాటు గ్రాంట్ మెడికల్ కాలేజి తరఫున సేవా కార్యక్రమాలలో పాల్గొన్నది .ప్లేగు వ్యాధి సోకిన వారికి సేవచేస్తూ ,మిగిలినవారికి వ్యాధి రాకుండా టీకాలు వేస్తూ నిర్విరామ కృషి చేసింది. దీనితో కామాకూ ప్లేగు సోకింది కాని అదృష్ట వశాత్తు బ్రతికి బయట పడింది .కాని విపరీతంగా బలహీన పడింది .1901లో కామాను చికిత్స కోసం బ్రిటన్ పంపారు .1908లో ఇండియాకు తిరిగి వచ్చే ప్రయత్నం చేసింది ..కాని లండన్ లో భారతీయులతో సత్సంబంధాలున్న జాతీయ నాయకుడు స్వామి కృష్ణ వర్మ తో పరిచయమై ,హైడ్ పార్క్ లో ఆయన ఉపన్యాసాలకు ప్రేరణ పొంది ,ఆయనద్వారా మరొక అకలంక దేశభక్తుడు భారత జాతీయ కాంగ్రెస్ కు బ్రిటిష్ కమిటీ ప్రెసిడెంట్ -దాదాభాయి నౌరోజీ తో పరిచయం సాధింఛి , ఆయన సెక్రెటరిగా పని చేసింది .దాదా తోనూ ,సింగ్ రేవాభాయ్ రాణా తో కలిసి లండన్ లో కామా 1905ఫిబ్రవరిలో వర్మ ఏర్పాటు చేసిన ఇండియన్ హోమ్ రూల్ ను బలపరచింది . ‘’జాతీయ ఉద్యమం లో పాల్గొనను’’ అని హామీ రాసి ఇస్తేనే ఆమెను ఇండియాకు పంపటానికి అనుమతిస్తామని బ్రిటిష్ ప్రభుత్వం షరతు పెడితే, నిర్ద్వంద్వంగా తిరస్కరించిన ధీర వనిత మేడం కామా .
ఆ ఏడాదే ఫ్రాన్స్ కు వెళ్లి పారిస్ లో రేవాభాయ్ ,మున్చేర్షా భుర్జిర్జి గాడ్రెజ్ లతోకలిసి ‘’పారిస్ ఇండియన్ సొసైటీ ‘’స్థాపించింది భారత దేశ విముక్తికోసం పుస్తకాలు రాసి వందేమాతరం గీతం తో పాటు నెదర్లాండ్స్ ,స్విట్జర్ లాండ్ లలో ముద్రించి భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరులూదిన ,ప్రవాస భారతీయ దేశభక్తురాలు మేడం కామా .ప్రముఖ విప్లవ వీరుడు మదన్ లాల్ ధింగ్రాను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీస్తే కడుపు రగిలిపోయి ‘’మేడమ్స్ తల్వార్ ‘’.రాసి ప్రచురించింది .వీటిని ప్రచురించిన పత్రికలు ఆ నాడు ఫ్రెంచ్ కాలనీగా ఉన్న పాండిచ్చేరి చేరి ఇండియాలో ప్రత్యక్షమై దేశభక్తులను ఉత్తేజ పరచేవి .
22-8-1907లో జర్మనీలోని షట్ గార్డ్ లో జరిగిన ‘’అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫ రెన్స్’’లో మేడం కామా పాల్గొని భారత దేశం లో కరువు వలన ఏర్పడిన తీవ్ర సంక్షోభాన్ని ప్రపంచ దృష్టికి తెచ్చింది .గ్రేట్ బ్రిటన్ కబంధ హస్తాలనుండి భారత్ కు విముక్తి కలిగి మానవ హక్కులు ఏర్పడి సమాన హక్కులు లభించి త్వరలో స్వతంత్ర భారత దేశం ఆవిర్భావించాల్సిన అవసరముందని ఎలుగెత్తి చాటింది .అకస్మాత్తుగా ‘’భారత స్వాతంత్ర్య పతాక ‘’ను వేదికపై ఆవిష్కరించి అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచేసింది .
ఈ సందర్భంగా కామా ప్రసంగిస్తూ ‘’ఇది పవిత్ర భారత స్వాతంత్ర్య పతాకం .ఇప్పుడే ఇది ఆవిర్భవించింది .భారత స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమర వీరుల పవిత్ర రక్తం తో తయారైంది .మహా జనులారా !లేచి నిలబడి ఈ పతాకానికి వందనం చేయండిఅని అర్ధిస్తున్నాను .ఈ పతాకం సాక్షిగా ప్రపంచం లోని స్వేచ్చా ప్రియులందరూ దీన్ని శక్తి వంతం చేయండి .’’అని గంభీర స్వరం తో చెప్పింది . ఈసంఘటన ఆఫ్రికన్ అమెరికన్ రచయితా ,మేధావి డబ్ల్యు .ఇ.బి.డూబోయిస్ కు ప్రేరణ నిచ్చి 1928లో ‘’డార్క్ ప్రిన్సెస్ ‘’నవల రచనకు స్పూర్తిగా నిలిచింది .కామా ఆవిష్కరించిన పతాకం కలకత్తా లో రూపొందించిన పతాకానికి చేసిన మార్పు తో ఏర్పడింది .దీని రూప కల్పనలో కామాకు వినాయక దామోదర సావర్కార్ , శ్యాం జీ కృష్ణ వర్మలు సహకరించారు .కామా ఆవిష్కరించిన త్రివర్ణ పతాకం లో ఆకుపచ్చ ,కాషాయం రంగుతోబాటు ఎరుపు గీతలున్నాయి ఎరుపు శక్తికి ,కాషాయం విజయానికి ,ఆకుపచ్చ ధైర్యం ,ఉత్సాహాలకు ప్రతీకలు .అందులోని ఎనిమిది పద్మాలు ఎనిమిది రాజ సంస్థానాలకుగుర్తు .మధ్యలోని కాషాయ రంగు పై దేవ నాగరలిపిలో వందేమాతరం ఉంది .క్రింద ఉన్న సూర్య చంద్రులు హిందూ ముస్లిం విశ్వాసాలకు చిహ్నాలు . .ఈనమూనా నుంచే అనేక మార్పులు చేర్పులు జరిగి ఇప్పుడున్న మన జాతీయ పతాకం ఆవిర్భ వించింది .
ఈ జర్మనీ సమావేశం తర్వాత కామా అమెరికా వెళ్లి భారత దేశానికి స్వతంత్రం యెంత అవసరమో అనేక సభలలో వివరించింది .బ్రిటిష్ రాజ్య దౌష్ట్యాన్ని ,అణచి వేతను గర్హించాలని కోరింది .’’పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి జనని ‘’అని గర్వంగా చెప్పుకొనే బ్రిటన్ ఇండియాకు ఎందుకు స్వతంత్రం ఇవ్వటం లేదు ?అని ప్రశ్నించింది .అందుకనే కామాను అమెరికాలో ‘’భారతదేశ తొలిసాంస్కృతిక ప్రతినిధి ‘’అన్నారు .
1909లో సెక్రెటరి ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా గా ఉన్న విలియం హట్ కర్జన్ విల్లీ ని మదన్ లాల్ ధింగ్రా హత్య చేసినందుకు స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులు బ్రిటన్ లో ఉన్నసావర్కార్ మొదలైన ముఖ్య కార్య కర్తలను అరెస్ట్ చేశారు .1910లో ఈకేసు విచారణ కోసం సావర్కార్ ను ఇండియా కు పంపించేశారు .సావర్కార్ ను ఇండియా తీసుకొస్తున్న షిప్ మార్సేల్లీస్ నౌకాశ్రయం లో లంగర్ వేయబడినప్పుడు సావర్కార్ చాకచక్యం గా ఒక కిటికీ గుండా సముద్రం లోకి అమాంతం దూకి ఈదు కొంటూ తీరం చేరాడు .ముందే వేసుకొన్న పధకం ప్రకారం అక్కడ మేడం కామా వాళ్ళు స్వాగతం పలుకుతారని ఆశించాడు. కాని రావటం ఆలస్యమైనందున పోలీసులు ముందే చేరారు . .కామా సాయం లేకుండా తనకేమీ మేలు జరగదని తెలుసుకొని బ్రిటిష్ కస్టడీ లో ఉన్నాడు .బ్రిటిష్ ప్రభుత్వం మేడం కామాను కూడా అప్పగించమని కోరినా, ఫ్రెంచ్ ప్రభుత్వం ఒప్పుకోలేదు .కోపం తో బ్రిటిష్ ప్రభుత్వం కామా వారసత్వ ఆస్తినంతటినీ వశపరచుకొన్నది .అప్పుడు లెనిన్ కామాను రష్యా దేశానికి సగౌరవంగా ఆహ్వానించాడు .దీన్నికూడా కామా తిరస్కరించింది .
క్రిస్టబెల్ పాంక్ హర్స్ట్ ,ప్రభావంతో పురుషులతో బాటు స్త్రీలకూ సమానావకాశాలకోసం కామా ఉద్యమించింది .1910లో ఈజిప్ట్ లోని కైరో నగరం లో ఉపన్యసిస్తూ ‘’ఈజిప్ట్ పుత్రులారా !ఇక్కడి ఈ సభకు దేశం లో సగం మంది మాత్రమె వచ్చారు .మిగిలిన సగభాగంఅయిన ఈజిప్ట్ పుత్రికలు ఎందుకు రాలేదు ?మీ తల్లులు ,అక్క చెల్లెళ్ళు ఎక్కడ?మీ భార్యలు ,ఆడపిల్లలు యేరీ?’’అని ప్రశ్నిస్తే సభ అవాక్కయింది .భారత స్వాతంత్ర్యం కామాకు మొట్టమొదటి కోరిక. మిగిలినవి దీని తరువాతే .1920లో హారాభాయ్ ,మితన్ టాటా అనే మహిళలను కలుసుకొని మహిళా హక్కు కోసం వారు చేస్తున్న పోరాటాన్ని చూసి ‘’ముందు భారతదేశ స్వేచ్చా స్వాతాన్త్ర్యాలకోసం పోరాడండి .స్వతంత్రం వస్తే మహిళా వోటుహక్కుతో పాటు అన్ని హక్కులూ వస్తాయి ‘’అని సలహా ఇచ్చింది కామా .
1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత బ్రిటన్ ,ఫ్రాన్స్ దేశాలు కూటమిగా ఏర్పడగానే మేడం కామా ,రేవాభాయ్ రాణా తప్ప మిగిలిన పారిస్ ఇండియా సోసైటీలోని సభ్యులంతా దేశం విడిచి వచ్చేశారు .కామాను జీన్ లాంగేట్ అనే సోషలిస్ట్ నాయకునితో,ఆచార్య తో కలిసి స్పెయిన్ వెళ్ళమని సలహా ఇచ్చారు .కాని ఆమె అక్కడే ఉండి పోవాలని నిశ్చయి౦చు కొన్నది .1914అక్టోబర్ లో యుద్దానినికి వెడుతున్న పంజాబ్ రెజిమెంట్ మార్సేలిస్ కు వస్తే వారి ముందు కామా ,రాణా తో కలిసి నిరసన ప్రదర్శన చేస్తే అరెస్ట్ చేసి కొద్దికాలం జైలు లో ఉంచారు .కామాను మార్సేలిస్ వదిలి వెళ్ళిపొమ్మని ఆదేశిస్తే బోర్డాక్స్ దగ్గర ఆర్కచాన్ లో ఉన్న రాణా భార్య ఇంటికి వెళ్ళింది .ఫ్రెంచ్ ప్రభుత్వం రాణాను, కుటుంబాన్ని మార్టినిక్ లోని ‘’కరేబియన్ దీవి’’కి ప్రవాసంగా పంపింది .మేడం కామా ను’’ విచీ ‘’కి పంపింది .అక్కడ ఆమె తీవ్ర అనారోగ్యం పాలైంది .ఆరోగ్య రీత్యా ఆమెను1917 నవంబర్ లో బోర్దాక్స్ కు తిరిగి పంపించటానికి అనుమతించి ,వారానికొకసారి అక్కడ పోలీస్ స్టేషన్ కు హాజరవ్వాలని ఆదేశించింది .యుద్ధం జరుగుతుండగానే పారిస్ లోని తన స్వగృహం 25 రూ డీ పా౦థియా కు .చేరుకొంది .
1935వరకు కామా యూరప్ లో ప్రవాసంగా ఉంది .ఏడాది క్రితమే ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చి శరీరం పక్షవాతానికి గురైంది .కోవాసి జహంగీర్ ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక అభ్యర్ధన పంపుతూ తనకు ఇండియా వెళ్ళటానికి అనుమతినివ్వవలసి౦దిగా కోరుతూ, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను త్యజించానని హామీ ఇచ్చింది .జహంగీర్ సహాయం తో 1935నవంబర్ లో మాతృ దేశం భారత్ చేరి బొంబాయిలో కాలు పెట్టింది .తొమ్మిది నెలల తర్వాత 74వ ఏట బొంబాయి లోని పార్సీ జనరల్ హాస్పిటల్ లో ప్రవాసం లో ఉంటూ భారత దేశ స్వేచ్చా స్వాతంత్ర్యాలకోసం అహరహం శ్రమించిన స్వేచ్చా పిపాసి మేడం కామా ప్రాణ వాయువు అనంత ప్రాణ వాయువులో కలిసింది .
ఎందరో మహా రాణుల లాగా స్వాతంత్ర్య సమరోద్యమం లో తనదైన విధానం లో సేవలందించింది కామా .ఎందరో విప్లవ వీరులకు లండన్ ,పారిస్ లలో ఉంటూ అజ్ఞాతంగా ధన వస్తు సాయం అందించి ఉద్యమ నిర్మాణానికి సాయపడింది .భారత స్వతంత్ర పోరాట తొలి సంవత్సరాలలో మేడం కామా చేసిన సాహసం,పోరాటం చిరస్మరణీయం .ఆమె జీవితమే ఒక పాఠ్య గ్రంధం . కామా జీవితం అందరికి ఆదర్శం ,అనుసరణీయం .ధన్య జీవి మేడం కామా.
-గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~