ఎక్కడుందో …,
చిరునవ్వుల పాలపుంత,
పరిమళించే మది లోగిలి ,
భువిని చేరాల్సిన మేఘమాలిక ,
మీ కెవరికైనా కనిపిస్తే చెప్పండి ,
ఇక్కడ పూల వనాలు తగులబడుతున్నాయని ,
శిలాఫలకాలపై అక్షరాలు తిరగరాయబడుతున్నాయనీ,
ఎక్కడుందో..,
అప్పుడే వయసొచ్చిన ఆ వసంత మాలిక,
అంభరాన ఉన్న అమృత జల్లును
తన ఒళ్లంతా నింపుకొన్న ఆశల హరివిల్లు ,
మీకెవరికైనా కనిపిస్తే చెప్పండి ,
శిరస్సు మోస్తున్న కన్నీటి కుండలని దించటానికి రమ్మని ,
బతుకు బండకింద అంకురించని బీజాలై,
చిరుజల్లుకు వేచిఉన్న చిట్టి గులాబీలై ,
ఎడారి దారిన ఎదగని పల్లేరు ముళ్ళై ,
అనామకులై కాలం చెక్కిలిపై పుట్టుమచ్చలౌతున్నారని .
నీ చిట్టి చెల్లెళ్ళు నీకై ఎదురుచూస్తున్నారని చెప్పండి.
-మెరాజ్ ఫాతిమా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~