నెలద-9 (ధారావాహిక ) -సుమన కోడూరి

రమిత పరుగున వచ్చింది ఎవరు కావాలీ …అనడిగింది . నేను ఓ పని మీద వచ్చాను అదెలా జరగాలా అని ఈ ఊరి వాళ్లనడిగితే ఈ ఇల్లు చూపారు ఇటు వచ్చాను అన్నాడు . రమితకు ముందు ఉన్నది పురుషుడో స్త్రీయో అనే సందేహం కల్గి తలగోక్కుంది . మీ పేరు అనడిగింది .

శౌ … శాంత.. శాంత అన్నాడు . ఉండండి అమ్మగారికి చెప్పి వస్తా అంటూ లోనికెళ్లింది . హూ … అంటూ నిట్టూర్చాడు శౌరి .
కాసేపటి తర్వాత వచ్చి లోనికి రండి అన్నది రమిత .
హమ్మయ్య అంటూ లోనికి వెళ్లాడు చక్కని అలంకరణతో మంచి ఆసనాలు మధ్య మధ్యన పువ్వుల కుండీల అమరిక అందమైన దీపతోరణాలు . విశాలమైన ఆ గదిని చూసి రాచ కుటుంబీకులు నా పని ఇక్కడే ఉంటుందేమో అనుకున్నాడు . మరి కాసేపటికి ఒక పళ్లెం లో మంచి నీరు , పళ్ళ రసం ఉన్న లోటాలు ఉంచుకునివచ్చిందోక మధ్య వయస్కురాలు . అతని ముందు ఉంచుతూ తీసుకోమ్మా అన్నది . ఓ ఇపుడు నేను స్త్రీని అనుకున్నాడు శౌరి .
ఆ … అంటూ మంచినీళ్లు అందుకున్నాడు . ఆమె శౌరి దుస్తుల వంక అనుమానంగా చూస్తూ ఏ ఊరినుండి వచ్చారూ అని అడిగింది . అదీ ….అమరావతి అ అమరావతి తడబడుతూ జవాబిచ్చాడు .
ఇక్కడ ఎవరితో పని నెలదమ్మ గారితోనా అని మళ్లీ ప్రశ్నించింది .
ఈ పెరేక్కడా విన్లేదు మహారాణి వారు పేరు చెప్పనే లేదు అన్ని వివరాలు తెలుసుకుని కబురు తెమ్మన్నారు అనుకుని.. ఆ ….అవునూ అన్నాడు .
కాసేపు ఉండండి వస్తారు పూజలో ఉన్నారు ఇవాళ పూర్ణిమ కదా కాస్త ఆలస్యమవుతుంది అంటూ మళ్లీ ఆమె దృష్టి అతని దుస్తుల మీదికి మళ్లినట్లుంది .మీరింతకూ ఈ ఊరిలోకి ఇవేళే వచ్చారా అన్నది సందేహంగా
ఆ ..హా ..అవునూ … అన్నాడు .
లోనికి వెళ్లి పోయింది .
వాళ్లు తన వేపు సందేహంగా చూడటం అతనికి భయం కల్గిస్తోంది . ఒక వేళ తాను పురుషుడనే విషయం బయట పడితే …….. ఏం చేయాలనే ఆలోచనలను కూర్చుకుంటూ మౌనంగా కూర్చున్నాడు .
ప్రియంవద నెమ్మదిగా లేచి పూజగది వేపు నడిచింది . ఇక నెలద హారతి పళ్లెం తెస్తుంది రండి అన్నది అక్కడున్న మిగతా వారిని ఉద్దేశించి
అందరూ ఆమె వెంట కదిలారు ఆమె నడుస్తూ కొంత ముందుకు వెళ్లి ఆగి వెనక్కి
చూసింది . సరిగ్గా అదే సమయంలో ఆమె వైపు చూశాడు శౌరి .ఎవరో అనుకున్నట్లు ప్రశ్నార్ధకం ఆమె ముఖం పై మళ్లీ తమాయించుకుని తర్వాత తెలుసుకోవాలనుకున్నట్లు ముందుకు కదిలింది .
హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు . అమ్మో ఈ ఇంట్లో అందరి చూపులూ అరా తీస్తున్నట్లే ఉన్నాయి . ఎలా గడిచి బైట పడతానో భగవంతుడా అనుకుంటూ పైకి చూసి చెంపలు చేత్తో ముట్టుకున్నాడు . అదృష్టం కొద్దీ ఎవరూ అతని చేష్టలు గమనించే స్థితిలో లేరు .
గంట శబ్దం విని అంటూ వేపు చూశాడు పొరపాటున దేవతా విగ్రహమే ప్రాణం పోసుకు హారతి పళ్లెంతో వచ్చిందా ? అన్నట్లున్న నేలడను చూసి అతను కళ్ళు తిప్పుకో లేక పోయాడు . ఆమె అందరికీ హారతి ప్రసాదం అందించి తిరిగ పూజ గదిలోకి వెళ్లి పోయినా అతను ఈ లోకంలోకి రాలేకపోయాడు . ఆ మైమరపులో ఉదయం నది వద్ద చూసింది ఈ ఆడవాళ్లనే అనే విషయం అతనికి స్ఫురించ నేలేదు . అయినా ఆ సమయం చీకటి తొలగని వెన్నెల వెలుగే కాబట్టీ గుర్తించటమూ అంతత మాత్రమే కాబట్టి వెంటనే తట్టలేదు .

-సుమన కోడూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, Permalink

Comments are closed.