పరుచూరి వెంకటేశ్వర రావు నాటకాలలో – సామాజిక చిత్రీకరణ -లక్ష్మణరావు ఆదిమూలం

 

ISSN 2278-478

కావ్యేషు నాటకం రమ్యం “, “ నాటకాంతం హి సాహిత్యం “ అని నాటక ప్రక్రియను ఉత్కృష్ట సృష్టిగా సంస్కృత పండితులు భావించారు . జాతిని జాగృతం చేసేది , జాతి జీవనాన్ని ప్రతిబింబించేది నాటకం . తెలుగు సాహిత్య వనంలో విరిసిన కుసుమాలలో నాటక కుసుమం తన ఉనికిని సుమారుగా ఒక శతాబ్దం పైనే నాటక ప్రియుల్ని అలరించింది . తెలుగులో నాటక సాహిత్యానికి నాంది పలికిన వారు కోరాడ రామచంద్ర శాస్త్రిని చెప్పుకోవాలి . ఆయన రాసిన మంజరీ మధుకరీయం తెలుగులో స్వతంత్ర నాటకం . తెలుగులో నాటక సాహిత్యం ప్రారంభంలో అనువాద నాటకాలు , పౌరాణిక ఇతివృత్తంతో కూడిన నాటకాలు వెలువడ్డాయి . రామాయణ , భారత , భాగవత సంబంధమైన కథలతోనే నాటక రచన సాగేది . తరవాత కాలంలో సాంఘిక ఇతివృత్తాన్ని తీసుకుని రచనలు చేయడం మొదలయ్యింది . సమాజంలో జరుగుతున్న సంఘటనలను , దౌర్జన్యాలను తీసుకుని , వాటిని ప్రజలలోని తీసుకెళ్లడానికి నాటకం చాలా వరకు విజయం సాధించిందనే చెప్పాలి .

1920 తరవాత నాటక సాహిత్యంలో అనేక మార్పులు వచ్చాయి . దానికి కారణం నాటక సంస్థలు పుట్టుకు రావడమే అని చెప్పడంలో అతిశయోక్తి ఎంత మాత్రము లేదు . అనంతర కాలంలో సాంఘిక నాటకాలు విరివిరిగా రావడం మొదలైయ్యాయి . నటుడిగా తొలి అడుగు నాటక రంగంలో వేసి , పసిపిల్లాడిగా స్టేజి మీద నటించి బహుమతి అందుకుని , తరవాత కాలంలో మాటల రచయితగా , నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని , నాటక రచయితగా కూడా పలు నాటకాలు రచించిన వారు పరుచూరి వెంకటేశ్వరరావు . వాటిని విజయవంతంగా ప్రదర్శించడమే కాకుండా వాటిని సినిమాగా కూడా రూపొందించడం జరిగింది .

పరుచూరి వెంకటేశ్వరరావు రచించిన నాటకాలలో సమస్యా ! నీకు నూరేళ్లు , సమాధి కడుతున్నాం చందాలివ్వండి ఈ నాటకాల్లో మొదటిది ఇప్పటికి నిత్యం రగులుతూనే ఉన్న వరకట్న సమస్య కి చెందినది అయితే , రెండవది ప్రజాస్వామ్య విధానాలు , వాటి వెనకాల రాజకీయ నాయకులు చేసే కుతంత్రాలకు అద్దం పడుతుంది .

మొదటి నాటకం సమస్యా ! నీకు నూరేళ్లు . నీలకంఠం, సీతాపతి , అన్నపూర్ణ , వివేకానంద, గోపాల్ , ఆనందం , పంతులు మొదలైనవి ప్రధాన పాత్రలు . నీలకంఠం వడ్డీ వ్యాపారం చేసి బాగా కూడా బెట్టినవాడు . అతనికి ఒక్కగానొక్క కూతురు అన్నపూర్ణ . నీలకంఠం చెల్లెలు భర్త సీతాపతి అతనికి ఇద్దరు కొడుకులు గోపాల్ , ఆనందం. నీలకంఠం కూతుర్ని తన కొడుక్కి చేసుకుంటే ఆస్తి అంతా తనది అవుతుందని ఆశ పడతాడు . దాని కోసం ఎంతటి పనికైనా చివరకి ఒక ఆడపిల్ల జీవితం మీద నింద వేయడానికి కూడా వెనుకాడడు . అయితే అన్నపూర్ణ చదువుకున్న అమ్మాయి కులాంతర , మతాంతర వివాహాలకు ఆదర్శంగా నిలవాలని భావిస్తుంది . దాని కోసం తనే ముందుగా ఆచరించాలని నిర్ణయించుకుని కులాంతర వివాహం చేసుకోవడానికి సిద్దమవుతుంది. అలాగే గోపాల్ కూడా కులాంతర వివాహం చేసుకునేలా ప్రోత్సహిస్తుంది.దీనికి అడ్డుపడే ప్రయత్నంలో సీతాపతి తన చిన్న కొడుకు ఆనందం ప్రాణాలు పోగొట్టుకున్న తరవాతకాని కళ్ళు తెరవడు . చివరకి అన్నపూర్ణ కులాంతర వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది . వేలకొద్ది డబ్బుపోసి వరుడిని కొనుక్కో గల శక్తి ఉంది కూడా కట్నాన్ని నిర్మూలించాలని ఒక యువతీ ముందుకు రావడం అన్నది గొప్ప విషయం . కేవలం మాటల్లోనే కాదు చేతల్లోనూ చేసి చూపించగల పాత్రగా అన్నపూర్ణ పాత్ర నిలుస్తుంది .

రెండవ నాటకం ప్రజా సమస్యకి , ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది . ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని గర్వంగా చెప్పుకునే మనం .ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఎందుకు మిగిలిపోయింది . స్వార్ధపూరితమైన రాజకీయ నాయకుల ఆలోచనలు , వాళ్ల దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యాన్ని సమాధి కడుతున్నారు అని తెలియజేసేదే “ సమాధి కడుతున్నాం చందాలివ్వండి “ నాటకం .

ఈ నాటకంలో చంద్రయ్య , సుబ్రహ్మణ్యం , పారిజాతం , అర్జునుడు , నారాయణ , పున్నయ్య , కోటేశు , రాములు , అంత్య , ఈరిగాడు ప్రధాన పాత్రలు కన్పిస్తాయి . ఈ నాటకంలోని వస్తువు దేశానికి , నాటకం రాసిన కాలానికే కాకుండా నడుస్తున్న కాలానికి కూడా సరిపోతుంది .మొదటి నాటకంలోని వరకట్న సమస్యలా , ఈ నాటకం లో సమస్యా కూడా కొనసాగుతూనే ఉంది .

సూరయ్య ఎంతోకాలంగా ప్రజలను నమ్మించి పదవిలో కొనసాగుతూ ఉంటాడు . మళ్లీ ఎన్నికలు సమయం దగ్గర పడటంతో అందరిని తన వైపుకు వచ్చేలా చేసుకోవడానికి పార్టి ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేస్తాడు . తనకి వ్యతిరేకంగా తయారైన చంద్రం తండ్రి అయిన పున్నయ్యను ఆ సమావేశానికి అధ్యక్షుడిగా కూర్చో బెడతాడు . ముందు ఎన్నికల్లో సూర్యకు ప్రచారం చేసిన పారిజాతం ఇప్పుడు చంద్రయ్య వైపుకి రావడం సహించని వీరిద్దరిని తప్పితే తనకి ఎటువంటి సమస్యా ఉందని గ్రహించిన సూరయ్య తగాదాలో చంద్రయ్య ప్రాణాలను బలికొంటారు . పధకం ప్రకారం గూడాన్ని తగలబెట్టి ,చంద్రయ్య శవాన్ని తగలపడిపోతున్న ఇళ్ళల్లోకి విసిరేస్తారు . ఆ గూడెం జనాన్ని కాపాడబోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడని అతని ఆత్మకి శాంతి చేకూరాలని , చంద్రయ్యకి సమాధి కట్టాలని చందాలు వసూలు చేస్తారు .

ఈ రెండు నాటాకాల్లోని పాత్రలు మనకు నిత్యం కనిపించేవే . మనుషుల స్వార్ధ పూరితంగా ఎలా మారిపోయారో , వాళ్ల జీవితం కోసం , పదవుల కోసం ఎటువంటి పనులు చేయడానికైనా వెనకాడరని తెలుస్తుంది . ప్రజలకు సేవా చేద్దామని వచ్చిన యువకుడు రాజకీయ నాయకుల స్వార్ధానికి బలైపోయిన చంద్రయ్య , చదువు లేకపోవడంతో కాస్త మందు పోస్తే ఎంత పనైనా , చేసే మనుషులు ఉన్నారు అనడానికి నిదర్శనం పున్నయ్య , ఈరిగాడు పాత్రలే .

ఈ విధంగా ఈ రెండు నాటకాల్లోని ఇతివృత్తం సమాజంలో జరిగిన,ఇప్పటికి జరుగుతున్న సమస్యలకు అద్దం పడతాయి . మొదటి నాటకం సమస్యా నీకు నూరేళ్లు అన్నట్లుగానే ఈ రెండు నాటకాల్లోని సమస్యాలు ఇప్పటికి శతమానం భవతి అన్నట్లుగానే ఉన్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు .

(పర్వతనేని బ్రహ్మయ్య సిద్దార్ధ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో 2014 డిసెంబర్ 12 ,13 తేదీలలో “తెలుగు సాంఘిక నాటకాలు – సామాజిక చైతన్యం ” అనే అంశం పై జరిగిన జాతీయ సదస్సులో పత్ర సమర్పణ చేసిన వ్యాసం  )

-లక్ష్మణరావు ఆదిమూలం

                                                                                                                        పరిశోధక విద్యార్ధి 

                                                                                          పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​, , Permalink

Comments are closed.