మనిషి శరీరం ఓ యంత్రంలాంటిది . దానికి సరైన ‘ఇంధనం ‘ పడితేనే సక్రమంగా పని చేస్తుంది . లేకపోతే పని చేయనని మొండికేస్తుంది . ఇక్కడ ‘ ఇంధనం ‘ అంటే ఆహారం అన్నమాట . “తినేందుకు జీవించడం ‘ అని కాకుండా జీవించడానికి తినాలి అన్నది ప్రస్తుతం తారక మంత్రంగా మారింది .
ఎంత తింటున్నాం అనే దానిపైనే కాకుండా ఏమి తింటున్నాం అనేది కూడా ఆలోచించాల్సిన సమయమిది .
ఇక్కడ మీకు చిన్న కథ చెప్పాలి . ఒక చోట ఆరుగురు వ్యక్తులున్నారు . వారందరూ బాగా ఆకలితో మాడిపోతున్నారు . వారికి నాలుగు రొట్టెలు దొరికాయి . తినడానికి ఆహారం కావాలి అంటే ఆ నాలుగు రొట్టెలు ఒక్కడికి కూడా చాలవు . కాని బ్రతకడానికి తినాలి అనుకుంటే వాళ్లందరికీ సరిపోతాయి కదా !
ఏముంది అన్ని ఆ కడుపులోకి వెళ్లే వేకదా ? వేళకు ఏదో ఒక్కటి పొట్టలో పడేసుకుంటే చాలు అనుకునే రోజులు మన అమ్మమ్మ , తాతయ్య వాళ్లవి . కారణం అప్పటి వాతావరణం , సగటు మనిషి దినచర్య వేరు . ఇప్పుడు దానికి పూర్తిగా విరుద్ధం . మారుతున్న కాలం సాంకేతికపరంగా ఎంత ముందుకు దూసుకుపోతుంది , మనిషి ఆరోగ్యాన్ని , ఆయు ప్రమాణాన్ని అంతే వేగంగా వెనక్కి నెట్టేస్తుంది అనేది కూడా నిజం .
మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మానసిక ఆరోగ్యం కూడా స్థిరమవుతుంది . తను మాత్రమే కాదు తన చుట్టూ ఉన్న వారిలోనూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగేలా చేస్తాడు అనేది కొన్ని సర్వేలు చెబుతున్న వాస్తవాలు . ప్రస్తుత ఒత్తిడి జీవితాలలో పూర్తిగా కాకపోయినా ఒక కంట మీ ఆహారం గురించి , ఏమి తినాలి , ఎంత తినాలి , తినే వాటిలో ఏది ఉపయోగం , ఎలా తింటే శరీరానికి అందుతుంది అనే విషయాలతో పాటు ఆరోగ్యం ….ఆనందం …అందం …గురించి విహంగ చదువరులకు ఒక అవగాహన కోసం మీ ముందుకొస్తుంది “ మన చేతుల్లో మన ఆరోగ్యం “.
– అలౌకిక శ్రీ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఈ సమాచారము నాకు nachindi