సుధీర

Blast“పెద్దకూతురెలాగూ అన్యాయమైపోయింది… చిన్నదాన్ని కూడా బలిపెట్టాల్సి వస్తుందని భయపడ్డాను…” అవిరామంగా కారుతున్న కన్నీటిని చీర చెరగుతో తుడుచుకోవటానికి విఫల ప్రయత్నం చేసింది, రాజ్యం తల్లి.
“సింధుజమ్మా, నీ ఋణమెలా తీర్చుకోవాలో నాకు తెలియటం లేదమ్మా… అన్నెం పున్నెం ఎరుగని నా కూతుర్ని అన్యాయంగా పొట్టన బెట్టుకున్నారా కిరాతకులు! వాళ్ళను చట్టానికి అప్పగించి, ఈ పసిమొగ్గను ఆ నరరూపరాక్షసుడి పాల బడకుండా కాపాడావు…” శలవు తీసుకోబోతూ, కృతజ్ఞతగా చేతులు జోడించాడు రాజ్యం తండ్రి.
“అయ్యో, ఇందులో నేను చేసిందేమీ లేదు… ఇదిగో, న్యాయాన్ని కాపాడటం కోసమని గట్టిగా కంకణం కట్టుకున్న ఈ లాయరు రామానుజం గారికి నమస్కరించండి. అంతులేని తమ ధనదాహంతో ఎందరో ఆడకూతుళ్ళ ప్రాణాలను హరిస్తూ చట్టానికి దొరక్కుండా తప్పించుకుంటున్న ఇలాంటి పాపాత్ముల నేరాలను నిరూపించి, ఆ న్యాయదేవతకు అప్పగించి, మనకు న్యాయం చేస్తున్న అమృతమూర్తి వీరు…” అతులిత గౌరవభావంతో రామానుజం గారి వైపు చూస్తూ చెప్పింది, సింధుజ.
“అసలు దామోదరమే హంతకుడన్న విషయాన్ని, నీవు కళ్ళారా చూసిన నిజాలను నాకు తెలియజేసి, వీళ్ళకి న్యాయం జరిగటానికి కారణం నువ్వే అయ్యావమ్మా సింధూ… కాకపోతే చనిపోయిన రాజ్యాన్ని మాత్రం తిరిగి వీరికి తెచ్చివ్వలేము…ప్చ్..” బాధగా అన్నాడు రామానుజం. కూతురి ప్రసక్తి రాగానే రాజ్యం తల్లి భోరున ఏడవసాగింది. ఆమెను సముదాయించి, వరండాలోకి తీసుకు వెళ్ళింది, రామానుజం గారి ధర్మపత్ని సుమతి.
“ధనాన్ని ఆశించరు… అన్యాయాన్ని సహించరు…న్యాయంగా రావలసిన ఆదాయం రాకపోయినా బాధపడరు… దీనుల పాలిటి కల్పవల్లి మీరు… అంకుల్… మీ పరిచయం నిజంగా నాకు మహద్భాగ్యం…” చెప్పింది, సింధుజ.
“అదేముందిలే తల్లీ… నాకిలా అలవాటైపోయింది… లోకజ్ఞానం లేని వాణ్ణని మీ ఆంటీతో అనిపించుకుంటూ, చేతకానివాడని సాటి ప్లీడర్లతో విసుర్లు వింటూ, ఇలా కాలం గడిపేస్తున్నాను… అయినా ఈ కేసులో నీవు అందించిన సహకారం మరువరానిది. కేసు హియరింగ్ కి వచ్చినప్పుడల్లా సాక్ష్యం చెప్పటానికి వీలుగా గత నాలుగు నెలల నుంచి నీ పుట్టింట్లోనే ఉండిపోయావు… పరోపకారమంటే ఏమిటో, నిన్ను చూసి నేర్చుకోవాలమ్మా… నీ కాపురంలో కూడా అపశృతులు వస్తున్నాయని చెప్పావు… మీ అత్తగారితో జాగ్రత్త తల్లీ… అసలే వట్టి మనిషివి కూడా కావు. ఇతరుల కోసమని నీ సంసారంలో కలతలు తెచ్చుకోకుండా వెంటనే బయలుదేరి మీ ఇంటికి వెళ్ళిపో… మీ నాన్నగారితో కూడా అదే చెప్పాను.”
“అలాగే అంకుల్… రేపే ఊరికి వెళుతున్నాను… కొద్ది రోజులలోనే మీరు నాకు మంచి ఫ్రెండయ్యారు… మీదగ్గరున్న పుస్తకాలు కొన్ని తీసుకు వెళ్ళవచ్చా?”
“తప్పకుండానమ్మా…ఆ షెల్ఫ్ లో నీకే బుక్స్ కావాలో తీసుకొని, ఆ డైరీ లో ఆ పుస్తకాల పేర్లు రాసి, సంతకం పెట్టి వెళ్ళు. మళ్ళీ తిరిగి ఇవ్వాలి సుమా…” అన్నారు ఆయన నవ్వుతూ…
కొన్ని నెలల క్రితం అసలేం జరిగిందంటే….
***
“పెళ్లి అయి రెండేళ్ళు దాటుతోంది… ఇంకెప్పుడు బామ్మవి అవుతావని అని నలుగురూ ఆడిపోసుకుంటున్నారు… కొందరైతే నేరుగా ‘నీ కొడుక్కి వేరే పెళ్లి చేయవమ్మా’ అని చెవినిల్లు కట్టుకొని పోరుతున్నారు కూడా…” సాధింపుగా అంది తాయారమ్మ.
అత్తగారి వైపు ఓసారి చూసి తల దించుకొని మళ్ళీ తను తయారుచేసిన అప్పడాలను, వడియాలను, చల్ల మిరపకాయలను ప్యాకింగ్ చేయటంలో మునిగిపోయింది సింధుజ.
“మనిషంత మనిషిని ఇక్కడ మాట్లాడుతోంటే అసలు ఏమన్నా లక్ష్యం ఉందిటే నీకు? నిన్ను కాదులే… నిన్నిలా పెంచిన మీ అమ్మా బాబుల్ని అనాలి… మాటిచ్చి తప్పే రకాలు!” విసురుగా ఈసడించింది తాయారమ్మ.
ఏదో జవాబు చెప్పబోయి నిగ్రహించుకొని పెదవి బిగించింది సింధుజ. తాయారమ్మ ఉపన్యాసం కొనసాగుతోంది. “పెళ్లికి అరవై వేలు కట్నం మాట్లాడుకున్నాము. పాతికవేలు మాత్రం చేతుల్లో పెట్టి దణ్ణం పెట్టాడు మీ నాయన… ‘సరేలే, నాకు మాత్రం ఆడకూతుళ్ళు లేరా’ అని జాలేసి అప్పటికి పెళ్లి ఆపటం ఇష్టం లేక ఊరుకున్నాను…ఇన్నేళ్ళు అయినా మీ వాళ్ళు ఆ డబ్బు మాటే ఎత్తటం లేదు…” నిష్టూరంగా అంది మళ్ళీ…
తాయారమ్మ బిగ్గరగా మాట్లాడుతున్న మాటలకు ఉయ్యాలలో నిద్రపోతున్న పాపాయి ఉలిక్కిపడి లేచి గట్టిగా ఏడ్వసాగింది. లోపలినుండి ఒక్క ఉదుటున వచ్చిన చంద్రిక పిల్లను ఎత్తుకొని ఊరడిస్తూ అడ్డాల్లో వేసుకుంది… “ఎన్ని సార్లు చెప్పానమ్మా, గట్టిగా మాట్లాడొద్దని? దీనికసలే సౌండ్ అలెర్జీ…” అని తల్లిమీద విసుక్కుంది.
“నీ గురించే కదుటే నా తాపత్రయమంతా… ఏదో దీని మెడ లోకి ఓ చిన్న గొలుసు చేయిద్దామని… ఇంకా నీ చెల్లెలి పెళ్లి చేయాలి…ఎలాగో, ఏమిటో?” నిట్టూర్చింది తాయారమ్మ.
“అవన్నీ అన్నయ్య చూసుకుంటాడు లేవే… వదిన్ని ఎందుకు అస్తమానూ సాధిస్తావు? తను మాత్రం ఖాళీగా ఎక్కడుంటోంది? క్షణమైనా కూర్చోకుండా ఏదో ఒక పని చేసి సంపాదిస్తూనే ఉంది కదా? ఇక చెల్లి పెళ్లి అంటావా చాలా టైమ్ ఉంది దానికి… హాయిగా చదువుకోనీ దాన్ని…” మందలింపుగా అంది చంద్రిక.
ఏమీ అనలేక, కొరకొరా చూస్తూ, వంటగది లోకి వెళ్ళిపోయింది తాయారమ్మ. కృతజ్ఞతగా ఆడబిడ్డ వైపు చూసి నవ్వింది, సింధుజ.
***
కేశవ్ అగ్రికల్చర్ ఎమ్మెస్సీ చేసేటప్పుడు అదే యూనివర్సిటీలో సింధుజ హోమ్ సైన్స్ లో బీయస్సీ చేసేది. సాంస్కృతిక, సేవా కార్యక్రమాల్లో కలసి పనిచేయటం వలన వారిద్దరి మధ్యా చనువు, స్నేహం పెరిగి అవి ప్రేమగా పరిణమించాయి. అయితే తనకు తల్లీ, ఇద్దరు చెల్లెళ్ళ బాధ్యత మాత్రమే కాక, ఊరిలోని పొలంలో ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసే ఉద్దేశ్యం కూడా ఉండటం వలన తమ ఊర్నుంచి తరలి వచ్చి, నగరంలో స్థిరపడటం తనకు వీలయ్యే పని కాదని అని చెప్పాడు కేశవ్. సింధుజ తానే పల్లెకు వెళ్ళటానికి మహదానందంగా అంగీకరించింది. ఆమె తల్లిదండ్రులు పెళ్ళికి అంగీకరించారు కాని, కేశవ్ తల్లికి మాత్రం కొడుకు తన వధువును తానే తెచ్చుకోవటం అసలు రుచించలేదు. తన అన్న కూతురుని కోడలిగా చేసుకుని, వరకట్నంగా వాళ్ళిచ్చే డబ్బుతో కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయాలని అనుకుంది. చదువుకున్న అమ్మాయి కోడలిగా వస్తే ఆమె మాట వినదనీ, ఇంటి పనులు చేయదనీ, బాధ్యతలు నిర్వహించదనీ ఒక రకమైన అపోహతో సింధుజ మీద అర్థం లేని ద్వేషాన్ని పెంచుకుంది.
సింధుజ తండ్రి ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. ఆయనకి వచ్చే అతి తక్కువ జీతంతోనే ఇంటి ఖర్చులు పోను, సింధుజను, ఆమె చెల్లెలిని, తమ్ముడిని చదివిస్తున్నారాయన. పిల్లలంతా కొద్దో గొప్పో తెలివితేటలు, కృషి, పట్టుదల కలవాళ్ళు కావటంతో వాళ్ల చదువులకు వాళ్ళే మెరిట్ స్కాలర్ షిప్ తెచ్చుకొని, పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ, ఆదాయం సంపాదించుకుంటున్నారు. ఈలోగా కేశవ్ పెళ్ళి ప్రతిపాదన తీసుకురావటం, తాయారమ్మ అడిగిన కట్నానికి సింధుజకు తెలియకుండా రహస్యంగా ఆమె తండ్రి ఒప్పుకోవటం, తీరా పెళ్ళి సమయానికి ఆయనకు చీటీ డబ్బు పూర్తిగా రాక, సగం పైకమే చేతికి రావటం జరిగింది. విషయం తెలిసిన సింధుజకు నోట మాట రాలేదు. తండ్రి పట్ల అపరాధ భావనతో ఆమె క్రుంగి పోయింది. భర్తతో చెప్పినా అతను తేలికగా తీసుకున్నాడు. తన దగ్గర డబ్బున్నప్పుడు తన తల్లి తీసుకున్న డబ్బును తిరిగి మామగారికి ఇచ్చేస్తానని అన్నాడు కాని సింధుజకా నమ్మకం లేదు. పైగా తాయారమ్మకి సింధుజను సాధించటానికి ఇదో ఆయుధంగా దొరికింది.
కేశవ్ పొలం పనులతో ఖాళీ లేకుండా అయిపోయాడు. వేణ్ణీళ్ళకు చన్నీళ్ళలా ఒక చిన్న స్కూలు పెట్టి పిల్లలకు ఇంగ్లీషు క్లాసులు నిర్వహించసాగింది, సింధుజ. సాయంత్రాలు హైస్కూలు పిల్లలకు, జూనియర్ కాలేజి పిల్లలకు కంప్యూటర్ క్లాసులు కూడా చెప్పసాగింది. అలాగే, పెరటితోట పెంపకం, అల్లికలు, కుట్లు నేర్పించటం, అప్పడాలు, వడియాలు, పచ్చళ్ళు పెట్టి, చుట్టుపక్కల ఊళ్ళలోని హాస్టల్స్ కు, ఆఫీసులకు సరఫరా చేయటం చేస్తూ తనూ కొంత ఆదాయం సంపాదించసాగింది. పెద్దాడపడుచుకు మంచి సంబంధమే చూసి పెళ్ళి చేసేసారు. ఏడాది తిరక్కుండానే ఓ పాపకు తల్లి అయింది ఆమె. అన్నగారి మీద ఉన్న గౌరవం వల్ల అయితేనేమి, చదువుకుందన్న మర్యాదతో అయితేనేమి వదిన సింధుజతో మాత్రం చాలా చక్కగా ఉంటారు, ఆడపడుచులిద్దరూ. ఒక్క తాయారమ్మ మనసునే తాను గెలుచుకోలేక పోతున్నానని వాపోతూ ఉంటుంది సింధుజ.
***
చెల్లెలికి ఏదో ఇంటర్వ్యూ ఉందని, శనాదివారాలు కలిసి వచ్చాయి అని పుట్టింటికి వచ్చింది, సింధుజ. శ్రీజకు కొన్ని సందేహాలు తీర్చి, కట్టుకోవలసిన బట్టలు తీసిపెట్టి, ఇంటర్వ్యూలో ఎలా జవాబులు చెప్పాలో, ఎలా నడచుకోవాలో చెప్పింది.
ఆ రాత్రి…
దాహం వేసి, మంచినీళ్ళకని లేచి వంటింట్లోకి వచ్చిన సింధుజ ఎదురుగా ఉన్న కిటికీలోంచి కనిపించిన దృశ్యాన్ని చూసి అలాగే శిలలా నిలబడిపోయింది. ఇంటి వెనుకనున్న అపార్ట్మెంట్ లోని కిచెన్ లో చిమ్మ చీకట్లో ఓ మెరుపు మెరిసినట్టైంది. మరుక్షణం కళ్ళు చెదిరేలా మంటలు… తర్వాత తలుపు తట్టిన శబ్దాలు… భయంతో అలాగే చూస్తున్న సింధుజ ఎలాగో ధైర్యం తెచ్చుకొని తన సెల్ ఫోన్ లోంచి అగ్ని మాపక కేంద్రానికి ఫోన్ చేసింది. గట్టి గట్టిగా ఏడుస్తున్నారు ఆ ఇంటిలో ఉండే అతను, అతని తల్లి. ఈ కలకలానికి నిద్ర లేచిన ఆ అపార్ట్ మెంట్ వాసులంతా హాహాకారాలు చేయసాగారు. ‘నా రాజీ, నా రాజీ ఉండిపోయింది లోపల…’ అతను వెక్కిళ్ళతో చెప్తున్నాడు ఇరుగుపొరుగూ అందరికీ.
నిద్రలేచిన సింధుజ అమ్మా, నాన్న నిశ్చేష్టులై అలాగే కూర్చుండిపోయారు. “మొత్తానికి ముత్యంలాంటి పిల్లని పొట్టన పెట్టుకున్నారు సింధూ…’ బాధగా చెప్పింది కావేరి.
“చూస్తున్నాముగా ఏడాదినుంచీ… చిదిమి దీపం పెట్టుకునేలా ఉండేది బంగారు తల్లి… వీళ్ళ ధనదాహానికి బలైపోయింది…” నిట్టూర్చారు రమణయ్య గారు.
“కాని ఆ పిల్ల అరుపులు ఏమాత్రం మనకు వినిపించనే లేదండీ…” చెప్పింది, కావేరి.
“ఏమోనమ్మా, ముందే స్పృహ లేకుండా చేసి, వంటింట్లో పడేసి, గాస్ లీక్ చేసి, అగ్గిపుల్ల వేసేసి ఉండొచ్చుగా?” సాలోచనగా అంది, సింధుజ.
“సింధూ, ఎక్కువగా ఆలోచించకుండా వెళ్లి పడుకోమ్మా… రేపు నువ్వు మీ ఇంటికెళ్ళిపో… అసలు మీ అత్తగారి బాకీ కూడా త్వరగా తీర్చెయ్యాలి…లేకపోతే… అమ్మో…” చివరి మాటలను తనలో తాను గొణుక్కున్నారు రమణయ్య గారు.
ఇంతలోనే గంటలు గణగణ మ్రోగించుకుంటూ ఫైరింజన్ వచ్చింది.
***
స్పృహ లేని స్థితిలోనే బొగ్గులా మారి చనిపోయింది, రాజ్యం. పోలీసులు రావటం, ‘రాజ్యానికి నిద్రలో నడిచే అలవాటుంది కనుక, ఆ అర్థరాత్రి నడుచుకుంటూ వంటింట్లోకి వచ్చి లైట్ వేయగానే, గ్యాస్ లీకయి మంటలు రావటం ఆ మంటల్లో ఆమె కాలిపోవటం…’ ఇలా కేసును రాసేసి, ప్రమాదవశాత్తూ చనిపోయిందని నిర్థారించి, కేసును క్లోజ్ చేసేయటం కూడా జరిగిపోయింది.
రాజ్యం మొగుడు దామోదరానికి మళ్ళీ రాజ్యం చెల్లెల్నే ఇచ్చి పెళ్ళి చేయబోతున్నారని తెలిసిన తరువాత ఇక ఆగలేకపోయింది, సింధుజ. కేశవ్ తో చర్చించింది. “మనకెందుకు సింధూ, నువ్వన్నిట్లోనూ తలదూర్చకు… అస్తమానూ టౌన్ కి పరుగుతీయకు… అమ్మకిలాంటివి నచ్చవు…” ఖచ్చితంగా చెప్పాడు. తెల్లబోయి చూసింది సింధుజ. ఆమె చూపులో చూపు కలపలేక, మౌనంగా ఆమె సంధించిన ప్రశ్నాస్త్రాలకు తట్టుకోలేక, అక్కడినుంచి వెళ్ళిపోయాడు, కేశవ్. తలపంకించి, భర్తతో తరువాత విపులంగా చర్చించాలని నిర్ణయించుకుందామె.
ఆ సాయంత్రం గుడికి వెళ్ళింది, సింధుజ. అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చిందో లేదో కొద్ది దూరంలో ఏదో కలకలం. అట్టలు కట్టిన జుట్టుతో, మాసి చిరుగులు పడుతున్న చీరతో ఓ స్త్రీమూర్తి… అక్కడున్న పిల్లలపై భీకరంగా అరుస్తూ పెద్ద రాయెత్తి కొట్టబోతోంది. పిల్లలు భయపడి పారిపోయారు. ఆమె తనలో తానే ఏదో గొణుక్కుంటూ, ఏడుస్తూ, గుడి ప్రహరీ గోడను ఆనుకుని కూర్చుండిపోయింది. అటువైపే చూస్తున్న సింధుజకి అసలు విషయమేమిటో అర్థం కాలేదు.
ఇంతలో అటువైపు వచ్చిన పూజారిగారితో, “ఎవరండీ, ఆమె?” అనడిగింది. అటువైపు చూసి నిట్టూర్చారు పూజారిగారు. “ఆమె ఓ అభాగ్యురాలు తల్లీ…పేరు ప్రసన్న. పక్క ఊరి గుడి పూజారి నారాయణశాస్త్రిగారి అమ్మాయి. ప్రసన్నకు ఐదేళ్ళ క్రితమే వివాహం జరిగింది. అత్తగారింట్లో అన్నీ ఆరళ్ళూ, ఆంక్షలే…తొలిచూలు ఆడపిల్ల పుట్టేసరికి ఈమె బాధలు మరింత ఎక్కువయ్యాయి. వాటికి తట్టుకోలేక, బిడ్డను ఎత్తుకుని బయటకు వచ్చేయటానికి ప్రయత్నిస్తే బిడ్డను లాగేసుకొని రోకలిబండతో ఆమె తలమీద కొట్టారు. రక్తం ఓడుతుంటే ఎలాగో బయటపడి, పుట్టింటికి చేరింది. కన్నవాళ్ళు చికిత్స ఇప్పించినా, శారీరకమైన గాయాలు తగ్గాయి కాని, అప్పటికే ఆమెకు మతిస్థిమితం తప్పిపోయింది.
ఇంట్లో వదినగారి పోరు పడలేక, తల్లి గారింటి నుంచి కూడా బయటికి వచ్చేసింది. ఎవరినీ ఏమీ చేయదు. దూరమైన బిడ్డను తలచుకొని ఏడుస్తూ ఉంటుంది. పెద్దగా చదువుకోలేదు. ఇక్కడే గుడి చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది. మా ఇంట్లో ఉంచుకోవాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది. మళ్ళీ వైద్యం చేయిస్తే మామూలు మనిషి అవుతుందేమో కాని, ఆమె తల్లిదండ్రులకు అంతటి శక్తి లేదు.
ఇక్కడ నా పరిస్థితీ అంతంత మాత్రమే… అందుకనే ఏదో ఓ పూట ప్రసాదమంటే పెట్టగలను కాని ఆమె బాధ్యతను పూర్తిగా తీసుకోలేకపోతున్నాను. రాత్రిపూట మన గుడిపంచలో పడుకుంటుంది. ఎవరైనా తనపైన దాడి చేసినా, మగపురుగులు తన జోలికి వచ్చినా అస్సలు సహించదు. చేతిలో ఏదుంటే దానితో వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఆమెను చూస్తుంటే చాలా బాధగా ఉంటుందమ్మా…”
“అయ్యో, ఆమె కథ వింటూంటేనే గుండె చెరువవుతోంది బాబాయి గారూ…” బాధగా నిట్టూర్చింది, సింధుజ.
ఆ మర్నాడే పుట్టింటికి ప్రయాణమయింది, సింధుజ. అయితే ఒక నాలుగు నెలల వరకూ తిరిగి పల్లె మొహం చూడనేలేదు. కోర్ట్ లో రాజ్యం తల్లిదండ్రులతో కేసు ఫైల్ చేయించి, దామోదరాన్ని చట్టానికి అప్పగించిన తర్వాతే పల్లెకు ప్రయాణమైంది.
***
ఊరిలోకి రాగానే, తన ఇంటికి వెళ్ళకుండా, ముందుగా గుడికి వెళ్ళింది, సింధుజ. పూజారి గారు కనబడగానే ఆమె అడిగిన మొదటి ప్రశ్న, “ ప్రసన్న ఎలా ఉందండీ?” అని…
“బాగానే ఉందమ్మా, ఇదివరకులా ఊరంతా తిరగటం లేదు… అదిగో ఆ చెట్టుకింద కూర్చుని ఉంటుంది… తన కూతురు గుర్తువచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటుంది… అప్పుడప్పుడూ మమ్మల్ని గుర్తు పడుతూ ఉంటుంది, అంతలోనే ఆ మతి పోతుందనుకుంటాను, అయోమయంగా చూస్తూ ఉంటుంది…” బాధగా చెప్పారాయన.
దేవాలయ ప్రాంగణంలో ఉన్న పొగడచెట్టు చుట్టూ కట్టి ఉన్న తిన్నె మీద కూర్చుని ఉంది, ప్రసన్న… బట్టలు కొంచెం బాగానే ఉన్నాయి. బహుశః పూజారి గారి భార్య ఇచ్చి ఉండాలి. ఆమె వైపు నడిచి, పక్కనే కూర్చుంది, సింధుజ. ప్రసన్న చేతిని తన చేతిలోకి తీసుకుంది. “ప్రసన్నా, నీ కూతురు త్వరలోనే నీ దగ్గరకి వచ్చేస్తుంది… రామానుజం అంకుల్ ఇప్పిస్తానన్నారు…” చెప్పింది, ఆమె భుజం తడుతూ… ప్రసన్న కళ్ళు మెరిసాయి. కళ్ళు పెద్దవి చేసి చూసింది, నమ్మలేనట్టు. “నిజం… నన్ను నమ్ము…” అంది సింధుజ ఆమె చేతిలో చేయి వేస్తూ…
“పట్నంలో నీవు చేసిన మంచి కార్యం గురించి కేశవ చెప్పాడమ్మా… ప్రసన్నకి కూడా న్యాయం జరిపించి దైన్యావస్థ లో ఉన్న ఆమెను ఆదుకోవాలనుకున్న నీ పెద్ద మనసుకి నా ప్రణామం తల్లీ… ఆ మందిరం లో కొలువైన అమ్మవారే నీరూపంలో వచ్చిందేమో అనిపిస్తోంది…” ఆప్యాయంగా సింధుజ తల నిమిరి చెప్పారు, పూజారి గారు.
“ఒక్క వారం రోజుల తర్వాత ప్రసన్నను నేనే మా ఇంటికి తీసుకు వెళతాను బాబాయ్ గారు, అప్పటి వరకూ తనను జాగ్రత్తగా చూసుకోండి… మరి నేను వస్తాను…” అంటూ లేచింది, సింధుజ.
***
“రండి రాణీ గారూ రండి…రండి… అబ్బో… చాన్నాళ్ళకు గుర్తు వచ్చామే మేము…” వెటకారంగా అంటూ గుమ్మానికి అడ్డంగా నిలబడింది, తాయారమ్మ.
“జరగండి అత్తయ్యా…” వినయంగా పలుకుతూ, పక్కనుంచి వెళ్ళబోయింది సింధుజ.
“ఆగక్కడ!” గర్జించింది తాయారమ్మ.
“అసలు రెండురోజుల్లో వస్తానని వెళ్ళి, ఇన్ని రోజులు నువ్వక్కడ చేస్తున్న రాచ కార్యాలేమిటే? మీ అమ్మేమో నీకు వేవిళ్ళనీ, బెడ్ రెస్ట్ అవసరమనీ బోలెడు కథలు చెప్పిందా? నువ్వేమో అడ్డమైన వాళ్ళకోసం కోర్టు గుమ్మాలు ఎక్కీ దిగుతున్నావా? అసలెంత ధైర్యమే నీకు? ఎవత్తో కాల్చుకుని చస్తే, దాని మొగుణ్ణి, అత్తనీ జైలు పాలు చేస్తావా? ఏ, ప్రపంచాన్ని ఉద్ధరించటానికి నువ్వే కంకణం కట్టుకున్నావా? సంసారం సజావుగా చేసుకోవడం చేతకాదు కాని సమాజాన్ని ఉద్ధరిస్తావే నువ్వు? అసలు నీలాంటి కోడలు నాకు అక్కరలేదు… వెళ్ళవతలికి…”
“ఊరుకోండి అత్తయ్యా… నేను మీకు అక్కరలేదేమో కాని మీరు నాక్కావాలి… దారికడ్డం తొలగి, ఇలా కూర్చోండి…” ఒకింత బలంగానే అత్తగారి చేయి పట్టి లాగి ఆమెను కుర్చీలో కూర్చుండబెట్టింది సింధుజ. “ఎంత పొగరే నీకు?” చేయి ఎత్తింది, తాయారమ్మ…
“చేయి ఎత్తటానికి నాక్కూడా క్షణం పట్టదు అత్తయ్యా… మీ మర్యాద మీరు నిలుపుకుంటే బాగుంటుంది మరి… ఒక సంగతి తెలుసా మీకు? మీ అబ్బాయికి తెలియకుండా, నేను ఏ పనీ చేయను… కాకపోతే మీరు బాధపడతారని ఆయన మీకు చెప్పరు అంతే… కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని సహించి ఊరుకునే చేతకానితనం నా రక్తం లో లేదు… ఒక అమాయకురాలిని గ్యాస్ లీక్ చేసి, కాల్చి చంపివేస్తే, మనకెందుకులే… అని ఊరుకునే తత్వం కాదు నాది… కట్నకానుకల కోసం కోడళ్ళ ప్రాణాలను హరించే అత్తలు, మొగుళ్ళు ఉన్నంతకాలం, ఆడదాని కన్నీరు జీవనదులై ఈ దేశంలో ప్రవహిస్తూనే ఉంటుంది. మీరైనా సరే… మరో సారి కట్నం గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు… ఇంటి బాధ్యతలన్నీ నేనూ, మీ అబ్బాయీ చూసుకుంటాము… పుట్టబోయే మీ వంశాంకురాన్ని ఆడిస్తూ మీరు హాయిగా కాలం గడపండి… అన్నట్టు, మీరు ఇంకా బామ్మకాలేదని నలుగురూ ఆడిపోసుకున్నారు కదా, వాళ్ళకి మరో ఆరు నెలల్లో మనింట్లో పాపాయి పుడుతుందని కాస్త గట్టిగా జవాబు చెప్పండి! ఉండండి… కాస్త నిమ్మకాయ పిండి, మజ్జిగ తేట తెస్తాను…వడదెబ్బకు మంచిది, ఇద్దరం తాగుదాం…” అని గదిలో సామాను పెట్టి, ఒక్క ఉదుటున వంటింట్లోకి వెళ్ళిపోయింది, సింధుజ.
తాయారమ్మ గుండెల్లో రాయిపడింది…’అమ్మో…దీనికి చట్టమంతా తెలిసిపోయినట్టుంది…పైగా పట్నం లో పెద్ద లాయర్లతో సాంగత్యం. మళ్ళీ కట్నం బాకీ సంగతి ఎత్తితే, నన్ను జైలుకు పంపించినా పంపేస్తుంది…ఇక ఊరుకోవటమే ఉత్తమం…’ అనుకుంది.
‘సారీ అత్తయ్యా, తప్పనిసరి పరిస్థితుల్లో మీ మీద నోరు చేసుకోక తప్పలేదు…మీలోని రాక్షసత్వాన్ని చంపేసి, అమ్మతనాన్ని మేల్కొలపటమే ప్రస్తుతం నా లక్ష్యం… అసలు రాజ్యం సంఘటన జరిగి ఉండకపోతే, నేను రిస్క్ తీసుకొని వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పి, నేరస్థులను పట్టించి ఉండకపోతే, రేపటి దినాన నేనూ మరో రాజ్యాన్నో, ప్రసన్ననో అయి ఉండే దాన్నేమో…అందుకే ఆత్మరక్షణ కోసం మిమ్మల్ని ఎదిరించక తప్పలేదు.’ గిన్నెలో కలిపిన మజ్జిగను గ్లాసుల్లోకి పోస్తూ తనలో తాను అనుకుంది, సింధుజ.
***

–  నండూరి సుందరీ నాగమణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

6 Responses to సుధీర