నా జీవనయానంలో(ఆత్మ కథ )- అత్తవారిల్లు – 2- కె.వరలక్ష్మి

అప్పటికే మోహన్ బైటకెళ్ళిపోయాడు.వాళ్ళమాటలకి నాకు ఉక్రోషంతో ఏడుపుతో నిస్సత్తువ కమ్మేసి అక్కడున్న చెక్కసోఫాలో చేరబడిపోయాను.“ఏం పెద్దా చిన్నా లేదా? ఇక్కడున్న వాళ్ళందరం అత్తగార్లం. మా ఎదటే సోఫాలో కూర్చుంటావా?” అందొకావిడ.నేను చటుక్కున లేచి నిల్చున్నాను.నడవాలోకెళ్ళి నేలపీటొకటి కనిపిస్తే వాల్చుకుని కూర్చోబోయాను. పిల్లలొచ్చి “ఆపీట కావాలి” అని పట్టుకెళ్ళిపోయారు. నడవాలో అన్నాలు తిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోరు కాబోలు గచ్చంతా జిడ్డుజిడ్డుగా ఉంది.

ఎట్టకేలకు మూడుగంటలకు మా అత్తగారు ఒక కంచంలో కాస్త అన్నం, క్లోరిన్ కంపు కొడుతున్న చారు పట్టుకొచ్చారు.తల్లిగారింట్లో కూర కోసం గిన్నెలన్నీ వెతికారు. అప్పటికే వీళ్ళు వండుకున్నదేదో ఊడ్చుకు తినేశారు. ఆ కంచం నేలమీద పెట్టీ “ఈ పూటకిది తిను . ఒకటి గుర్తు పెట్టుకో. ఈ ఇంట్లో మా మరుదులు తిరుగుతుంటారు. నువ్వు వాళ్ళెవరికీ ఎదురుపడి మాట్లాడకూడదు. కనిపించకూడదు. చివరికి మా ఆయనకి కూడా” అన్నారు.

మామగారు తండ్రితో సమానం అంటారు కదా! మా మీనాక్షి నెపోలియన్ అని పేరు పెట్టిన అప్పుడెప్పుడో స్కూలుకెళ్తూ చూసిన ఆయన రూపం గుర్తుకొచ్చింది. పాపం మంచివాడిలాగే కనిపించారే. అయినా ఆవిడ చెప్పినట్టే నడుచుకుంటే పోలా అనుకుని సరేనని తలూపాను. అంతే, నా అంతటికి నేను ఎప్పుడూ ఎవరికీ ఎదురుపడి మాట్లాడలేదు.

తర్వాతికాలంలో అదేంటమ్మా, నువ్వు మా పిల్లలతో సమానమైనదానివి. అలా దూరదూరంగా ఉంటావెందుకు?” అని వాళ్ళ ఆవిడలా ఉండమన్నారని చెప్పలేదు. ఆ సాయంకాలం మా అత్తగారి పిన్నికూతురు సూరీడు నన్నూ, మోహన్ నీ భోజనానికి పిల్చుకువెళ్ళింది. వీళ్ళ పూరిపాకల్లో ఒకదాంట్లో ఉంటోంది ఆవిడ. వాళ్ళాయనా తనూ ఏదో ఫ్యాక్టరీలో కార్మికులట. రకరకాల మాంసాహార వంటలతో వేడివేడి భోజనం పెట్టింది. తింటున్నప్పుడు పక్కనే ఉన్న మరోపూరింటిని చూపించి ఇదేనమ్మా మీ అత్తగారిల్లు. రేపు సదువు ముగిసాక నువ్వు కాపురానికి రావలసింది ఇక్కడికే” అంది.

ఉదయం కురిసిన వానకి వాకిలంతా చిత్తడి చిత్తడిగా ఉంది. గుమ్మం లో పొయ్యి నాలుగు వంటగిన్నెలూ లోపల ఒక పాత మడతమంచం తప్ప మరేం లేవు.

నిజంగా మోహన్ కుటుంబం ఇంత పేదరికంలో ఉందా? కావాలని నన్ను భయపెడుతున్నారా? నాకు కావలసింది ఇళ్ళూ వాకిళ్ళూ కావు. చదువు ముఖ్యం అని ధైర్యం చెప్పుకొన్నాను.

వీళ్ళ అమ్మమ్మగారింటికి తిరిగొచ్చేసరికి ఇంటిముందు చాలామంది పనులనుంచి తిరిగొచ్చిన జాలారి ఆడవాళ్ళు కొత్త పెళ్ళికూతుర్ని చూడడానికి వచ్చి గుంపుగా నిలబడి ఉన్నారు.

వాళ్ళంతా నన్ను చూసి సంతృప్తిగా తలాడించి “ మోహన్రావు బాబుకి సుక్కలాంటి పెళ్ళాం దొరికింది.” అన్నారు. కొంగరాని గొల్లతాతైతే అరుగుమీద చతికిలబడిపోయి “అమ్మా నా బంగారు తల్లే! నువ్వు పద్దేలు పాటలు పాడతావంట. ఒక్కపాట పాడు తల్లీ” అన్నాడు.

“సాల్లే సంబరం నువ్వు లోపలికెళ్ళమ్మాయ్” అని గద్దించారు అమ్మమ్మగారు.
వీళ్ళు తినని బెల్లం మిఠాయి, చలిమిడి కనీసం వాళ్ళకైనా పెట్టలేదు. యాలకులపొడి వేసి చేసిన ముదురు పాకం బెల్లం మిఠాయి పరిమళం నాకైతే నోరూరింపజేస్తోంది. అడిగితే ఏమంటారోనని భయం.

ఇంట్లో ఎక్కడా చోటులేదు కాబట్టి మోహన్, నేనూ డాబామీదంతా శుభ్రంగా తుడిచి నీళ్ళు చల్లాం. చాపలు దుప్పట్లు వేసినా పగలంతా ఎండకి వేడెక్కిన డాబా వీపులు మాడ్చేసింది. రాత్రి పదిగంటలకి కాబోలు నాలుగిళ్ళ అవతలనుంచి ముందు ఆర్కెస్ట్రా సవరింపు, కాసేపటికి నిండు చందమామా నిగనిగల భామా” అంటూ జేసుదాసు గొంతు విన్పించింది. నేను ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాను.

“మీకు తెలుసా అది జేసుదాసు బంగారు తిమ్మరాజు సినిమాలో పాడిన పాట” అన్నాను. ఎగ్జైటైపోతూ మోహన్ తో మా అత్తింటి వాళ్ళు చేసిన బ్రెయిన్ వాష్ తో ఆ రోజే నేను మోహన్ని ‘మీరు’ అనడం మొదలుపెట్టాను.
“జేసుదాసెవరు? అని కావచ్చు ఆ ఇంటివాళ్ళమ్మాయికి ఈ రాత్రికి పెళ్ళి. పెళ్ళివాళ్ళది మద్రాసట. వాళ్ళు తీసుకొచ్చి ఉంటారు” అన్నాడు మోహన్,

అంతలో ఆ పాట ముగిసి ఎస్. జానకి పాట మొదలైంది. నేను లేచి నిలబడి పదండి. వాళ్ళని చూసొద్దాం” అన్నాను. అమ్మో మా వాళ్ళొప్పుకోరు అన్నాడు. ఎంత బ్రతిమిలాడినా కరగలేదు. అయినా పాట వినపడతా ఉంది కదా, వాళ్ళని చూసేదేంటి? పడుకో పడుకో” అన్నాడు. “లైట్లు కన్పిస్తునాయి కదా, పోనీ నేనెళ్ళి చూసి రానా దూరం నుంచి. ఇప్పుడే వచ్చేస్తాను.” అన్నాను.

చెప్తే అర్థం కాదా, కదులు చెప్తాన్నీపని” అన్నాడు కోపంగా.
నా ఇష్టం చెల్లదనీ చెయ్యాలనుకున్నది చెయ్యలేననీ అర్థమైంది మొదటిసారి, చాలా మనస్తాపం కలిగింది.
ఈ మధ్య ఒకసారి హైదరాబాద్ లో గులాం అలీ గజల్ ప్రోగ్రామ్ కి టిక్కెట్టు దొరక్కపోతే అంతటి మనస్తాపమూ కలిగింది. ఆ రాత్రి నిద్రపట్టలేదు.

మర్నాడు మా రెండో మేనమామ ఆయన భార్య వెళ్తూ చెప్పడానికొచ్చారు. ఆవిడ మా అత్తగారితో “ఈపల్లెటూరి పిల్లనెందుకు చేసుకున్నారు? ఆళ్ళనాన్నదగ్గిర ఇప్పుడేవీ లేదు. మీ పిల్లోడికి అందచందాలేవీ జరగవు. ఈ స్టేడియంకి అవతలివైపు మా అక్కగారిల్లు ఉంది. ఆళ్ల పిల్లని చేసుకొంటే పదివేళు కట్నం ఇచ్చే వాళ్ళు” అంది. నేనా పక్కగదిలో లేననుకుందో. విన్నా ఫరవాలేదనుకుందో.

తర్వాత ఆ మాట నేను మోహన్ తో అంటే “అవును చేసుకోవాల్సిందే, నాకు పెద్దమ్మలాగా ఉండేది ఆ పిల్ల” అని నవ్వాడు. అప్పట్నుంచీ తన కొడుక్కి పదివేలు కట్నం వచ్చి ఉండేది అనే నమ్మకం వటవృక్షంపై నాటుకుపోయింది మా అత్తగారిలో.
ఆ రోజు విజయాటాకీస్ లో కొహ్ రా హిందీమూవీకి వెళ్ళాం నేనూ మోహన్, మా ఊళ్ళో సంపూర్ణ రామాయణం, భక్త హనుమాన్ జంబో జంగిల్ రాణి లాంటి హిందీ డబ్బింగ్ సినిమాలు తప్ప డైరెక్టు హిందీ సినిమాలు చూడలేదు నేను. గేటు దగ్గర ఒకతను నిల్చుని తెలుగు అనువాదం పెద్ద గొంతులో చెప్తున్నాడు. సినిమా చూస్తూ రెండు మూడు చోట్ల గజం ఎత్తున సీట్లో ఎగిరిపడ్డాను. నా ఆ భయాన్ని మోహన్ చాలా ఎంజాయ్ చేశాడు. తర్వాత చాలాసార్లు కనురెప్పలు పైకి మడిచీ పెదవిలచివర కోరల్లాంటివి పెట్టుకొని భయపెడుతూ ఉండేవాడు రాత్రివేళల్లో.

నాకు జడవేసుకోవడం రాదు. ఆ మూడురోజులు డాబామెట్ల మీద మోహన్ నా తల దువ్వి తనకి చేతనైనట్టు కొక్కిరిబిక్కిరిగా జడవేస్తూ ఉండేవాడు. మా ఊళ్ళో బయలుదేరేటప్పుడు ఇంట్లోవాళంతా కన్నీళ్ళు పెట్టుకుంటూంటే నేను మాత్రం నవ్వుతూ రిక్షా ఎక్కాను. కాని, మా ఇల్లు, ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చి ఒకటే ఏడుపొచ్చేసేది రాజమండ్రిలో.

మూడోరోజు మా నాన్న పంచదారమిఠాయి, చలిమిడి చేయించి పట్టుకొచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. మా నాన్న వచ్చారని ఎవరో చెప్పగానే ఒక్క పరుగున వెళ్ళి సోఫాలో కూర్చున్న నాన్న భుజం మీద వాలిపోయి ఎక్కెక్కి ఏడ్చాను. “ఏంటమ్మాయి? ఆ ఏడుపు నిన్నేదో మేం కష్టాలు పెట్టేసినట్టు” అని మా అత్తగారు గద్దించినా నా ఏడుపు ఆగలేదు. మేన మామని పెళ్ళాడి పుట్టింట్లోనే ఉండిపోయారు కాబట్టీ ఆ ఏడుపేమిటో ఆమెకి అర్థమయ్యే అవకాశం లేదు. అంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే మమ్మల్ని ప్రయాణానికి సిద్ధం కమ్మని చెప్పి మా నాన్న బైటికెళ్ళగానే “ఎంత తండ్రైతే మాత్రం మొగోడే కదా! ఎదిగిన పిల్లవి. అలాగ అతని భుజమ్మీద వాలిపోతావా, సొంత అన్నదమ్ములకైనా దూరంగా ఉండాలి.” అంటూ క్లాసు మొదలుపెట్టారు. నాకు చాలా అసహ్యం వేసింది ఆవిడ మాట్లాడుతున్న విధానానికి. అన్నదమ్ములు లేరు కాబట్టి ఆవిడకి ఆ ప్రేమలు తెలిసి ఉండకపోవచ్చు కాని కన్నతండ్రి ఆపేక్ష కూడా తెలీదా? మళ్ళీ రోజుకి వందసార్లు మానాన్న మా నాన్న అంటూ వాళ్ళ నాన్న గొప్పలు చెప్పేది.

తర్వాతి కాలంలో మా అబ్బాయి డిగ్రీ చదువుతున్నా అమ్మా అమ్మా అంటూ నాకు సన్నిహితంగా మసలడం చూసి మోహన్ పెద్ద చెల్లెలు రాణీ అలాగే మాట్లాడింది. అప్పుడు కూడా నాకు అంతటి అసహ్యం కలిగింది. మనుషుల మధ్యలో దుర్మార్గపు సంబంధాలు తప్ప అనుబంధాలు చూడలేని లోపమేదో ఉంది. ఈ కుటుంబంలో అనిపించింది. బెల్లం స్వీట్లని అసహ్యించుకున్నవారు అవి కూడా ఖాళీ చేసేశారు. నన్నూ మోహన్ నీ ఖాళీబిందెల్నీ మా నాన్న ఇంటికి తీసుకొచ్చారు.

మనుగుడుపుల అల్లుడికి కారపుబూందీలో పెరుగు తినడం ఇష్టమని తెలిసి ఒక పెద్ద క్రేన్ నిండా బూందీ చేయించి పెట్టింది మా అమ్మ. ఏ పూటకాపూట కమ్మని పెరుగు తోడుపెట్టి సిద్ధంగా ఉంచేది. అరిసెలు సున్నుండలు బూందీలడ్డూలు కాజాలు అన్నీ సిద్ధం, ఉదయం టిఫిన్ కి రోజూ మినప్పప్పుతోనో బొబ్బరపప్పుతోనో ఉల్లిగారెలు చేసేది. సాయంకాలాలు మా పిన్నమ్మ ఇంటికి వాహ్యాళికి వెళ్తే పెరుగు గారెలు, పాకం గారెలు, మసాలా వడలు, చేసి పెట్టేది. ఇప్పుడు పెట్రోలు బంకు వెనక ఉన్న కొత్తకొండ బాబుగారి దొడ్డి అప్పుడు మాదే. మా నాన్న సినిమాహాలు కట్టాలని కొన్నారు. తర్వాత కాలం కలిసిరాక అమ్మేశారు. మా పిన్నమ్మ ఆ దొడ్లో ఉండేది. అక్కడ మా పశువులకోసం పెద్ద గడ్డిమేటు ఉండేది. ఒకసారి మోహన్ గడ్డిమేటూ పైకి ఎక్కుదాం అని సరదాపడి నాకూ చెయ్యందిస్తే ఇద్దరం ఎక్కాం. సెంటర్లోకి చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళకి పొలాల్లోకి కనిపించామట. మా నాన్న నన్ను పిలిచి మందలించారు.

మేం వచ్చేసరికి చుట్టాలందరూ వెళ్ళిపోయారు. మా నాన్నకి భూలోకం అని ఒకతాపీమేస్త్రి మిత్రుడుండేవాడు. అతన్తో చెప్పి మా ధాన్యం కొట్టు పక్కన గోడకానుకుని ఒక చిన్నగది కట్టించారు. ఆ గదిని మాకిచ్చారు. మా పెద్దగది అలరానుంచి నా బట్టలు పుస్తకాలు తెచ్చి ఈ కొత్తగదిలో సర్దుకున్నాను.

పది పన్నెండురోజులు గడిచేసరికి సెలవులు ముగిసి అటు కాలేజీస్, ఇటు హైస్కూల్స్ త్రిచేశారు. ఆ రోజు ఉదయాన్నే మోహన్ బయలుదేరుతుంటే కొత్తబట్టలు పెట్టారు వాళ్ళు. కొంత దగ్గరతనం పెరిగి అతను వెళ్తుంటే ఏడుపు వచ్చింది నాకు. నేను కూడా స్కూలుకు తయారై మెడలో పెట్టుకుందామని చూస్తే నెక్లెస్ కనిపించలేదు. రాత్రి పడుకునేటప్పుడు రోజూ పెద్దగది అల్మారాలో గాజు చెంబులో వేసే అలవాటు. ముందురోజు రాత్రి అలాగే వేశాను. కంగారు పడి అంతా వెతికాను. ఆ పక్కనే పింగాణీ ముగ్గులో పెట్టిన నా మొదటికథ రెమ్యునరేషన్ నేను జాగ్రత్తగా దాచిన ఏడున్నరరూపాయలు కూడా కనిపించలేదు.

– కె.వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, నా జీవన యానంలో..., , Permalink

One Response to నా జీవనయానంలో(ఆత్మ కథ )- అత్తవారిల్లు – 2- కె.వరలక్ష్మి