నా కళ్లతో అమెరికా-50(సియాటిల్ – చివరి భాగం)- కె .గీత

సియాటిల్ నించి బయలుదేరే రోజు రానే వచ్చింది. నాలుగు రోజుల నించి టైం టేబులు పెట్టు కుని లేవడం, చూడవలసిన ప్రదేశాలన్నీ అవిశ్రాంతంగా చూస్తూ తిరుగుతూండడం చేస్తున్న మాకు ఆ రోజు రాత్రి ఫ్లయిట్ టైం వరకూ ఖాళీ దొరికింది. మిగిలి ఉన్న చూడాల్సిన నా లిస్టులో సియాటిల్ ని ఆనుకుని ఉన్న దీవులు ముందుగా ఉన్నాయి. ఎంత సమయం కేటాయించగలమో తెలుసు కానీ ఒక్క దీవైనా చూసి రావడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. మా ఫ్లైట్ రాత్రి తొమ్మిది గంటలకి. కనీసం 6 గంటల కి మేం ఎయిర్పోర్టుకి వెళ్లినా చాలు. అంతకు ముందు సాల్ట్ లేక్ సిటీ ప్రయాణంలో చివరి నిమిషంలో రెంటల్ కారు రిటన్ ఇవ్వడానికి జరిగిన ఆలస్యం వల్ల కలిగిన ప్రయాణపు ఆదుర్దా అనుభవం వల్ల ఈ సారి కాస్త పెందరాళే తెముల్చు కోవాలని నిర్ణయించుకున్నాం.

ఆల్కిబీచ్ : – ఉదయం తొందరగా హోటల్ ఖాళీ చేసి లగేజ్ కార్లో సర్దేసాం. ఇక ఏదైనా దీవిని చూడాలన్న ఆలోచన బానే ఉంది కానీ ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలోవివరాలు తెలీవు. ఇక ఆ ఆలోచన మానుకుని లిస్టులో ఉన్న ఇతర ప్రదేశాల మీద దృష్టి సారించాం.

అందులో మొదటిది ఆల్కి బీచ్ (Alki Beach). సియాటిల్ నగరానికి మధ్యలో లోపలికి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగానికి ఒక వైపు ఆకాశ హర్మ్యాల ప్రధాన నగరం ఉంటే, మరో వైపు ఈ బీచ్ ఉంటుంది. దారి పొడవునా పరిశ్రమలు కనిపిస్తూ కాస్త పాత బడినట్లున్న భవంతులు, రోడ్ల మీదుగా ప్రయాణించి ఆవలి తీరం వైపుకి వెళ్ళగానే విశాల మైన రహదారి కనిపించింది. మధ్యలోనూ చెట్లతో , నడిచే వాళ్లకు, సైకిళ్ల మీద విహారం చేసే వాళ్లకి అనువుగా ఉందా రహదారి. అలా కాస్త దూరం వెళ్ళగానే కుడి వైపు తళుక్కున మెరిసే చల్లని గాలి తెమ్మెర కెరటాల జలాలకటు వైపు ధగద్ధగమానంగా మెరిసే సియాటిల్ ఎత్తైనభవంతులు, చక్కగా చెక్కిన నౌకా తీరంతో మిలమిలలాడుతున్న నగరం అత్యద్భుతంగా సాక్షాత్కరించింది. అత్యంత సుందరమైన ఆ దృశ్యాన్ని అక్కడ ఆగి ఎంత సేపైనా కళ్ళ నింపుకోవాలనిపించింది. కానీ ఆ రోజు సెలవు దినం కావడం వల్ల, జన సందోహం బాగా ఉండి, మాకు ఎక్కడా కారు పార్కింగు దొరకలేదు.తాత్కాలికమైన పార్కింగులో సరిగ్గా అయిదు నిమిషాలు ఆపి, చప్పున దిగి ఫోటోలు తీసుకోవాల్సి వచ్చింది.

ఇక్కడ క్లిక్ చేసి ఛాయా చిత్రాలను చూడండి.

ఎంతసేపైనా తనివితీరని ఆ ప్రదేశంలో పార్కింగు దొరికి ఉంటే ఆ రోజంతా అక్కడే గడిపెయ్యగలిగిన చక్కని ప్రదేశం అది. అప్పుడది దురదృష్టమని అనిపించినా, “ముందేదో ఇంత కంటే గొప్ప విషయ మేదో ఎదురు చూస్తుంది కాబట్టే తప్పిపోవలసినది తప్పిపోతుందని” గాఢంగా నమ్మే నేను ముందుకు దారి తీసాను. అదెంత నిజమో ఆ తర్వాత అక్కడ చూసిన మరో ప్రదేశం లో తెలిసింది.

సియాటిల్ వాటర్ ఫ్రంట్ , వాషింగ్టన్ స్టేట్ ఫెర్రీస్ :- అక్కణ్ణించి సియాటిల్ వాటర్ ఫ్రంట్ కు వచ్చాం. అంటే సరిగ్గా ఆవలి ఒడ్డన్న మాట. అయితే వాటర్ ఫ్రంట్ లో ఆగిపోయిన జెయింట్ వీల్ తప్ప ఇంకేం కనిపించలేదు. అక్కడ రోడ్డు బాగుచేస్తూ దారంతా మళ్లించడం వల్ల అనుకుంటా. అంతలో పక్కనే దీవులకి షిప్పులు బయలుదేరే పోర్ట్ లు కనిపించాయి. అవి వాషింగ్టన్ స్టేట్ ఫెర్రీస్ (Washington State Ferries). ప్యూగెట్ సౌండ్ (Puget Sound) లో ఉన్న అన్ని ప్రధాన కేంద్రాలకూ అక్కణ్ణించి నౌకా మార్గం ఉంది. ప్యూగెట్ సౌండ్ అంటే సియాటిల్ చుట్టుపక్కల మూడు వైపులా భూభాగాలతో కప్పి అనేక పాయల తో కూడి లోనికి చొచ్చుకు వచ్చిన అతి పెద్ద సముద్రపు పాయన్న మాట. అదెంత పెద్దదంటే, పెద్ద పెద్ద అంతర్జాతీయ రవాణా నౌకలకు అక్కడ ప్రవేశం కలుగుతుందంటే అతిశయోక్తి కాదు.

ఈ స్టేట్ ఫెర్రీల నించి వాషింగ్టన్ రాష్ట్రం లోని అనేక తీర పాంతాలకు మంచి రవాణా సౌకర్యం ఉంది. అంతే కాదు కెనడా దేశానికి, అలాస్కా వంటి ప్రధాన ప్రదేశాలకూ నౌకా సౌకర్యం ఉంది.

బైన్ బ్రిడ్జ్ ఐలాండ్:- కనీసం వివరాలైనా కనుక్కుని వచ్చేద్దామని కారటు తిప్పాను. ప్రధాన గేటు దగ్గిర ఒక్క రోజులో చెయ్యగలిగిన ప్రయాణాల లో రానుపోను అయిదు గంటలు పట్టే ప్రయాణం, రానుపోను మూడు గంటలు పట్టే ప్రయాణం అంటూ… రకరకాల ఆప్షన్లు ఉన్నాయని చెప్పేరు. కనీసం మూడు గంటల ప్రయాణానికి మాకు వ్యవధి ఉంది కాబట్టి ఉత్సాహంగా ఒకదానికి టిక్కెట్లు తీసుకున్నాం. తీరా టిక్కెట్లు తీసుకుని లోపలికి కారు పోనిచ్చాం కానీ కారు ఎక్కడ పార్కు చెయ్యాలో అర్థం కాలేదు. కాస్త దూరంలో వరసగా లైన్లున్న ఓపెన్ షెడ్డులోకి ప్రవేశించాం. ఇంతకీ మేం టిక్కెట్లు తీసుకున్నది బైన్ బ్రిడ్జ్ ఐలాండ్ (Bain Bridge Island) కి.

షిప్పు వచ్చేంత వరకూ వేచి ఉండాల్సిన లైన్ అదని, దాదాపు నలభై నిమిషాల వ్యవధి ఉందని వెలిగే బోర్డు చెపుతూంది. అయితే మా ముందున్న కార్లెక్కడ పార్కు చేస్తే మేమూ అక్కడే చేద్దామని ధీమాగా లైనులోకి వెళ్లేం. మా వెనకే మరి కాసిన్ని కార్లు వచ్చి పద్ధతిగా నాలుగైదు లైన్లలో కాస్త కాస్త దూరంగా సిగ్నల్ దగ్గిర ఆగినట్లు ఆపేయి. అయితే పార్కింగు లోనికెళ్ళినట్లు ఇంజన్లు ఆపి డ్రెవర్లు, కారులోని వారు అందులోనే కూర్చుని ఉండడం గమనించాను. ఎవర్నైనా అడుగుదామంటే దగ్గర్లో విషయం చెప్పే పోర్ట్ ఉద్యోగులైవరూ లేరు. ఇక నేనే ధైర్యం చేసి కారు దిగి, ఆ పక్కనే తిరుగుతున్న ఒక ప్రయాణీకుణ్ణి కారు పార్కింగు వివరాలు అడిగేను. అతను చెప్పిన సమాధానం విని నా అజ్ఞానానికి నాకే నవ్వు వచ్చింది.

ఇంతకీ అక్కడ మేం లైనులో నిలబడ్దది కారుతో సహా షిప్పు లోనికి ఎక్కడం కోసం. ఇంత వరకూ మేమెన్ని పడవ ప్రయాణాలు చేసినా ఇదొక ప్రత్యేక మైన అనుభవమన్నమాట. గొప్ప ఉత్సాహం వచ్చేసింది ఇక అందరికీ. అంతే కాదు మేం కారుతో బాటూ షిప్పు ఎక్కి, అటు ఒడ్డున ఉన్న దీవిలో దిగి మా కారులోనే అంతా తిరిగి చూసుకుని, మళ్ళీ కారుతో బాటూ రావొచ్చన్నమాట.
కారు పట్టడమంటే ఇదేదో ఒకట్రెండు కార్లు పట్టే చిన్న షిప్పు కాదండోయ్, దాదాపు వంద కార్లు ఒక్కసారి పట్టే పెద్ద షిప్పు. ఊహించుకోవడానికే భలే బావుంది కదా! పదకొండు గంటలకి మా షిప్పు. అక్కడ ఫెర్రీల నుంచి ప్రయాణించే షిప్పులలో 250 కార్లనీ, 2500 మనుషులనూ తీసుకెళ్ళగలినంత పెద్దవి కూడా ఉంటాయట. మేం ఎట్నించెటు ఆలోచించినా తప్పనిసరిగా తిరిగి మధ్యాహ్నం 2 గంటల షిప్పుకి వెనక్కు తిరిగి రావాల్సి ఉంది. తప్పితే 3 గంటల షిప్పు వరకూ వేచి చూడాల్సి ఉంటుంది. అంతకంటే ఆలస్యమైందంటే ఇక పరుగులు పెట్టాల్సిందే. “నాలుగైనా ఫ్లయిట్ కు అందుకోగలుగుతాములే, అంతగా అయితే తిన్నగా ఇక ఎక్కడా ఆలస్యం చెయ్యకుండా ఎయిర్ పోర్టుకి వెళ్లి పోదాం” అని ధైర్యంగా ప్లాను చెప్పేను.

సత్యకి ఇలా అప్పటికప్పుడు ధడాలున పెట్టేసే ప్రయాణాలు నచ్చవు. ముందంతా గొప్ప ప్లానింగు లేకపోతే తెగ టెన్షను పడతాడు. నా ధీమా చూసినా తనకు నమ్మకం కలగక “అమ్మో, ఇప్పుడే లైనులో ఇంత సేపు నిలబడితే ఇక దీవిలో తిరిగి వచ్చే లైను ఇంకెంత భయంకరంగా ఉంటుందో, ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు గంటల వేళకి తిరుగు షిప్పు లైనులో ఉండవలసిందే. ఒకవేళ అది దొరకక, మూడు గంటల షిప్పు కోసం నిలబడి, అదీ మిస్సయ్యిపోయామనుకో” అంటూ నా బుర్ర తినడం మొదలు పెట్టాడు. ఇక ఇలా లాభం లేదని డ్రైవింగు సీటు తనకి అప్పజెప్పి నేను కారు బయట తిరుగుతూ ఫోటోలు తియ్యడంలో నిమగ్నమయ్యాను.

ఇక అసలు సమయం రానే వచ్చింది. కారుని మెల్లగా అదే లైన్లలో షిప్పు లోనికి పోనివ్వాలి. అక్కడ పార్కు చేసిన తర్వాత మెట్లెక్కి పైనున్న కూర్చునే కాబిన్లలోకి వెళ్లి కూర్చో వచ్చు. కారు పెట్టడం వరకే అధిక సమయం పట్టింది. ప్రయాణం చాలా త్వరగా తేలిపోయినట్లనిపించింది. పెద్ద షిప్పుకి ఆ మూల నించి ఈ మూల వరకూ రెండు మూడంతస్థులూ తిరిగే సరికే మళ్లీ కారులోకి పరుగెత్తి కూచోవలిసి వచ్చింది. అయితే గొప్ప ఆసక్తిదాయకమైన చక్కని అనుభవమది. సియాటిల్ వెళ్ళిన వాళ్లు ఒక పూట సమయం ఉంటే తప్పనిసరిగా చూడాల్సిన వాటిలో ఈ బైన్ బ్రిడ్జి ఒకటి.

ప్రయాణం కంటే అందమైన దీవి అది. ఎక్కి దిగే చిన్న వంపుల రహదారుల్లో పచ్చని చెట్ల వెంబడి ప్రయాణం ఎంత బావుందో. దీవి అటు చివరి వరకూ వెళ్లి సముద్రానికి అటు అంచు చూసి రావాలని నా ఆకాంక్ష. అయితే అంత రౌండూ కొట్టినా అటు వైపు సముద్ర తీరం కనిపించని నిషిద్ధ ప్రాంతం ఉందక్కడ. పైగా దారి తప్పి రెండు సార్లు తిరిగాం. ఇక్కడి ఇతర ప్రాంతాలతో పోలిస్తే బాగా రద్దీగా ఉన్న ప్రదేశం అది. అంతే కాదు, గొప్ప ధనికులెందరో విడిది గృహాలు ఏర్పాటు చేసుకున్నందు వల్ల అత్యధిక విలువ ఉన్న ప్రదేశం అది.

మేం గంట కూడా తిరక్కుండానే భోజన సమయమయ్యింది. ఇండియన్ రెస్టారెంటు పేరు దార్లో ఎక్కడో చూసేం. అందుకోసం కారుని అటూ ఇటూ తిప్పుతూ కాస్సేపు తిరిగేం. ఇక ఆ రెస్టారెంటు కోసం ఎక్కడో పార్కు చేసి ఎక్కడికో నడవాల్సి వచ్చింది. డౌంటౌన్ లో కొంత దూరం నడిచే సరికి అలసట వచ్చేసిందరికీ. పైగా అందరికీ బాగా ఆకలేస్తూంది. ఇక ఇండియన్ రెస్టారెంటు కోసం వెతకడం మానేసి ఎదురుగా ఉన్న థాయ్ పుడ్ సెంటర్ లో నూడుల్సి, రైస్ తీసుకున్నాం. పూర్తి వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్న హోటలది. చాలా రుచికరంగా ఉన్న భోజనం త్వరత్వరగా తిన్నాం. అయితే తీసుకున్న ఆర్డర్లతో కడుపు నిండ లేదు. కానీ మళ్లీ ఆర్డరు చేసి ఇక అక్కడే వేచి ఉండడం వల్ల సమయం మించిపోతుందని బయలుదేరాల్సి వచ్చింది. తిరిగి వచ్చేటప్పుడు మళ్లీ లైను లో అరగంటకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. ఒక రోజు పూర్తిగా ఉండాల్సిన ప్రదేశామని అప్పుడు అర్థమైంది. మొత్తానికి ఒక చక్కని, మరపురాని అనుభూతిగా మిగిలిపోయిందా అనుకోని దీవి ప్రయాణం.

“చిట్టెండెన్ బాల్లార్డ్ లాక్స్” (Chittenden Ballard Locks):-
తిరిగి సియాటిల్ వైపుకి మా షిప్పు చేరి మేం మళ్లీ సియాటిల్ వీధుల్లోకి వచ్చి పడేవరకూ సత్యకి టెన్షను వదల్లేదు.
తీరా చూస్తే అప్పటికింకా మధ్యాహ్నం మూడే అయ్యింది. నేను గబగబా లెక్కలేసి “ఇంకా 2, 3 గంటలు తిరగొచ్చు” అంటూ లిస్ట్ లో తర్వాతి ఐటం పైకి తీసాను. అవే “చిట్టెండెన్ బాల్లార్డ్ లాక్స్” (Chittenden Ballard Locks).

సముద్రం లో నుంచి వెనక్కు వచ్చే నీటి ప్రవాహానికి అడ్డుకట్టగా నిర్మించిన లాకులవి. వాటిని ఆనుకుని ఉన్న బొటానికల్ గార్డెన్ లో నుంచే నడవాల్సి రావడం విశేషం. రోడ్డు మీద నుంచి కాస్త దూరం లోపలికి నడవాలి. దారి పక్కన రకరకాల అందమైన పూలు, పేర్లతో సహా వివరంగా ఉన్న అనేక తీగలు, మొక్కలు. ఆ చివర ఇరు వైపులా నల్లని నీళ్లు పరుచుకున్న లాకులు, గేట్లు. అరగంటకొక సారి లాకులు తెరుచుకునే సమయానికి గంట మోగుతుంది.

మేం వెళ్ళేసరికి సరిగ్గా ఒక విడత గేట్లు తెరిచే కార్యక్రమం మొదలయ్యింది. సామర్లకోట లోని లాకులు జ్ఞాపకం వచ్చాయి నాకు. కానీ అవి చాలా చిన్నవి. వీటికీ వాటికీ పోలిక లేదు నిజానికి.

సిరి కి అవేవిటో సరిగా అర్థం కాలేదు. వదిలితే అటూ ఇటూ పరుగులు పెట్టడం తప్ప. వరు చాలా ఆసక్తిగా చూసింది.
ఇక్కడ మామూలు చిన్న పడవలకు చిన్న మార్గం, పెద్ద షిప్పులకు పెద్ద మార్గం ఉన్నాయి. అంతే కాదు చేపలకు కూడా ప్రత్యేక మార్గం ఉండడం విశేషం.

లాకులకు ఒక పక్క తియ్యని మంచి నీటి సరస్సు “లేక్ వాషింగ్టన్”(Lake Washington ) కు ప్రవాహ మార్గమైన “సాల్మన్ బే” (Salmon Bay) , మరో వైపు లోనికి చొచ్చుకొచ్చిన సముద్రపు పాయ ఉంటాయి. సముద్ర జలాల వల్ల మంచి నీళ్లు కలుషితం కాకుండా కూడా ఈ లాకులు కాపాడతాయి. దాదాపు గంటన్నర సేపు అక్కడే తిరుగాడి బయలుదేరేం.

నగరానికి వీడ్కోలు:- దాదాపు అయిదు గంటల ప్రాంతంలో పిల్లలు తినేందుకు వాళ్లకు బాగా ఇష్టమైన పాండా ఎక్స్ప్రెస్ నూడుల్స్ పాక్ చేయించుకుని, మేం స్టార్ బక్స్ కాఫీలు తీసుకుని తాగుతూ సియాటిల్ నగరానికి వీడ్కోలు చెబుతూ ఆ మూల నించి ఈ మూలకి చివరిగా ప్రయాణించేం.

6 గంటల ప్రాంతంలో ఎయిర్ పోర్టుకి అనుకున్న విధంగా చేరుకుని సమయానికి చెకిన్ అయ్యాం. చెకింగులో నా బ్యాగులో వాటర్ బాటిల్ పొరబాటున ఉండిపోవడం వల్ల నన్ను కాస్సేపు ఆపేసి స్పెషల్ చెకింగు చేసేరు. సత్య కి కోపం నషాళానికంటింది. “నీకెన్ని సార్లు చెప్పేను మంచి నీళ్ల సీసాలు సరిగ్గా చూసుకోమని” అంటూ వాళ్ల ఎదురుగా నా మీద అరవడం మొదలు పెట్టాడు. అంతే కాకుండా తనేవీ తిననని భీష్మించుకుని కూచున్నాడు. ఎక్కడికక్కడ అన్నీ మరిచిపోయి అందర్నీ సంయమనంతో చూస్కోవాల్సిన బాధ్యత నా మీద ఉండడంతో తనని ఏదో నవ్వించడానికి ప్రయత్నించి, విఫలమై మిగతా వాళ్ళని చూసుకుంటూండగానే నా మనసు అక్కణ్ణించి వెనక్కు ప్రయాణించడం మొదలు పెట్టింది. నాలుగైదు రోజుల చిత్రాలన్నీ వరుసగా కదలాడడం మొదలు పెట్టాయి.

నా కళ్ల ముందు ఏవేవో సంఘటనలు జరుగుతూన్నా, గుండె నిండా దారి పొడవునా సాయం సంధ్యలో దాటి వచ్చిన సముద్రపు తీరపు తళత్తళలు మెరుస్తూ ఉన్నాయి. సియాటిల్ నగరం మిగిల్చిన అందమైన అనుభూతులెన్నో కళ్ల ముందు తెరలు తెరలు గా నాట్యమాడుతూ ఉన్నాయి.

నాలుగైదు రోజులుగా ఎంతో అలిసిపోయినా, జ్ఞాపకాల హుషారుతో గొప్ప ఆనందంగా ఉరకలేస్తున్న నా హృదయం నగరాన్ని వదిలి రావడానికి మాత్రం విలవిల్లాడింది.

-కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యంPermalink

Comments are closed.