నామధేయాపరాగము-మెర్సీ మార్గరెట్

m

వాళ్ళడిగారు
నీ పేరు మాలా ఎందుకులేదని?

చరిత్ర నిదురించే ఓ రాత్రి
నేలపైకి మరుగుజ్జులా మారి
పాలపుంతలు దిగి నడిచే రాత్రి
మందారాలు, ముద్దబంతులూ
ఒళ్ళు విరుస్తూ ఒక్కోవస్త్రపు రేకును విప్పుకుని
బయటికి తొంగి చూసే రాతిరి
యే బోధి వృక్షాన్నో వెదుకుతూ కొందరు గౌతములు
ఇళ్లు విడిచిన రాత్రి
శపించబడిన అంజూరవృక్షపు వేర్లలోకి చీమలా దూరి
నా మనసు వాటి మాటలు వినాలని ప్రయత్నించిన రాత్రి
ఎందుకో వాళ్ళ ప్రశ్నలు
నా చేతికి తాళ్ళను చుట్టాయి
కలాన్ని లాగేసుకుని యే మరుభూమిలోనో పాతేసాయి

వాళ్ళన్నారు
నీ పేరుకు మా బాషకు సంభందం లేదని?
వాళ్ళ అక్షరాలలో యే కొసన నా పేరును ముడివేయలేమని
వాళ్ళ రాతల దారుల్లో
నాపేరు ఊరిచివర నుంచి వినిపించే శబ్ధం చేస్తుందని
అడుగు అడుగు కలిపినడవాల్సిన అక్షరాల మధ్య
నా పేరు వారికి అభ్యంతరంగా వుందని

పొగమంచుల ఊపిరినొదులుతూ చంద్రుడు

తిరుగుపయమనమయ్యే వేళ
రాలిన ఆకులతో వాళ్ళదీ నాదీ ఒక్కటైన బాషలోనే
అడిగా
ఇంతకు మీరెప్పుడైనా నా అక్షరాల్ని స్పృశించారా?
నా కాగితాలపై మీ చేతుల్నుంచి వాటి ముఖం తడిమారా?
నా కలం గొంతు పై మీ చేతులు తీసి
అది మాట్లాడుతున్నప్పుడు దాని ఆత్మగీతం విన్నారా?
యేది సమాధానం
అంతటి తీరిక వారికెక్కడిది?

ఇంతలో

ఎవరో నేను రాసుంచుకున్న కాగితాల్ని
ఎడమకాలితో తన్ని
భావాల పసికుసుమాలను చిద్రం చేయబోతున్నంతలో
అవన్నీ ముక్త కంఠంతో ఉరుముతూ అన్నాయి గదా
-“ఆమె మాది
ఆమెకి మీ బాషతో సంబంధంలేదు
బాషకి కులంతో, అక్షరాలకి మతంతో
ఆ మతంతో మాకూ సంభంధంలేదని” –

ఇప్పుడు నేను
గర్వంగా నవ్వుతున్నాను
మెర్సీ లా నవ్వుతున్నాను
మార్గరెట్ లా నవ్వుతున్నాను
నా సంతకంకింద పెట్టే
రెండు తోకచుక్కల్లా నవ్వుతున్నాను

– మెర్సీ మార్గరెట్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలుPermalink
0 0 vote
Article Rating
4 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
D.Venkateswara Rao
D.Venkateswara Rao
5 years ago

మార్గరెట్ ని సంస్కృతంలో ‘మంజరి’ అంటారు. యుఎస్ లో ఈ పేరు ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి ఉండేది. మార్గరెట్ అంటే ‘పెరల్’ కాబట్టి అందరూ ఆ పేరునే ఇష్టపడి పెట్టుకుంటారు. ఇక మెర్సీ ముందు తగిలించినా వెనుక తగిలించినా ఏమీ పరవాలేదు.

THIRUPALU
THIRUPALU
5 years ago

//ఇంతకు మీరెప్పుడైనా నా అక్షరాల్ని స్పృశించారా?
నా కాగితాలపై మీ చేతుల్నుంచి వాటి ముఖం తడిమారా?
నా కలం గొంతు పై మీ చేతులు తీసి
అది మాట్లాడుతున్నప్పుడు దాని ఆత్మగీతం విన్నారా? //
అడగటం కంటే అడిగిన తీరు బాగుంది. మెర్సీ లా నవ్వటం బాగుంది.

sujatha thimmana
sujatha thimmana
5 years ago

అద్భుతం తల్లి…..అక్షరాలకు అమ్మని ఇచ్చావు…

mercy margaret
mercy margaret
5 years ago

ధన్యవాదాలు అమ్మా