సందర్భాన్నిబట్టి., (కవిత )- అమరజ్యోతి

అది టి వి
ఎప్పుడూ టి వి గానే ఉంటుంది..కారుగా మారదు
ఇది ఒక బోల్ట్
బోల్ట్ గానే ఉంటుంది..నట్ గా మారదు
ఆకాశం ఎప్పుడూ ఆకాశంగానే ఉంటుంది
ఆకాశం ఎప్పుడూ భూమిగా మారదు
చెట్టు చెట్టుగానే ఉంటుందిగాని
అది ఒక రోడ్డుగానో..పర్వతంగానో మారదు
సృష్టిలో రూపాంతరత ఒక విశుద్ధ క్రీడ
నిర్జీవ వ్యవస్థలన్నీ తమ తమ అవధుల్లోనే పరిభ్రమిస్తూ
అన్నీ..పరిమితులూ..స్వయం నియంత్రణలూ..విధి నిర్వహణలే
అంతా ఒక యాంత్రికత..ఒక పునః పునః వలయ గమనాలే
ఎందుకూ..? అని ఆలోచిస్తానుగదా.,
బోధి వృక్షం కింద గౌతమునికి జ్ఞానోదయమైనట్టు
ఒక సూర్యోదయవేళ సత్యం అవగతమైంది నాకు
ఒకేఒక శరీరమున్న ఒక స్త్రీని నేను
నాకొక హృదయముంది..అందుకే
ఉదయమే త్యాగినై..ఒక ఇల్లాలు నౌతాను
పిల్లలు బడికి వెళ్తున్నపుడు..వాత్సల్యాన్ని నింపుకుని ఒక తల్లినౌతాను
మధ్యాహ్నానికి అనేక సమస్యల సాధకురాలిగా ‘పనిమనిషి ‘నౌతాను
సందర్భాన్నిబట్టి ఒకసారి బిడ్డగా,సోదరిగా,పౌరురాలిగా
అప్పుడప్పుడు నాపై దాడి జరిగినప్పుడు భద్రకాళినౌతాను
వెన్నెల రాత్రుల్లో..చేతుల్లో పాలగ్లాసుతో..మల్లెల్లో పరవశించిపోతూ
నా ధర్మాన్ని నేను గ్రహిస్తూనే ఒక భార్యనుకూడా ఔతాను
నేను మనిషిని..స్త్రీని..ఒక హృదయమున్న ప్రాణిని
సందర్భాన్నిబట్టి తల్లినీ..చెల్లినీ..అపర ఆదిశక్తినీ ఔతా –

-అమరజ్యోతి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , Permalink

One Response to సందర్భాన్నిబట్టి., (కవిత )- అమరజ్యోతి

 1. D.Venkateswara Rao says:

  కుడివైపునుంచి చూసినా.ఎడమవైపునుంచి చూసినా
  ముందునుంచి చూసినా, వెనుకనుంచి చూసినా
  ఎటునుంచి చూసినా ఏ సందర్భాన్ని బట్టి చూసినా
  ఎంత ఆలోచించి తల బద్దలుగోట్టుకున్నా
  ‘బోధి వృక్షం కింద గౌతమునికి జ్ఞానోదయమైనట్టు’ అన్న దానికి
  ‘ఒక సూర్యోదయవేళ సత్యం అవగతమైంది నాకు’ – అనడానికి పోలిక ఎక్కడా ఇసుమంతైనా కనిపించలేదు
  కొంచెం ఆలోచించి వ్రాయండి
  టివి, కారు- నట్టు, బోల్టు – చెట్టు, రోడ్డు కావేమి కవితకనర్హం అన్నట్లు
  ఎందుకండీ మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలని చూస్తారు
  మీరు ఒకేఒక సరీరమున్న స్త్రీ అని మీకొక హృదయముందని
  ఎప్పుడెప్పుడు ఏమవుతారో చెప్పారు
  తల్లిని అన్నారు, పనిమనిషిని అన్నారు
  బిడ్డని అన్నారు, సోదరిని అన్నారు, భద్ర కాళిని అన్నారు
  భార్యని అన్నారు, మనిషిని అన్నారు, స్త్రీని అన్నారు, ప్రాణిని అన్నారు
  సందర్భాన్న్నిబట్టి తల్లిని, చెల్లిని మరియు అపర ఆదిశక్తిని అన్నారు
  మీ పేరు మాత్రం అమరజ్యోతి అని మాత్రం చెప్పలేదు