ఫెమినిజం – కుటుంబం – కులం

మన దేశ సామాజిక వ్యవస్థలో స్త్రీ అణచివేత ఇక్కడుండే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, వైవిధ్య రూపాల్లో కనిపిస్తుంది. పాశ్చాత్యా దేశాల్లో స్త్రీ అణచివేత అన్న అంశం మన దేశం లోని సమస్య తో పోల్చి చూస్తే సంక్లిష్టత తక్కువే. పంతొమ్మిదో శతాబ్దం నుండి ఈ దేశం లో అంకురం తొడిగిన ఫెమినిజం కూడా ఎన్నో రూపాంతారాలకు గురయ్యింది. మొదట మగ వాళ్ళతోనే మొదలైన స్త్రీ పక్షపాత వాదన , నెమ్మదిగా స్త్రీలను చేర్చుకుంది. ఈ స్త్రీ అణచివేత సమస్య 1980 మధ్యలో నుండి ఉధృతంగా చర్చకు గురై, ఈ మధ్య కాలం లో కొంత సైద్ధాంతికంగా stable అయినట్టు అగుపిస్తుంది. స్త్రీ విముక్తి జరగాలంటే ఉండాల్సిన ప్రధానమైన condition precedent ను గమనించే ఉద్దేశ్యంతో అందులో భాగంగా – స్త్రీ అణచివేతకు ప్రధాన మూలమైన ‘ కుటుంబం ‘ ను ఇక్కడ క్లుప్తంగా పరిశీలించడం జరిగింది.

కుటుంబ వ్యవస్థ ‘ పితృస్వామ్యంగా ‘ ఉండడానికి కారణం , మగ వాడు ‘వ్యక్తి గత ఆస్తి ‘ కి స్వంత దారుడు మరియు పరిరక్షకుడు కాబట్టి కుటుంబం లో పితృ స్వామ్యం ఉందనేది ఒక వాదన. స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం ఉండడమనే విషయం ఇదే భావనను ఆధారం చేసుకున్నదే అయినా, స్త్రీ ఆర్థిక స్వాతంత్ర్యం కేవలం వ్యవస్థలో leakage లా మిగిలిపోయి ఈ కనీసమైన ఆపేక్షను కూడా విజయవంతమైన కోరిక లా మిగల్చడం లేదు. ప్రస్తుతానికి – ఒక ప్రజాస్వామిక కుటుంబ వ్యవస్థ ను సృష్టించడానికి ఉండాల్సిన ప్రధానమైన condition precedent ఏంటో చూడాలి.

కుటుంబం అన్నది సమాజం లో ఒక చిన్న యూనిట్. సమాజం లో దీని ఫంక్షన్ ఏంటి ? ఇది సాధారణంగా – ఒక social order ను నిలబెట్టడానికి , మనుష్యులు మొదలు పెట్టిన చిన్న యూనిట్. బానిస వ్యవస్థ నుండి కేపిటలిస్ట్ వ్యవస్థ దాక గమనిస్తూ పోతే, కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పులు ఇదే పరికల్పనను నిజమని తెలుపుతూ పోతాయి. మరి మన భారత దేశ కుటుంబ వ్యవస్థ – సాధారణంగా ఎటువంటి సమాజాన్ని, సోషల్ ఆర్డర్ ను, సాంఘిక విలువలను ప్రొటెక్ట్ చేయడానికి తగినట్టుగా ఏర్పడుతుంది ?

కుటుంబం మొదటగా – ఒక పురుషుడు, ఒక స్త్రీ కలిసి జీవించాలి అనే నిర్ణయం అమలైనప్పటి నుండి మొదలౌతుంది. మన దేశం లో కుటుంబం ఏర్పడ్డమే – ఒక Endogamy సాంప్రదాయం తోనే ఏర్పడుతుంది. మన దేశం మొత్తం మీద Exogamy అన్నది వ్యవస్థాగతంగా మార లేదు. చెదురు మదురుగా కులాంతర వివాహాలు జరిగినా, అటు తిప్పి ఇటు తిప్పి – కుటుంబం ఒక ‘ homogenous casteist unit ‘ గానే మిగిలిపోతుంది. Endogamy ఒక వివాహ నియమంగా ఈ సమాజం లో మిగిలినంత కాలం – మనం ఇది నివారించలేము. సతీ సహగమనం, వైధవ్యం, బాల వివాహం – వంటి ఆచార వ్యవహారాలు , Endogomy ని తద్వారా కులాన్ని ప్రొటెక్ట్ చేయడానికే పుట్టుకొచ్చాయి. స్త్రీ సెక్జువాలిటీ ని నియంత్రించి కుల వ్యవస్థను పటిష్టం చేసే క్రమం లోనే పుట్టుకొచ్చాయి అని తెలిసిన విషయమే. హిందూ మెజారిటీ వ్యవస్థ అయిన మన సమాజం లో కుటుంబ సాంప్రాదాయాలు , కుటుంబ వ్యవస్థ వ్యవహార శైలి మొత్తం స్త్రీకి ప్రతికూలంగా ఉంటుంది. దీని వలన ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించిన స్త్రీ, ఈ చట్రాన్ని ఛేధించడం కష్ట తరం అవుతుంది.

హిందూత్వ శక్తులు ‘ బహు లావో – బేటీ బచావో ‘ అని, ‘ శుద్ధి ఉద్యమం ‘ గాని మొదలు పెట్టడం లో ఉద్దేశ్యం కుటుంబం హిందూత్వ పరిరక్షణకు ప్రధానమైన యూనిట్ కాబట్టి. మన దేశం లో ఉండే పితృస్వామికత ప్రధానంగా ‘ బ్రాహ్మణీయ పితృస్వామ్యం ‘ కాబట్టి. కోడలిని మన మతం లోకి తిసుకు రావచ్చు కాని కూతురును పరాయి విశ్వాసాల కుటుంబాలతో వివాహం జరిపితే – అపరిశుభ్రత అయిపోతుంది అనే ఘాతుకమైన విశ్వాస ప్రచారం Exogomy ని ఏక పార్శ్వ విధానంగా చేయడం Endogomy ని పరిరక్షించడం కోసమే. మగవాడు మన వంశం లో ఉండి స్త్రీ వేరే వంశమైనా పర్లేదు అన్న భావన, వివాహం స్త్రీకి నిమిత్తం లేని ఒక సాంప్రదాయంగా రూపుదిద్దుకున్నది. అంటే బ్రాహ్మణియ వ్యవస్థలో, స్త్రీ sexual gateway గా ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది. అందుకే ప్రేమ వివాహాలు ఉండవు, ‘ అరేంజ్ ‘ చేసిన వివాహాలే ఉంటాయి దానితో బాటు పరువు హత్యలు ఉంటాయి. కాబట్టి – ఈ కుల పరిరక్షణ భూమిక గా ఉన్న కుటుంబ వ్యవస్థను బద్దలు కొట్టకుండా , స్త్రీ విముక్తి సాధ్యమయ్యే అవకాశం లేదు.

ఇక్కడ – బ్రాహ్మణియ వ్యవస్థ నుండి పుట్టుకొచ్చిన పండిత రమాబాయి లాంటి వ్యక్తుల సందర్భాన్ని కూడా పరిశిలిస్తే కొంత సోదాహరణగా ఉంటుంది. కేపీటలిజం పుంజుకుంటున్న రోజుల్లో మన దేశం లో మొదటి తరం ఫెమినిస్టుల్లో ఒకరైన పండిత రమాబాయి , వేద పఠనలో పట్టు సాధించింది. కులాంతర వివాహం చేసుకుని, క్రిస్టియానిటీ లోకి మారిపోయింది. ఆమె రాసిన High caste Hindu women అనే పుస్తకం అప్పట్లో వేల ప్రతులు అమ్ముడు పోయాయి. ఆమె పోరాటం ఎక్కువగా బాల్య వివాహాలు, సతీ సహగమనం లాంటి విషయాలపైనే జరిగింది. ఆమె అనుసరించిన ఫెమినిజం ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది అని చూస్తే – మన సమాజం – బాల్య వివాహాలను, సతీ సహగమనాన్ని అదుపులోకి తెచ్చాక, 1829 లో సతీ సహగమన వ్యతిరేక చట్టం వస్తే బాల్య వివాహ వ్యతిరేక చట్టం 1929 లో వచ్చింది. ఆర్థిక వ్యవస్థలో క్రమ క్రమంగా భాగస్వామ్యం పెరగడంతో – అసలు బాల్య వివాహాలకు, సతీ సహగమనం లాంటి సాంప్రదాయాలకు మోరల్ సపోర్ట్ కూడా కరువయ్యింది. దానితో పాటు కుల వ్యవస్థ కూడా రూపాంతరం చెందడం తో పాత పద్ధతుల మనుగడ కష్టమయ్యింది. తర్వాత జరిగిందేమిటి ? 1800 లతో పోల్చి చూస్తే, హైందవ బ్రాహ్మణిక వ్యవస్థ ఖచ్చితంగా బలహీన పడ్డది వాస్తవమే కాని, అది రూపాంతరం చెందుతూ వచ్చింది అన్నది కూడా వాస్తవం. ” మెడ నాది, సూత్రం నీది; చేతులు నావి, గాజులు నీవి ; నుదురు నాది, సింధూరం నీది ; శరీరం నాది, దాని వాడుక నీది ” – ఇదే సూత్రాలతోనే స్త్రీ వైవాహిక జీవితం గడిచిపోతుంది. స్త్రీ – వర్గాన్ని మరియు కులాన్ని ఏక కాలం లో బేలన్స్ చేస్తూ సమాజాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతను ఈ బ్రాహ్మణియ వ్యవస్థ ఆమె మీద మోపినప్పుడు, ఈ నిర్భంధ జీవన విధానం తప్పదు.

2500 సంవత్సరాలకు పూర్వం యాఙవల్క్యుడు రాసిన స్మృతి పురాణం గమనిస్తే ఇలా ఉంటుంది ” కన్యత్వం కలిగి, శుభా చిహ్నాలూ ప్రసాదింపబడి, మునుపెన్నడూ వివాహము చేసుకోని, ఎవరికీ ప్రియురాలిగా ఉండని, ఒకే వర్ణం కు సంబంధించి ఉండి, దాయాదులు కాని వారై, వయసులో ఎక్కువ కాకుండా ఉండి, అనారోగి కానిదై, ఒకే గోత్రమునకు సంబంధించినది కాక……” (స్మృతి 1.52-55 ) ఉన్న స్త్రీనే వివాహం చేసుకోవాలి. మరి ఇప్పటికీ ఇవే సూత్రాలు అమలౌతున్నాయంటే – స్త్రీ సమస్య లో గుణాత్మక మార్పు ఏమున్నది అన్నది గమనించాలి.

మన దేశం , బ్రిటిష్ పరిపాలన నుండీ విడివడ్డాక, రూపొందించిన మొదటి చట్టాల్లో ఒకటైన ‘ హిందూ కోడ్ బిల్లు ‘ ప్రవేశ పెట్టిన అంబేద్కర్ , నెహ్రూ మహిళా వ్యతిరేక హిందూ ఛాందస పక్షపాతానికి వ్యతిరేకంగా రాజీనామా చేసి కేబినెట్ నుండి తొలగడం జరిగింది. ఇక్కడి స్థలాభావం వల్ల – ఆ మొత్తం విషయాన్ని చర్చించలేము కానీ ఇక్కడ గమనించమని కోరిందేమంటే , స్త్రీ హిందూ వివాహ కుటుంబ వ్యవస్థకు , ప్రధాన పునాది కాబట్టి, స్త్రీ ప్రగతిని అడ్డు కోవడానికి హిందూ బ్రాహ్మణిక శక్తులే ముందుంటాయని తెలుసుకోవాల్సి ఉంది. హిందూ బ్రాహ్మణ వాదాన్ని సమూలంగా నాశనం చేయ కంకణం కట్టుకున్న అంబేద్కర్, స్వపరిపాలన రాగానే హిందూ మహిళా చట్టాన్ని తన అస్త్రంగా ఎచుకోవడం గమనార్హం.

అగ్ర కులం , అగ్ర కుల స్త్రీ కి , ఒక సామాజిక అస్తిత్వాన్ని, సామాజిక హోదాను ఇవ్వగలుగుతుందేమో గాని, ప్రాథమిక స్వేఛ్ఛ ఏదైతే ఉండాలో అది ఇవ్వలేదు. ఐతే ఇంకొక అడుగు ముందుకేసి చూస్తే – గ్రామీణ దళిత కులాల స్త్రీలు , నిజానికి , పాతివ్రత్యం, శీలం లాంటి అంశాలకు ( ఒక్క ఆత్మ గౌరవ అంశంగా చూడ్డం తప్ప ) దూరంగా బతుకుతుంటారు. దళిత స్త్రీలు ఉత్పత్తి సంబంధాల్లో మగాడితో పాటు పాలు పంచుకుంటారు అందునా వారి కుటుంబ వ్యవస్థ సాంప్రదాయ పరమైన పీడన కు తాత్విక ఆధారం లేకపోవడంతో – ఆ మేరకు దళిత స్త్రీ సమస్య వేరుగా అగుపిస్తుంది. అంతే కాక, దళిత పురుషుడికి , అగ్ర కుల పురుషులకు మల్లే custodian of caste హోదా లేదు కూడా. ఐతే ప్రత్యేకంగా దళిత స్త్రీలు దేవదాసీ వ్యవస్థ, వేశ్యా వృత్తి లాంటి అంశాల్లో వాళ్ళు సామాజిక పురుష వ్యవస్థ దురహంకారానికి గురౌతారు. అది కూడా వారి కున్న కుల నేపథ్యం వలన వచ్చిన సమస్యనే.

కుటుంబం లో బ్రాహ్మణియ పితృస్వామ్యాన్ని ఎదుర్కోకుండా కుటుంబం ప్రక్షాళన కానేరదు. అందుకు కుల వ్యవస్థ మీద స్పృహతో మెజారిటీ హిందూ దేశమైన ఇండియాలో ఉన్న ప్రస్తుత కుటుంబ వ్యవస్థను సమూలంగా అర్థం చేసుకోకపోతే స్త్రీ వాద దృక్పథం పూర్తి తనాన్ని నింపుకోలేదు. నిర్భయ కోసం పోరాటం జరిపిన ప్రతి ఒక్కరు, మరో నిర్భయ పుట్టరాదు అనుకుంటే, పూలన్ దేవిల కోసం కూడా పోరాటం చేయాల్సి ఉంది. ఆ క్రమం లో కుల రహిత దృక్పథం normative గా మాత్రమే అర్థం కావడం కాక, pragmatic గా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. కుటుంబ వ్యవస్థ పునాదులు లోతు తెలుసుకోవాలంటే ఇదో condition precedent

ఈ దేశం లో ఎవరి కులం ఏదో తెలియక మొత్తంగా కలగా పులగమైపోయి, ఏ సాంప్రదాయం విలువ దేనికో గుర్తు పట్టలేనంత సాంస్కృతిక కల్మషం వచ్చేసాక కుటుంబ వ్యవస్థ ప్రక్షాళన స్త్రీ విముక్తి దిశగా వెల్తుందా లేదా అన్నది అర్థం కాకుండా ఎలా పోతుంది ?

                                                          – పి. విక్టర్ విజయకుమార్

( Note : సంస్కృత పదాలు వాడ్డం నివారించడానికి తప్పని సరిగా, సరి అయిన భావన కోసం, ఇంగ్లీషు పదాలు వాడ్డం జరిగింది. వ్యాసకర్తను pvvkumar@yahoo.co.uk లో గాని ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా గాని సంప్రదించ వచ్చు )

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

పురుషుల కోసం ప్రత్యేకం, వ్యాసాలుPermalink

4 Responses to ఫెమినిజం – కుటుంబం – కులం

 1. mercy margaret says:

  మంచి వ్యాసం విక్టర్ విజయ్ కుమార్ గారు .. చాల ప్రశ్నలు , అంశాలు ఆలోచిన్చేవిగా వున్నాయి ..

  • p v vijay kumar says:

   I am glad that u liked it. There needs to be even more comprehensive debate that should happen in respect of feminism.

 2. ఒక్క హిందువుల్లోనే కాక ,ముస్లిం,క్రైస్తవ సమాజాల్లో కూడా ఈ పిత్రుస్వామిక సమాజ పద్ధతే ఇప్పటికీ కొనసాగుతున్నది కదా.దాన్ని గురించి కూడా రాయలేదేమి?వాళ్ళ అమ్మాయిలు ఇతర మతాల అబ్బాయిలని వివాహం చేసుకోడానికి ఒప్పుకోరు కదా.

  • p v vijay kumar says:

   అవునండి. మీ అబ్జర్వేషన్ కరెక్టే .
   ఈ వ్యాసం – కేవలం What is the condition precedent to understand the complete frame of patriarchy అన్న విషయం మాత్రమే చెబుతుంది. పితృస్వామ్యం కు వర్గ దృక్పథం కూడా ఉంది. అది ఈ వ్యాసం acknowledge చేస్తుంది. మన దేశం లో ముస్లిములలో ఉన్న ‘ బుర్ఖా ‘ పద్ధతిని అంబేద్కర్ తీవ్రంగా నిరసించాడు. అది కేవలం sexual insulation లా అభివర్ణిస్తూ, ఇస్లాం లో ఉన్న అప్రజాస్వామికతను despise చేసాడు. ఎన్నుకున్న context ఈ వ్యాసం కున్న పరిమితి వేరు కాబట్టి, అది టచ్ చేయలేదు.

   ఈ వ్యాసం ఏం చెబుతుంది అని చూస్తే ” అందుకు కుల వ్యవస్థ మీద స్పృహతో మెజారిటీ హిందూ దేశమైన ఇండియాలో ఉన్న ప్రస్తుత కుటుంబ వ్యవస్థను సమూలంగా అర్థం చేసుకోకపోతే స్త్రీ వాద దృక్పథం పూర్తి తనాన్ని నింపుకోలేదు. నిర్భయ కోసం పోరాటం జరిపిన ప్రతి ఒక్కరు, మరో నిర్భయ పుట్టరాదు అనుకుంటే, పూలన్ దేవిల కోసం కూడా పోరాటం చేయాల్సి ఉంది. ఆ క్రమం లో కుల రహిత దృక్పథం normative గా మాత్రమే అర్థం కావడం కాక, pragmatic గా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. కుటుంబ వ్యవస్థ పునాదులు లోతు తెలుసుకోవాలంటే ఇదో condition precedent ” అని మాత్రం చెప్పడానికి రాయబడింది తప్ప , ఈ వ్యాసం లో సమూలంగా స్త్రీ సమస్యను ఎదుర్కోవడానికి పూర్తి స్థాయి రాజకీయ సిద్ధాంతాన్ని కాని, ఆచరణను కాని ఏదీ ప్రతిపాదించడం లేదు. ఈ వ్యాసం ఉద్దేశ్యం అది కాదు కూడా.

   Please feel free to reach me for any further clarifications