పల్లవి॥ లాలీ! లాలీ! కృష్ణయ్యా లాలీ నా ముద్దు తండ్రీ!
జోలానిదురించవయ్య। ఘనపాళీ వజ్రాల తండ్రీ లాలీ!
ఎవతే చూచేరా నిన్ను ఇంత పోరూ పెట్టేవు
పోరు మానుంటకు పొగసెద నిదుర పోర ॥లాలీ।
కారు ఇంగువ తవుడు కలిపి భూ తులసి తోడ
పోరు మానుటకు పొగ వేసేద నిదురపోరా॥లాలి
ధరణిలో కాండ్రకోట పురమందు వెలసిన సూర్యమాంబకు
వేగసిరి సంపదలియ్యవయ్య ॥లాలి॥
అనీ తన ఆరాధ్య దైవం రాముని ఉద్దేశించి
పల్లవి॥ నిదురపోడమ్మా మా రామయ్య బెదిరినాడమ్మా!
చ॥ 1. గట్టిగ మనము వశిష్టూల పిలిపించి, దిష్టీ విభూదైన నొస్ట పెట్టిన గాని ॥నిదుర॥
2. హేతూవ తెలిసిన భూత వైద్యునీ పిలిచి నా తిరక్షరేకు చేతగట్టినా గానీ.
అని ఆ రాత్రి సీతమ్మ గారు లాలి పాటలూ, జోల పాటలూ పాడుకున్నారు. ఊయలలో వేయడానికింకో ప్రత్యేక కార్యక్రమం వుంది. ఊయలలో పరుపు క్రింద గుప్పెడు సెనగలు, అక్షతలు వుంచుతారు. ఇరువురు పెద్ద ముత్తయిదువులు వచ్చి ఊయలకు అటూ, ఇటూ నిలబడతారు. పసివాణ్ణి చేతులతో పట్టుకొని ఊయల క్రింద నుంచి ఎదురుగా వున్న ముత్తయిదువకు అందిస్తుంది. ఆమె ఊయల క్రింద నుంచి పసివాణ్ణి అందుకొని ఊయలపై నుంచి తీసి తాను మళ్లీ ఎదురు ముత్తయిదువుకు ఊయల క్రింద నుంచి అందిస్తుంది. ఈ విధంగా ఇరువురు మూడు సార్లు అందుకున్నాక శిశువును ఊయలలో వుంచుతారు. అప్పుడు బాలెంతరాలు బిడ్డను ఊయలలో ఊపుతూ
పల్లవి ॥ సుకుమారా! సుశరీరా సుందరా! నగధీరా।
చ॥ 1. విధుని భవతరం నిరంతర విమలాధారా ॥సుకుమారా॥
2. సుగ్రీవాభయ మొసగిన రామా! ఆ వాలి మదమణంచిన రామా ॥సుకుమారా॥
అని ఊయలలో ఊపుతూ పాడాక, బాలింతరాలికీ, పసిబిడ్డకూ కర్పూర హారతీ, వసంత హారతీ ఇచ్చి ముత్తయిదువులంతా అక్షతలు వేసి దీవించారు.
ఇప్పుడు నూతిలో చెదవేసే కార్యక్రమం. ఇది బహు వేడుకయినది. చాలా సరదా అయినదీనూ, పసివాని పొత్తు బట్ట ఒకటి, ఓ పెద్ద సైజు చెంబు ఒకటీ సీతమ్మ గారి చేతికిచ్చి అంతా పెరట్లోని నూతి వద్దకు బయలుదేరారు. ఒక పళ్లెంలో పసుపూ, కుంకుమా, అక్షతలూ వరి పిండీ, కుందెలో వత్తీ, నూనె, రెండు తాంబూలాలు, రెండు కాయపుండలు, రెండు వెల్లుల్లి గడ్డలూ తల్లి తెచ్చింది. సీతమ్మ గారు ఓ చేదడు నీళ్ళు తోడి చెంబులో పోసుకొని నూతి గట్టు వద్ద పళ్ళెం కొంతమేర అలికి వరిపిండితో పద్మాలు పెట్టి పసుపూ, కుంకుమ, అక్షతలు చల్లారు. నూతి ప్రక్క తడి మట్టి పిడికెడు తీసి కప్పతల్లిని తయారు చేసారు. ఈ కప్ప తల్లి సంతానానికి అధిష్టాన దేవత అన్నమాట. కప్ప గ్రుడ్లు పెట్టినట్లుగా సంతానం అవిచ్ఛిన్నంగా కలగాలని నాటి రోజుల్లో కోరేవారు. దీపం వెలిగించి, పసుపు కుంకుమలతో గంధాక్షతలతో పూజించి, కప్పతల్లికి ఓ కాయపుండా, ఓ వెల్లుల్లిగడ్డ నైవేద్యం పెడుతుంది బాలెంతరాలు.
ఇప్పుడు వాయనం ఇవ్వాలి. ఈ వాయనం అందుకుంటే తిరిగి సంతానం కలుగుతుంది. అందుచేత ముత్తయిదువులంతా నువ్వంటే నువ్వని ఎదుటి వార్ని ముందుకు త్రోస్తారు. ఆఖరికి సంతానార్థి అయిన స్త్రీ కాని, ఇక సంతానం కలగదులే అని భయం తీరిన వృద్ధ ముత్తయిదువు కాని ఆ వాయనం అందుకుంటుంది. బాలింతరాలి చేత మూడు చేదల నీరుతోడిరచి నూతి ప్రక్కన వున్న పచ్చని మొక్కలకు పోస్తారు. ఆలా తోడేటప్పుడు ఓ వెల్లుల్లి గడ్డ నూతిలో వేసి బాలెంతరాలిని తీయమంటారు. నూతిపోతన్న అనే దేవుడు నూతిలో వుంటాడు. పురిటాలు ఒక లోటాతో చల్ల నూతిలోధారగా పోస్తూ నూతిపోతన్న తండ్రీ చల్లధార తీసుకొని పాలధార ఇయ్యి అని మ్రొక్కుతుంది. తనకు స్థన్యం పుష్కలంగా వుండాలని కోరుకుంటూ. ఆమె తీస్తూ వుంటే తోటి ముత్తయిదువులు చేద కుదిపేస్తూ ఆమెను ఎలయిస్తారు. కొంతసేపు ఈ వినోదం జరిగాక తోటి ముత్తయిదువు సహాయంతో ఆమె ఉల్లిపాయ బైటకు తీస్తుంది. తోటి ముత్తయిదువుకు పసుపు పూసి, బొట్టు పెట్టి తాంబూలంలో వెల్లుల్లి పాయ, కాయపువుండ పెట్టి ఇస్తారు. బాలింతరాలు పిల్ల పొత్తు బట్ట తడిపి పిండి భుజాన వేసుకున్నాక, తోటి ముత్తయిదువు నిండు నీటితో వున్న చెంబు సాయం పడుతూ వుండగా ఇరువురూ ఇంటిలో ప్రవేశించే ద్వారం చేరుతారు.
– కాశీచయనుల వెంకట మహాలక్ష్మి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~