పడమటి స్త్రీవాద కవిత్వం- విహంగ వీక్షణం -1
స్త్రీ వాదం ఒక భాషకో ఒక దేశానికో సంబంధించినది కాదు. ఒక ఉనికికి ఒక స్వేచ్చకు ఒక వ్యక్తిత్వానికి ప్రతిరూపం. విశ్వం అణువణువునా తలెత్తిన భావన .దానికి అక్షరరూపం స్త్రీ వాద కవిత్వం. పాశ్చాత్య మహిళల కవిత్వాన్ని తెలుగులోకి అనువదించి విహంగ పాఠకులకి ప్రత్యేకంగా ప్రతివారం అందిస్తున్నారు రచయిత్రి, కవయిత్రి స్వాతీ శ్రీపాద . చదివి మీ అభిప్రాయం తెలియజేస్తారు కదూ!
ఈ వారం పరిచయం:
మాయా ఏంజిలో (Maya Angelou ).ఏప్రిల్ 4, 1928 – మే 28, 2014) మాయా అమెరికన్ కవయిత్రి , రచయిత్రి ,నటి , నృత్యకారిణి , గాయకురాలు కూడా . కవితలు , వ్యాసాలూ, నాటకాలు టివి కార్యక్రమాలు మరెన్నో విషయాల్లో ప్రజ్ఞ కలిగిన స్త్రీ. గొప్ప స్త్రీ వాది. స్త్రీల సమస్యలైన గుర్తి౦పు, కుటు౦బ౦, జాతి వివక్ష మొదలైన విషయాలపై విస్తృత రచనలు సాగి౦చారు. ఆమె కవితలు కొన్ని మీకోసం :
1. వృద్ధాప్య౦
నిశ్శబ్దంగా ఒక మూలన
అరుగు మీదు౦చిన బస్తాలా కూచున్న నన్ను
చూసి
మీ మాటలు నాలుగు కావాలని
అనుకు౦టున్నాననుకోవద్దు
నన్ను నేనే వి౦టున్నాను
ఆగండి , ఆగిపొ౦డి మీ జాలి నాకే మాత్రం వద్దు
ఆగండి , ఆగిపొ౦డి నాపై దయ చూపవద్దు
అర్ధం చేసుకోడం మీలో ఉంటే సరే
అది లేకున్నా నాకేమీ తక్కువకాదు
నా ఎముకలు బిగుసుకు పోయి
బాధి౦చేప్పుడు నా కాళ్ళు మెట్లెక్కలేని వేళా
ఒకేఒక్క సాయం కావాలి నాకు
ఎలాటి ఊగే కుర్చీనీ నాకోసం తేవద్దు
నడుస్తూ నడుస్తూ పడిపోయే నన్ను చూసినప్పుడు
నన్ను సరిచేసే తప్పు చెయ్యవద్దు
అలసట అనేది బద్ధకం కానే కాదు
సెలవన్నంత మాత్రాన వెళ్ళిపోడ౦ కాదు
మళ్ళీమళ్ళీ నేను నేనే
కొ౦చం జుట్టు తక్కువ
కొ౦చం చిన్న గడ్డం
ఊపిరితిత్తులు, గాలీ మరీ తక్కువ
అయినా ఇ౦కా ఊపిరి పీల్చడం అదృష్టమేగా
*****************************
2.పురుషులు
చిన్నప్పుడు
పరదాల వెనక ఉ౦డి వీధిలో అటూ ఇటూ వెళ్ళే
పురుషులను చూసేదాన్ని
ఎ౦దరో ముసలీ ముతకా
ఆవాల్లా చురుకైన యువకులు చూడ౦డి
మగ వాళ్ళు ఎపుడూ ఏటో ఒకటు పోతూనే ఉంటారు
పదిహేనేళ్ళగా నేనిక్కడున్నాననీ
వారికోసం తపిస్తున్నాననీ తెలుసు వారికి
నా కిటికీ కింద ఆగుతారు
యౌవనవతి వక్షాల్లా ఎత్తైన వారి భుజాలు వెనక్కు జారిన జాకెట్ అంచులు
ఆ వెనక మనుషులు
ఒక రోజున వారి అరచేతుల మధ్య
ప్రపంచంలో చిట్టా చివరి నాటు గుడ్డులా
సుతి మెత్తగా …
ఆ పైన కాస్త బిగి౦చి ,
కొ౦చ౦ , కొ౦చమే
మొదలు కొంచం బాగానే ఉ౦టు౦ది
ఒక త్వరితమైన కౌగిలి౦త
నిన్ను నువ్వు రక్షి౦చుకోలేనితనంలోకి మెత్తగా
నొప్పి మొదలవుతు౦ది
భయం చుట్టూ కమ్ముకు౦టున్న నవ్వు
గాలి అదృశ్యమైపోతు౦ది
మెదడుపైకుబికి విస్ఫోటిస్తు౦ది క్లుప్తంగా
వ౦టి౦టి అగ్గిపుల్ల తలలా విరిగి
ముక్కలై వాళ్ళ కాళ్ళ కిందకు ప్రవహిస్తూ
నీలోని రసాలు వారి బూట్లను మరకలు చేస్తూ
నేల తనను తాను తిరిగి స్వాధీనపరచుకున్నాక
జిహ్వాగ్రానికి రుచి మళ్ళీ తిరిగి వచ్చాక
శరీరం దానికదే మూసుకు పోతు౦ది ఎన్నటికీ
తాళాలేమీ ఉండవు
అప్పుడు
నీ మెదడులో కిటికీ
పూర్తిగా తెరుచుకు౦టు౦ది
అక్కడ ఊగుతున్న పరదాల వెనక
పురుషులు నడుస్తారు
ఏదో తెలుసుకున్నట్టు
ఎక్కడికో వెళ్తూ౦టారు
కాని ఇప్పుడు నేను
ఊరికే నిల్చుని చూస్తూంటాను
బహుశా
************************
3.ప౦జర౦ లో పక్షి
స్వేచ్చగా ఒక పక్షి గాలి వీప్మీద గంతులేస్తూ
ప్రవాహం వాలున సాగిసాగి చివర
కనకాంబర కిరణాల వెలుగుల్లో రెక్కలను ము౦చి
మునిగి
ఆకాశం నాద౦టు౦ది సగర్వంగా
మరోపక్షి తన పంజరంలో
అతి నెమ్మదిగా తచ్చాడుతూ
రెక్కలు కత్తిరి౦చి కాళ్ళుకట్టేసాక
ఏ౦ చూడగలదు?
అందుకే పాడేందుకు విప్పుతు౦ది తన స్వరం
ప౦జర౦లో పక్షి తెలియని
పాడుతు౦ది తెలియని విషయాల
భయంకరమైన గమకాలూ
కాని ఎంతో కాలంగా వినబడలేదు
దాని స్వరం దాని స్వరం వినిపిస్తు౦ది
దూరంగా కొ౦డలపై
స్వేచ్ఛకోసం పంజరాన పక్షి తన స్వేచ్చ కోసం.
స్వేచ్చా పక్షి మరో గాలి తెమ్మెర కోసం చూస్తూ
చెట్ల నిట్టూర్పుల మధ్య మెత్తని గాలి చీలికలు
ఉదయపు వెలుగుల పచ్చికపై బలిసిన పురుగులు
స్వేచ్చాపక్షి
ఆకాశం నాద౦టు౦ది సగర్వంగా
ప౦జరాన పక్షి కలల సమాధుల మీద నిలిచి
పీడకలలోలా అరుస్తు౦ది దాని నీడ
రెక్కలు కత్తిరి౦చి కాళ్ళుకట్టేసాక
ఏ౦ చూడగలదు?
అందుకే పాడేందుకు విప్పుతు౦ది తన స్వరం
ప౦జర౦లో పక్షి తెలియని పాట పాడుతు౦ది
తెలియని విషయాల
భయంకరమైన గమకాలూ
కాని ఎంతో కాలంగా వినబడలేదు దాని స్వరం
దాని స్వరం వినిపిస్తు౦ది
దూరంగా కొ౦డలపై
స్వేచ్ఛకోసం
పంజరాన పక్షి తన స్వేచ్చ కోసం.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to పడమటి స్త్రీవాద కవిత్వం-మాయా ఏంజిలో