ఎలుగు బంటి (కథ ) – విజయ భండారు

ఏందే రాజక్క నువ్వు రావా ఏంది? అవతల సత్తెమ్మ బిడ్డ యాదమ్మది పెండ్లిటైం అవుతావుంటే! అంటూ తలదువ్వుకుంటూ ఒడిలో కొడుకుకు పాలిస్తున్న రాజమ్మను పలుకరించింది పక్కింటి కమలను. రాజమ్మ తన తెల్లని పలువరుస మెరిసేటట్లు నవ్వుతూ ఎందుకురానే కమలా? ఈ పోరడు అరగంటసేపు నుంచి వదులతలేడు అంటూ తలముడిచి ఒళ్ళోపడుకొని పాలుతాగుతున్న సాయిలును లాగి పక్కన కూర్చోబెట్టింది .

ఏందక్కా మరీ యిడ్డూరం కాకపోతే! మూడేళ్ళు నిండిన పోరాడుకి గా పాలిచ్చుడేంది? నాలుగు తన్ని మనూళ్ళో గవర్నమెంటు బడికి పంపక… మస్తు గార్వం చేస్తున్నవు? నీవు గిట్లనే వాడికి ఇంకా పాలిస్తవుంటే రేపు వాడు పెరిగి పెద్దోడై కనబడిన ఆడోళ్ళ పై ఎదలవైపే చూస్తడు తెలుసా!…. కోపంగా అంది కమల. ఎన్ని ఏశాలేసినా ఈ పోరడు ఇడుస్తలేడే కమల… మానేద్దామని ఎంత ప్రయత్నం చేస్తున్ననో ఆ భగంతుడికే ఎరక… అయిన ఈడి సంగతి తర్వాతగాని జరసేపు కోచో చీర మార్చుకొని వస్తా!… అంటూ లోపలికి పోయింది రాజమ్మ….

కమల, రాజమ్మ, ఈరవ్వ, వరమ్మ నలుగురు కల్సి రాములోరి గుడికి పోయేటపప్పికి పెండ్లి పందిర్లో బాజాలు యినిపిస్తున్నయి. పందిలోకి పోయి చూస్తే ఎక్కడా ఒక్క కుర్చీ కూడా కానరాలే. దూరం నుండి వాళ్ళని చూసిన యాదమ్మ తల్లి ఎల్లవ్వ పెండ్లి మండపం దగ్గరికి రమ్మని సైగ చేయటంతో అటువైపు కదిలారు.

పెండ్లి కొడుకు బగు ముచ్చటగున్నడే కమలా యాదమ్మ మస్తు అదృష్టమంతురాలు… దానక్క వరలచిమి మొగడు ఎంకన్నలా తాగుబోతు కాకుంటే చాబాలు బిడ్డ పట్నంలో సుఖబడ్తతి అంది ఈరవ్వ. ఎమో… అక్క ఎవరు చూడొచ్చారు? మనువాడే ఓడు మంచోడో! కాదో! ఎా్లతెలుస్తది? రూపుచూసి తెలుసుకొనుడే అయితే మన ఆడోళ్ళకు తాగుబోతులు, తిరుగుబోతులు, లత్కరోళ్ళు, బద్మాషుగాళ్ళు మొగుళ్ళే… ఎందుకౌతున్నరే!! కమలా!… అంటూ నవ్వింది రాజమ్మ.

అదిగాదే… ఈరవ్వ! మొగుళ్ళందరు నా మొగుడోలే మంచోడైతే… కల్లు దుకాణాలు, సారా కాంపౌండులు, లిక్కరు షాపులు ఎట్లనడుస్తెయే? ప్రభుత్వానికి పాపం ఆదాయం పోలస్తదే!… ఎక్కిరింపుగా అంది కమల. ఏ!! మీ ముచ్చట్లు పాడుగాను ఇందాకట నుంచి ఇంటున్న… మొగుళ్ళ ముచ్చట్లు మాడ్లానీకి వచ్చిండ్రా! పెండ్లి చూడానికి వచ్చిండ్రా…. వాళ్ళ మాటలు విన్న నర్సింలు కసురుకున్నడు వాళ్ళను చూసి.

నర్సింలు ఆవూరి ప్రసిడెంటు. నాలుగెకరాలు చేనున్న ఆసామి. ప్రతి సారి ఎవరి పోటి లేకుండా 20 సం||లుగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడుతున్న మంచి మనిషి. ఎవరిని యీసమెత్తు మాట అనడంగాని, వాళ్ళపై పెత్తనం చేయడంకాని ఎరుగడు. ఆయన భార్య భారతమ్మ చదువుకున్న ఇల్లాలు. తన ఇద్దరాడపిల్లల్ని పట్నం పంపి చదివిస్తున్నడు. ప్రతి పండుగ సెలవులకు ఆడపిల్లలు ఊరికి వచ్చిపోతుంటరు. నర్సింలుకు ఆడోళ్ళు పరాచకాలాడుడంటే అసలు గిట్టదు. ఆడోళ్ళు తెలివిగా వుంటే మొగుళ్లెందుకు చెడుదారులు తొక్కుతరు? అంటూ ఎద్దేవా చేస్తుండు. ఎవరన్నా ఆడోళ్ళు ఎదురుచెబుతే… చాలు… కస్సుమని రంకెలేస్తడు. అతనున్న చోటకి ఆడోళ్ళు ఎళ్ళానికి భయపడతరు. అందుకే… అతన్ని తప్పుక తిడుతుంటరు ఆవూరి ఆడోళ్ళు.
యాదమ్మకు మూడు తులాల బంగారం, పదివేల రూపాయలు కట్నం. అల్లుడికి ఒక హీరో హోండా బండి, చేతికి వాచి ఏలికి ఉంగరం, కాపురానికి బోలెడు బాసన్లు పెండ్లికి కొనిచిండ్రు యాదమ్మ తల్లిదండ్రులు. అల్లుడు పట్నంలో తమ బిడ్డను కళ్ళళ్ళో పెట్టుక చూసుకుంటడని చుట్టరికంలేకున్నా దూరం సంబంధమైన ధైర్యంగా చేసిండ్రు. పెద్ద కూతురు తలరాత బాగలేక తాగుబోతు మొగుడు దొరికుండు. చిన్నల్లుడు నాగేషన్నా… మంచిగుంటే… చాలు అనుకుంటూ యాదన్నను పట్నం కాపురానికి సాగనంపిండ్రు. అందరు కలిసి.

మొదటి సారిగా పట్నం బోయిన యాదమ్మకు మొగడు రోజు సాయంత్రాలు తోల్కబోయి అన్ని బజార్లు చూపిస్తుంటే… తన అదృష్టానికి మురిసిపోయింది. అత్తమామలు కూడా కోడల్ని ప్రేమగా చూస్తున్నరు. తన అక్కలాకాక తన బతుకు మంచిగుందని యాదమ్మ తెగ సంబరపడిపోతోంది.

పక్కింట్లో ఉండే ఆడబిడ్డ పొద్దనక, రాత్రనక తనింట్లోనే ఎందుకుంటుందో అర్థం గాలేదు యాదమ్మకు. ఆడబిడ్డ మొగడు లారిడ్రైవరు డ్యూటీ చేస్తడు… ఏ అమాసకో! పున్నమికో భార్య దగ్గరికి వచ్చిపోతడు… ఇంకా పిల్లా-పాపలు లేకపోవడంతో… తనపైన పెత్తనం చేస్తూ లేనిపోని గిల్లికజ్జాలు సురూచేసింది నాలుగు రోజుల్లోనే!

తనపైన సాడీలు అత్తమామలకు చెప్పటమేకాక మొగుడిని కూడా చెప్పటంతో యాదమ్మకు ఏంచేయాలో పాలు పోలేదు. పెండ్లై వారం పదిరోజులు అయిందో! లేదో! మొగుడు రాత్రుళ్ళు తాగిరావటం… బూతులు తిట్టటం షురుచేసిండు. పదిహేను రోజులు అయ్యేటప్పికి యాదమ్మ తనలోతాను కుంచించుకుపోసాగింది. పదహార్రోజుల పండుగకు అల్లుడ్ని, బిడ్డను ఊరికి తీసుకపోతమని వచ్చిన తల్లిదండ్రులను చూసిన యాదమ్మ బోరున ఏడ్చింది. ఏడ్చే కూతుర్ని ఓదార్చిండ్రే కాని… కారణం ఏందని… అడగలేకపోయిండ్రు వాళ్ళు. యియ్యపుడ్ని, యియ్యపురాల్ని, బిడ్డని, అల్లుడ్ని తోలుకపోతం పంపమని అడిగిండ్రు… వాళ్ళెంత బతిమాలిన ఇప్పుడు పంపం రెడ్నెల్లాయినాక దసరా సద్దులకు పంపుతం… మీరుపోండి అంటే… ఇంక ఏంచేయలేక యాదమ్మ తల్లిదండ్రులు మారు మాట్లాడకుండా ఎళ్ళిపోయిండ్రు.

ఒక రోజు యాదమ్మ పక్కిం సుగుణతో బయటకు పోయింది. దాంతో మొగుడికి కోపం నశాలం అంటింది . యాదమ్మ తిరిగొచ్చేటప్పికి, ఆమె పెట్టెలో దాచుకున్న కొత్త చీరలన్నింని కుప్పబోసి అగ్గిపుల్ల గీసిండు. యాదమ్మ లబోదిబోమన్నా, అన్నీ మసి అయిపోయేదాక పైశాచిక ఆనందాన్ని ఆస్వాదించి… కల్లు దుకాణానికి పోయి పుల్లుగా తాగి ఇంికి వచ్చి నీవు ఈ రోజు నాకు చెప్పకుండా బజారుకుపోయినవు కదా… అందుకే… కాల్చేసినా… మళ్ళీ ఇట్లనే నాకు తెలియకుండా బయటకుపోయినవనుకో! నిన్ను… అలాగే తగులేస్తా… అంటూ… చేతులు నొప్పిపుట్టేంతవరకు నిద్రపోయిండు నగేషు.
యాదమ్మకు ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగుతలేదు. నెలరోజుల్లోనే పెండ్లంటే, మొగడంటే రోతకొచ్చింది. తల్లిగారింకి పోతనంటే పోనీయడు. మంచిగుండా అంటే! అదీ లేదు. ఏ పని చేసినా… అమ్మా, అయ్యా, చెల్ల మాట బట్టుకొని తనను కొడుతుండటం భరించలేకపోతోంది… ఇల్లొదిలి పారిపోదామని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది . ఫలితంగా నగేష్ కొట్టిన దెబ్బలకు తలపగిలింది. ఏసుకున్న నైటినీ చింపి నానా యాగిచేసిండు… కారుతున్న రక్తాన్ని… చిరిగిపోతున్న మనసును కూడగట్టుకొని రోజులు ఎళ్ళదీస్తోంది. పోనీ… తల్లిదండ్రులకు కబురంపుదామా! అనుకుంది… అక్క కాపురం గురించే మస్తు తండ్లాడుతున్న వారికి తనసంగతి తెలిసి ఇంకా కృంగిపోతరు… ఎట్లరా దేవుడా! అని కనిపించని దేవుడికి దండాలు పెట్టుకోసాగింది.

రెండ్నెల్లు అయినాక ఓ రోజు యాదమ్మ తండ్రి బిడ్డను, అల్లుడ్ని దసరా పండుగకు తోలకపోనికి వచ్చిండు… నగేష్. రెండురోజులైనాక నీ బిడ్డను తోల్కొని నేనే వస్త నువు ఎళ్ళిపో అని అనటంతో ఉట్టి చేతులతోటే ఎనక్కుమళ్ళిండు యాదమ్మ తండ్రి హనుమాండ్లు. రెండు రోజులైనాక ధైర్యాన్ని కూడగట్టుకొని మొగుడ్ని తన పుట్టింటికి తోలుకపొమ్మని అడిగింది యాదమ్మ. ఏ మొగాన ఉండడో సరే తయారవు.. బాగాలేదు… మా దోస్తు తోల్కనివస్తా… అని బయటకు పోయిండు నగేష్. తల్లిగారింకి పోతున్నాన్న సంబరం… యాదమ్మను మనసు నిలువనిస్తలేదు. కొడుకు-కోడలు తమరిని ఒదిలేసి ఒంటరిగా పోవటం చూసిన ముసలోళ్ళకు… ఆడబిడ్డకు… లోపల కోపమున్నా… ఏమి మట్లాడకుండా వుండటంతో యాదమ్మ మనసు జర నెమ్మదించింది. బస్సులో పోదామన్నా… ఇనకుండా మొగడు తల్లిగారింటికి తోలుకపోవుడు యాదమ్మను మనసు పరిపరి విధాల ఆలోచింపచేస్తోంది.

పట్నం నుండి తమ ఊరికి పోవాలంటే మధ్యలో చిక్కని అడవి కుండా పోవాలి. ఒక్కొక్కసారి అడవిలోని జంతువులు రోడ్డు మధ్యలో నిలబడి గడబిడి చేస్తయి. ఒకసారైతే! అడవిలోంచి పెద్దపులి రోడ్డుమీద బండిపైన పోతున్న భార్యభర్తలిద్దరిని బలితీసుకుందని… తన ఊళ్లో చెప్పుకుంటే విని వుండటంతో భయపడింది… అడవిలో మొగడేమైనా చేస్తే! మనసు శంకిస్తున్నా ఆటో  నడిపే డ్రైవరు ఉన్నడులే! అని సరిబెట్టుకుంది ధైర్యంతో ఒక నిశ్చయానికి వచ్చిన యాదమ్మ. అడవి మధ్యకు రాగానే ఆోని ఆపమని మగడ్ని వేడుకుంది. ఆపటంతో దిగిన యాదమ్మ మగడిని తనకు తోడుగా రమ్మనంది. మొహమాటంగా నగేష్ ఆమెను అనుసరించాడు. యాదమ్మ గుబురుగా వున్న చెట్లమాటుగా మగడ్ని తోలుకపోయింది… ఎదురుగా ఒక్క ఉదుటున నేలమీద కనబడిన ఓ దుడ్డుకర్రను అందుకొంది. దాన్ని చూసిన నగేష్ మనసు కీడు శంకిస్తున్నా ఏందే!… యాది… మీ అమ్మకు పిండొంటలు వండనీకి గీకర్రను తీసుకపోతవా! ఏందే!… అంటూ తెచ్చిపోట్టుకున్న నవ్వుతో పరాచికమాడాడు. యాదమ్మకు… తిక్కరేగింది మగడు ఎక్కిరింపుకు ఒక్కసారిగా ముందునడుస్తున్న నగేష్ వీపు మీద ఆ దడ్డుకర్రతో ఒక్కిచ్చింది. మొగడు ఎనక్కి తిరగేలోపు మరొక దెబ్బవేసింది. ఒక్క ఉదుటున శివంగిలా లేచి మొగడి చొక్కాబట్టుకొని ఏది!.. ఇప్పుడు కొట్టరా… నా కొడకా! పెండ్లామంటే! నీకంత లోకువనారా? నిన్ను నీ తల్లి ఎలా కన్నదో! నన్ను నా తల్లి గట్లనే కదరా… కన్నది. నిన్ను మనువాడిన పాపానికి… నాకేందక్కిందిరా! గాడిదకొడకా!… నేనేం తప్పు చేసానురా! రోజు తాగొచ్చి నన్ను కొడుతున్నావు? చెప్పుడు మాటలు వింటూ నామీదే చేయిచేసుకుంటావా? పెండ్లాన్ని మంచిగా చేసుకోవటం రాని నీకెందుకురా పెండ్లి… నన్ను కొట్టే అధికారం నీకెవరిచ్చారురా!… అడదాన్ని మనువాడింది కొడితే పడుండానికే నారా! చావునా… కొడకా! నీవు చస్తే ముండమోయానికి నేను రడీగా ఉన్నారా! నా కొత్త బ్టల్ని తగులబెట్టి వికృత ఆనందాన్ని పొందావు కదరా!… ఇప్పుడు నీ బట్టలన్ని ఊడబెరికి తంతా! నన్నేం చేస్తావురా! కాళికలా… అరుస్తూ మరో దెబ్బ కొట్టింది . ఆమె గసను చూసి నగేష్ వణికిపోయాడు. యాదమ్మ మళ్ళీ విజృంభించి చెప్పరా! ఎదవా! మళ్ళీ నన్ను కొడతవా! కొడతవా! అంటూ మొగుడ్ని కిందపడేసి తన్నింది. కిందబడ్డ నగేష్ చేతులు జోడించి వద్దే యాది కొట్టోద్దే … ఇక ఆపవే!.. ఇక ఈ జన్మలో నీ జోలికి రానే! నీ మీద చేయిచేసుకోనే… నన్ను ఒదిలేయవే! చచ్చిపోతాను… అంటూ బతిమలాడసాగాడు.

ఏందిరా!… ఈ జన్మలో కొట్టనంటున్నావు మళ్ళీ జన్మలో కొడదామనుకుంటున్నావురా… అంటూ మళ్ళీ కర్ర ఎత్తింది… యాదమ్మ… వద్దే! వదిలేయవే! ఇక నిన్ను మంచిగ జూసుకుంటనే వదిలేయవే! అంటూ భార్య కాళ్ళుపట్టుకున్నాడు నగేష్. దూరం నుంచే వీళ్ళనే గమనిస్తున్న డ్రైవరును యాదమ్మ రమ్మని సైగచేసింది. డ్రైవరు యాదమ్మ కల్సి నగేష్ను పట్టుకొని వచ్చి ఆటోలో కూర్చోబెట్టారు . ఆటో కదిలి యాదమ్మ తల్లిగారు ఊరును చేర్చింది. ఆటో దిగుతున్న అల్లుడి అవతారాన్ని చూసిన అత్తా, మామ భయపడ్డారు. బిడ్డా! అల్లుడికేమైందే అని… కళ్ళతోనే యాదమ్మను ప్రశ్నించారు. ఏం లేదు అయ్యా! పట్నం నుండి మనూరుకి వస్తుంటే అడవిలో ఓ ఎలుగుబంటి ఎదురైంది. మీ అల్లుడు దాన్ని ఎదిరించానికి పోయాడు. దానికి మా ఆయనకు మధ్యన మస్తు గలాట జరిగింది. ఎలుగుబంటి తోకముడిచి పారిపోయింది. మా ఆయనే గెలిచినాడు అంది నవ్వుతూ…

యాదమ్మ మాటల్లోని అర్ధాన్ని గ్రహించిన ఆటో డ్రైవరు అవునూ…. నిజమే!… నగేష్లోని పురుష ఆధిపత్యాహంకారం అనే ఎలుగుబంటి నిజంగానే పారిపోయింది లేకపోతే ఆడదాన్ని అందులో కట్టుకున్న ఇల్లాల్ని వేధించి ఏడ్పించినోళ్ళకు ఎవరికైనా శిక్షపడాల్సిందే!… తప్పదు. తాగుడుమానేసి భార్యను తాను ఎప్పికి ఏ కష్టం రాకుండా, ప్రేమతో, గౌరవంతో చూసుకోవాలి. అందులోనే ఆనందం ఉంది… అనుకుంటూ అక్కడి నుండి నిష్క్రమించాడు ఆటో డ్రైవర్.

-భండారు విజయ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , Permalink

One Response to ఎలుగు బంటి (కథ ) – విజయ భండారు