Nono – The Zig Zag Kid(సినిమా సమీక్ష )- శివలక్ష్మి

Director : Vincent Bal
Country : Netherlands, Belgium, U.K., Spain, France
Language : English,Dutch,French
Duration : 95 minutes
Age Group : 13 Years &above all age groups.

qqwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww

ఇతివృత్తం: . “జిగ్ జాగ్ కిడ్” అంటే సమాజం స్థిరీకరించిన ధోరణులనూ, మూస పద్ధతులనూ చేధించుకుని బయటికి వచ్చిన బాలుడు అని అర్ధం. 13 సంవత్సరాల నోనో అనే బాలుడి ప్రపంచం లోని గందరగోళాలు, భయాలు,ఫాంటసీల దృశ్యీకర ణే ఈ సినిమా! సాధారణంగా ఆ వయసు పిల్లల్లో ఉండే సాహస ప్రవృత్తి, సందేహాలు,ఉత్సాహం, దూకుడు,చమత్కారాల కలయికే ఈ చిత్ర సారాంశం.

నోనో తండ్రి జాకబ్ హాలండ్ లో ప్రసిద్ధ డిటెక్టివ్ గానూ, సమర్ధుడైన పోలీస్ ఇనస్పెక్టర్ గానూ ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. అతను మూడేళ్ళ వయసునుంచే తన కొడుక్కి అపరాధ పరిశోధక శిక్షణలో తర్ఫీదిస్తూ ఉంటాడు. నోనో కూడా తండ్రి లాగే గొప్ప పోలీస్ ఇనస్పెక్టర్ కావాలనుకుంటాడు.కానీ సరైన ఆలనా పాలనా, క్రమ శిక్షణా లేని పెంపకం వల్ల ఇష్టమొచ్చినట్లుండే అతని సహజ స్వభావం నోనోకి అడుగడుగునా అడ్డంకుల్ని తెచ్చి పెడుతుంది! ఇంకా రెండు మూడు రోజుల్లో 13 సంవత్సరాలు నిండుతా యనగా ఒకరోజు ఒక పార్టీలో అందరూ సరదాగా ఉన్నప్పుడు నోనో తన చిలిపితనంతో పార్టీ నింకా ఉత్సాహభరితం చెయ్యాలనుకుంటాడు. ఒక గొడుగుతో భవనం పైభాగం నుంచి కిందికి దూకేస్తాడు.ఆ దూకడం దూకడం ఒక పుట్టిన రోజు పార్టీ కేక్ మీద పడిపోతాడు. నోనో చేష్టలతో విసిగిపోయిన జాకబ్ నోనోని సరైన దారిలో పెట్టమని అతని మామయ్య ఎస్జెమోల్ ఇంటికి పంపిస్తాడు.
గాబీ అనే ఆమె జాకబ్ సెక్రటరీ మాత్రమే గాక ఆమే అతని గర్ల్ ఫ్రెండ్ కూడా! అతి చిన్న వయసులోనే అంటే ఒక సంవత్సరం లోపే తల్లి చనిపోవడం వల్ల, మానసికంగా నోనో తల్లి కోసం ఆరాట పడుతున్నాడని, అందువల్లే అతను స్థిమితంగా ఉండలేకపోతున్నాడని, అతని బాధని మొట్టమొదటిగా గుర్తిస్తుంది గాబీ.

తనకి తొలిగా తెలిసిన ఒకే ఒక స్త్రీ మూర్తిగా,మాతృప్రేమ నందిస్తూ పెంచిన తల్లిగా గాబీ అంటే నోనోకి చాలా గౌరవం,ఇష్టం కూడా.జాకబ్ గాబీ కలిసి నోనోకి ఒక రైలు ప్రయాణాన్ని ప్లాన్ చేస్తారు. జాకబ్ నోనో తో “నువ్వు పెద్దవాడివవుతున్నావు.గొప్ప ఇనస్పెక్టర్ కావాలంటే నిన్ను నువ్వు రుజువు చేసుకోవాల్సిన సమయం వచ్చింది.అందుకోసం నీకో పని చెప్తున్నాను. ఫలానా రైలు సెకండ్ క్లాస్ చివరి కంపార్ట్ మెంట్ కెళితే అక్కడ నీకోసం నీ టీచర్ ఎదురుచూస్తుంటాడని” చెప్తాడు. ఆ టీచర్ ఎవరో కాదు జాకబ్ కి అంతకుముందే తెలిసిన ఒక అంతర్జాతీయ దొంగ ఫెలిక్స్ గ్లిక్ అని నోనోకి తెలుస్తుంది.”నేను చెయ్యవలసిన పని ఏమిటి?” అని గ్లిక్ ని అడుగుతాడు నోనో .”నీకు చాలా అసాధారణమైన ఊహాశక్తి ఉంది కదా, నీ గ్రహణశక్తి తో తెలుసుకోమంటాడు” గ్లిక్ . నోనో పసివయసు నుంచీ “నా మమ్మీ ఎవరు?” అని అమ్మ గురించిన వేదనతో వయసుకి మించిన ఆలోచనలతో భారమవుతున్న తన మనసుని సమాధాన పరచుకోవడానికి ఒక చివరి అవకాశం తీసుకుని చూడాలనుకుంటాడు నోనో. నోనోకి తన బ్యాగ్ లో దొరికిన లెటర్ లో “లోలా కోరుకునేదేమిటి?” అన్న ప్రశ్నతో పాటు ఉన్న సందేశం ప్రకారం గ్లిక్ తో కలిసి నడుస్తున్న రైలుబండి నాపి ఇద్దరూ దిగిపోతారు. దారిలో నోనో ఒక్క తన తల్లి ఫొటో తప్ప ఆమె గురించిన గుర్తులేవీ తన దగ్గర లేవని గ్లిక్ తో చెప్తూ గ్లిక్ కి తల్లి ఫొటో చూపిస్తాడు. అది చూసిన గ్లిక్ ఈ పోలికలతో ఉన్న ఒక స్త్రీ నాకు తెలుసని నోనోకి చెప్తాడు. ఆ విధంగా వారిద్దరూ ఫ్రాన్స్ దక్షణ ప్రాంతానికి ప్రయాణిస్తూ రకరకాల ఎత్తుగడలతో దారి మధ్యలో రకరకాల మారువేషాలతో ఫ్రెంచ్ రివేరా వరకూ చేరుకుంటారు.

0000000000011111111111111111111

ఒకచోట లోలా సిప్ రోలా అనే ఒక గాయనిని కలుస్తారు. ఆమే తన తల్లి జోహార ని గురించిన సమాచారానికి సూత్రధారి అని తెలుస్తుంది నోనోకి! ఆమె ద్వారా నోనో తల్లి జోహార గురించిన కొన్ని రహస్యాలు తెలుస్తాయి! ఇక ఆ తర్వాత నోనో జీవితం పూర్తిగా మారిపోతుంది. పసి వయసునుండి పొందిన అపరాధ పరిశోధక శిక్షణ ఎందుకూ పనికిరాకుండా పోతుంది.తన వరసలేని స్వభావం ద్వారానే తన జీవితానికి సంబంధించిన నిజాన్ని బహు చాకచక్యంగా తెలుసుకుంటాడు నోనో!!

అతని తల్లికి సంబంధించిన ఒక మిస్టరీని అతను మాత్రమే చేదించగలడు. అదేమిటి? జోహార రహస్యమేమిటి? జోహారకి లోలా సిప్ రోలాకి ఉన్న సంబంధమేమిటి?ఈ ప్రయాణం నుంచి అల్లరి వాడైన నోనో తనకి తానుగా ఈ రహస్యాన్ని ఎలా కనుక్కున్నాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాల కోసం ప్రేక్షకులు ఎవరికివారే ఈ సినిమా చూచి తేల్చుకోవాలి.చెప్తే ప్రేక్షకులకి అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్లుంటుంది. రెప్పార్పకుండా సినిమాని ఆశ్వాదించాలనిపించదు. 90 నిమిషాల సినిమా 45 నిమిషాల్లోనే ఐపోయిందా అనే ఆశర్యకరమైన అనుభూతి లభించదు.

ఈ సినిమా డైరెక్టర్ విన్సెంట్ బాల్. బెల్జియం లో 1971 లో జన్మించిన ఇతను ప్రతిభావంతమైన రచయితే గాక సమర్ధుడైన దర్శకుడు. ప్రపంచ ప్రఖ్యాత ఇస్రాయెలీ రచయిత డేవిడ్ గ్రాస్మన్ రాసిన ఒక నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. రచన మూల సారాంశాన్ని ఏమాత్రం చెడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ,అద్భుతంగా దృశ్యీకరించాడు విన్సెంట్ బాల్ . స్వయంగా ఆయన కూడా బాల్యమంతా తండ్రికి దూరంగా, తండ్రి లేకుండా పెరిగాడు. స్వానుభవం సినిమా వాస్తవికంగా రూపు దిద్దుకోవడానికి దోహదపడింది. ఈ కాలపు పిల్లల్ని ఒక అందమైన గతకాలపు వీరగాధల అద్భుతలోకం లోకి చక చకా తీసికెళ్తాడు. ఊహించడానికి ఏమాత్రం అంతు చిక్కని మిస్టరీ ప్లాట్ తో వింత దూకుడుతో నడిపిస్తాడు డైరెక్టర్ బాల్. ఈ డచ్ చిత్రంలో క్లాసిక్ దోపిడీ గూఢచార థ్రిల్లర్ శైలిలో కనిపిస్తుంది. తప్పుడు గుర్తింపులు, కనురెప్పపాటులో తప్పించుకునే ధైర్యం- ఇవన్నీ ఒకదాన్నుంచి మరొకటి తృటిలో మారిపోతూ ఉంటాయి. పెద్దలు, యువకులు, టీనేజర్స్ ని వశం చేసుకుని పరవశింపజేస్తుందీ సినిమా! మరీ ముఖ్యంగా పిల్లలకోసం నిర్మించిన ఈ చిత్రంలో హీరో 13 ఏళ్ళ టీనేజర్ కాబట్టి ఆ వయసువాళ్ళందరూ ఈ చిత్రం లోని వినోదంతోనూ,సాహసక్రీడల తోనూ మమేకమవుతారు.

మృదువైన సంభాషణలతో నడిచే స్నేహపూర్వక మైన సినిమా. ఆద్యంతం హాస్యంతో కూడిన కుటుంబ కథా చిత్రం. చివర్లో కొంచెం తల్లి అనారోగ్య పరిస్థితి తప్ప మిగిలిన మొత్తం చిత్రం వినోదాత్మకంగా సాగుతుంది.
దిగ్భ్రాంతి గొలిపే సాహసాలతో సునాయాసంగా ప్రేక్షకులను ఆనందాల కేరింతలలో ముంచుతుంది.
మరో ధ్యాసలేకుండా పనిచేసే వ్యక్తి డచ్ పోలీస్ డిటెక్టివ్ తండ్రిగా ఫెడ్జా వాన్ హ్యూట్ (Fedja van Huet) చలాకీగా ఆశావాదిగా ఉండే అతని స్నేహితురాలు గాబీగా జెస్సికా జేల్ మేకర్, సాసీ (Jessica Zeylmaker, sassy), మిగిలిన మొత్తం తారాగణం తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక యూరప్ మొత్తంలో ప్రఖ్యాత నటిగా పేరు గాంచిన ఇసాబెల్లా రోసెలినీ(Isabella Rossellini) తన సినిమాలో లోలా సిప్ రోలాగా నటించడానికి ఒప్పుకోవడం తన అదృష్టమంటాడు విన్సెంట్

ముఖ్యంగా నోనో గా నటించిన థామస్ సైమన్ (Thomas Simon) అనుభవజ్ఞుడైన పెద్ద మేధావిలా అమ్మ కోసం అహర్నిశలూ ఆరాటపడే బాలుడిగా మనోహరమైన నటనలో జీవించాడు. దాదాపు 150 మంది పిల్లలను పరిశీలించి,ఇతని కళ్ళల్లో అనివార్యంగా కనిపించే విషాదాన్ని చూచి ఇతన్నే కధానాయకుడిగా నిర్ణయించానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు డైరెక్టర్ విన్సెంట్ బాల్.

నోనో భవిష్యత్తులో నాన్నలాగా కావాలనుకుంటాడు.కానీ అమ్మకోసం ఆరాటపడతాడు.చివరికి “నేను వాళ్ళిద్దరి కలయికతో ఆవిర్భవించిన ఇంకో మనిషిని.నా జీవితాన్ని నా ఇష్ట ప్రకారం నడిపించుకోవచ్చు” అనే ఆశావహ దృక్పధాన్ని తనకి తానుగా ఎవరూ ఏమీ చెప్పకుండానే ఏర్పరచుకుంటాడు.
మంచి,చెడులను గురించిన అత్యంత ప్రాథమికమైన ప్రశ్నలను అన్వేషించే క్రమంలో తెలివిగా, నేరుగా అన్ని వయసుల వారితో మాట్లాడటానికి ప్రయత్నిస్తుందీ చిత్రం.

ఊహించని విధంగా ఆహ్లాదం కలిగించే ఈ సినిమా7 ఏళ్ళ వయసు నుంచి 77 ఏళ్ళ వయసు వాళ్ళందరూ నోనో చిత్రం చూచి మంచి-చెడుల తారతమ్యాన్ని తెలుసుకోమంటున్నాడు డైరెక్టర్. అది నిజం!
అందుకున్న పురస్కారాలు

యూరోపియన్ ఫిల్మ్ అవార్డ్స్ నుంచి యంగ్ ఆడియన్స్ అవార్డ్
మాంట్రియల్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2013 లోజరిగిన ఫిల్మోత్సవంలో ఆడియన్స్ అవార్డ్
ట్యాలిన్ బ్లాక్ నైట్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2013లోబహుమతులు గెల్చుకుంది.
2013 – ఔలు అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవానికి నానినేట్ అయింది.

– శివలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సినిమా సమీక్షలు, , , , , , Permalink

Comments are closed.