రెండు గోతులు(కథ) – కాత్యాయనీ విద్మహే

కొండలంటే నాకు చాలా ఇష్టం.అమ్మ బంగారు కొండా అని నన్ను ఎత్తుకొని ముద్దులాడినప్పుడు బంగారం అయితే నాకు తెలియదు కానీ మా ఇంటి వెనుక కొండ మాత్రం నా కళ్ళల్లో నిలిచిపోయింది. ఆ కొండను,కొండ మీద చెట్లను,చెట్ల మీద పిట్టలను, చెట్ల వెనుక కదిలే చందమామను చూపిస్తూనే కదా అమ్మ నాకు గోరు ముద్దలు తినిపించింది…

ఆరు బయట మంచం మీద పడుకోబెట్టుకొని నాయనమ్మ చెప్పిన కధలలో విన్పించే కొండలను కదిలే మబ్బులలో వెతుక్కుంటూ నిద్రలోకి జారిపోయే నాకు కలల్లోనూ కొండలే ….. పొద్దున్నే లేచి కుంపటి ముందు కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లాడుకొనే అమ్మకు, బామ్మకు మధ్య చోటు చేసుకొని కొండల కలల గురించి చెప్తుంటే … మురిపం గా వినటం , నవ్వటం నాకు బాగా గుర్తు .

నా బాల్యాన్ని ఆవరించుకుని కొండల చుట్టూ ఎన్నో ప్రశ్నలు , సందేహాలు . కొండంత అండ అంటే భద్రత అని,రక్షణ అని బామ్మవల్లె తెలిసింది . కొండ నా గుండెలో ఎత్తుగా స్థిరపడింది. కొండ అద్దమందు కొంచమై ఉండదా అని బడిలో పంతులు చెప్పిన పద్యం లోని మాట నన్ను తికమక పెట్టినప్పుడు బామ్మే చెప్పింది… సందర్భాన్ని బట్టి ఒదిగి ఉండే తత్వం గొప్పదని, అద్దాన్ని బట్టి కొండ చిన్నదిగా ఉన్నట్లు కనిపించటం ఆ ఒదిగి ఉండే సంస్కారానికి గుర్తు అని ,అలాగే చిన్నది గా కనిపించే దానిలోని గొప్పతనాన్ని విస్మరించకూడదని చెప్పటం ఆ మాటల సారమని బామ్మ చెప్పినప్పుడు కొండ అంటే గొప్ప జీవిత విలువ అని నాకు అర్ధమైంది .

కొండలెక్కుతున్నట్లు తరచు వచ్చే కల గురించి చెప్పినప్పుడల్లా ,మంచిదేలే అన్నిటా పైకొస్తావ్, అనుకున్నది సాధిస్తావ్ అని నాకు జీవితకాలపు లక్ష్యం గా అధిరోహించాల్సిన కొండను చూపిన అమ్మ, బామ్మ ఈ రోజు లేరు కానీ కొండ మాత్రం వాళ్ళకంటే ముందూ ఉందీ ,వాళ్ళ తరువాత కూడా చెక్కు చెదరకుండా అలాగే ఆకాశం లోకి సాగిన శిఖరాలతో నిటారుగా నిలబడే ఉంది .
అనాది అయిన కొండ ఇప్పటికి ఎంతమందిని చూసిందో కదా ! ? కొండ పాదాలముందు మోకరిల్లితే పూర్వీకులు తల నిమిరిన అనుభవం ….. లేలేత సూర్య కిరణాల మెరుపుతో పసిడి వర్ణం పులుముకుంటున్న కొండల నిగనిగలు ప్రవాహంగా కదలిపోతూ నాలో ఏవో పురా స్మృతులను మేల్కొల్పుతుంటే మౌనంలో ధ్యానంలో మునిగిపోయాను .
విద్యార్థులు గోల గోలగా వేసే ప్రశ్నలు ,డ్రైవర్ నూకరాజు ఉత్సాహంగా ఇచ్చే జవాబులు ఏ లోకం నుండో వినబడుతున్నట్లు ఉంది.
నూకరాజు ఈ ప్రాంతపు వాడేనట . ఒకదాని తరువాత ఒకటిగా దాటిపోయే వూళ్ళతో తన అనుబంధాన్ని చెప్తున్నట్లున్నాడు . ఇది బూసుపురవండి .. మా ఊరేనండి, మాకు బూవుందండి ,పంట తీత్తావండి … అని ఏవేవో చెప్తూనే ఉన్నాడు . బండి మలుపు తిరగాగానే కాస్త వేగంతగ్గించి అటొకటి ,ఇటొకటి ధీర గంభీరంగా నించున్న కొండలను చూపుతూ ఇది గాలి కొండండి , అదిగో అది రక్త కొండండి … అని చెప్తుంటే అతని మాటల్లోని కొండ నన్ను పూర్తి గా ఈ లోకం లోకి తెచ్చేసింది .

కొండా? ఏం కొండా? పేరు భలే ఉందే … ఒకసారి బండి ఆపు ..అని తొందర పెట్టాను . గాలి కొండ మొదట్లో వాన్ ఆపాడు . అందరూ వాన్ దిగి పంజరం వదిలిన పిట్టల్లా ప్రకృతిలో భాగమయ్యారు .అరకు లోయలో ఔషధ మొక్కల సర్వేకి బయలు దేరిన పరిశోధక విద్యార్ధి బృందమది . మేడం … ఈ కొండ మీదే ఔషధ మొక్కల జాడ చూడొచ్చు కదా! అని హరిత అన్నదో లేదో అందరూ అవును ,అవును ,ఎక్కుదాం ,ఎక్కుదాం ,చూద్దాం,చూద్దాం .. అని ఉత్సాహపడ్డారు . సరేననుకొని కొండ ఎక్కటం ప్రారంభించాం . నూకరాజు కూడా బండిని ఒక పక్కకు పార్క్ చెసి వచ్చి మాతో కలిసాడు .

వస్తూనే చెట్ల పోదలనుండి గట్టి కొమ్మలు విరిచి తలా ఒకటీ ఇచ్చాడు . కర్ర పోటుతో నడిస్తే ఎక్కటం సులువని చెప్పాడు . చెట్ల మధ్య నుండి దారి చేసుకొంటూ నడుస్తుంటే ఎందరెందరి అడుగు జాడుల్లో నేను నడుస్తున్నానో కదా అని గొప్ప ఉద్వేగం కలిగింది . కొండ ఎక్కుతుంటే కాలికింద రాళ్ళు బెసగి కాలు జారినప్పుడల్లా పట్టుకొనటానికి దారి పక్క నిలిచిన చెట్లు వేలు పట్టి నడిపించే అమ్మలాగ అనిపించాయి . కొండగాలి చెవిలో కధలు చెప్తున్నట్లు సన్నగా రొద పెడుతున్నది .

మేము వచ్చిన పని తెలిసిన వాడు కావటం వల్లనో ,తనకు కొండతో ఉన్న అనుబంధం వల్లనో నూక రాజు దారి పొడుగునా చెట్లను మాకు పరిచయం చేస్తూనే ఉన్నాడు. ఇది తెల్ల తుమ్మండి ,దీని కాండం ముద్దగా నూరి పసుపుతో కలిపి గాయానికి రోజుకు రెండు తూర్లు రాస్తే యిట్టె తగ్గి పోద్దండి… అతను చెప్తుంటే మావాళ్ళు నోట్సు రాసుకొనే వాళ్ళు రాసుకుంటున్నారు మరికొందరు ఆకులు,పూలు,కాయలు, కొమ్మలు,కాండం భాగాలు -సేకరిస్తూ భద్ర పరుచుకుంటున్నారు.

ఉసిరిగ చెట్లకు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న కాయలు చూసి పిల్లలు వాహ్హ్ అని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అటు వైపు పరుగెత్తారు . కొంగు నడుముకు చుట్టిన ఆడమనిషి ఉసిరికచెట్టు కాయలు దులుపుతూ కనిపించింది. ఉసిరికాయలను గురి చూస్తూనే ఉరుకులు పరుగులు పెడుతూ కాయలు ఏరుతూ మెరుపువేగంతో వాటిని సంచులకు ఎత్తుతున్న చింపిరి తలల చిరిగిన బట్టల పిల్లలను , చెట్టు మొదట్లో మాసిన చీర మడతల పక్క మీద పోర్లాడుతున్న నాలుగయిదు నెలల పిల్లాడిని ఒక కంట కనిపెడుతూ హెచ్చరిస్తూ పలకరిస్తూ అష్టావధానం అవలీలగా చేస్తున్న ఆమె నా దృష్టిని ఆకర్షించింది . అది ముత్యాలండీ .. సీజన్ లో కొండెక్కి ఉసిరికాయలు దులుపుకొని దిగువన అమ్ముకుంట దండీ.. అని నూకరాజు పరిచయాలు ప్రారంభించాడు . ‘కొండకు షికారు కొచ్చినారేటి చదూకున్న బాబులు,పాపలూ’ .. అని మాగుంపును ఉద్దేశించి ప్రశ్నిస్తూనే ‘ఎవమ్ముకోతమో బొట్టికాయలను కూడా కష్టపెట్టకపోతే గడవని బతుకులు’ అనియాష్ట పడుతూ నిండిన ఉసిరక సంచులు మూతులు బిగించి కట్టింది. ‘కాయలమ్ముకోవాల ,పోయి లో పిల్లిని లేపాల’ .. అంటూ చిన్న మూట కొడుకు నెత్తికి ఎత్తి కొంకికర్ర ,కొడవలి కూతురికి ఇచ్చిబిరీన నడవండి అని హెచ్చరించి ,ఈ ఆసరా కూడా ఎన్నాళ్ళు లే అని కొంగు తీసి కన్నీళ్ళతో పాటు మొహం తుడుచుకుంటూ పసిపిల్లవాడిని చంకన వేసుకొని నూకరాజు సాయంతో పెద్దమూట నెత్తికెత్తుకొని బలంగా అడుగులువేస్తూ కిందికి దిగుతూ ఆమె అక్కడ మిగిల్చిన విషాదం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమెకు నేనెలా ఆసరా కాగలను… !?

కొంకి కర్రతో కొమ్మలు వంచి ఉసిరికాయలు తెంపుతూ విద్యార్ధులలో కలిసిపోయాడు నూకరాజు . ఉసిరిగాయ నోట్లో వేసుకొండమ్మా దప్పి కాకుండా ఉంటది, అలసట తెలియదు అని నా చేతికి నాలుగు అందించాడు.ఉసిరికాయలు చప్పరిస్తూ పరిసరాలపై సారించిన చూపుకు బంగారు పసుపు వర్ణపు పూల చెట్టు పండుగ చేసింది . అది ఆకాష్ చెట్టు దానికాండం నూరి ఒక మోతాదు తింటే పక్షవాతం పారిపోవలసిందే అని నూకరాజు చెప్తున్న తీరు ఇతను మామూలు డ్రైవర్ కాదు అనిపించింది . ఆ కొండతో ,అడవితో అనాది సంబంధమేదో అతనికి ఉన్నట్లు అనిపించింది . ఇవన్నీ నీకెలా తెలుసు కుతూహలంగా అడిగాను.
కట్టలు తెంచుకున్న ఉత్సాహంతో అతను వాళ్ళ అమ్మమ్మ గురించి చెప్పాడు. చుట్టుపక్కల ఆమెకు తెలిసినంత వైద్యం మరెవరికీ తెలియదట . ఆమెది చిన్నప్పటి నుండి చెట్లవెంట తిరిగి ప్రకృతితో స్నేహం చేసిన జీవితమట . వేళ్ళ దగ్గరినుండి పూలు,కాయల వరకు చెట్లు తమను తాము ఆమెకు అర్పించుకున్నాయట. సమస్తం సర్వజనోపయోగానికే అని ఆమె చెవిలో ఊదాయట. అప్పటినుండి ఆమెకు ఏ చెట్టు ఏ జబ్బు కుదర్చటానికి పనికి వస్తుందో తెలిసిందట. ఎవరయినా జబ్బు అని వస్తే రోగ లక్షణాలు తెలుసుకొని కొండదేవతకు మొక్కి కావలసిన చెట్టును వెతుక్కుంటూ వెళ్లి ఆకులో,పూలో,వేర్లో ,కాండమో కావాలనో అడిగి తీసుకొంటున్నట్లు తెంపేతీరు బహు అందంగా ఉండేదని ,ఆమె వెంటపడి కొండలు, గుట్టలు అడవులు తిరిగిన తన బాల్యం గురించి చెప్తూ అతను మమ్మల్నిఒక మార్మిక ప్రపంచంలోకి తీసుకెళ్ళాడు. నల్లతుమ్మ చెట్టును చూపిస్తూ మళ్ళీ ఈ ప్రపంచం లోకి తీసుకు వస్తూ ఈ చెట్టు ఆకు పొడితో ఇక పిల్లలు పుట్టరనుకున్న ఆడవాళ్ళను ఎంతమందిని తల్లులను చేసిందో మా అవ్వ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. అవ్వ లేదు … అడవి మీద కొత్త పెత్తనాలు అవ్వకు వారసులను మిగల్చలేదు .. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్రయత్నంగా అతని చెయ్యి నాచేతుల్లోకి తీసుకున్నాను. అవ్వ పట్టి నడించిన చేతులు కదా అవి !?

ఎడతెగకుండా మాట్లాడుతున్న నూకరాజు అనాయాసంగా పైపైకి పోతున్నాడు . అతనితో పోటీపడలేక మా విద్యార్ధులు గసపోస్తున్నారు . అక్కడక్కడా పశువులను మేపుకొంటున్న వాళ్ళు ఎదురవుతుంటే నెమ్మదిగా నడుచుకుంటూ సమతల ప్రదేశానికి చేరాం. ఎదురుగా పక్కపక్కనే రెండు పెద్ద పెద్ద గోతులు ప్రత్యక్షమయ్యాయి . ఒక్కసారి గుండె ఝల్లుమన్నది . కాస్త ఏమరుపాటుగా ఉంటే వాటిల్లో పడటం ఖాయం.దిగ్భ్రాంతి నుండి తేరుకొంటూ పిల్లలు గోలగోలగా మాట్లాడుతున్నారు. వాటిలోతెంత ఉంటుందో ఊహించసాగారు. చతురస్రాకారంలో సమంగా తవ్వబడిన ఆ గోతుల చరిత్ర గురించి అందరిలోనూ కుతూహలం . అక్కడ చేతికర్ర పై రెండు చేతులూ పెట్టి దానిపై గడ్డం ఆన్చి-కొండలోకి వెళ్ళు తన్ని ఆకాశంలోకి తలయెత్తిన మహా వృక్షం లా- ఏవో తాత్విక లోకాలలోకి కళ్ళు తెరుచుకొని నిల్చుని వున్నఆయన అడుగో సత్తెం తాత …. ఈ కొండ సంగతీ ,ఈ గోతుల సంగతి అడక్కుండానే పురాణం ఇప్పుతాడు ,ఇనుకోండి అన్న నూక రాజు వైపు పలకరింపుగా చూసాడు . .ఈ చుట్టుపక్కల నీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా నూకరాజు అని అతనితో నేస్తం కలసిన సింహాద్రి సరదాగా అడిగాడు . ఇప్పుడంటే ఆ బండి చక్రం తిప్పుతూ బతుకు తెరువుకు పట్నందారి పట్టాడు కానీ వాడు ఇక్కడి కొండల్లో కోతికాదూ అని మురిపెంగా అన్నఆ పెద్దాయన స్వరంలో విషాదం వినిపించకపోలేదు.
ఇంతకూ ఈ గోతులు ఎవరుతవ్వారు? ఎందుకు తవ్వారు అన్న నా ప్రశ్న పూర్తయిందో లేదో ఎవరు తవ్వుతారు తల్లీ ముఖం ముందు ఇచ్చకాలు చెప్పెవోల్లు ఎనకమాల గోతులు తవ్వుతారు . దేశం కానివాడూ తవ్వాడు .. మనవాడు అనుకున్నవాడూ తవ్వాడు . ఈ కొండల్లో దొరికే బాక్సైట్ రాయి కావల వాళ్లకు- అంటూ అరవై ఏళ్ళు పైబడ్డ ఆ పెద్దమనిషి ఒక విషాద ఇతిహాసమై ప్రవహించాడు .

ఎంత లోతుకు తవ్వితే ఎంత దొరుకుతుందో దాని గుణం ఏమిటో తెలుసుకోవాలని ఎప్పుడో ఇంగ్లీషువాడు పెద్ద గొయ్యి తవ్వాడని మా తాత మా నాయనకు చెప్పాడంట … మానాయన చెప్పంగ నే విన్నా .అదిగో అదే ఆ గొయ్యి చెయ్యిపెట్టి చూపించాడు . వాడంటే మన సంపద దోచుకోనీకే వచ్చే . దోచుకోనేవాన్ని సాగనంపి దేశం ఏలిన మనోళ్ళు కూడా మన వెనక గోతులు తవ్వబట్టిరి. వాళ్ళ భరతం పట్టాలని సంగం పెట్టిన సత్తెమన్నను కాల్చి చంపిరి. సంగం బాయె .. అడిగేవాళ్ళు లేరనుకున్నారేమో …. మల్లోకసారి నా కళ్ళముందే … మన కొండలలో బాక్సైట్ మీద కన్నేసి తవ్వీసి నారు నాయనా ఇదిగో ఇదే ఆ గొయ్యి. కొండన్నాక కాయకో, కట్టెకో,ఎక్కని వాళ్ళుండరు . పశువులను మేపటానికి రాని వాళ్ళుండరు. ఈ గోతులు ఎందరు మనుషులను ,ఎన్ని పశువులను పొట్టన పెట్టుకోన్నాయో ….ఇవి సంపద బావులు కావు అవి మా దుఃఖపు బావులు . కొండ కింద సాగు భూములను, కొండ సంపదను … జాతినీ కాపాడుకొనటం ఎట్లా అన్న ఆరాటం ఇంటిదగ్గర నిలబడ నీయవు . పశువులను తోలుకొని కొండకు రాకపోతే ఊపిరి ఆడదు .

గోతులు తవ్విన వాళ్ళిప్పుడు మనల్ని గోతిలోకి తోసీడానికి. మళ్ళీ లేవకుండా కప్పీ టానికి సిద్దపడుతుంటిరి.. దెబ్బ కాచుకోటమే కాదు ఎదురుదెబ్బకు తయారు కావాలే. కొండలు పోతే ,కొండలమీద సాగు పోతే,చెట్లు చేమ సర్వనాశానమైతే అడవి మనుసుల బతుకు ఎల్లమారేదేట్లా? కొండలు తవ్వి మా పీనుగులమీంచీ సంపదలు దేశాలు దాటిస్తాం అంటే ఉరుకునేదేట్లా నాయనలారా ?నా మోర ఎవరికి ముట్టాలే ? ఎవరుతీసిన గోతిలో వాళ్ళే పడతారంటారు. అదెప్పుడు? ఎట్లా?
గోతులలో పడిపోకుండా హెచ్చరిక, గోతులు తీసే శక్తుల గురించి హెచ్చరిక ఇచ్చి నడిపించే వాళ్ళకోసం ఎదురు చూపులు నావి బిడ్డలారా ! అంటున్న ఆయన ఆక్రోశం లక్ష్యానికి అడ్డుగా ఉన్న కొండను తవ్వటానికి పూనుకొన్న వంటరి వృద్ధుడిని గుర్తుకు తెచ్చింది.ఎన్నో జీవితాలకు అండఅయిన వనరుల కొండను తవ్వకుండా అడ్డుకొనే శక్తుల ఆవాహనకు తపస్సు చేస్తున్న ఋషిలా తోచాడు .అడవులలోకీ ఆదివాసీ జీవితాలలోకీ చొచ్చుకు వస్తున్న బహుళజాతి సంస్థల తో కొత్త యుద్ధానికి సత్తెం తాత ఇస్తున్న ఆ పిలుపు గాలికొండపై సుడిగాలి అయి హోరెత్తింది . నూకరాజు మొదలంటా కదిలిపోతున్నాడు. అతని పెదవులు దాటి గాలి కొండ దళం తయారైతున్నదిలే అన్న మాటలు గాలిలో తేలి పిల్లలను నన్ను చుట్టేసాయి . ఆ గాలి తాకిడి కి ఎవరిమూలాలైనా కదలక తప్పదు .

-కాత్యాయనీ విద్మహే 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , Permalink

Comments are closed.