సమస్యల వరవడిలో కొట్టుకు పోతున్నా, సదాలోచననూ, సన్మార్గంలో పయనించే యోచననూ మరువద్దని పాడే మేలుకొలుపు వారణాసి నాగలక్ష్మి గారి “వేకువ పాట” కధా సంపుటి.
సరళీ స్వరాల సాధన సంగీతానికి ఎలాగో మంచి వ్యక్తిత్వ నిర్మాణం జీవితానికలాంటిది. కనుక తల్లి తండ్రులు పిల్లల్ని పెంచే విషయంలో నిర్లక్ష్యం చూపకూడదనీ, తగు జాగ్రత్త తీసుకోవాలనీ చెప్పిన కధ “సరళీ స్వరాలు”. ఒక వయసు వచ్చాక తల్లి పిల్లలతో పెంచుకోవలసిన డిటాచ్ మెంట్ గురించిన కధ “విముక్త “.
“నాన్నకో ఈ మెయిల్” చాలా సహజంగా ఉండే కఠినమైన నిజాల్ని చెబుతుంది. భార్యతో భర్తగా, కూతుళ్ళతో తండ్రిగా రెండు విభిన్న పాత్రలలో మగవారిలో ఉండే పక్షపాతాన్ని చక్కగా పట్టుకుని వాత పెట్టారు ఈ కధలో. “అమ్మా నాన్నా కాలేజీ అబ్బాయి” కధ నేడు జరుగుతున్నవాస్తవం. తల్లి తండ్రుల కోణం లోంచి నిజం ఏమిటన్నది చక్కగా రాసారు. వారి ఆవేదన కళ్ళకు కట్టినట్టు చెప్పారు.
“అమ్మ ఒక రూపం కాదు” కధలో టీచర్ పట్ల పసి మనసు అభిమానం ఎంతో బావుంది. స్త్రీలలో కనబడే గయ్యాళితనం వెనక వారి మనసును “అయినవాళ్లు” కధలో చూపారు. “పుష్య విలాసం” కధలో చక్కని సందేశం ఉంది. మగ మనసులోని కాంప్లెక్స్ లను సున్నితంగా చెప్పారు.
పరిసరాల పట్ల మనుషుల పట్ల అనుబంధాలని యువతరం కూడా కోరుకుంటుందని “సహజీవనం” లో చెప్పారు. “కొమ్మకో కొమ్మకో సన్నాయి” కధలో స్త్రీల ఆర్ధిక స్వావలంబన అవసరాన్ని మృదువుగా చెప్పారు. మనుషుల్ని కలిపే మమతల గొప్పతనం “వారధి ” లో కనబడుతుంది.
ఈ సంపుటి లోని కధల్లో కోడలికి అమ్మ ప్రేమను పంచాలనుకునే అత్తగారు, తమ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లోని తోటి ఇల్లాలి పట్ల సహానుభూతి చూపే యువతి , పని పిల్ల భవిష్యత్తుకు బాటలు వేసే గృహిణి మనల్ని ఆలోచింప చేస్తారు. ఈ సంకలనంలోని 19 కథల్లో 7 కథలకు బహుమతి రావడం, 4 కథలు ప్రత్యేక సంచికలలో రావడం విశేషం. మంచి చిత్రకారిణి కూడా అయిన ఈ రచయిత్రి తన పుస్తకానికి చక్కటి ముఖ చిత్రం వేసుకున్నారు. లోపలి చిత్రాలు కూడా ఎంతో భావ యుక్తం గా ఉన్నాయి.
కధలో కొన్ని సపోర్టింగ్ సంఘటనలని చెప్పేటప్పుడులోని వస్తువుపై ఫోకస్ తప్పిపోకుండా చూసుకుంటే గురి తప్పకుండా పాయింట్ చదువరిని చేరుతుంది. నిడివి ఎక్కువగా వచ్చిన కధల్ని కాస్త కుదించు కుంటే భావం చిక్కబడి అవి మరింత అందగిస్తాయి.
భావుకతతో కూడిన చక్కటి వర్ణనలతో పాఠకుడిని తన మూడ్ లోకి తీసుకుని వెళ్ళడంలో రచయిత్రి సక్సెస్ అయ్యారు. మంచి ఇతివృత్తాలని ఎన్నుకున్నారు. ఈమెది సామరస్య వాదం. మానవ సంబంధాలు హృద్యంగా ఉండాలంటారు. ఘర్షణ లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగాలనే ప్రేమ తత్త్వం ఈ కథలన్నింటిలోనూ అంతర్లీనంగా కనబడుతుంది. ఈ భావం నేటి కాలపు అత్యవసరం. అందుకే అందరూ చదవాల్సిన సంకలనం ఇది.
ఆశావహ దృక్పధాన్ని సూచించే లేత ఆకుపచ్చా, పసుపు పచ్చా కలిసిన కవర్ పేజీతో కళ్ళకీ, మనసుకీ హాయి గొలుపుతూ ఉందీ పుస్తకం.
– అల్లూరి గౌరీలక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~